Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 44

   

   రెండోది సెన్సేషనల్! పత్రికలవారికి కావల్సినంత సంచలనం!! మరుసటిరోజే తాటికాయంత అక్షరాల్తో పేపర్లలో ప్రచురిస్తారు. యోగి భయపెడుతున్నది కూడా అందుకే. ధరణి తొందర పడుతున్నది కూడా అందుకే!
   
    టోనీ ఆమెవైపు జాలిగా చూశాడు. ఆమె ప్రవర్తనని అతను అర్ధం చేసుకోగలడు. ప్రాణాలు పోయినా, తన వాళ్ళందరూ మరణిస్తున్నా-మొదటినుంచీ చివరివరకూ ధీరోదాత్తంగా నిలబడటం కథల్లోనూ సినిమాలలోనూ మాత్రమే సాధ్యం నిజజీవితంలో కాదు.
   
    అతను శ్రీధర్వైపు తిరిగి, "ఆమె చెప్తున్నట్టు మనం అర్జెంటుగా కోర్టుకి వెళ్తే మంచిదేమో...." అన్నాడు.
   
    ఇక తప్పదన్నట్టు శ్రీధర్ తలూపి, వెళ్ళటానికి ఆయుక్తుడవుతూ భార్యవైపు తిరిగి విసుగ్గా, "....అప్పుడు నేను చెప్తే విన్నావు కాదు. అంతా చేజేతులారా కొనితెచ్చుకున్నాం...." అంటూ బయల్దేరాడు.
   
    నిర్విన్నురాలైంది ధరణి. ఎన్నివేల దశాబ్ధాల్నుంచీ ఎన్ని కోట్లమంది భర్తలు భార్యలు ఒకరితో ఒకరు ఈ మాటలు అనుకుని వుంటారు! అతడు వెళ్ళిన వైపే నిర్లిప్తంగా చూస్తూ అనుకుంది.
   
    '.... అప్పుడు నేను చెప్తే విన్నావుకాదు..... నేను చెప్పినట్టే జరిగింది చూసావా.... అవతలివాళ్ళు చెప్పింది కాస్త వినాలి..... అనుభవించు .....' లాటి దెప్పిపొడుపులు.
   
    తనేం తప్పుచేసింది?
   
    ఒక సామాజిక అన్యాయాన్ని ఎదుర్కోవటం తన బాధ్యత అనుకుంది. పిల్లల్ని కూడా రిస్క్ చేయాలనుకుంది! అదే విషయాన్ని ప్రాక్టికల్ గా అనుభవించాల్సి వచ్చేసరికి ఓడిపోయింది. అంతేగా!
   
    దీన్ని తన భర్త ఎందుకు 'తన గెలుపు'గా తీసుకుంటున్నాడు?
   
    .....
   
    ఆలోచన్ల నించి తెప్పరిల్లి, ఆఖరిసారి అన్నట్టు ఆమె కోర్టుకి ఫోన్ చేసింది.
   
    రెండుసార్లు రింగ్ అవగానే అట్నుంచి లాయర్ విధ్యాదేవి కంఠం '....హల్లో' అని వినిపించింది. ధరణి చప్పున కిటికీలోంచి చూసింది. అప్పటికే శ్రీధర్ వాళ్ళూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు.
   
    మళ్ళీ అట్నుంచి '....హల్లో' అని వినపడింది.
   
    "లాయర్ గారూ నేను ధరణిని" ఆమె కంఠం స్వల్పంగా రుద్దమయింది.
   
    అది గమనించి అట్నుంచి "ఏమైంది ధరణీ.... వ్వాట్ హాపెండ్" అని విధ్యాదేవి కంగారుగా అడిగింది.
   
    "నేనిచ్చిన కంప్లెయింట్.."
   
    "ఊ... కంప్లెయింట్?"
   
    ధరణి వాక్యం పూర్తి చేయబోతూంటే గుమ్మం దగ్గిర్నుంచి "....అమ్మా" అన్న పిలుపు వినిపించింది. ఎక్కడున్నా ఒక తల్లి గుర్తుపట్టగలిగే స్వరం అది. ప్రేమతో ప్రేవుని కదిల్చే ప్రకంపనం అది.
   
    నమ్మశక్యం కానట్టు ధరణి తలతిప్పి చూసింది.
   
    గుమ్మంలోంచి లోపలికి పరుగెత్తుకు వస్తున్నారు అభి, పూజలు.
   
    వెనుకే విక్రమ్ హుందాగా నడుస్తూ దగ్గిరవుతున్నాడు.
   
