Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 43

  

    అవతల్నుంచి సమాధానం లేదు.
   
    అతడికి అర్ధంకాలేదు. తుడిచేసుకున్నాడు. అరగంట తరువాత చాపమీద పడుకుని నిద్రకుపక్రమించాడు.
   
    ఒకటే ప్రశ్న! నిండుగా భోజనం పెట్టి, పడుకోవటానికి చాప యిచ్చి తననేం చెయ్యబోతున్నారు వీళ్ళు?
   
    సమాధానంగా కిటికీ తలుపు తెరుచుకుంది.
   
    ఒక బోను లోపలికి దూర్చి-మరో చేత్తో బయట్నుంచే దాని తలుపు తీసారు.
   
    ఒకటి తరువాత ఒకటి-అరడజను ఎలుకలు లోపలికి దూకాయి. మదన బిత్తరపోయాడు. అయిదు నిముషాల తరువాత మళ్ళీ అదే జరిగింది. దాదాపు డజను ఎలుకలు....
   
    గదిలో అటూ ఇటూ పరుగెడ్తున్నాయి. అప్పుడర్ధమైంది తన ఒంటిమీద పడినదేమిటో....
       
    రక్తం.....!
   
    అది అర్ధమై అతడు సన్నగా వణుకుతుంటే - కాలి పైనుంచి ఒక ఎలుక పరుగెత్తింది. చప్పున లేచి కూర్చున్నాడు. ఇక ఆ రాత్రి అతడికి నిద్రలేదు. కాస్త నిద్రపట్టగానే ఎలుకలు శరీరం మీదకు చేరేవి. సన్నగా కొరికేవి మెలకువ వచ్చేది. భయంతో కేక వేసేవాడు, పట్టించుకునే నాధుడే లేడు.
   
    .....
   
    రెండోరోజుకి మనిషి బలహీనంగా అయిపోయాడు. ఆ రోజు భోజనం కూడా రాలేదు. బయటంతా నిశ్శబ్దంగా ఇంట్లో ఎవరూ లేనట్టు వుంది. ఆ నిశ్శబ్దం మరింత భయకరంగా వుంది.
   
    ఎలుకలకి కూడా ఆకలి ఎక్కువైనట్టుంది. ధైర్యంగా అతడి శరీరాన్ని గీరతం మొదలు పెట్టాయి. అతడికీ ధైర్యం వచ్చినట్టుంది లేదా ఓపిక నశించినట్టుంది. అరవటం మానేసేడు. కళ్ళమీద నిద్రనాట్యం చేస్తోంది. కానీ అతడిని ఎలుకలు అసలు నిద్రపోనివ్వటం లేదు.
   
    సైన్యంలో శత్రువులని చిత్రహింస పెట్టటానికి, కనురెప్పలు పైకి జరిపి క్లిప్పులు పెట్టేవారట. అంతకన్నా నాజూగ్గా అదే ఎఫెక్టుతో వుందీ చర్య ఆకలీ, దాహం- చలీ, ఎండా- దేన్నైనా ఓర్చుకోవచ్చు గానీ నిద్రలేమిని ఎన్ని రోజులు ఓర్చుకోగలడు మనిషి?
   
    .....మరో రోజు గడిచింది.
   
                                            2
   
    ఇన్ స్పెక్టర్ విక్రమ్ తన చెల్లెలి ద్వారా మదన్ ని కిడ్నాప్ చేసిన మూడ్రోజులకి-లాయర్ విద్యాదేవి కోర్టులో పిటీషన్ వేసింది.
   
    కోర్టులో ఆమెతో మాట్లాడక, "ఇంటికి వెళ్దాం" అంది ధరణి.

    అంతకుముందు రాత్రే-ఊరిబయట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరో పాపది శవం దొరికిందంటే కంగారుపడుతూ వెళ్ళాడు శ్రీధర్ ఇంకా రాలేదు. ఆ రాత్రంతా నిద్రపోలేదు ధరణి. ఒకవైపు పట్టుదల, మరొకవైపు తల్లి మనసు పరస్పర విరుద్దంగా పోరాడుతున్నాయి.
   
    ఆ ఘర్షణతోనే కోర్టు ఆవరణలో లాయర్ ని కలుసుకుని, చెయ్యవలసిన తతంగం పూర్తిచేసి ఇంటికి బయల్దేరదామంది.
   
    "అక్కడికా?" సందేహంగా అడిగాడు టోనీ.
   
    "ఔను! శ్రీధర్, పిల్లలూ ఏమైపోయారో, ఎక్కడున్నారో ఇంటికి వెళితే తెలుస్తుందేమో!" అంది.

