అప్పటికే చీకటిపడింది.
"ఎక్కడ డ్రాప్ చేయమంటావ్?"
"అబిడ్స్ లో! అక్కడినుంచీ బస్ లో వెళ్ళిపోతాను."
కారు అబిడ్స్ లో ఆగింది.
"ఆ ఫోటోలు నెగెటివ్ లు ఎలాగోలా తీసుకోడానికే ప్రయత్నించండి."
"ఎంతో కొంత బేరమాడి నేను తీసుకుంటాకదా! నువ్వేం వర్రీ అవకు"
ఆమె కారు దిగింది. రమేష్ ఆ కార్డుమీద అడ్రస్ చూసుకుని బయలుదేరాడు.
చిక్కడపల్లిలోని అపార్టుమెంట్స్ లో ఫ్లాట్ అది. కానీ లాక్ చేసి వుంది. బిజినెస్ అవర్స్ - మాణింగ్ ఎయిట్ - టూ - టెన్ అని రాసి వుంది.
ఇంటికి బయలుదేరాడతను.
"హలో" అన్నాడు నూతన్ ఫోన్ మోగగానే.
"నేను మయూరిని"
"అంతా అనుకున్నట్లు జరిగిందా?"
"యస్"
"గుడ్! రేపు మీ ఆఫీసుకి ప్రహ్లాద్ ను పంపుతాను"
"ఓ.కే."
ఫోన్ పెట్టేసిందామె.
మర్నాడు ఆఫీసుకెళ్ళేసరికి రమేష్ తనకోసమే ఎదుర్చూస్తున్నాడు.
"ఏమయింది? వడు ఫోటోలుఇచ్చాడా?"
"ఇంతవరకూ వాడి ఫ్లాట్ దగ్గరే నిలబడివచ్చాను. ఎవరూ రాలేదు- లాక్ చేసి వుంది"
"నాకు తెలుసు! ఇదేదో మన ప్రాణం మీదకొస్తుంది"
"నీమీద ఈగయినా వాలకుండా నేను చూస్తాను- సరేనా?" అన్నాడు.
"నాకు మీమీద నమ్మకముంది"
వాళ్ళు మాట్లాడుతూండగానే ప్రహ్లాద్ లోపలికొచ్చాడు. అతనిని చూడగానే మయూరి ముఖం పాలిపోయింది.
రమేష్ కి అతనెవరో అర్ధమయింది కొద్దిక్షణాల్లోనే.
"నేను చెప్పిన విషయం ఏమాలోచించావ్?" క్రూరంగా చూస్తూ అడిగాడు ప్రహ్లాద్.
"ఇంకొక పదిరోజులు గడువివు"
"నేనింక గడువివను. ఇవాళ సాయంత్రంనీ యింటికి వచ్చి జుట్టుపట్టుకుని లాక్కెళతాను. ఎవడడ్డు వస్తాడో చూస్తా-"
మయూరి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
"నీకు దండం పెడ్తాను. నా దారిన నన్నువదిలెయ్" బతిమాల్తూ అంది.
హటాత్తుగా ఆమె చేయిపట్టుకుని మెలిపెట్టాడతను.
"నిన్ను వదిలేస్తే ఇంకొకడితో కులుకుదామనా? నీ అంతు తేలుస్తా-"
"అబ్బ నొప్పి వదిలెయ్" గింజుకుంటోందామె.
రమేష్ ఇంక భరించలేకపోయాడు.
"చూడు మిస్టర్! మర్యాదగా ఆమె చేయి వదులు"
చటుక్కున ఆమెచేయి వదలి అతని కాలర్ పట్టుకుని గాల్లోకి లేపాడు ప్రహ్లాద్.
అతని చేయి ఇనుపచట్రంలా బిగుసుకుంది.
మరో చేతిలోకత్తి! అంత రాక్షసబలంగలవాడిని తనింతకుముందెప్పుడూ చూళ్ళేదు.
"అంటే మీరిద్దరూ కలిసేనాటకాలాడుతున్నారన్నమాట! మా ఇద్దరి విషయం తేలకుండాదాని వంటిమీద చేయివేశావో నిన్నిక్కడే నరుకుతా! తెలిసిందా?"
రమేష్ కళ్ళల్లో భయం స్పష్టంగా కన్పిస్తోంది.
"మాకలాంటి సంబంధమేమీలేదు"
"ఉంటే నువిప్పుడిలా మాట్లాడుతుండేవాడివికాదు. స్మశానంలో తగలడుతూండేవాడివి"
మళ్ళీ నేలమీదకు దింపాడు.
