Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 45

         

                                     4
   
   
    "ఆ ఇన్ స్పెక్టర్ ముందు చెప్పటం బావోదని వూరుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నా కూతురు ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగటం నేనొప్పుకోను" స్వరం తగ్గించి మాట్లాడినా-ఆ కంఠంలో ఉద్రేకం తొంగిచూస్తోంది.
   
    పక్క గదిలో నిద్రపోతూన్న పిల్లలకి డిస్టర్బెన్స్ కలగకుండా నెమ్మదిగా మాట్లాడుతూ ఘర్షణ పడుతున్నారు ధరణీ, శ్రీధర్ లు ధరణి కూడా అంతే ఆవేశంతో అంది. "....ఒక స్త్రీ బాధ మీకు తెలీదండీ. అందుకే మీరొప్పుకోరు. మొట్టమొదటిసారి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఆయన్తో ఏమన్నానో గుర్తుంది నాకు! 'ఈ శరీరం నా ప్రాపర్టీ! నా ఆస్థి!! నా అనుమతి లేకుండా దానిమీద ఎవరైనా చెయ్యివేస్తే-నేను కత్తే పన్నులతో జీతాలు అందుకుంటున్న ఆ రక్షకభటులకి-నన్ను రక్షించాల్సిన బాధ్యత కూడా వుంది' అన్నాను. అది గుర్తు పెట్టుకునే ఆయన బహుశా అని వుంటారు- కేసు బలంగా వుండాలంటే నష్టం జరిగిన వ్యక్తే కంప్లైంట్ చేయాలని! మనకూతురి తరపున మనం కోర్టులో ఏం చెప్తాం! జరిగిందేమిటో తననే చెప్పమందాం! దానివల్ల భవిష్యత్తులో తనకేం నష్టమో ఆ పాప వూహించలేకపోవచ్చు. జడ్జి వూహించగలడు కదా."
   
    "ఇదేం చెప్తుంది? అతడేం వూహిస్తాడు? అనవసరంగా నువ్వే ఏదో బ్రహ్మాండంగా అయిపోతుందని వూహించుకుంటున్నావు. ఏమీ జరగదు. మనమ్మాయి ఫోటో పేపర్లో పడుతుంది. కొట్ట స్కూల్లో అందరూ వింతగా చూసి చెవులు కొరుక్కుంటారు. ఏదో సమాజాన్ని ఉద్దరిద్దామనుకుంటూ అనవసరంగా నీ కూతురి భవిష్యట్టు నాశనం చెయ్యకు."   
   
    "ఇప్పుడు నాశనం అవలేదా?"
   
    "తెలిసీ తెలియని వయసులో ఎవడో వంటిమీద చెయ్యి వేస్తే దానికింత రాద్దాంతం దేనికి?"
   
    "అంతా తెలిసిన వయసులో బస్ లో ఎవడో చెయ్యి వేసినప్పుడు కూడా మీరిలాగే అన్నారు-రాద్దాంతం దేనికీ? అని."
   
    "అన్నాను. ఏదో కూతురి శీలం పోయినట్టు మాట్లాడతావేమిటి?"
   
    "శీలం పోవటమంటే కన్నెపొర చిరగటమేనా?"
   
    శ్రీధర్ షాక్ తిని, వెంటనే తమాయించుకుని "అంత పెద్ద మాటలు దేనికి?" అన్నాడు.
   
    "పోనీ ముద్దు పెట్టుకోవటమా?"
   
    "ఇష్టం లేకుండా ఎవరూ పెట్టుకోరు."
   
    "ఇష్టం లేకుండా స్పృశిస్తే?"
   
    "నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావటంలేదు. నీ కూతురికి ఏదో జరిగిపోయినట్టు ఆ ఆవేశం ఏమిటి?"
   