    టోనీ, ధరణీ ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి వుంది. తాళం తీసి లోపలి వెళుతూ ఉంటే ధరణికి దుఃఖం గుండెల్లో గడ్డకట్టి ఏదో పెద్దరాయి పెట్టినట్లుగా బరువుగా అనిపించింది.. నిన్న-మొన్నటి దాకా తనూ, శ్రీధర్, పిల్లలూ కలసి హాయిగా జీవించిన ఇళ్ళు, ఈనాడు బేలగా, ముష్కరుల అఘాయిత్యానికి బలైపోయిన ఆడపిల్లలా దీనంగా కనిపించింది.
   
    ధరణి కిందపడిన తమ ఫ్యామిలీ ఫోటో తీసి టేబుల్ పైన పెట్టింది. అందులో శ్రీధర్, తనూ పక్కపక్కన కూర్చుని ఉంటే పిల్లలిద్దరూ తమ మెడల దగ్గరగా తలలు పెట్టి కులాసాగా నవ్వుతున్నారు! ఏమైపోయింది ఆ ఆనందం? ఆ శాంతి? ఎలా దొరుకుతుంది? ఆమె ఫోన్ వైపు దిగులుగా చూస్తూ కూర్చుంది. అది పని చెయ్యదని ఆమెకు తెలుసు.
   
    టోనీ వంటగదిలోకి వెళ్ళాడు. ధరణికి ఆలోచించడానికి కూడా శక్తిలేనట్లు సోఫాలో ఒరిగిపోయింది. టోనీ ట్రేలో టీ తీసుకొచ్చాడు. "తీసుకోండి" ఆమె చేతికి అందించాడు.

    ఆ నిమిషంలో మరో మనిషి తోడు ఎంత అవసరమో ఆమెకి తెలిసివచ్చింది. అతని స్థితికన్నా తన స్థితి కాస్త మెరుగని కూడా ఆమెకు అర్ధమైంది. అతని ఒక్కగానొక్క కూతురూ అన్యాయానికి బలై చనిపోయింది. భార్య ఆస్పత్రిలో మతిచెడి అనారోగ్యంతో పడివుంది. తనకి కనీసం భర్త, పిల్లలూ ఎక్కడో అక్కడ క్షమంగా ఉన్నారు.
       
    ఆమె టోనీకి థాంక్స్ చెప్పి టీ తీసుకుంది. నలమహారాజు తనని వదిలి అష్టలక్ష్ములూ వెళ్ళిపోతుంటే.... ధైర్యలక్ష్మిని మాత్రం అడ్డుకున్నాడట! "అమ్మా! ఎవరు లేకున్నా బ్రతికేయచ్చు. కానీ నువ్వు లేకుంటే బ్రతకలేము?" అన్నాడట. అది ఎంత నిజం! ధైర్యం లేనినాడు గోడమీద నీడ కూడా భయపెడుతుంది. ధైర్యంతో వెదికితే సముద్రగర్భంలో కూడా ఓ పిల్లచెక్క దొరకవచ్చు. అందరి తుది ధ్యేయమూ మరణమే! మరి మనం మాత్రమే చావుకు ఎందుకు భయపడాలి?
   
    ఆ నీరవ నిశ్శబ్దంలో ఒక్కసారిగా గణగణా మ్రోగింది ఫోన్. ధరణి ఉలిక్కిపడి చూసింది. టోనీ ఉత్సాహంగా చూశాడు. ఆమెకి ఫోన్ పని చేస్తోందని అర్ధమై అక్కడికి నడిచి వెళ్ళడానికి ఒక్కక్షణం పట్టింది.
   
    ఫోన్ ని చేరుకాగానే ఆత్రంగా "హలో....హలో...." అంది.
   
    "హలో ధరణీ! పిల్లలు కావాలా?"
   
    "ఎవరు మీరు? ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు? నా పిల్లలు ఎక్కడున్నారు?" ధరణి ఆతృతగా ప్రశ్నలు వేసింది.
   
    "ఆ.... అంత తొందరెందుకూ? ఆగు! ముందు నువ్విచ్చిన కంప్లయింట్ వెనక్కి తీసుకో. లేకపోతే నీ పిల్లల శవాల మీదపడి ఏడవాల్సొస్తుంది. బుద్దిగా చెప్పినమాట విన్నావనుకో, నీ పిల్లలు నీ దగ్గరికి తెల్లారేసరికల్లా వస్తారు."
   
    "వద్దు.... పిల్లల్నేమీ చెయ్యొద్దు" ధరణి అరిచింది.
   
    "అయితే కంప్లెయింట్ విత్ డ్రా చేసుకుంటావా? విద్యాదేవితో మాట్లాడు. పోలీస్ స్టేషన్ లో కూడా వెనక్కి తీసుకో, మాతో పెట్టుకోకు."
   
    "పిల్లలు ఎక్కడున్నారు? చెప్పు...." ధరణి అడిగింది.
   
    "ముందు కేసు విత్ డ్రా చేసుకో పది నిముషాల్లో ఇది జరగాలి. తర్వాత చెప్తాను" లైన్ కట్ అయింది.
   