రమేష్ గుండె వేగంగా కొట్టుకోసాగింది.
తననూ, మయూరినీ ఆ గండిపేటలో వాడెవడో తీసిన ఫోటో చూస్తే ఖచ్చితంగా తననునరికేస్తాడు వాడు.
"ఏమంటావో చెప్పు" మయూరిని చూసి గద్దించాడు.
"పోనీ ఒక వారం టైమివ్వు"
"సరే! వచ్చేవారం ఇదేటైముకొస్తా" వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి రమేష్ దగ్గరకొచ్చాడు.
"ఏయ్! చెప్పింది గుర్తుందా? దాని అందం చూసిదాన్ని ఉద్యోగంలో పెట్టుకున్నావని నాకు తెలుసు. కానీ మాగొడవ తేలకుండాదాని వంటిమీద చేయిబడిందో తలతీసేస్తా" వెళ్ళిపోయాడు.
రమేష్ తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు.
మయూరి కన్నీళ్ళు తుడుచుకుంది.
రమేష్ ఆమెను సమీపించాడు. ఆమె భుజంమీద చేయి వేయబోయి ప్రహ్లాద్ వార్నింగు గుర్తుకువచ్చి మానేశాడు.
"భయపడకు మయూరీ! నథింగ్ విల్ హాపెన్" అన్నాడు ధైర్యం చెపుతూ.
"ఐయామ్ సారీ! వాడు మీమీదకూడా చేయి చేసుకున్నాడు"
"ఏం పర్లేదు నాకొకటే ఆశ్చర్యంగా వుంది. ఇలాంటి వాడిని నీలాంటి చదువుకున్నది ఎలా చేసుకుందా అని"
"చెప్పానుకదా! అంతా మావాళ్ళు చేసిన నిర్వాకం! నాకు పెళ్ళి అవటమే ముఖ్యమనుకున్నారుగానీ - నా లైఫ్ నాశనం చేస్తున్నామని తెలుసుకోలేకపోయారు"
"వీడి పీడ ఎలా వదిలించుకోవాలో నాకర్ధం కావటంలేదు" ఆలోచనలో పడుతూ అన్నాడు రమేష్.
"నేనో నిర్ణయం తీసుకున్నాను- ఈ ఉద్యోగం వదలిబొంబాయికో, కలకత్తాకోపారిపోతాను. అక్కడ వుంటే వీడిక నన్నేం చేయలేడు"
"కానీ అక్కడెలా బ్రతుకుతారు? అక్కడ ఉద్యోగం ఎవరు ఇస్తారు?"
"ఏమో! అదంతా నాకు తెలీదు! ఒకవేళ బ్రతకటం మరీ కష్టమైతే ఆత్మహత్యచేసుకుంటాను"
రమేష్ అదిరిపడ్డాడు.
"నో! నీకలాంటి పరిస్థితిరానీను మయూరీ! ఐ లవ్ యూ! నీకు తోడుగా నేనుంటాను. కావాలంటే నీతోపాటు నేనూ వస్తాను"
మయూరి ఆశ్చర్యంగా చూసిందతనివేపు.
"మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలీటంలేదు. మీ భార్యా పిల్లల్నేం చేస్తారు! మీ ప్రాక్టీస్ మీ ఆస్థులూ, ఇవన్నీ ఏం చేస్తారు? ఇంపాజిబుల్! కలలో కూడా అలాంటిఆలోచనలు రానీకండి"
"నువ్ మాత్రం తొందరపడి, నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోనని ప్రామిస్ చెయ్ మయూరీ!"
అతను చేయి చాపాడు.
ఆమె అతని చేతిలోచేయివేసి అతని గుండెలమీదకు వాలి కన్నీరు పెట్టుకుంది. అతని చేతులు ఆమెను చుట్టేసినయ్. ఆమె మెత్తని స్పర్శహటాత్తుగా అతనిలో అణగి వున్న కోరికలను నిద్రలేపింది. ఆమె పెదాలమీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.
ఆమె చటుక్కున అతని కౌగిలి విడిపించుకుని దూరంగా జరిగింది.
"ఏమిటి?"
"నాకా ఫోటోలదే భయంగా వుంది. అవి ప్రహ్లాద్ చేతిలోపడ్డాయంటే మనిద్దరి ప్రాణాలకూ ముప్పే" భయంగా అంది.
రమేష్ గుండె వేగంగా కొట్టుకుంది.