మోపెడ్ రేస్ అను జి.వి.యస్-50 కథ

ప్రతి ఆదివారం ఏదో గొడవమీద మాకెవరికీ విశ్రాంతి లేకుండా కాలనీ మీటింగ్స్ లోకి ఈడ్వటం శాయీరామ్ కి చాలా మామూలు విషయమని మీకూ తెలుసు కదా!
కానీ తమాషా ఏమిటంటే ఆ ఆదివారం అలాంటి గొడవ లేమీ లేకుండా రోజంతా ప్రశాంతంగా గడిచిపోయింది. కానీ మర్నాడు ఉదయం తెల్లారక ముందే తలుపుకొట్టేరెవరో. లేచివెళ్ళి నిద్రకళ్ళతో తలుపు తెరిచాను.
"గురూ! ఇవాళ మనకి జి.వి.యస్-50 మోపెడ్ వస్తోంది. అంచేత ఆఫీస్ కి శెలవు పెట్టు-" అన్నాడు ఆనందంగా.
నాకు శాయీ రామ్ మీద ఈర్ష్య కలిగింది. మా కాలనీలో మా బాచ్ వాళ్ళెవ్వరికీ మోపెడ్ లేదు. గవర్నమెంట్ ఉద్యోగుల జీవితాల్లో మోపెడ్ కాదుకదా- దాన్ని ఫ్రీగా ఇచ్చినా పెట్రోల్ పోయించే కెపాసిటీ ఉండదు.
"త్వరగా రడీ అవ్! నేను వెళ్ళి రంగారెడ్డికీ, జనార్ధన్ కీ యాదగిరికీ గోపాల్రావుకీ కూడా చెప్పేసి వస్తాను" అంటూ వెళ్ళిపోయాడతను.
అందరం కలిసి పదింటికల్లా జి.వి.యస్-50 షోరూం కెళ్ళాం.
"ఏ కలర్ కావాలో చూసుకోండి!" అన్నాడు మేనేజరు.
"బ్లూరంగు కొందాం!" అన్నాడు యాదగిరి. కాసేపు రంగుల గురించి మాలో మాకు వాగ్వివాదాలు జరిగాక చివరకు నల్లరంగు అయితే పది కాలాలపాటు బావుంటుందని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ మోపెడ్ గురించి మేనేజర్ పావుగంట పొగిడాడు.
"లీటరు పెట్రోల్ కి 70 కి.మీ! అంటే ఎంత? కిలోమీటరుకి ఇరవై పైసలు ఖర్చు! అదే సిటీసబ్ కయితే కి.మీ. 50 పైసలు!" షాప్ సూపర్ వైజర్ వచ్చాడు "ఫస్ట్ రెండు సర్వీసింగ్ లూ ఫ్రీ! ఆ తరువాత ఏ రిపేరు వచ్చినా మేమే మా స్పెషల్ మెకానిక్స్ తో చేయించి నామినల్ గా ఛార్జ్ చేస్తాం! కస్టమర్స్ సర్వీస్ ఈజవర్ మోటో..." అన్నాడతను ప్రేమగా.
అందరం కలిసి బండి నడిపించుకెళ్ళి ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించాం.
అందరికీ ఆ పక్కనే ఉన్న హోటల్లో స్వీట్లు ఇప్పించాడు శాయీరామ్.
"మీరు కూడా కొనెయ్యండ్రా! ఎన్ని రోజులిలా మన దరిద్రపు సిటీ బస్సులో ఫుట్ బోర్డు మీద వేలాడుతూ ప్రయాణం చేస్తారు!" అన్నాడు శాయీరామ్ మా అందరివంకా జాలిగా చూస్తూ వాడంత జాలిపడుతుంటే నిజంగానే మా బ్రతుకు చూసి మాకు ఏడుపొచ్చింది అందరం బయటికొచ్చాము.
"మీరు బస్ లొ ఇంటికొచ్చేయండి. నేను డ్రైవ్ చేసుకొచ్చేస్తాను-" అన్నాడు శాయీరామ్.
అప్పుడే బస్ వేలాడుతున్న జనంతో కదల్లేక కదులుతూ వచ్చింది.
"అబ్బబ్బ! నిజంగా బస్ ప్రయాణం హారిబుల్- రోడ్డుమీద చెత్తను వేసుకెళ్ళే మునిసిపల్ ఎద్దుబండిలో ప్రయాణం చేసినట్లే....." అన్నాడు శాయీరామ్ మా మీద ఇంకా జాలిపడుతూ-.
మేమందరం మొఖాలు చూసుకుని మళ్ళీ మా మీద మేమే జాలిపడ్దాం.