    "నా కూతురికి జరగలేదు. నాకు జరిగింది! నా కూతురి వయసులో వున్నప్పుడు నాకు జరిగింది!! మీకు గుర్తుందా శ్రీధర్.... ఒకరోజు స్కూల్లో మా టీచర్ చిన్నప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నాడంటే ఆ రాత్రంతా మధనపడి తెగ సిగరెట్లు కాల్చావు. బస్ లో ఎవడో వళ్ళంతా తడిమాడంటే దానికీ నన్నే తిట్టావు. ఆఫీసులో ఆపి అధికారి వేధిస్తున్నాడంటే, ఏదో విధంగా మానేజి చెయ్యమన్నావ్! ఇదంతా చివరికి ఎటు దారితీస్తుందో తెలుసా శ్రీధర్... '.... ఈ మొగాడికి చెప్పుకోవటం కన్నా కడుపులోనే దాచుకోవటం మేలు' అనే మానసికమైన దౌర్భాగ్యపు స్థితికి తీసుకువెళ్తోంది. అందుకే నా కూతురిని నేను కోర్టులో సాక్ష్యం చెప్పమంటున్నాను. ఏ స్త్రీ అయినా పైకి చెప్పుకోవటానికి సిగ్గు పడాల్సిన విషయం కాదని అంటున్నాను."
   
    శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు.
   
    ఆమె కొనసాగించింది.
   
    "....ఆ రోజు రాత్రంతా నువ్వు సిగరెట్లు తాగుతుంటే, నీ ఉపశమనం కోసం అబద్దం చెప్పాను. ఏమీ జరగలేదనీ, సరదాగా జోక్ చేసాననీ అన్నాను. మరి నువ్వు అన్నట్టు ఇదంతా చిన్న విషయం అయితే ఆ రాత్రంతా ఎందుకు మధనపడ్డావ్? నీ దృష్టిలో - ఒక చిన్న అమ్మాయిని తెలిసీ తెలియని వయసులో మాస్టారు పెదాలమీద ముద్దు పెట్టుకోవటం నేరం కాదుగా-"
   
    అతడు తలదించుకున్నాడు.
   
    "నేను మిమ్మల్ని తప్పు పట్టటం లేదు ఏ భర్తా సహించలేడు దీన్ని! కానీ ఆ చిన్నపిల్ల ఏం చేస్తుంది? ఏం చెప్పుకోవాలన్నా ఆ పాపకి సి....గ్గే...స్తుం....ది! పెద్దయ్యాక, తొలి అనుభవపు ఆహ్లాదాన్ని ఆస్వాదించాల్సిన స్టేజిలో - చిన్నప్పటి మాస్టారి చర్యో, ఇంట్లో ముసలి మావయ్య చెయ్యో గుర్తొచ్చి మనసు వికలమవుతుంది! భర్త దగ్గిర స్వచ్చమైన ఆనందం పోతుంది!! అందుకే....అందుకే శ్రీధర్....నేను మన అమ్మాయిని దీనికి ముందు నిలబెట్టాలనుకుంటున్నాను! తన హక్కులకోసం, తన శరీరపు ఆస్తుల కోసం పోరాడేలా చేస్తున్నాను...."
   
    శ్రీధర్ నెమ్మదిగా తలెత్తి భార్యవైపు చూసాడు. అతడి మొహం ఇప్పుడు వర్షం కడిగిన వరిపైరులా వుంది. ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. "నా కర్ధమైంది ధరణీ..... నాకా రోజు ఫోటో స్టూడియోలో జరిగిన సంఘటన కూడా గుర్తొస్తుంది. ఆస్పత్రిలో అసహాయమ్గా పడివున్న రోగిష్టి స్త్రీని కూడా వదలని మనుష్యులకి బుద్ది చెప్పాలంటే ఎవరో ఒకరు ముందుకు రాక తప్పదు."
   
    తేలికైన మనసుతో ధరణి భర్తవైపు చూసింది. అదే టైమ్ కి బయట తలుపెవరో కొట్టిన చప్పుడైంది. భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. ఇంత రాత్రిపూట వచ్చిందెవరో అర్ధంకాలేదు. ముందు కిటికీలోంచి చూసి, తలుపు తీసారు.
   
    చందూ, మేధ కంగారుగా లోపలికి వచ్చారు.
   
    "ఏమైంది?" శ్రీధర్.
   
    "మా నాన్న ఇంత చండాలుడు అనుకోలేదు" అంది మేధ. "మదన్ తెచ్చిన పిల్లల్ని తన దగ్గిర దాచాడు. ఇన్ స్పెక్టర్ రాగానే భయంతో అప్పగించేసాడు."
   
    "అవును. అయితే?"
   
    "అంతా తెలిసి యోగి నిప్పులు తొక్కిన కోతిలా చిందులు వేస్తున్నాడు. రేప్రొద్దున్నే మీరు ఎలాగూ ప్రెస్ ని పిల్చి స్టేట్ మెంట్ ఇస్తారని తెలుసు. పేపర్లలో ఇదంతా రాకముందే రాత్రికి రాత్రి మిమ్మల్ని ఏదైనా చేయాలని పథకం వేస్తున్నారు వాళ్ళు..."
   
