"ఇంతవరకూ ఉన్నావెందుకు?"
"మీరు రాకుండా ఎలా వెళతాను మేడమ్? ఇవాల్టి విశేషాలన్నీ చెప్పాలికదా!"
ఆమె లోలోపల సంతోషించింది. ఇంత నమ్మకమయిన వ్యక్తే తనక్కావలసింది.
"ఏమిటి విశేషాలు?"
జరిగిందంతా చెప్పాడు నూతన్.
ఆమె నిశ్చేష్టురాలయింది.
"నాకు మూర్తి ఎనిమిది లక్షలు ఇవ్వడానికి వప్పుకున్నాడా?"
"అవును మేడమ్!"
"నాకు మతిపోతోంది. సడెన్ గా ఏడు లక్షలు కేవలం నీ జగ్లరీవల్ల పెరిగిపోయిందా?"
'మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు మేడమ్! ఈ మధ్య కొన్ని సినిమాలు ఫెయిలవాల్సినవి కేవలం మీ నటనవల్ల సక్సెస్ అయాయన్నవిషయం మీకు తెలీదు. నేను జనంలో కూర్చుని సినిమాలు చూసేవాడిని కనుక నాకు తెలుసు! మీ మీద వ్యాపారం చేసికోట్లు సంపాదిస్తోంటే మీరు మీ షేర్ డిమాండ్ చేయటంలో న్యాయం వుంది....."
సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది.
"హలో" అంది చంద్రిక ఫోన్ అందుకుని.
"నమస్తే చంద్రికగారూ! నేను మూర్తిని!"
"నమస్తే! చాలా కాలానికి!"
"ఔనండీ! ఇంత కాలానికి మళ్ళీ మీ అవసరమొచ్చింది"
"ఇప్పుడే నూతన్ చెప్తున్నాడు"
"ఎలాగయినా ఆ డేట్స్ మాక్కావాలి చంద్రికగారూ! మీది చాలా ఇంపార్టెంట్ వేషం! మొత్తం పిక్చర్ మీద ఆధారపడి ఉంటుంది"
"అదే......డేట్స్ క్లాష్ వస్తాయని ఆలోచిస్తున్నాను"
"ఎలాగోలా వాళ్ళకు నచ్చజెప్పండి. మీరడిగిన రెమ్యూనరేషన్ కి కూడా వప్పుకుంటున్నా నంటే ఆ వేషం మీరు వేయాలని ఎంత పట్టుదలతో ఉన్నానో మీరే ఆలోచించండి"
చంద్రిక గుండె వేగంగా కొట్టుకోసాగింది.
నిజంగా ఎనిమిది లక్షలు ఇవ్వడానికి వప్పుకుంటున్నాడా అతను?
"ఆల్ రైట్! ఎడ్జస్ట్ చేస్తాను! కానీ ఓ కండిషన్!"
"ఏమిటో చెప్పండి!"
"ఏడు లక్షలు బ్లాక్ - ఒకటి వైట్! ఏడు లక్షలూ రేపు సాయంత్రంలోగా పంపించాలి!"
"ఓ! తప్పకుండా పంపిస్తాను"
"థాంక్యూ - ఉంటానిక"
ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
"నూతన్! నువ్ చాలా డేంజరస్ మనిషిలాగా కనబడుతున్నావ్! కేవలం మాటలగారడీతో ఏడు లక్షలా? ఇంకా నమ్మకం కలగడంలేదునాకు"
నూతన్ నవ్వాడు.
"మేడమ్! నేను మీ సిన్సియర్ ఫాన్ ని! మీరు అన్నివిధాలుగా ఆనందంగా ఉండేలా చూడటంనాకు ఆనందాన్నిస్తుంది! ఇంక వెళతాను మేడమ్! రేపు మాణింగ్ వస్తాను"
"ఓ.కే!"
అతను బయటకువెళుతుంటే మళ్ళీ వెనకే వచ్చిందామె.
"నూతన్!"
"యస్ మేడమ్"
"నీ జీతంలో ఏమయినా అడ్వాన్స్ కావాలంటే తీసుకో! మొఖవాటపడకు."
"అవసరమొస్తే తప్పక అడుగుతానండీ"
నూతన్ వచ్చేశాడు.
హోటల్ గదిలో తనకోసం వెయిట్ చేస్తోంది మయూరి.
"ఎలా వుంది మొదటిరోజు?" అడిగింది ఆతృతగా.
