Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 43


    "దేనికి?"
    "ప్రాక్టీస్ లో నన్ను డామినేట్ చేస్తున్నందుకు."
    హరిణి బలవంతాన నవ్వింది. "ఈ విషయం నాకన్నా నీకే ఎక్కువ సంతోషం కలిగిస్తుందని తెలుసు" అంది.
    మహేష్ కు నిజంగా చాలా సంతోషంగా వుంది.
    "మహేష్! ఈవేళ చాలా సీరియస్ కేసులొచ్చాయి. నేను ఒక్కదాన్నీ మేనేజ్ చెయ్యగలనో లేనో చూద్దామని నిన్ను హెల్ప్ కి పిలవలేదు" అంది హరిణి.
    "నువ్వు చాలా అలసిపొయావు హరిణి! కనీసం ఓ గంటయినా రెస్ట్ తీసుకో."
    హరిణికి నిజంగానే చాలా అలసటగా వుంది. లంచ్ అయినాక నీరసంగా ప్రక్కమీదకు వ్రాలుతూ, మహేష్ బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తూండటం చూసి "మధ్యాహ్నం పూట _ యిప్పుడెక్కడకి మహేష్" అనడిగింది.
    "ఒక సీరియస్ కేసుంది. పేషెంట్ యిక్కడకు రాలేదు. వెళ్ళి చూసిరావాలి"
    "త్వరగా వచ్చెయ్ మహేష్" అని కళ్ళు మూసుకుని పడుకుంది.
    మహేష్ బయటికొచ్చి కొత్తగా కొనుక్కున్న ఫియట్ కారు డ్రైవ్ చేసుకుంటూ పేషెంట్ యింటికి వెళ్ళాడు.
    ఆ పేషెంట్ ఓ యాభై ఏళ్ల స్త్రీ. ఆమె భర్త ఈశ్వరరావు బిజినెస్ మేగ్నెట్. చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లున్నాయి. ఆయనకు మూడు రేసుగుర్రాలు కూడా వున్నాయి.
    ఆవిడకి బ్రెస్ట్ కేన్సర్. సెకండరీస్ శరీరంలో చాలా అవయవాల్లోకి వ్యాపించి టెరిఫియర్ స్టేజ్ లో వుంది. కేన్సర్ హాస్పటల్ లో చెయ్యవలసిన ట్రీట్ మెంటంతా చేసి యిహరోజుల్లో వుందనీ, హాస్పటల్లో వుంచటం అనవసరమని చెప్పి యింటికి పంపించేశారు.
    ఉపశాంతి కోసం సెడిటివ్స్, పేషెంటు తృప్తి కోసం కొన్ని మెడిసిన్స్ యివ్వటానికి మహేష్ ని ఆయన కోరగా, అతను అవసరమున్నప్పుడల్లా వెళ్ళి వస్తూ వుంటాడు.
    ఈశ్వరరావుగారు భార్యను చాలా ప్రేమించి వుండవచ్చు. ఆమెతో అన్యోన్యంగా సంవత్సరాల తరబడి కాపురం చేసి వుండవచ్చు. కాని యిప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్లు, డెస్పరేట్ గా వున్నట్లు కనిపించాడు.
    ఆమెకు ఇంజక్షన్ చేసి బయటకు వచ్చాక "డాక్టర్ ఆమె ఇంకా నెలా రెండు నెలలు కంటే బ్రతకదనుకుంటాను కదూ" అన్నాడు.  
    మహేష్ తలవూపి ఊరుకున్నాడు.
    "నరక బాధననుభవిస్తూ, అనుక్షణం మృత్యువును తలుచుకుంటూ చచ్చిపోతూ రోజులు గడపటంకంటే కొన్ని రోజులు ముందుగా చనిపోవడంవల్ల నష్టం లేదనుకుంటాను డాక్టర్."
    మహేష్ ఉలికిపడి ఆయన ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళు, వాటిలోని భావం ఏమీ క్రూరంగా లేవు. చాలా ప్రశాంతంగా, గంభీరంగా వున్నాడు.
    "యుమీన్?"
    "మెర్సీ కిల్లింగ్ తప్పులేదంటాను."
    మహేష్ నరనరాల్లో ఒకానొక చిత్రమైన వణుకు ప్రవహించింది. బ్రతుకున్న మనిషిని చంపటం.... అతన్లోని మృదుత్వం, సుకుమారమైన భావనలు, సున్నితమైన గుణాలు_ అన్నీ నిర్దాక్షిణ్యంగా నలిగిపోయినట్లుగా అయినాయి.
