ఆమె కప్పు తీసుకెళ్ళి సింక్ దగ్గర వుంచింది.
"నువ్వెంత కాలంనుంచి పనిచేస్తున్నావిక్కడ?" సంభాషణ ప్రారంభించాడు.
"రెండేళ్ళనుంచీ"
"మేడమ్ దగ్గర పనిచేయటం చాలా ఆనందంగా వుంటుంది కదూ?"
"అవునండీ!"
"నాకూ చంద్రికగారంటే విపరీతమైన గౌరవం, అభిమానం! అందుకే చేరాను"
ఆమె మాట్లాడలేదు. సుజాతను పడగొట్టటం అంత తేలికగా జరిగేట్లు లేదు. ఇంత కూల్ గా ప్రవర్తించేవాళ్ళు చాలా మేధావులయిఉంటారు.
ఫోన్ మోగటం వినిపించింది. డైనింగ్ రూమ్ లో నుంచీ తన ఆఫీస్ రూమ్ లో నుంచి -
అంటే తన ఫోన్ ఎక్స్ టెన్షన్ వుందన్న మాట.
త్వరత్వరగా తనగదిలోకి నడిచి ఫోన్ అందుకున్నాడు.
"హలో! చంద్రికగారి పి.ఆర్.ఓ ని మాట్లాడుతున్నానండీ!"
"పి.ఆర్.ఓ నా?" అవతల గొంతులో కన్ ఫ్యూజన్.
"అవును!"
"నిన్నటి వరకూ లేని పి.ఆర్.ఓ. ఇవాళెక్కడినుంచి వచ్చాడు?"
"ఎవరు మాట్లాడుతున్నారు? మేడమ్ తో ఏమయినా మాట్లాడాలా?"
"నా పేరు సంజీవ్! చంద్రిక తో మాట్లాడాలి"
"ఆమె షూటింగ్ కెళ్ళారు. సాయంత్రం ఆరు వరకూరారు"
"షూటింగెక్కడ?"
"తెలీదు!"
"అంత చిన్న విషయాలు తెలీకపోతే ఇంక నువ్ పి.ఆర్.ఓ ఏమిటి?" అతని గొంతులో హేళన.
నూతన్ నవ్వాడు "నేను ఇవాళే జాబ్ లో చేరాను. గ్రాస్ప్ చేసుకోడానికి ఇంకొంచెం టైమ్ పడుతుంది."
"ఆల్ రైట్! ఆమె రాగానే నేను ఫోన్ చేశానని చెప్పు."
"సరే -"
ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
సంజీవ్ అనగానే నూతన్ కి గుర్తుకొచ్చేసింది.
తను ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీద్వారా కలెక్ట్ చేసిన ఇన్ ఫర్మేషన్ లో అతని ప్రస్తావన వుంది. చంద్రికకు అందంగా బలిష్టంగా కనిపించేయువకులంటే మోజు ఉంది. ప్రస్తుతం ఆమెతో సంబంధం వున్న యువకుడతను. అతనూ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికొచ్చాడు.
మరి కొద్ది నిమిషాల కే ఫోన్ మోగింది.
"హలో పి.ఆర్.ఓ. హియర్"
"చంద్రికగారు లేరా?"
"లేరు - ఎవరు మాట్లాడుతున్నారు?"
"ప్రొడ్యూసర్ మూర్తి! మా పిక్చర్ లో ఆమెకు రోల్ ఉంది. డేట్స్ విషయం మాట్లాడాలి!"
"ప్రస్తుతం ఆమె డేట్స్ నేనే చూస్తున్నాను."
"సరే -- నేనే వస్తున్నాను"
"ఓ కే సర్"
ఫోన్ పెట్టేసి ఆమె డయిరీ తీసి చూశాడు.
ఒక సినిమాని ఇంకో రెండు షెడ్యూల్స్ ఉన్నాయ్ - మరో సినిమాకోసం కేవలం పదిరోజుల షెడ్యూల్ వుంది!
మిగతా డేట్సన్నీ ఖాళీ చకచక ఏడెనిమిదినెలలవరకూ ఎదురుగ్గా వున్న జ్యోతిచిత్ర మాగజైన్ చూసి కొన్ని ప్రొడక్షన్ బానర్స్ ఫిలప్ చేశాడు పూర్తి చేసే సరికల్లా మూర్తి వచ్చేసాడు.