"సెంట్ పర్సెంట్ సక్సెస్! నా మీద పూర్తి నమ్మకం ఏర్పడింది ఆమెకు! నీ సంగతేమిటి?"
"దిన దిన గండంనూరేళ్ళ ఆయుష్షు!" నవ్వుతూ అంది.
"గుడ్! అలాగే కవ్వించు! నీకోసం అతనేమయినా సరే చేసే స్థితికి తీసుకురావాలి!"
"ఇంకో పది రోజులు అంతే! వచ్చేస్తాడు"
ఆమె వెళ్ళిపోయాక కాసేపటికి ప్రహ్లాద్ వచ్చాడు.
"నమస్తే బాస్"
"నమస్తే - మనం అనుకున్నట్లే జరుగుతోందంతా! బహుశా ఇంకో రెండు రోజుల తర్వాత నీ అవసరం ఉంటుంది! అంతవరకూ హాయిగా విశ్రాంతి తీసుకో!"
"సరే!"
"ఒక విషయం మర్చిపోకు! ఏ రోజుకారోజు ఒక కొత్త హోటల్ కి మకాం మారుస్తూండు. ఎందుకంటే నీ మొఖం ఎవరికీ గుర్తుండకూడదు"
"సరే!"
"ఇంకో సంగతి! నీకు అమ్మాయిలమీద మనసు తిరిగితే అమ్మాయిలతో గడుపు! కానీ అక్కడ వాళ్ళు నిన్ను గుర్తుంచుకునేలా ప్రవర్తించకు!"
"తెలుసు"
"రోజూ ఇక్కడకు రావటంమంచిది కాదు! రోజుకో పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తూండు! సరిపోతుంది"
"ఓ.కే."
"ఇంక వెళ్ళవచ్చు నువు"
అతను వెళ్ళిపోయాడు.
మర్నాడు ఆఫీస్ కెళ్ళగానే రమేష్ ఆమె గదిలో కొచ్చాడు.
"నిన్న సాయంత్రం చెప్పకుండా వెళ్ళిపోయారేమిటి!" కొంచెం కోపంగానే అడిగాడు.
"అయామ్ సారీ! సడెన్ గా తలనొప్పి వచ్చింది. సడెన్ గా రెండు మూడు నెలలకోసారి వస్తూంటుంది. అది వున్న కాసేపూ నేను ఏం చేస్తానో నాకే తెలీదు. పిచ్చెక్కినట్లవుతుంది.
అందుకే వెంటనే ఇంటికెళ్ళిపోయాను"
"ఓ...... అలాగా! ఇప్పుడు ఎలా వుంది మరి? డాక్టర్ కి చూపించుకున్నావా?"
ఆమె నిట్టూర్చింది.
"డాక్టర్ కి చూపించుకున్నా లాభంలేదు రమేష్ గారూ! మానసికంగా బాగా స్ట్రెయిన్ కలిగినప్పుడల్లా వస్తూంటుందది!"
"మీకేమైనా ప్రాబ్లెమ్స్ ఉన్నాయా మయూరీ?"
ఆమె అతని కళ్ళల్లోకి చూసింది.
"ఈ ప్రపంచంలో ప్రాబ్లెమ్స్ లేనివాళ్ళు ఎవరయినా ఉంటారా?"
"ఆ మాట నిజమే! కానీ మీకు ప్రాబ్లెమ్స్ ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాను. మీకు నేనేమైనా సహాయం చేయగలనా మయూరీ"
"అవసరం వస్తే తప్పక మీ సహాయం తీసుకుంటాను"
"మయూరీ! మీ మనసుని రిపేర్ చేసే బాధ్యత నాది! మధ్యాహ్నం మనం గండిపేట వెళుతున్నాం!ఓ.కే?"
"మరి ఆఫీస్?"
"డోంట్ బాదర్! రేపు చూసుకోవచ్చు!"
ఆమె మాట్లాడలేదు. అతను వెళ్ళిపోయాడు. మయూరి తనలో తను నవ్వుకుంది. మగాళ్ళల్లో కొన్ని కేటగిరీలుంటారు. రమేష్ కేటగిరీ ఏమిటో తనకు అర్ధమైంది. వాళ్ళకు దగ్గర వస్తువుల మీద మోజెక్కువ! బెట్టుసరి చేసే అమ్మాయిలను స్వంతం చేసుకోడానికి ఎంత శ్రమైనా పడతారు. ఎంత డబ్బైనా ఖర్చుపెడతారు. ఎంత రిస్కయినా తీసుకుంటారు-