"అదా! పరవాలేదులేమ్మా! ఆవిడగారు ఈలోకంలో మనిషినికానని అనుకుంటుంది, ఆవిడ దృష్టికి మనమంతా పురుగులం." కసిగా అన్నాడు సాంబశివం___
ఆ కంఠంలో కసికి వణికిపోయింది సుశీల!
తనకు తండ్రిమీదున్న అధికారమంతా ఆయన మనసులోని పిత్రువాత్సల్యమే! ఈ క్రూరమృగంలో మమత చిగురింపచేసే శక్తి దానికి ఉందా?
"నాన్నా! నీకు అమ్మప్రేమ పొందాలనివుందా?"
తన మనసులోపలి రహస్యమేదో ఇతరులు కనుగొన్నట్లు ఉలిక్కిపడ్డాడు సాంబశివం, అంతలో సర్దుకొని దర్పంగా అన్నాడు.
"నా కేంలేదు-తలుచుకుంటే ఈ క్షణంలో లక్షమందిని సంపాదించగలను"-
నోరు జారిన వెంటనే సుశీల ముఖంలో మార్పు చూసి, తను మాట్లాడుతున్నది తన కూతురితోననే విషయమ గుర్తుకొచ్చి నాలుకకరుచుకొన్నాడు సుశీల మనసులో కంటగించుకున్నా ఆ ప్రసంగం ఆపలేదు.
"కానీ, అమ్మను మాత్రం సంపాదించలేవు. అమ్మ డబ్బుకి ఆశపడదు, బెదిరింపులకు భయపడదు, లోకాన్ని లక్ష్యపెట్టదు, కష్టాలకు లొంగిపోదు. అమ్మలాంటి వ్యక్తులను లొంగదీసుకో గలిగేశక్తి లోకంలో ఒకే ఒకటి ఉంది."
"ఏమిటది?"
ఈ ప్రశ్న అడిగిన తండ్రి కంఠంలో ఆరాటానికి చాలా సంతృప్తి పడింది సుశీల___
"ఎదుటి వ్యక్తులలో మంచితనం......"
సాంబశివం మాట్లాడలేదు, సుశీల మళ్ళీ అంది.
"మీరు ట్రై చేసి చూడండి! నామాట అబద్దమయితే అడగండి."
సాంబశివం ఆలోచనలో పడ్డాడు.
ఆ సాయంత్రం సాంబశివం లలిత దగ్గరకు వచ్చాడు. అలా పెళ్ళయిన కొత్తల్లో వచ్చేవాడు, బెదురుగా చూస్తూ ..... మొరటుగా తనను సమీపించబోయే అతన్నిచూస్తే లలితకు భరింపరాణి చికాకు కలిగేది. పెదవి కదపకుండా శరీరం అరఅంగుళమైనా కదలకుండా లలిత చూసేచూపు సాంబశివాన్ని పాతాళంలోకి పడవేసేది. ఆ పరాజయాన్ని భరించలేక మరింత తిక్కతో తిరగబడేవాడు లలిత ఏ విధంగాను ప్రతిఘటించేదికాదు. అయినా తనే చిత్తుగా ఓడిపోయినట్లు అనిపించేది సాంబశివానికి.
ఆ రోజు సాంబశివాన్ని చూడగానే ఒక్కసారి అదంతా గుర్తుకొచ్చింది లలితకు.......ఆ క్షణంలోనూ అతన్ని చూడగానే భరింపశక్యంగాని కంపరమే కలిగింది. కానీ "లోకంలో అపురూపమైన విజ్ఞానము, సంస్కారమూ, నిన్ను నువ్వు దహించుకోవటానికి ఉపయోగపడడం నేను భరించలేనమ్మా!" అంటున్న సుశీల ఆర్తస్వరం లలితలో ఎక్కడలేని సహనాన్నీ పోగుచేసింది.
చిరునవ్వుతో సాంబశివాన్ని రిసీవ్ చేసుకుంది. అలాంటి చిరునవ్వు లలిత ముఖంలో ఏనాడూ చూడలేదు సాంబశివం. ఆ మాటకొస్తే ఏ ఆడదాని ముఖంలోనూ చూడలేదు.
"చూడు! నీ కోసం ఈ చీర తెచ్చాను-నాకు ఎంచటం రాదనుకో! అయినా నువ్వు పసిమిఛాయ కదా! అందుకానీ ముదురుకెంపు రంగులో కొన్నాను."
సిగ్గుపడుతూ ఆ చీర చూపించాడు.
"బాగుంది!" అంది లలిత.
"కట్టుకోవాలనిపిస్తే-కట్టుకుని చూపించు......"
ఇంకా ఎక్కువసేపు ఉంటె ఆ ఆనందం చెదిరిపోతుందేమోనని భయపడుతున్నట్లు గబగబ వెళ్ళిపోయాడు సాంబశివం.
ఆ రోజే ఆ చీర కట్టుకుని సాంబశివం గదిలోకి వెళ్ళింది లలిత.
లలిత సాంబశివం గదిలోకి తనంత తను రావటం ఇంచుమించు అసంభవమే! యధాప్రకారం గ్లాసుమీద గ్లాసు విస్కీ త్రాగుతున్న సాంబశివం లలితను చూసి తెల్లబోయాడు.
అంతా తెలిసినదే అయినా ఆ దృశ్యం చూడగానే భరించలేక మంచంమీద కూలబడిపోయింది లలిత.
"నావల్ల కాదు-నేను నటించలేను....." నుకుంది తనలోతను.
కెంపురంగు జరీచీరలో మెరిసిపోతున్న లలితను___తనంత తనుగా వచ్చిన లలితను-చూసేసరికి నిషాలో ఉన్న సాంబశివానికి మతిపోయినట్లయింది. దగ్గిరగా వచ్చి లలిత చుబుకం పట్టుకుని పైకెత్తాడు-బలిపశువులా చూసింది లలిత-అంతటి మైకంలోను సాంబశివానికాముఖంచూస్తే జాలి కలిగింది.
మత్తుమత్తుగా......ముద్దగా "వంట్లో బాగుండలేదా లలితా! పోనీలే! నువ్విలా పడుకో! నేనుసోఫాలో పడుకుంటానులే!" అని వెళ్ళిపోయి సోఫాలో పడుకున్నాడు......
కొన్ని క్షణాలలోనే గుర్రుపెడుతోన్న సాంబశివాన్ని చూచి దీర్ఘంగా నిట్టూర్చింది లలిత......తడబడే అడుగులతో సాంబశివం దగ్గరకు వెళ్ళింది......
ఉలికిపది లేచాడు సాంబశివం - ఎందుకో ఏమిటో తెలియకుండా సాంబశివం గుండెలమీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది లలిత. ఏమిటి? ఏమిటి? అంటూ లలితను చేతులతో చుట్టి బుజ్జగించాడు సాంబశివం.
లలిత చిరునవ్వులు చిందించటంలేదు. విలాసపు వాలుచూపులు విసరటంలేదు. అయినా ఏడుస్తోన్న లలితను తన హృదయానికి హత్తుకున్నప్పుడు ఏదో విచిత్రమైన శాంతి కలిగింది సాంబశివానికి, ఆ రకమైన అనుభూతి ఆనాటి వరకు అతనికి ఎలాంటి విలాసినుల దగ్గిరా లభించలేదు......