"అతను బతుకుతాడని నాక నమ్మకంలేదు" అన్నాడు మైత్రేయ.
"వాడు నా కళ్ళెదురుగా చస్తేనే నాకు సంతృప్తి. వాడు ఏ హాస్పిటల్లో వున్న నేను చంపుతాను.... పద" ఇద్దరూ ఎర్రమట్టి దిబ్బల్లోంచి బయటి కొచ్చారు. రోడ్డుమీద నడుస్తున్నారు. మైసూరుకు వెళుతున్న లారీని ఆపి, అందులో ఎక్కారు.
ఆ లారీ వాళ్ళని ఊరు సరిహద్దులో దింపేసి వెళ్ళిపోయింది.
* * *
"ఆ మోహితను, మైత్రేయను ఎందుకు వదిలేశావ్?" అడిగాడు సిటీ పోలీస్ కమీషనర్.
"ఆ చీకట్లో ఆ పొదలమధ్య ఛేజ్ చేయడం కష్టం సార్! కీలకమయిన వ్యక్తి మనకు ప్రాణాలతో దొరికిపోయాక వాళ్ళిప్పుడు మనకు సులభంగా చిక్కిపోతారు" చెప్పాడు రమేష్ బాబు.
"ఎలా?"
"ఆ మోహిత రాజేంద్రకుమార్ ని చంపకుండా ఊరుకోదు. రాజేంద్రకుమార్ ప్రస్తుతం కోమాలో వున్నాడు నలభై ఎనిమిది గంటలకుగాని అతనికి మెలుకువ రాదు. ఈలోపల మనకు మోహిత, మైత్రేయ పట్టుబడిపోతారు" చెప్పాడు రమేష్ బాబు.
"ఆ మోహిత ఇంటెలిజెంట్ క్రిమినల్. మన కళ్ళు గప్పి, రాజేంద్రకుమార్ ని చంపేస్తే?" అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ కమీషనర్.
"నో..... రాజేంద్రకుమార్ తో పాటు మోహిత, మైత్రేయలకు మూడు రోజుల్లో కోర్టులో హాజరుపరిచే బాధ్యత నాడి. వాళ్ళని పకడ్బందీగా పట్టుకోవడానికి నా దగ్గర ఫర్ ఫెక్ట్ ప్లాన్ వుంది సార్?" నవ్వుతూ చెప్పాడు రమేష్ బాబు.
"ఏంటా ప్లాన్?"
చెప్పాడు ఎ.సి.పి. రమేష్ బాబు.
"గుడ్..... రియల్లీ మాస్టర్ ప్లాన్ ..... గో..... ఎహెడ్" సంతృప్తిగా అన్నాడు సిటీ పోలీస్ కమీషనర్.
* * *
అడవి మధ్యలో వున్న చిన్న రైల్వేస్టేషన్. అక్కడ ఒకటీ అరా ప్యాసింజర్ ట్రైన్ తప్ప మిగతా ట్రైన్స్ ఏమీ ఆగవు. ప్రయాణీకుల రద్దీ కూడా ఎక్కువగా వుండదు. అక్కడుంటే తమని ఎవరూ గుర్తుపట్టరని అక్కడకు మైత్రేయని తీసుకుని వచ్చింది మోహిత.
విశాలమయిన వెయిటింగ్ హాలు, కర్రబెంచీలు. కన్నడ ప్రభ డైలీ పేపర్ని తిరగేస్తోంది మోహిత.
"ప్రముఖ కంట్రాక్టర్ రాజేంద్రకుమార్ పై హత్యాయత్నం.
నగరానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రాజేంద్రకుమార్ పై నిన్నరాత్రి హోగెనకల్ ఫాల్స్ కి వెళ్లేదారిలో, కావేరీ నదికి దగ్గర్లో హత్యాయత్నం జరిగింది. సరి అయిన సమయంలో పోలీసులా సంఘటన స్థలానికి చేరుకోవడంవల్ల రాజేంద్రకుమార్ మృత్యువునుంచి బయటపడ్డాడు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా వుందని నగరంలోని ఛామరాజ్ వడయార్ ఆస్పత్రి డాక్టర్లు చెప్తున్నారు. ఎ విషయం ఇరవై నాలుగు గంటలకు గానీ తెలియదని వారంటున్నారు.
ఈ హత్యాయత్నం జరిపిన నిందితుల గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు."
ఈ వార్తను చదివిన మోహిత-
"ఇరవై నాలుగు గంటలకు ఎ విషయం ఎందుకు తెలీదు..... వాడు చచ్చిపోయిన విషయమే తెలుస్తుంది" నవ్వుతూ అంది.
"మన ఆ హాస్పిటల్ కి వెళ్ళాలి" అంది మళ్ళీ.
"ఇప్పుడక్కడ పోలీసు నిఘా తీవ్రంగా వుంటుంది" అన్నాడు మైత్రేయ భయోద్వేగంతో.
"అవును...... వుంటుంది..... ఈ చివరి క్షణంలో మనం వెనకడుగు వెయ్యకూడదు. ఈ టైమ్ లో నువ్వు భయపడుతున్నావా?" అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మోహిత.
