క్రమక్రమంగా ఆమెను చూడటానికొచ్చే జనం ఎక్కువవుతున్నారు. పోలీసులు రావటం, హడావుడిగా అటూ యిటూ తిరగటం కూడా కన్పిస్తోంది. ఇహ ఇక్కడ వుండటానికి భయమేసి మెల్లగా వెనక్కి వచ్చేశాడు.
ఆ రోజు పోస్టులో అతనికో ఉత్తరమొచ్చింది.
"డియర్ గోపీ !
నాకు బ్రతకాలని లేదు. అందుకని చచ్చిపోతున్నాను. గుడ్ బై!
__అస్మిత"
* * *
ఆ మధ్యాహ్నం మూడు గంటలకు అస్మిత మరణించింది.
రాత్రి పదకొండు ప్రాంతంలో ఆమె తండ్రి మృత్యుంజయరావు గ్లాసుమీద గ్లాసు ఖాళీ చేస్తూ హాల్లో కూచుని వున్నాడు. అతనికెదురుగా ఆ సాయంత్రమే ఊరినుంచి వచ్చిన ప్రతాప్ కూచున్నాడు. అతని చేతిలో కూడా గ్లాస్ వుంది.
"డాడీ! అస్మి ఎగ్జామ్ బాగా రాయలేదనో, అమ్మ కోప్పడిందనో సూసైడ్ చేసుకుందంటే నేను నమ్మను. ఇంకేదో బలమైన కారణముండి వుంటుంది" అన్నాడు ప్రతాప్.
కలకత్తాలో తండ్రి ప్రారంభించిన బ్రాంచి వ్యవహారాలూ చూసుకుంటూ అతనీమధ్య అక్కడే వుంటున్నాడు. ఇక్కడి విషయాలేవీ అతనికి తెలీవు.
"అదే నా అనుమానం. కానీ ఆ కారణం..." అంటూ ఆపేసి లోపల గదిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్యను కేకేశాడు.
ఆమె వచ్చాక "చెప్పు అస్మి ఎందుకు చచ్చిపోయిందో నీకు తెలిసే వుంటుంది...చెప్పు లేకపోతే చంపేస్తాను" అంటూ అరిచాడు.
"కాదు. తెలుసు నువ్వు దాస్తున్నావు. నీకు తెలుసు" అంటూ చేతిలోని గ్లాసునామె మీదకు విసిరేశాడు. గ్లాసు మొహానికి తగిలి, కొద్దిగా చిట్లి నెత్తురు బొట్లు కారసాగాయి.
"అమ్మనేమీ అనకు డాడీ! తనకు సరిగ్గా తెలిసి వుండదు" అన్నాడు ప్రతాప్ వారించడానికి ప్రయత్నిస్తూ.
"నలుగురూ మన గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. సంఘంలో నా ప్రెస్టేజి, స్టేటస్..." అన్నాడు మృత్యుంజయరావు రొప్పుతున్నట్టుగా.
మరో గంట గడిచాక యింకో మూడు పెగ్గులదాకా త్రాగి తెలివితప్పిపోయినట్టుగా సోఫా మీద వాలిపోయాడు.
ప్రతాప్ లేచి అస్మిత గదిలోకి వెళ్ళాడు. ఆమె బీరువా, డ్రాయరూ, పుస్తకాలూ చెల్లాచెదురు చేస్తూ గాలించసాగాడు. కొంతసేపటికి అతని శ్రమ ఫలించింది.
ఆమె క్లాస్ పుస్తకాల్లో గోపీకృష్ణ రాసిన రెండు ఉత్తరాలు దొరికాయి. అవి తీసి చదువుతుంటే విషయమంతా బోధపడసాగింది. కళ్ళు ఎర్రబడ్డాయి.
* * *
అర్దరాత్రి. అంతవరకూ గోపీకృష్ణ ఎక్కడెక్కడో తిరిగాడు. సాయంత్రమతను స్మశానానికి వెళ్ళివచ్చాడు. ఎవరికంటా పడకుండా జాగ్రత్తపడుతూ దహనకాండ అంతా చూసి వెనక్కి మళ్ళాడు.
ఇంటికి వెళ్ళాలంటే భయంగా వుంది. పోలీసులొస్తారెమో, అస్మిత యింట్లో వాళ్ళెవరయినా వచ్చి రచ్చకీడ్చి హంగామా చేస్తారేమో!
ఆ రాత్రి ప్రజ్ఞకి నైట్ డ్యూటీ అని గుర్తొచ్చింది. స్మశానం నుంచి తిరిగి వస్తూ బాగా చీకటి పడ్డాక హాస్పటల్ కి వెళ్ళాడు.
"ఏమిటి గోపీ, యిలా వచ్చావు?" అనడిగింది ప్రజ్ఞ అతన్ని చూసి కొంచెం ఆశ్చర్యంగా.
"నీతో కొంచెం మాట్లాడాలి"
కాంపౌండింగ్ రూంలో ఎవరూ లేరు. ప్రజ్ఞ అతన్నక్కడికి తీసుకెళ్ళి "ఏమిటి చెప్పు" అనడిగింది.
గోపీకృష్ణ ఒక్కొక్క మాటగా _ చివరకు జరిగిందంతా చెప్పేశాడు.
ప్రజ్ఞకు గుండె ద్రవించిపోయింది. "అయ్యో!" అంది చాలా బాధగా.
"నాకు...చాలా భయంగా వుంది" అన్నాడు.
ఆమె అతని వంక ఆశ్చర్యంగా చూసింది. "భయంగా వుందా! బాధగా వుందా?" అనడిగింది నిజంగానే అర్ధంగాక.
"బాధ వుంది కానీ...పోలీసులు కూపీలాగి నన్ను స్టేషన్ కి తీసుకెళ్ళి..."
ప్రజ్ఞ అతని వంక విచిత్రంగా చూస్తోంది.
"లేకపోతే...అస్మిత యింట్లో నా ఉత్తరాలుండే వుంటాయి. అవి బయటపడి వాళ్ళు నన్నేమయినా
చేస్తే ...?"
ఆమెకా సమయంలో అతనంటే విపరీతమైన అసహ్యమేసింది. కోపంతో, ఏవగింపుతో వళ్ళు గగుర్పొడిచినట్లయింది.
"వొరేయ్! యిలా మాట్లాడటానికి నీకు సిగ్గు వెయ్యటంలేదూ? ఆభమూ శుభమూ తెలీని ఆడపిల్లని పెద్ద హీరోలాగా జంఝాటంలోకి లాగావు, ఆమె మనసులో తెలీని గాలిదుమారాన్ని రేపావు. బుద్ది వికసించకపోవడంవల్లో, తొందరపడో _ సిల్లీ గానే అనుకో ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది. కాని, డైరెక్ట్ గా యీ సంఘటనకు కారణం నువ్వే. నీలో మానవత్వమనేది వుంటే యీ పరిస్థితిని ధైర్యంగా నిష్కల్మషమైన హృదయంతో ఎదుర్కోవాలి. పోలీసులు నీ వెంటపడితే జరిగింది చెప్పు. అసలు నువ్వే స్టేషన్ కెళ్ళి యిందులో నీ పాత్ర ఎంతో చెప్పెయ్యి. కాదంటారా? ఎంతో కొంత తప్పు చేశావు కాబట్టి అవతలివాళ్ళు కక్షసాధించదలిస్తే సంతోషంగా శిక్షననుభవించు."