    ధరణి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
   
    "హల్లో-హల్లో" ఫోన్ లో లాయర్ కంఠం అటువైపు ఆందోళనగా పిలుస్తోంది. "ఏమైంది ధరణీ? ఏమైంది?" అంటూ.
   
    "ఏమీ లేదు లాయర్ గారూ వీలైనంత త్వరగా కేసుకోర్టులో ఫైల్ అయ్యేలా చూడండి. మావారు మీ దగ్గరికి బయల్దేరారు. పిల్లలు దొరికారని చెప్పండి" ఫోన్ పెట్టేసింది.
   
                                          3
   
    "మొదట రెండు రోజులూ బింకంగా వున్నాడు. మూడోరోజు కూడా నిద్రలేకపోయేసరికి కదిలిపోయాడు. కాస్త మాగన్నుగా నిద్ర పట్టేసరికి ఎలుకలు పీక్కుతినటం మొదలు పెట్టేవి-అనుకంటూ.." కాఫీ సిప్ చేస్తూ అన్నాడు విక్రమ్. "....మా డిపార్ట్ మెంట్ లో ఎన్నో పద్దతులు చూశాను. కానీ దీన్ని మించింది లేదని ఇప్పుడనిపిస్తోంది. అమ్మో! తలచుకుంటేనే వళ్ళుగగుర్పొడుస్తోంది. 'నేనేనా ఇదంతా చేయగల్గింది' అనిపిస్తోంది."
   
    "ఇంతకీ వాళ్ళు పిల్లల్ని ఎక్కడ దాచారు?"
   
    "మీ తమ్ముడి మామగారి దగ్గర.." ధరణిని చూస్తూ అన్నాడు.
   
    "వ్వాట్" భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అరిచారు.
   
    "అవును ఆ సాలగ్రామం, యోగి, ప్రొడ్యూసర్ ఏడుకొండలు - అందరూ ఒకే గ్రూపు. మదన్ అదృశ్యమయ్యాడనగానే పోలీసుల మీద యోగికి అనుమానం వచ్చింది. అయితే నేను వాడిని మా ఇంట్లోనే వుంచుతాననుకోలేదు. కంగారుపడ్డాడు. పిల్లలకి ఏడుకొండలు బంధువు అవుతాడని తెలుసు. అందుకే అక్కడ దాచి పెట్టాడు. పోలీస్ ఇంటరాగేషన్ లో మదన్ అంతా చెప్పేస్తే - కేస్ నిలవకుండా."
   
    ధరణీ, శ్రీధర్ లు ఆశ్చర్యంగా వింటున్నారు. ".... చాలా పెద్ద క్రిమినల్ మెదడది!" అన్నాడు విక్రమ్.
   
    ".... మదన్ మా బాధలకి తట్టుకోలేక అసలు విషయం చెప్పగానే ఏడుకొండల్ని అరెస్ట్ చేద్దామని వెళ్లాను. నన్ను చూడగానే ఏమీ ఎరగనట్టు పిల్లల్ని తీసుకొచ్చి నా ముందుంచి, '....మా అల్లుడి తాలూకు పిల్లలంట. ఎవరో కిడ్నాపర్స్ ఉత్తరంతోపాటు పంపించారు' అన్నాడు. ఇంకేం చెయ్యను?"
   
    "మదన్ సాక్ష్యం చాలదా?"
   
    "చెప్పడు మేము వదిలెయ్యగానే వాడు మామూలు క్రిమినల్ అయిపోతాడు. తనవాళ్ళని చూడగానే ధైర్యం వచ్చేస్తుంది!!!! మా దగ్గిర అప్రూవర్ ని అంటాడు. అక్కడికి వెళ్ళగానే ప్లేటు మార్చేస్తాడు. కేసు నిలబడదు."
   
    "ఇంతేనా- ఇంకేమీ జరగదా?" ఆవేశంగా అరిచింది ధరణి. "....ఒక నేరం చెయ్యటం, దాన్నించి తప్పించుకోవటం ఇంత సులభమా?"
   
    శ్రీధర్ గాఢంగా విశ్వసిస్తూ "-మన వ్యవస్థ అలాటిది ఏం చెయ్యగలం?" అన్నాడు విక్రమ్ మాట్లాడలేదు.
   
    "కనీసం ఏడుకొండల్ని అరెస్ట్ చెయ్యాల్సింది" ధరణి ఉద్రేకంగా అంది.
   
    "అప్పుడు వాళ్ళూ వూరుకోరు అన్-ఆధరైజ్ డ్ గా ఒక మనిషిని నేను బందించినందుకు ఏదో ఒక గొడవ చేస్తారు. అంతా లోపాయికారిగా జరిగిపోయింది. మనక్కావల్సింది మన పిల్లలు మన వద్దకు రావటం- అది చాలు."
   