"లేదు...... జైలుకి ఎలాగూ వెళతామని తెలుసు. భయం ఎప్పుడో పోయింది" అన్నాడతను నవ్వుతూ.
"నువ్వూ జైలుకి వెళ్ళవ్. నేనూ జైలుకి వెళ్ళను. ఆ విషయం నాకు తెలుసు. కంగారుపడకు."
"అదెలా?"
"ఇవరై నాలుగు గంటలు ఆగు. అన్ని విషయాలు నీకే తెలుస్తాయి" ఆమె మాటలవెనక అర్థం గురించి ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
ఇద్దరూ రైల్వేస్టేషన్ లోంచి బయటికొచ్చి ఆటో ఎక్కారు.
"ఏమిటీ.... మూడీగా వున్నావ్ ?" అడిగింది మోహిత.
"ఇందు జ్ఞాపకానికొచ్చింది" అన్నాడతను.
"ఇందును నువ్వు కలుసుకుంటావులే..... డోన్ట్ వర్రీ" అందామె. ఆటో అడవిమధ్యలో వున్న మట్టిరోడ్డుమీద నెమ్మదిగా వెళుతోంది.
* * *
ఛామరాజ్ వడయార్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో పాటు, హాస్పిటల్ కారిడార్లో నడుస్తున్నాడు ఎ.సి.పి రమేష్ బాబు.
"అయితే మీకు హాస్పిటల్ వెనకనున్న డాక్టర్స్ రెస్ట్ రూమ్ ఇస్తాను. హాస్పిటల్లో రూమ్ ఇస్తే, దానివల్ల పేషెంట్స్ కి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం వుంది" అన్నాడు సూపరెంటెండెంట్.
"ఇందులో పేషెంట్స్ ఇబ్బంది పడే అవకాశం లేదు..... ఎందుకంటే మీ డాక్టర్లు ట్రీట్ చేసేది నన్నే. రాజేంద్రకుమార్ ని కాదు..... దిసీజ్ సీక్రెట్" ఆ సీక్రెట్ ఏమిటో చెప్పాడు రమేష్ బాబు సూపరింటెండెంట్ తో.
"వెరీగుడ్ ప్లాన్..... మా డాక్టర్లు కూడా మీకు సహకరిస్తారు" అన్నాడాయన.
"మీ డాక్టర్ల అవసరంగానీ, మీ నర్సుల అవసరంగానీ మాకుండదు" చెప్పాడు రమేష్ బాబు.
"అంటే హాస్పిటల్ ని మీరు డ్రామా థియేటర్ చేస్తున్నారన్నమాట" నవ్వుతూ అనేసి తన ఛాంబర్లో కెళ్ళిపోయాడు సూపరింటెండెంట్.
* * *
హాస్పిటల్ ఇన్ గేట్ దగ్గర ఆటో ఆగింది.
అందులోంచి దిగారు మోహిత, మైత్రేయ.
ఎంక్వయిరీ వేపు ధైర్యంగా నడిచిందామె.
ఎంక్వయిరీ కౌంటర్లోని లేడీ అసిస్టెంట్ 'ఏం కావాలన్నట్లు'గా ఆమెవేపు చూసింది.
"ఉయార్..... రాజేంద్రకుమార్స్...... రెలెటివ్స్...... ఆయన ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చా?"
"ఆ లేడీ అసిస్టెంట్ మోహితవేపు ఎగాదిగా చూసి-
పక్కనే వున్న రిజిష్టర్ అందుకుని చూస్తూ -
"ఏ కేసు?"
"మర్డర్ ఎటెమ్డ్...... నిన్న రాత్రి పోలీసులు జాయిన్ చేశారు" చెప్పింది మోహిత.
అయిదు నిమిషాలసేపు పేజీలన్నీ తిరగేసి......
"నో మేడమ్..... ఇక్కడ జాయిన్ చెయ్యలేదు" ఆ జవాబుకి ఆశ్చర్యపోయింది మోహిత.
"ఇవాళ డైలీపేపర్ చూశారా మీరు?" అంటూ ఆ పేపేర్ కటింగ్ లో న్యూస్ ఐటెమ్ ని చూపించింది ఆమెకు మోహిత.
"ఎప్పుడు, ఏ సమయంలో, ఏ పేషెంట్ ని మేం చేర్చుకొన్నా.... స్టాఫ్ ఆ పేషెంట్ వివరాలన్నీ ఇందులో రాస్తారు. మేం చేసే ఫస్ట్ డ్యూటీ అదే..... బట్...."
"రాయడం మర్చిపోయారేమో!"
"లేదు...... అలాంటిది జరగదు. ఛామరాజ్ వడయార్ హాస్పిటల్ అని తప్పు పడిందేమో, ప్రైవేట్ నర్సింగ్ హోమ లో చేర్చారేమో....." అందామె.
"థాంక్యూ" చెప్పేసి బయటకొచ్చి, ఇన్ గేట్ కు ఎదురుగా వున్న హొటల్లో కూర్చున్నారిద్దరూ.