వాడు బండి స్టార్ట్ చేసికొని జనంలో నుంచి తూనీగలా దూసుకుపోయాడు.
మేము దిగులుగా బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాం.
"ఈపాటికి మన కాలనీ చేరుకొని ఉంటాడు....." అన్నాడు రంగారెడ్డి దిగులుగా తన వాచ్ వంక చూస్తూ.
"అవ్!" అన్నాడు యాదగిరి ఇంకా దిగులుగా-ఆగకుండా వెళ్ళిపోయినా ఓ బస్సువంక చూస్తూ.
చివరకు అరగంట తర్వాత కాలనీ బస్ దొరికింది.
తీరా ఎక్కి రెండు స్టాప్ లు దాటామో లేదో- అక్కడ రోడ్డు పక్కనే ట్రాఫిక్ పోలీస్ తో ఏదో గొడవపడుతున్న శాయీరామ్ కనిపించాడందరికీ.
"ఏదో గొడవయినట్లుంది- పదండి! దిగి వెళ్దాం" అన్నాడు జనార్ధన్ అందరం బస్ దిగి వెళ్ళాం.
"బండి కొన్నది ఇప్పుడే అయితే లైసెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండీ!" అంటూ అరచాడు శాయీరామ్ గట్టిగా.
"ముందే టెంపరరీ లైసెన్స్ తీసుకోవాలయ్యా!" అన్నాడు కానిస్టేబుల్.
"టెంపరరీ లైసెన్స్ గురించే పోతున్నాడండీ! ఇంతలోనే మీరు రుకాయించబట్టి-" అంటూ కల్పించుకున్నాడు రంగారెడ్డి.
"నువ్వెవరు?" కోపంగా రంగారెడ్డిని అడిగాడు కానిస్టేబుల్.
"అతని దోస్త్ ని"
"దోస్తానా ఉంటే ఇంటి దగ్గర - ఈడగాడు" ఆ మాటతో రంగారెడ్డి సైలెంటయి పోయాడు.
"అదంతా మాకనవసరమయ్యా! రెండొందలు ఫైన్ కట్టాలె" శాయీ రామ్ తో అన్నాడు ఇంకో కానిస్టేబుల్.
అందరం ఉలిక్కిపడ్డాం! అయిదూ పదీకాదు! రెండొందలు-
"ఇదిగో - బండికి 'ఎల్' బోర్డు కూడా పెట్టలే" అన్నాడు కానిస్టేబుల్- ఇప్పుడు బండిలోని మొత్తం లోపాలన్నీ పరీక్షిస్తూ.
"ఇదిగో- హెడ్ లైట్ కి సగం నల్లరంగు వేయాల్సున్నది- వేయలే!"
రాన్రాను లిస్ట్ పెరిగిపోతుందని భయపడి యాదగిరి అతనిని పక్కకు తీసుకెళ్ళి రహస్యంగా మాట్లాడివచ్చాడు.
ఆ కేసులన్నీ వదిలించుకోవడానికి వంద రూపాయలు ఖర్చయింది!
ఆ తరువాత రెండురోజుల మోపెడ్ మీద ఆఫీస్ కెళ్ళాడో లేదు మళ్ళీ వారం శెలవు పెట్టాడు.
"ఏమిటి? ఏమయింది?" ఆశ్చర్యంగా అడిగాను శాయీరామ్ ని కలుసుకుని.
"షాపువాళ్ళు ఇచ్చింది టెంపరరీ రిజిస్ట్రేషన్ కదా! అందుకని రోడ్ టాక్స్ కట్టడానికి రోజూ ఆ ఆఫీసుకెడుతున్నాను-" అన్నాడు దీనంగా చివరకు తనకు సాధ్యంకాక బ్రోకర్ కు వెయ్యిరూపాయలిచ్చి పని పూర్తిచేశాడు.
వారం రోజుల తరువాత రోడ్ టాక్స్ బుక్ తీసుకొని విజయగర్వంతో మళ్ళీ మోపెడ్ మీద ఆఫీస్ కొచ్చాడు.
ఆ తరువాత ఆదివారం అమ్ముగూడాలో బోసువాళ్ళింటికెళ్ళి వస్తానన్జెప్పి మోపెడ్ మీద కాలనీలో హారన్ కొట్టుకుంటూ వెళ్ళాడు. మోపెడ్ పుణ్యమా అని కాలనీలో మీటింగ్ ల బెడద తప్పిందిగ దాని సంతోషించాం మేము! కానీ ఆ సంతోషనం ఎంతోసేపు నిలువలేదు.