    "కానీ ఇంత ఘోరం చేసి-"
   
    "ఇది చాలా చిన్న ఘోరం! కోర్టులోకేషు నిలవని ఘోరం!! కానీ అంతకన్నా పెద్ద ఘ్జోరం వాళ్ళు చేశారు. డానికి ... దానికి పడాలి శిక్ష! వాళ్ళు చేస్తున్నది పదిమందికీ తెలియాలి. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాలి."
   
    శ్రీధర్, ధరణిలు ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూశారు. అతడిలో ఇంత సామాజిక స్పృహ, ఆవేశం వున్నాయనుకోలేదు. ధరణికి- తను మొదటిసారి అతడిని కలిసిన సంఘటన గుర్తొచ్చింది. ఆ ఇన్స్ పెక్టర్ కీ- ఈ విక్రమ్ కీ ఎంత తేడా!     పోలీసు దుస్తులూ, నిరంతరం చుట్టూ జరిగే అన్యాయాలూ-ఆవేశం చుట్టూ నిర్లిప్తతని కోట కడతాయనుకుంటా-అనుకుంది.
   
    విక్రమ్ అన్నాడు, "మదన్ ఇంకా మా దగ్గిరే వున్నాడు కాబట్టి అతడి సాక్ష్యంతో ఏడుదుకొండల్ని అరెస్ట్ చేయించవచ్చు. కానీ కేసు కోర్టు వరకూ కూడా వెళ్ళదు. నేను చెప్పేది అర్ధమైందనుకుంటాను."
   
    "ఇదే నిలబడకపోతే- రేపు యోగి మీద ఏం నిలబడుతుంది?" శ్రీధర్ నిరాశగా అన్నాడు.
   
    "నేను భయపడేది కూడా అదే! దానికీ సాక్ష్యాలూ లేవు. కేవలం మదన్ సాక్ష్యంతో ఈ విషయాన్నంతా పేపర్లకి ఎక్కించగలిగితే చాలు. కొందరు తల్లిదండ్రులన్నా జాగ్రత్తపడతారు."
   
    అప్పటివరకూ ప్రేక్షకురాలిలా వింటూన్న ధరణి, "మేము ఇంత రిస్కు తీసుకున్నదీ ఇందుకేనా?" అంది.
   
    "ఇంతకన్నా ఇంకేం చెయ్యగలమమ్మా? ఒక నేరం నిరూపించబడాలంటే, నష్టపోయిన వ్యక్తి వుండాలి. లేదా నేరస్థుడికి నష్టం చేకూర్చే ఉద్దేశ్యం వుందని నిరూపించాలి. ఈ కేసులో సాక్ష్యం చెప్పగలిగే ప్రియ మరణించింది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లేదు, మీరు చూసిన దృశ్యాలకి కోర్టులో ఏ విలువా వుండదు. ఇంకెవరు చెప్తారు సాక్ష్యం?"
   
    నెమ్మదిగా, కానీ-స్పష్టంగా దృఢంగా ధరణి స్వరం పలికింది "నా కూతురు చెపుతుంది."
   
    యధాలాపంగా వింటున్న శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు.
   
    ఇన్ స్పెక్టర్ ఆశ్చర్యంగా, "అంత చిన్న పిల్లా?" అన్నాడు.
   
    "అవును చిన్న పిల్లలు అబద్దాలు చెప్పరని కోర్టు నమ్మగలిగితే చాలు. నేరస్తుడు శిక్షింపబడతాడు." అంది.
   
    అదంతా సులభం కాదని ఇన్ స్పెక్టర్ కి తెలుసు. అయినా నిరాశ పర్చకుండా "-ప్రయత్నిద్దాం" అంటూ లేచాడు. "ఈ లోపులో మిగతా పిల్లల్ని కూడా వాకబు చెయ్యాలి. ఇవన్నీ కోర్టులో చెప్పటానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో! అదీగాక- కోర్టంటే సినిమాలో చూపించినట్టు వుండదు. అంతా చెత్తాచెదారం, మెట్లపకనే ఉమ్ములూ, చౌకబారు క్రిమినల్సూ...."అతడిమాట పూర్తికాకుండానే ఆమె అన్నది - "ఒక అడవిని చుట్టుముట్టి మట్టుపెట్టే దావానలం కూడా- చిన్న చితుకుల మంటతోనే ప్రారంభం అవుతోంది విక్రమ్ గారూ వెలుగు చూడటానికి భయపడే పెద్దవాళ్ళముందు నా కూతురిచేత అగ్గిపుల్ల గీయిస్తాను. చూద్దాం ఏమవుతుందో...."

 Previous Page Next Page