    అతని ఆలోచనలు గ్రహించినట్లుగా ఈశ్వరరావు నవ్వాడు. "మిమ్మల్నాపని చెయ్యమనటంలేదు డాక్టర్. మంచిదా కాదా అని అడుగుతున్నాను."
    మహేష్ జవాబివ్వలేదు.
    "డాక్టర్! రండి. మీకో విచిత్రం చూపిస్తాను" అంటూ మహేష్ ను తీసుకుని ఈశ్వరరావు బయటికి వచ్చి మేడ వెనక భాగంలోకి తీసుకెళ్ళాడు.
    వెనక ప్రాంగణంలో సిమెంట్ రేకులతో వేసిన ఓ షెడ్ ఉన్నది. అందులో ఓ గుర్రం చాలా నీరసంగా పడుకునివుంది.
    "డాక్టర్! దీనిపేరు బాల్ మొరే. మూడు నాలుగేళ్ళ క్రితంవరకూ యిది పార్టిసిపేట్ చెయ్యని రేస్ లేదు. మద్రాస్, బెంగుళూరు, ఊటి, బాంబే అన్నిచోట్లా రేసుల్లో అద్భుత విజయాలు సాధించింది. నాకు కొన్ని లక్షలు ఆర్జించి పెట్టింది. దీనిమీద ఆశ పెట్టుకుని పందాలు కాసినవారికి లక్షలకు లక్షలు సంపాదించి పెట్టింది. ఇప్పుడు వయసు మళ్ళటమేగాక, రోగగ్రస్థురాలై పోయింది. ఒకప్పుడు మదించి, వీరవిహారం చేసిన యీ జవనాశ్వాన్ని యిప్పుడీ దుర్భరమైన స్థితిలో చూడటం దుస్సహంగ వుంది." అని "బాలూ" అంటూ పిలిచాడు.
    బాల్ మొరే ఒకసారి కళ్ళు విప్పి యజమాని వంక చూసి ఓపిక లేనట్లు మళ్ళీ నీరసంగా కళ్ళుమూసుకుంది.
    "బంధూ" అని పిలిచాడు ఈశ్వరరావు.
    లోపల్నుంచి ఓ ముప్పయి ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఆ యింట్లో పనిచేసే మనిషిలా కనిపించాడు.
    "నా గన్ తీసుకురా."
    బంధు లోపలికి వెళ్ళాడు. మహేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
    "డాక్టర్! ఈవేళే నేనో నిర్ణయానికొచ్చాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో."
    బంధు యింట్లో నుండి ఓ తుపాకీ తీసుకొచ్చాడు.
    ఈశ్వరరావు అందుకుని లోడ్ చేసి వుందోలేదో చూసుకుని బాల్ మొరేవంక గురిపెడుతున్నాడు.
    మహేష్ చాలా విభ్రాంతిలో వున్నాడు. ఏదో జరగకూడనిది జరుగుతున్నట్లుగా తీవ్రమైన అనుభూతికి గురవుతున్నాడు.
    ఈశ్వరరావు గురిచూసి ట్రిగ్గర్ మీద చెయ్యివేశాడు.
    మహేష్ "నో" అని అరవబోయాడు కాని అతని కేక నోట్లోనే వుండిపోయింది.
    తుపాకి ధన్ మని పేలింది.
    బాల్ మొరే హృదయ విదారకంగా అరిచి రక్తంలో ఓలలాడుతూ గిలగిల తన్నుకుంటోంది.
    "సింహంలా, మదపుటేనుగులా, మహరాజులా బ్రతికిన యీ గుర్రం యిలా నికృష్టంగా రోజులు వెళ్ళదియ్యటం నేను చూడలేను" అంటూ గన్ యింకోసారి రోడ్ చేసుకుని మళ్ళీ పేల్చాడు.
    ధన్ మన్న శబ్దం.
    బాల్ మొరే ఆఖరిసారి చిన్న ఆర్తనాదం చేసి కదలకుండా వుండిపోయింది.
    దాని ప్రాణవాయువు అనంత విశ్వంలో కలసిపోయింది.


                              *    *    *


    ఆ రాత్రి మహేష్ చాలా రెస్ట్ లెస్ గా వున్నాడు. ఎంతకూ నిద్రపట్టటం లేదు. తుపాకీ పేలిన శబ్దం, బాల్ మొరే హృదయ విదారకంగా అరిచి, గిలగిలకొట్టుకుని ప్రాణాలు విడవటం_యీ దృశ్యాలే అతని కళ్ళముందు కనబడుతున్నాయి. అతని మృదువైన హృదయం యీ సంఘటనను తట్టుకోలేకపోతోంది.

 Previous Page Next Page