Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 43


    "ఆవిడ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు మేడమ్! అక్కడ నుంచి తెప్పించుకుందేమో మరి..."
    "సీ- మిస్టర్! మీరు టెక్స్ట్ పుస్తకాలెలా తెచ్చుకుంటారో, ఎక్కడ తెచ్చుకుంటారో నాకనవసరం! టి.సి. తీసుకుపోండి...."
    "ఈసారికి క్షమించండి మేడమ్! మేడమ్, మేడమ్? మేడమ్ ప్లీజ్ మేడమ్!"
    "నో-నో-నో- యూ ఆర్ టూ ఎడొమెంట్- టి.సి. తీసుకుపోవాల్సిందే"
    అందరం ఊపిరి బిగబట్టి వింటున్నాము. అతనిగొంతువినిపించలేదీ సారి. కానీ హఠాత్తుగా "ధన్" మన్న శబ్దం వినిపించింది.
    దానివెనుకే ఆవిడ కీచుగొంతు "కయ్" మంది.
    "ఛీ! వాటీజ్ దిస్, వాటీజ్ దిస్ నాన్సెన్స్! మేరీ- మేరీ- రిమూవ్ హిమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్..."
    మాకు అర్ధమయిపోయింది. అతను రాజకీయ నాయకులువాడే ఆఖరి అస్త్రం ప్రయోగించాడు. ఆమె కాళ్ళ మీద పడిపోయాడు.
    "అలా అనకండి మేడమ్! ఇప్పుడు ఇంకో స్కూల్లో చేర్చాలంటే మళ్ళీ కొత్తరకం యూనిఫారం, రెండువేలు డొనేషనూ- బాబోయ్ నావల్లకాదు మేడమ్ మీరు వప్పుకునే వరకూ మీ కాళ్ళు వదలను."
    "ముందు కాళ్ళు వదులు-"
    "నేను వదలను మేడమ్- టి.సి. ఇవ్వను అనేదాకా వదలను!"
    "ఆల్ రైట్! వచ్చే యూనిట్ టెస్ట్ లో అయినా అన్ని సబ్జెక్టుల్లో పాస్  మార్కులు రాకపోతే టి.సి. ఇవ్వడం ఖాయం!"
    "అలాగే మేడమ్!"
    "అయితే ఇంక కాళ్ళువదులు!"
    "థాంక్యూ మేడమ్!"
    "మేరీ!" ప్రిన్సిపాల్ గొంతు వినిపించింది.
    "యస్ మేడమ్!"
    "అక్కడ విక్స్ డబ్బా ఉంటుంది- కొంచెం తెచ్చి నాకాళ్ళకు రాయ్- మరీ నొప్పి పుట్టేలా పట్టుకున్నాడు..."
    "అలాగే మేడమ్!"
    మా అందరిగుండెలూ ఝల్లుమన్నాయ్.
    "ఆవిడ కాళ్ళు పట్టుకోవడం మరీ టూ మచ్!" అన్నాడు రంగారెడ్డి.
    "ఒకళ్ళ సంగతేమో గానీ, గిసంటిపనులు నాతోని కాదు భయ్" చెప్పేశాడు యాదగిరి అయితే మేము కాళ్ళు పట్టుకోకపోయినా ఇంచుమించుగా అంత ఘోరంగానూ జరిగింది మా ఇంటర్వ్యూ!
    అందరం వాచిపోయిన మొఖాలతో బయటకొచ్చాం.
    హఠాత్తుగా యాదగిరి తన చైన్ లోని చాకు తెరచి తన పన్నెండేళ్ళ కొడుకుని పొడిచేయడానికి వెంబడి పడ్డాడు. వాడు "అమ్మో, అమ్మో" అంటూ మా అందరి చుట్టూ తిరగసాగాడు.
    మేమంతా నానా హడావుడిపడి యాదగిరిని బలవంతంగా పట్టుకుని కత్తిలాక్కున్నాం.
    "ఏమిట్రా! నీకేమయినా మతిపోయిందా కన్నపిల్లాడిని చంపుతానంటావేమిటి?"
    "లేకుంటే ఏం కిరికిరి గురూ ఇది? ఇస్కీ మాకీ- వీడు పుట్టిన దగ్గర కెళ్ళి ఒకటే పరేషాన్, పరేషాన్ ఈడికి పాలడబ్బాలు కొననికి కిరికిరి! దేశమంతా తిరిగినంగానీ పాలడబ్బా మనగ్గావలసినది దొరకదు! బ్లాకులో కొనెడిదే! ఆడికెళ్ళి స్కూల్లో ఎడ్మిషన్ గురించి కిరికిరి! వెయ్యిరూపాయలు నగలు గిర్వికిపెట్టి తెచ్చి డొనేషను గట్టి లోయర్ కేజీల జేర్పించిన! ఈడు స్కూలుకి పోనీకి రిక్ష! నీయవ్వ! ఈడి ఫీజు రెండొందలు! రిక్షా నాలుగొందలు! ఈడి యూనిఫారం బట్టగురించి వంద దుకాణాలు తిరిగినా ఆడకెళ్ళి ఈడి బూట్లు, టై నిజం చెప్తున్న భయ్! ఈ ఇద్దరు పిల్లగాండ్రిని సదివియ్యనికి పైసల్జాలక నేనూ, నా భార్య ఒక్క పొద్దే భోజనం చేస్తున్నం- గీపరిషాన్ల నేనుంటే గిప్పుడీ ప్రిన్సిపాల్ టి.సి. ఇస్తననబట్టే! ఏరా ఎందుకుర మార్కులు గన్ని తక్కువొచ్చినయ్యనడిగితే టెక్స్ట్ పుస్తకాలు తీస్కరమ్మంటడు! నీయవ్వ ఇంకేదయినా అంటే తెస్తంగానీ గీ టెక్స్ట్ పుస్తకాలు ఏడకెళ్ళి తేవాల? అదేం బంగారమా, వెండా- తేలిగ్గా దొరకనికి? థూ! నీయవ్వ - గిసంటి దేశంలో పిల్లల్నెవడువయ్యా కనమని చెప్పేడిది?"