    "యూ బాస్టర్డ్!" ధరణి ఫోన్ వైపు చూస్తూ అరిచింది.
   
    "ఏవైంది!" టోనీ అడిగాడు.
   
    ధరణి నిరాశగా అంది. "అయిపోయింది. ఇంకేం చెయ్యలేం. రేపొద్దున్నకల్లా కేసు వెనక్కి తీసుకోలేకపోతే- పిల్లల్ని చంపేస్తామన్నారు...."
   
    "గుడ్" అన్నాడు టోనీ. ధరణి అతడివైపు అయోమయంగా చూసింది.
   
    "పిల్లలు ఇంకా సురక్షితంగా వున్నారన్న మాటేగా అంటే ఊరిపొలిమేరల్లో కనబడిన మృతదేహం గురించి మనం ఆందోళన పడనవసరం లేదు."
   
    టోనీ అలా చెప్పేసరికి ధరణి మనసు తేలికపడింది.
   
    అప్పుడే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. పిల్లల అ....వ.....స...రం తమకి ఎంత వుందో అర్ధమైంది.
   
    ఓటమికి సిద్దపడ్డట్టు ఫోన్ దగ్గరికి వెళ్ళింది. టోనీవైపు తిరిగి, "శత్రువుని తక్కువగా అంచనా వేసినట్లున్నాం. విద్య ఫోన్ నెంబర్ చెప్పండి" నిస్సహాయంగా అంది.
   
    టోనీ జేబులో నుండి విద్యా విజిటింగ్ కార్డు తీశాడు.
   
    ధరణి బాధనీ, దుఃఖాన్నీ మునిపంట నొక్కిపెట్టి డయల్ చెయ్యబోయింది.
   
    "ధరణీ!" అంటూ శ్రీధర్ లోపలికి వచ్చాడు.
   
    భర్తని చూడగానే ఫోన్ వదిలేసి "ఏవండీ!" అంటూ వెళ్ళి చుట్టుకుపోయింది.
   
    "ఏవైంది ధరణీ?" గాభరాగా అడిగాడు శ్రీధర్.
   
    కన్నీళ్ళ మాటున ఫోన్ వైపు చూస్తూ చెప్పింది. "ఆ దుర్మార్గుల కంప్లెయింట్ వాపస్ తీసుకోకపోతే పిల్లల్ని... చంపేస్తారట!" ఏడుస్తూ అంది.
   
    "నో!!!" ఆ మాటే భరించలేనట్లుగా అన్నాడు శ్రీధర్.
   
    "ముందు లాయర్ గారికి ఫోన్ చెయ్యండి" టోనీ విద్య నెంబర్ ఇస్తూ తొందరపెట్టాడు. ధరణి డయల్ చేసింది. విద్యాదేవి కోర్టులో వుంటుందనీ, ఈ టైమ్ లో ఆమెని డిస్టర్బ్ చేయకూడదనీ తెలుసు. కనీ ఆ తర్కాలేవీ ఆలోచించే స్థితిలో లేదు ధరణి. అవతలివైపు నుంచి రింగ్ వినపడుతోంది. అర నిముషం తరువాత "-మీరు చేసిన సెల్ ఫోన్ ప్రస్తుతం ఆపుచేయబడి వున్నది" అని అనౌన్స్ మెంట్ వినపడింది.
   
    ధరణి నిస్సహాయంగా టోనీ, శ్రీధర్ లవైపు చూసింది. ఆమె చూపు నర్ధం చేసుకున్న వాడిలా శ్రీధర్, ".... ఆమె కోర్టులో వుంది కదా. ఫోన్ ఆపుచేసి వుంటుంది" అన్నాడు. ధరణి ఆ మాటలు వినలేదు. ఫోన్ లో మాటలే గుర్తొస్తున్నాయి.
   
    "పదినిముషాల్లో కంప్లెయింట్ విత్ డ్రా చేసుకోవాలి. లేకపోతే పిల్లల శవాల్ని చూడాల్సి వస్తుంది..."
   
    ఆమె మళ్ళీ ఫోన్ చేసింది. అదే అనౌన్స్ మెంటు.
   
    భర్తవైపు తిరిగి, "మీరు అర్జెంటుగా కోర్టుకి వెళ్ళండీ" అని అభ్యర్ధించింది. విద్యాదేవిగానీ కేసు ఫైల్ చేసిందంటే-క్షణాల్లో ఆ వార్త పేపర్ వాళ్ళకి చేరుతుందని ఆమె భయం. పిల్లల కిడ్నాప్ విషయం పోలీస్ స్టేషన్ లో తను కంప్లయింట్ ఇవ్వటం వేరు.....ఒక స్కూలులో జరిగే అరాచకాలపట్ల కోర్టులో కేసు ఫైలు చేయటం వేరు!

 Previous Page Next Page