"అరె బేవకూఫ్! ఇవి స్మగుల్డు టెక్స్ట్ పుస్తకాలు! మద్రాస్ కెళ్ళి ప్రింటయి వచ్చింది. సముజే?"
"నహీసముజే!" అన్నాను మొఖవాటం లేకుండా.
"అరె! క్యాదమాక్ హైజీ తుమారా? మన రాష్ట్రంలొ టెక్స్ట్ పుస్తకాలు దొరకటంలేదని స్మగుల్డు వస్తువులు వ్యాపారం చేసేటోళ్ళు- టేప్ రికార్డర్లు, వాచీలు, బట్టలు కాసెట్లు స్మగ్లింగ్ బంద్ చేసి మన ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ పుస్తకమ్ లు మద్రాసులో ప్రింట్ చేయించి బ్లాకులో యాభై రూపాయలకు ఎక్కువ రేటుతో అమ్ముతున్నాయ్. కొన్ని పుస్తకమ్ లు హాంకాంగ్, పాన్ నుంచి భీ స్మగ్లింగ్ హోరైబోల్ కె సునామై?"
మరో అయిదు నిముషాలు గడిచినయ్.
లాల్చీపైజామా తొడుక్కున్న ఓ వ్యక్తి ఆ పాడుబడ్డ భవనంలో నుంచి టార్చిలైట్ తో రోడ్డుమీద కొచ్చి అటూ ఇటూ రెండుసార్లు పచార్లు చేశాడు. అతన్తో ఏ కోడ్ లో మాట్లాడాలో రంగారెడ్డికి ముందే నేర్పాడు ఆజమ్ భాయ్-
రంగారెడ్డి అతని దగ్గరకెళ్ళి "ఆకాశంలో పగలే నక్షత్రాలొచ్చాయ్!" అన్నాడు అతను ఓ క్షణం ఆగి "నిన్నరాత్రి సూర్యుడు కూడా వచ్చినయ్!" అన్నాడు, సిగరెట్ వెలిగించుకుంటూ! ఆ తరువాత ఏం చెప్పాలో రంగారెడ్డి మర్చిపోయినట్లుంది తన డయిరీ తీసి అగ్గిపుల్ల వెలుగులో చూసి "అగ్గిపుల్లకు ముళ్ళున్నాయ్" అన్నాడు. ఆ వ్యక్తి ముఖంలో సంతృప్తి కనిపించింది.
"ఎవరు పంపించారు మిమ్మల్ని?" అనడిగాడు.
అజయ్ భాయ్ ముందుకొచ్చాడు "నిసార్ మియా!"
"ఎంతమందిక్కావాలి టెక్స్ట్ పుస్తకాలు."
"పద్దెనిమిది సెట్లు!" చెప్పాడు శాయీరామ్.
"మద్రాసు ఎడిషన్ లేదు! అవి లేకపోతే మా పిల్లలకు సంవత్సరం గోవిందా అవుతుంది!" అన్నాడు గోపాల్రావ్.
"అసలు రేటు మీద వందరూపాయలెక్కువవుతుంది!"
"వప్పుకుంటున్నాం గదా!"
"అయితే డబ్బివ్వండి!"
అందరం లెక్కచూసి డబ్బు అతనిచేతికిచ్చాం.
అతను ఆ భవనంలోకెళ్ళిపోయి పావుగంట తర్వాత పెద్ద "బండిల్" తో తిరిగివచ్చాడు.
"ఇదిగో పద్దెనిమిది సెట్లు! తెలుగు టెక్స్ట్ లో అక్కడక్కడ ఒకటి రెండు చైనీస్ అక్షరాలు వస్తే రావచ్చు. ఎడ్జస్ట్ చేసుకోండి! మళ్ళీ రిటర్న్ తీసుకోమంటే మాత్రం తీసుకునేది లేదు. వారం పదిరోజులు వీటిని స్కూలు కివ్వకండి! సరేనా?"
"సరే!"
అందరం అతనిని కౌగిలించుకుని ముస్లిం పద్దతిలో భుజాలు కలిపి, షేక్ హాండిచ్చి కృతజ్ఞతలు తెలిపి కాలనీకి చేరుకున్నాం.
తీరా మర్నాడు ఉదయానికి రంగారెడ్డి ఫ్రెండ్ మింట్ కాంపౌండ్ లొ తన ఫ్రెండ్ ద్వారా సంపాదించిన పుస్తకాల పార్సిల్ రిక్షాలో పంపించాడు. చార్మినార్ దగ్గర షాపులో ఎడ్వాన్స్ గా కట్టిన డబ్బు తీసుకొచ్చేద్దామని వెళ్ళిన శాయీరామ్ మరో పార్సిల్ తో తిరిగొచ్చాడు.