    "మేమంత నీతోపాటే బాధలు పడటం లేదేమిటి? అంతమాత్రాన కత్తితీసుకుని పిల్లలను పొడిచేస్తున్నామా?" అన్నాడు రంగారెడ్డి అందరం కాలనీకి చేరుకున్నాం.
    "ఇలాక్కాదు గురూ! అందరం తలోవేపూ వెళ్ళి మొత్తం హైదరాబాద్ అంతా వెతికి వద్దాం టెక్స్ట్ పుస్తకాలెక్కడయినా దొరుకుతాయేమో!" అన్నాడు గోపాల్రావ్.
    ఆ ఆలోచనలతో అందరూ ఏకీభవించారు. మర్నాడు శెలవుపెట్టి అందరం టెక్స్ట్ పుస్తకాల కోసం తలోదిక్కూ వెళ్ళాం! మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి శాయీరామ్ ఉత్సాహంగా ఓ విషయం చెప్పాడు.
    "చార్మినార్ దగ్గర ఓ చిన్న షాపువాడు ముందే డబ్బిస్తే రెండు రోజుల్లో పుస్తకాలు తెప్పించి ఇస్తానంటున్నాడు."
    "నాకూ ఓ ఫ్రెండ్ కనబడ్డాడు. వాడికి డబ్బిస్తే ప్రింటింగ్ ప్రెస్ లో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెప్పిస్తాట్ట" అన్నాడు రంగారెడ్డి.
    వెంటనే అందరం ఆలోచించి ఇద్దరికీ కట్టేద్దామని నిర్ణయించుకున్నాం! "ఇద్దరిలో ఏ ఒక్కరు పుస్తకాలు తెచ్చినా రెండోవారి దగ్గర ఆర్డర్ కాన్సిల్ చేసేయవచ్చు-" అన్నాడు జనార్ధన్.
    వారంరోజులు గడిచిపోయినయ్. అయినా ఏ ఒక్కరూ టెక్స్ట్ పుస్తకాలు తేలేదు. అ రోజు అర్ధరాత్రి తలుపు తట్టారెవరో నిద్రకళ్ళతో తలుపు తెరచాను.
    ఎదురుగ్గా శాయీరామ్, రంగారెడ్డి, గోపాల్రావ్, యాదగిరి కనిపించారు.
    "ఏమిటంత రాత్రిలో వచ్చారు?" అన్నాను నిద్రమత్తుతో.
    "టెక్స్ట్ పుస్తకాలు! టెక్స్ట్ పుస్తకాలు దొరుకుతున్నాయట! త్వరగా పద!" అన్నాడు శాయీరామ్ రహస్యంగా నా నిద్రమత్తంతా వదిలిపోయింది.
    "ఎక్కడికి?"
    "ష్! అదంతా సీక్రెట్! ఆజమ్ భాయ్ ఇప్పిస్తానంటున్నాడు!" అప్పటివరకూ నేను ఆజమ్ భాయ్ ని చూళ్ళేదు. వీళ్ళందరి వెనుకా నిలబడి ఉన్నాడు. ఆజమ్ భాయ్ కూడా మా కాలనీ నివాసే! అతనికి అల్ఫా హోటల్ పక్కన చిన్నపుస్తకాల షాపుంది. మాంచి ఇంగ్లీషు మషాలా నవలలు అద్దెకిస్తూంటాడు.
    నేను వెంటనే బట్టలు మార్చుకుని వాళ్ళతో బయలుదేరాను. అందరం అబిడ్స్ చేరుకున్నాం సైకిళ్ళమీద. అబిడ్స్ సెంటర్ కి దగ్గర్లోనే ఉన్న ఇరుకు సందులు ఓ అరడజను తిప్పాడు ఆజమ్. చివరకు ఓ పాడుబడినట్లున్న మేడముందు నిలబడ్డాం.
    "ఇగో, దేఖోభయ్! పోలీసులు గిట్టవచ్చి ఈడ ఎందుకు నిలబడిన్రు అంటే టెక్స్ట్ పుస్తకమ్ కర్ కే బోల్ నానై సమ్ జెకినై?"
    "సముజే-సముజే" అన్నాడు రంగారెడ్డి.
    "మళ్ళా ఈడ ఎందుకు నుంచున్నావు అంటే ఏం జెప్తావ్?"
    "ఏం జెప్పమంటావ్?" అతనినే అడిగాడు శాయీరామ్.
    "సెకండ్ షో సినిమాదేక్ కే అరహే హై కర్కేబోల్ నా! సముజేకినై!"
    "సముజే!" అన్నాడు రెడ్డి.
    అయిదు నిమిషాలయిపోయింది. అందరం నిశ్శబ్దంగా దొంగల్లా నిలబడ్డాం.
    "టెక్స్ట్ పుస్తకాలేకదా మనం కొనేది? దానికింత రహస్యం ఎందుకు?" నెమ్మదిగా అజమ్ భాయ్ పక్కన చేరి చెవిలో గుసగుసలాడాను.

 Previous Page Next Page