    ధరణి సన్నగా వణికింది.
   
    మేధ అంది, "అవును వదినా, ఒక్కసారి ఇదంతా పేపర్లలో వస్తే, పోయిన పరువు కూడగట్టుకోవటం కష్టమని యోగి అంటూండగా నేను స్వయంగా విన్నాను. అందుకే మీ తమ్ముడ్ని తీసుకుని వచ్చాను. వెంటనే మీరు ఇక్కణ్నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి...."
   
    ఆమె మాటలు పూర్తి కాకుండానే బయట అడుగుల చప్పుడు వినిపించింది. ఒకటి కాదు, చాలామంది వస్తున్న చప్పుడు.....
   
    సన్నగా ప్రారంభమై-క్రమ క్రమంగా దగ్గిరవుతున్న ధ్వని.....!!
   
    నిశ్శబ్దపు అర్దరాత్రి - సుశిక్షితులైన సైనికులు ఒక దుర్గాన్ని చుట్టు ముట్టుతున్న ఫీలింగ్....!!!
   
    శ్రీధర్ గుమ్మం దగ్గరికి పరిగెత్తాడు.
   
    ఏదైనా ఆయుధం దొరుకుతుందేమోనని చందూ గదంతా కలయచూసాడు. మేధ ధరణికి దగ్గరిగా జరిగింది. ధరణి మనసంతా- గదిలో నిద్రపోతున్న పిల్లలమీదే వుంది.
   
    శ్రీధర్ తలుపు వేసాడు.
   
    కానీ ఎదుటి వ్యక్తుల్ని కిటికీలోంచి చూసి లోపలున్న వారందరూ ఒక్కసారిగా విస్మయం చెందారు.
   
    విశ్వనాథం, అతని వెనుకే భార్య కమల, జాన్ అబ్రహం, రాజారావు, సుబ్బారావు, సలీం మొదలైన వారంతా వస్తూ వున్నారు. మొత్తం కాలనీ అంతా అక్కడే వున్నట్టుంది.
   
    "....ప్రొద్దున్నించీ మీరెప్పుడు వస్తారా అని కాచుక్కూర్చున్నాం. ఎక్కడికి వెళ్ళారు?' జాన్ అడిగాడు.
   
    "ఇంట్లోనే వున్నామే. ఇంతకీ ఇంత అర్దరాత్రి చలిలో మీరందరూ ఎందుకొచ్చారు?" అంది ధరణి ఆశ్చర్యంగా.
   
    "మీ పిల్లల్ని ఆ దుర్మార్గులు కిడ్నాప్ చేసారనీ, కోర్టుకేసు విరమించుకొమ్మని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ తెలిసాక - జాన్ అబ్రహం మీటింగ్ ఏర్పాటు చేశాడు" అన్నాడు విశ్వనాథం.
   
    "ఒక కోతి కరెంట్ తీగె తగిలి మరణిస్తే మిగతా కోతులన్నీ దాని శవం చుట్టూ మూగి నానాగొడవా చేసి తమ ఐకమత్యాన్ని ప్రకటిస్తాయి. అలాటిది సాటిమనుష్యులం- ఇన్నాళ్ళ నుంచీ కలిసి బ్రతుకుతున్న వాళ్ళం..... మీకు కష్టంవస్తే మేము ఏమీ పట్టనట్టు ఎలా వుండగలం?" నిష్టూరంగా అంది కమల.
   
    ధరణి కళ్ళు ఆర్ద్రంగా చెమర్చాయి.
   
    "ఈ రాత్రి నలుగురైదుగురు ఇక్కడే వుంటాం. ప్రతీ ఇంట్లోనూ దీపం వెలుగుతూనే వుంటుంది. చూద్దాం ఎవరొస్తారో...." అన్నాడు జాన్ అబ్రహం.
   
    శ్రీధర్ కి ఎందుకో చాలా హాయిగా, రిలీఫ్ గా అనిపించింది. నిజానికి ఆ రాత్రి అతడు విక్రమ్ సాయంకోరి, ఏ పోలీస్ స్టేషన్ లోనో, అతని ఇంట్లోనో ఆశ్రయం పొందుదామనుకున్నాడు. ఇప్పుడా ఆలోచన మానుకున్నాడు.

 Previous Page Next Page