"పుస్తకాలు వచ్చేసినయ్ కనుక డబ్బువాపస్ ఇవ్వనన్నాడు ఆ షాపువాడు!" అన్నాడు శాయీరామ్ దిగాలుపడి.
ఈ ఎక్స్ స్ట్రా పుస్తకాల బెడద ఎలా వదిలించుకోవాలా? అని అందరం చాలా భయంకరంగా ఆలోచిస్తూ కూర్చున్నాం. తీరా సాయంత్రం నలుగయేసరికి మా కాలనీ పిల్లలంతా స్కూలు నుంచి వచ్చేశారు. అందరి చేతుల్లో టెక్స్ట్ పుస్తకాల పార్సెల్స్.
ఖంగారుపడి "ఈ పుస్తకాలెక్కడివి?" అడిగాం వాళ్ళను.
"మా ప్రిన్సిపాల్ ఎక్కడి నుంచో తెప్పించి మా అందరికీ ఇచ్చింది. రేపు డబ్బు పట్టుకొచ్చి కట్టమంది?" అన్నారు వాళ్ళు.
మూలిగే నక్కమీద కొన్ని వందలు తాటికాయలు వరుసగా గంటసేపు పడినట్లనిపించింది.
చివరకు ఆ రాత్రి అందరూ కలిసి ఓ తీర్పు ఇచ్చారు. నేనూ, శాయీరామ్ కలసి ఆ ఎక్స్ స్ట్రా పుస్తకాలన్నీ ఓ రిక్షాలో వేసుకెళ్ళి ఓ పెద్ద స్కూలు బయట నిలబడి కావలసిన విద్యార్ధులకు అమ్మివేయాలన్నదే ఆ తీర్పు సారాంశం. ఇష్టం లేకపోయినా, ఆపని ఎవరొకరు చేయక తప్పదు కనుక వప్పుకున్నాం- మర్నాడు పొద్దున్నే అనుకున్న ప్రకారం రిక్షా మాట్లాడి పుస్తకాలన్ని వేసుకుని మా కాలనీకి కొంచెం దూరంలో ఉన్న ఓ పెద్ద స్కూలు దగ్గరకెళ్ళి నిలబడ్డాం. మా వంక ఎవరూ చూడకపోయేసరికి శాయీరామ్ కి గట్టిగా అరవకతప్పలేదు. "ఎవరికి మాస్టారూ టెక్స్ట్ పుస్తకాలు! టెక్స్ట్ పుస్తకాలెవరికండి! తాజా టెక్స్ట్ పుస్త-సారీ-సారీ- కొత్త టెక్స్ట్ పుస్తకాలు- గవర్నమెంట్ టెక్స్ట్ పుస్తకాలెవరికండీ బాబూ...."
నాలుగుసార్లలా అరిచేసరికి కొంతమంది కుర్రాళ్ళు వాళ్ళ తండ్రులూ మా రిక్షా చుట్టూ పోగయ్యారు. నాకు అలా ఫుట్ పాత్ వ్యాపారం చేయడం చిన్నతనంగా ఉంది కాని తప్పదు కదా మరి!
అయితే శాయీ రామ్ ఎందుకనో ఆవేషానికి భలే సూటయ్యాడనిపించింది. కొంతమంది టెక్స్ట్ పుస్తకాలు తిరగేసి చూశారు.
"జపాన్ ఎడిషన్ లేవా?" అడిగాడొకతను.
"లేవుసార్! ఇవే వున్నయ్!"
"అందులో పేపరు మంచిది వాడతారు! అందుకని అడుగుతున్నాను. కావాలంటే ఇంకో రెండ్రూపాయ లెక్కువ తీసుకుని జపాన్ ని తెచ్చిస్తారా?"
"అయ్యా! మేము ఈ వ్యాపారం చేసేవాళ్ళం కాద్సార్! మా పిల్లలకు అనుకోకుండా మూడుసెట్లు కొనడం వల్ల అమ్మేస్తున్నాము.
"హలో ఉదయార్కర్" అని ఎవరో పిలవడంతో నాపై ప్రాణం పైనేపోయింది అతను మా ఆఫీసులోనే వర్క్ చేస్తుంటాడు.
"ఏమిటి ఉద్యోగం మానేశావా?" ఆశ్చర్యంగా అడిగాడతను.
