"చక్కటి వరుణ్ణి చూసి పెళ్ళి చేస్తాను. నా నగలన్నీ ఆమె కిస్తాను. ఆమె కోరినవన్నీ క్షణంలో ఆమె ముందుంచుతాను. ఇంకా..."
"పెళ్ళి చేసుకోనంటే?"
"ఎందుకు చేసుకోదు?"
"ఎందుకు చేసుకోదో నాకేం తెలుసు కాని, చేసుకోదూ అనుకొందాం."
"ఆమె కిష్టమైనట్టుగానే నేను నడుచుకొంటాను. చేసుకోకపోతే చేసుకోకపోనీ! నా కూతురు నా కళ్ళముందుంటుందిగా?"
"అబ్బా! ఎంత ఆత్రుత! ఎన్ని ఆశలు! ఇరవై సంవత్సరాలు ఆమె లేకుండా ఎలా ఉన్నా వత్తా?"
"ఎలా ఉన్నానో తలుచుకొంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నా ఇద్దరు కూతుళ్ళు, భర్త సంసారం ఒకెత్తు. నా పెద్ద కూతురు ఒకెత్తుగా కనిపిస్తున్నారంటే నమ్ము."
భార్యను చూసి పోదాం అని వచ్చారు గిరిధరంగారు. గత నెల రోజులుగా నిస్త్రాణగా, నిస్పృహగా మంచంమీద పడుకొని ఉండే గీతా భవాని ఇప్పుడు చురుగ్గా, తేలిగ్గా తిరుగుతూంది. వంటమనిషికి సెలవు ఇచ్చి మేనల్లుడికి ఇష్టమైనవి చేసి పెడుతూంది. ఆమె ముఖంలో, నడకలో క్రొత్త ఉత్సాహం చిందులు వేస్తూంది.
ఈ మార్పుచూసి ఆనందంతో తలమునకలయ్యారు గిరిధరం. "గాలిమార్పు బాగా పనిచేసినట్టుంది. విశాల్ మాట నిజమే అయింది!" అన్నారు, టీ కప్పు అందించి ప్రక్కనే తలదించుకు నిల్చున్న భార్యను చూస్తూ. పొలంనుండి విశాల్ వస్తూనే కృతజ్ఞత మళ్ళీ మళ్ళీ చెప్పుకొన్నారు.
"మీ అత్తని ఈ మాత్రం ఆరోగ్యంగా చూస్తావని అనుకోలేదు, విశాల్! ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి మంచిపని చేశావు!"
"అయితే ఇంకా ఓ రెండు మూడు నెలలు ఇక్కడే ఉంచేయండి, మామయ్యా! అత్తని ఆపిల్ పండులా చేసి మీ దోసిట్లో ఉంచుతాను."
"కొంటె వెధవా!" అన్నారు చిరుకోపంతో. "ఈ వారం రోజులకే చాలావరకు నయమైందనిపిస్తూంది. ఇంకా రెండు మూడు నెలలెందుకు? మీ అత్తయ్య లేకపోతే అక్కడ మాకు ఎలాగో ఉంటుంది సంసార భారాన్ని మోయక్కరలేదు. ఊరికే ఉంటే చాలు."
"ఉహుఁ. అత్తకి పూర్తి ఆరోగ్యం చిక్కనిదే ఆమెను ఇక్కడినుండి పంపించను."
"అక్కడినుండి వచ్చేప్పుడు తీసుకొచ్చిన మందులు సక్రమంగా వాడుతుందా?"
"ఆ మందులన్నీ తీసి పెంటకుప్పలో పోయించాను. ఆమెకేం జబ్బుందని మందులు?"
"జబ్బులేకుండానే మంచం పట్టిందా?"
"అత్తకి మంత్రం వేశాను, మామయ్యా! ఇహ మీరు చెప్పినా మంచం ఎక్కదు."
"ఏం మంత్రం రా, విశాల్?"
"చెప్పకూడదు. మంత్రమంటేనే ఒక రహస్యం కదా?"
"మంత్రమా? తంత్రమా? ఉట్టిమాటలు. నేను నమ్మనుగాని అత్తని త్వరగా పంపించరా!"