* * *
డాక్టర్స్ రెస్ట్ రూమ్ విశాలంగా వుంది.
ఎ.సి.పి. రమేష్ కాకుండా, అక్కడ పదిహేనుమంది పోలీస్ ఆఫీసర్స్ వున్నారు. వాళ్ళలో లేడీ కానిస్టేబుల్స్ కూడా వున్నారు.
"ఇద్దరు డాక్టర్ల వేషం వేసుకోండి...... నలుగురు నర్సుల వేషం వేసుకోండి. ఇంకో నలుగురు వార్డు బోయ్స్ వేషం వేసుకోండి. ఆ మోహిత, మైత్రేయలను గుర్తుపట్టగలిగే పోలీస్ ఆఫీసర్స్ మఫ్టీలో ఇన్ గేట్ దగ్గర, ఎంక్వయిరీ దగ్గర, లాన్స్ లాన్స్ దగ్గర వుంటారు.
ఎంక్వయిరీ దగ్గరకొచ్చే మొహితకు గానీ, మైత్రేయగానీ కౌంటర్ లో వున్న మన వ్యక్తి రాజేంద్రకుమార్ ఎ వార్డులో వున్నాడో తెలియచేస్తాడు.
ఆ సమయంలో నేనొక్కడ్నే ఆ రెస్ట్ రూమ్ లో వుంటాను...... ఈ రూమ్ లోకి మోహితగానీ, మైత్రేయగానీ ఎంటర్ కాగానే మారువేషాల్లో వున్న మీరు రెస్ట్ రూమ్ ను చుట్టుముట్టాలి...... దట్సాల్."
నిందితులను పట్టుకోడానికి రంగం సిద్ధమవుతోంది.
* * *
కూల్ డ్రింక్ సిప్ చేస్తోంది మోహిత.
"ఆ ఎ.సి.పి. రమేష్ మీద నాకేదో అనుమానంగా వుంది. రిజిష్టర్లో ఎంటర్ చేయకుండా పేషెంట్ ని చేర్చుకోరు అని ఆ లేడీ అసిస్టెంట్ చెప్పిన విషయమే కరెక్ట్ అయితే...... ఇక్కడే ఎక్కడో రహస్యంగా అతనికి ట్రీట్ మెంట్ జరుగుతూ వుండొచ్చు. లేకపోతే ఎ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోనో అతన్ని చేర్పించి...... పేపర్స్ లో మాత్రం ఛామరాజ్ వడయార్ హాస్పిటల్ అని మాత్రమే యిచ్చారు...... హత్యయత్నం ఇవాళ పేపర్లో ఎందుకు రాయలేదు? రాజేంద్రకుమార్ కి ఈ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ జరుగుతోంది అంటే మనం ఇక్కడకు వస్తాం.
ఇక్కడ పోలీసులు మఫ్టీలో వుంటారు. రాజేంద్రకుమార్ వుండడు" సాలోచనగా అంది మోహిత.
"యూ ఆర్ కరెక్ట్! నో డవుట్...... ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోనే అతనున్నాడు" చెప్పాడుతను.
అదే సమయంలో-
అవుట్ గేట్ లోంచి ఓ పోలీస్ జీపు బయటకు రావటాన్ని గమనించింది మోహిత.
"మైత్రేయ....... నువ్వు వెంటనే ఆటోలో ఆ జీపుని ఫాలో కా...... క్విక్...... నేనిక్కడే వుంటాను" చెప్పిందామె.
ఆ జీపువేపు చూస్తూ, గబగబా హోటల్లోంచి రోడ్డుమీదకొచ్చి ఆటో ఎక్కాడు.
జీపు వెనక ఆటో వెళుతోంది.
ఆ జీపులో ఎస్.ఐ. రవివర్మ వున్నాడు. ఆ జీపు మొదట సిటీపోలీస్ కమీషనర్ ఆఫీసుముందు ఆగింది. లోనికెళ్ళి వచ్చాడు రవివర్మ. తర్వాత ఆ జీపు కలెక్టరేట్ ప్రాంతానికెళ్ళి, అక్కడో ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఆగింది.
ఆ హాస్పిటల్ ముందు ఆగిన జీపును రెండుగజాల దూరంలో ఆగిన ఆటోలోంచి చూస్తున్నాడు మైత్రేయ.
లోనికెళ్ళిన రవివర్మ పావుగంట తర్వాత బయటికొచ్చాడు. ఆ జీపు ఆటో పక్కనుంచే వెళ్ళిపోయింది.
"వడయార్ హాస్పిటల్ కి పోనీ" చెప్పాడు మైత్రేయ.
రవివర్మ ఎక్కిన జీపు మళ్ళీ వడయార్ హాస్పిటల్ కి వెళ్లింది. ఆటో హోటల్ ముందు ఆగింది. ఆటో దిగి, తనకోసమే ఎదురుచూస్తున్న మోహిత దగ్గరకు వెళ్ళాడు.
"ఏం జరిగింది?" ఆత్రుతగా అడిగింది మోహిత
అంతా చెప్పాడు మైత్రేయ.