"అబ్బేకాదు" అంటూ ఖంగారుగా చెప్పబోయానుగానీ అతను వినిపించుకోలేదు.
"ఓ హో పార్ట్ టైమ్ అన్నమాట! అవున్లే! స్మగ్లింగ్ బెస్ట్ బిజినెస్! ఎంతమంది ఇట్టే లక్షాధికారులయిపోలేదు? హాజీమస్తాన్ చూడు! మొదట్లో తిండిక్కూడా గడిచేదికాదుట-"
పావుగంటసేపు హాజీమస్తాన్ కథంతా చెప్పివెళ్ళిపోయాడతను.
"శాయీరామ్!" నీరసంగా పిలిచాను.
"ఏమిటి?"
"ఇలా లాభంలేదు గురూ! పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి తల్లిదండ్రులొస్తారు చూడు! వాళ్ళని అడిగితే బావుంటుంది గానీ ఇలా అసహ్యంగా కేకలు పెడుతూ అమ్మటం నాకు బావుండలేదు" అన్నాను.
"నీ అయిడియా బాగానే ఉంది!" అన్నాడు శాయీరామ్. సరిగ్గా అప్పుడే ఓ పెద్దమనిషి స్కూటర్ మీద వచ్చి వాళ్ళ పాపను డ్రాప్ చేసి తిరిగి వెళ్ళబోతుంటే నేను పరుగుతో వెళ్ళి అడ్డం నిలబడ్డాను.
"మీ పిల్లలకు టెక్స్ట్ పుస్తకాలు కావాలా సార్?" అతను స్కూటర్ ఆపాడు "కావాలి!"
"రండి సార్! తీసుకోండి! రిక్షాలో ఉన్నాయ్! మేము కొన్నధరకే ఇచ్చేస్తున్నాం!"
"ఐసీ" అన్నాడతను స్కూటర్ కి స్టాండ్ వేసి రిక్షా దగ్గరకొస్తూ పుస్తకాలన్నీ చూశాక "ఇవ్వన్నీ కొంటాను ఇస్తారా?" అనడిగాడు. శాయీరామ్, నేనూ ఆనందంగా మొఖాలు చూచుకున్నాం.
"ఇస్తాం సార్! అంతకంటే కావల్సిందేముందీ?"
"అయితే నా వెంబడే రానీండి రిక్షా" అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడతను. రిక్షా స్కూటర్ వెనకేపోతోంది. మేము సైకిల్ మీద బయల్దేరాము. "వీడెవడో స్మగ్లర్ లాగున్నాడు! ఈ పుస్తకాలన్నీ మామూలు రేటుకి కొనేసి- బ్లాకులో అమ్ముకుంటాడు కాబోలు!" అన్నాను శాయీరామ్ తో.
"ఇంకా అనుమానమెందుకూ? బ్లాక్ మార్కెట్ బిజినెస్ చేయబట్టే ఆ స్కూటర్ కొనగాలిగాడు!" అన్నాడు శాయీరామ్. "ఇక్కడ ఆపు!" అన్నాడతను రిక్షావాడితో రిక్షా ఆగింది.
"ఫోర్ నాట్ త్రీ- ఆ రిక్షానీ వాళ్ళిద్దరినీ లోపలకు తీసుకు పద!" అంటూ అరిచాడు. ఉలిక్కిపడి చూచాము. ఎదురుగ్గా పోలీస్ స్టేషన్! ఓ కానిస్టేబుల్ బయటకొచ్చి "లోపలకు పదండి!! అన్నాడు కర్కశంగా. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మమ్మల్ని లోపలకు తీసుకెళ్ళి లాకప్ లో పడేశాడు. ఫోన్ లొ మమ్మల్ని తీసుకొచ్చిన స్కూటర్ వాలా గొంతు భయంకరంగా వినబడుతోంది.
"హలో సార్! ఎస్పీగారా సార్! గుడ్ మాణింగ్ సార్! నేను సి.అయ్.డి. ఇన్ స్పెక్టర్ నర్సింగ్ రావ్ ని మాట్లాడుతున్నాను. టెక్స్ట్ పుస్తకాల స్మగ్లింగ్ కేసు పెట్టేశాను సార్! చాలా పెద్ద రాకెట్ సార్ అది! ఇద్దరు వ్యక్తులనీ, రిక్షావాడు పుస్తకాలన్నీ కాన్ ఫి స్కేట్ చేసేశానండీ!....మన రాష్ట్రంలొ జరుగుతున్న ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో ఇదే పెద్ద ముఠా సార్....."
మాకు క్రమంగా స్పృహ తప్పసాగింది.
* * *