"కొత్తపెళ్ళికొడుకులా మరీ ఇంత బెంగేమిటి, మామయ్యా?" విశాల్ నవ్వసాగాడు.
"వయసున్న దంపతులమధ్య శరీరాకర్షణ ఎక్కువగా ఉంటుందిరా! వయసు ప్రొద్దు తిరిగాక ఇద్దరిమధ్య కేవలం మానసికానుబంధం మాత్రం మిగిలిపోతుంది. ఈ వయసులోనే వియోగం దుర్భరం. శరీరాన్ని అదుపులో పెట్టగలంగాని మనసును అదుపులో పెట్టడం సాధ్యమా?"
"ఎంతచక్కగా సమర్ధించుకొంటాడో, మామయ్యా! చూశావా, గీతత్తా? మగవాళ్ళెప్పుడూ ఇలాంటి ప్రేమ మంత్రాలు వల్లెవేసి మీ ఆడవాళ్ళను గృహసామ్రాజ్యానికి పట్టపురాణులను చేసేస్తుంటారు కదూ? కొంచెం తెలివున్న ఆడదయితే, 'గృహసామ్రాజ్యమా? నా బొంద! పొగచూరిన నాలుగుగోడలు! పట్టపురాణి పడవా? నా మొహం ఉట్టి బానిసచాకిరీ' అని గోలపెడుతుంది కదూ?"
"ఇలాకాక మరోలా బ్రతకడం చాతకాని మా బోటివాళ్ళు నాలుగుగోడలే సామ్రాజ్యం అని గర్వపడుతుంటారు, విశాల్."
"మన కుటుంబ వ్యవస్థ సుస్థిరతకు స్త్రీలో ఈ సేవాగుణం, సహనగుణం మూలస్తంభాలురా, విశాల్! ఈ ఆడవాళ్ళే తిరుగుబాటు చేశారనుకో. మానవజీవితమే తుఫాను తాకిడికి ముక్కలయ్యే పడవలా అవుతుంది. ఏ కాస్త ముందు చూపు ఉన్నా ఆడవాళ్ళ బుర్రలోకి ఇలాంటి వెర్రి ఆలోచనల్ని ఎక్కించడం మానేస్తారు" కొంచెం సీరియస్ గా అన్నారు గిరిధరంగారు.
"ఆడవాళ్ళకి ఆలోచించే శక్తి లేదా ఏమిటి? తమకి ఏం కావాలో వాళ్ళకి తెలియదా?"
"ఆలోచించడం వేరు. ఉసిగోల్పడం వేరు. కొందరు విపరీతార్ధాలు తీయడం తప్పితే మీ అత్తది గృహసామ్రాజ్యం కాకపోతే పొగచూరిన నాలుగు గోడలనేందుకు వీలుందా? ఇంటి విషయాలన్నిటా ఆమె స్వతంత్రురాలు! ఒక చీర ఖరీదు చేసినా, ఒక నాగ చేయించుకొన్నా ఒకరి అనుమతి పొందాల్సిందిగాని, ఒకరికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందిగానీ లేదు. కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఇంటి పెద్దగా నా రాజముద్ర పడాలి. కాని, మంత్రిలాగా సలహా ఇవ్వాల్సింది ఈమే. ఇహ బానిస చాకిరీ అనేందుకేముంది? తన భర్తా, పిల్లలూ, తన బంధువులూ! ఇల్లాలుగా వాళ్ళ శ్రేయస్సుకోసం పాటుపడుతుంది. ఇందులో ఆమె వంచింపబడుతున్నదీ, అగౌరవం పొందుతున్నదీ ఏమైనా ఉందా? ఇలాకాక మరోలా బ్రతికితే ఇంతకంటే గొప్పగా, తృప్తిగా, ఆత్మగౌరవం పెంచుకొన్నట్టుగా ఉంటుందా?"
"దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది అత్త. నేను కాదు" వాతావరణం వేడెక్కడం చూసి నెమ్మదిగా తప్పుకొన్నాడు విశాల్.
"స్వాతి, జ్యోతి ఇంటి విషయాలేమైనా పట్టించుకొంటున్నారా లేదా? అదే అల్లరి సాగిస్తున్నారా?" యుక్తిగా విషయం మార్చేసింది గీతాభవాని.