"మా పిక్చర్ మూడు షెడ్యూల్స్ లో జరుగుతుంది - అందులోరెండు షెడ్యూల్స్ లో చంద్రికగారు కావాలి!"
షెడ్యూల్స్ ఎప్పుడనుకుంటున్నారు?"
"మార్చిలో పదిరోజులు - మేలో వారం రోజులు"
నూతన్ డయిరీ తీసిచూశాడు.
"మార్చి, ఏప్రిల్ అన్నారు కదూ? ఏప్రిల్ లో వారంరోజులు ఖాళీ వున్నాయ్."
"మార్చి ఏప్రిల్ కాదు - మార్చ్, మే నెలల్లోకావాలి -"
మళ్ళీ డైరీ తిరగేశాడతను.
"సారీ సార్ లేవు! ఏప్రిల్ లో ఒక్క వారంరోజులు మాత్రం ఖాళీ వుంది -"
అతను నిరాశపడ్డాడు.
"పోనీ జూన్ లో?"
"ఆగస్ట్ వరకూ ఖాళీలేవు సార్ - సెప్టెంబర్ అయితే ఓకే"
"అయ్యో - ఎలా మరి? ఆ కారెక్టర్ ఆమె తప్పితే ఇంకెవరికీ సూట్ కాదు. చాలామంది కారెక్టర్ కూడాను"
"సరేనండీ! ఆమెతో మాట్లాడి రేపు చెప్తాను. మీది పెద్ద బానర్ కనుక వేరేవాళ్ళతో మాట్లాడి ఏదయినా అడ్జస్ట్ చేస్తారేమో!"
"చేస్తారేమో కాదు! చేయాలని చెప్పండి! నేను కూడా రాత్రికి ఫోన్ లో మాట్లాడతాను"
"సరే సార్"
"మీరు కొత్తగా చేరారా?" అడిగాడతను.
"అవునండీ! ఈ మధ్యే"
"ఇంతకు ముందెవరి దగ్గర చేశారు?
"రజనీకాంత్ దగ్గర కొన్నాళ్ళు - ముమ్ముటి దగ్గర కొన్నాళ్ళూ చేశాను"
"ఓహో! అలాగా!"
"అవున్సార్"
"సరే - వస్తా"
అతను వెళ్ళిపోతుంటే" ఎక్స్ క్యూజ్ మీ సార్!" అన్నాడు నూతన్ లేచి అతని వెనుకే నడుస్తూ.
"ఏమిటి?"
"అదే! మేడమ్ గారు అందరికీ ప్రస్తుతం ఆమె తీసుకుంతున్న రెమ్యూనరేషన్ గురించి చెప్పమన్నారు. మొన్న బుక్కయిన రెండు పిక్చర్స్ కీ ఎనిమిది లక్షలు చొప్పున తీసుకున్నారు"
"ఆ! ఎనిమిది లక్షలా?"
"నేనూ అదే చెప్పాను- లక్షరూపాయలు పెంచడంబావుండదండీ అని! కానీ ప్రెజర్ తగ్గాలంటే పారితోషికం పెంచటం తప్పగత్యంతరం కనిపించలేదు"
"లక్షరూపాయలు పెంచడమేమిటి? ఇంతకు ముందు లక్షరూపాయలే తీసుకుంటున్నారని అన్నారు?"
మీరు చెప్పేది మరీ సంవత్సరం క్రితం సంగతనుకుంటాను. నేను చేరిన దగ్గర్నుంచీ ఏడులక్షలే ఇస్తున్నారు"
అతను మాట్లాడలేకపోయాడు కొద్దిక్షణాలు.
"సరే! ఎనిమిదయినా గానీ నాకు తప్పదులెండి! ఆమె కారెక్టర్ వేస్తేనే మా పిక్చర్ కి రిచ్ నెస్ వస్తుంది."
"అయితే మీరు రాత్రికి ఫోన్ చేయండి. ఆమె తప్పకుండా అడ్జస్ట్ చేస్తారు."
అతను వెళ్ళిపోయాడు.
రాత్రి ఆమె పదిగంటలకు తిరిగి వచ్చేవరకూ నూతన్ అక్కడే వుండిపోయాడు.
చంద్రిక ఆశ్చర్యపోయింది.