హరిణి కూడా నిద్రపట్టక అవస్థ పడుతోంది. శ్రీకాంత ఆమె రోగంతో పడుతూన్న నరకయాతన, ఆమె భర్తా పిల్లల హృదయవిదారకమైన స్థితి ఆమె కళ్ళముందు అనేక దృశ్యాలుగా కనబడుతున్నాయి. కాని ఆమె ఆలోచనలు అతని ఆలోచన్లకు భిన్నంగా వేరేవిధంగా వున్నాయి.
మహేష్ ఆమె అటూ యిటూ కదుల్తూ వుండటం చూసి "హరిణి!" అని పిలిచాడు.
"ఊ."
అతనికాసమయంలో ఆమెనుంచి ఊరట కావాలనిపించింది.
"నిద్రపట్టటంలేదా?"
"ఉహు."
చేతులు రెండూ ఆమెమీద వేసి తనవైపు త్రిప్పుకున్నాడు. నీలంగా వెలుగుతోన్న బెడ్ లైట్ కాంతిలో ఒకరి కళ్ళతో ఒకరివి ఆబగా, ఆర్తిగా చూసుకుంటున్నారు.
ఆమెకు అతన్తో చాలా చెప్పాలనివుంది. అతనూ తన బాధనంతా చెప్పాలనుకుంటున్నాడు.
అతని తల్లోకి వ్రేళ్ళు పోనిచ్చి జుట్టును రాస్తూ "మహేష్" అంది.
అతడామెకు మరి కొంచెం దగ్గరగా జరిగాడు.
"ఇవేళ....ఓ కేసొచ్చింది" అంటూ శ్రీకాంత గురించి క్లుప్తంగా చెప్పింది.
తనకు జరిగినట్లే__
"మహేష్! అలాంటి నరకబాధను చూస్తూ ఇలా చెయ్యటంకన్న మెర్సీకిల్లింగ్ ఇచ్చేస్తే మంచిదికదూ?"
తృళ్ళిపడ్డాడు. తను ప్రాణాతిప్రాణంగా ప్రేమిచిన హరిణి తన ఊపిరి, తన సర్వస్వం అయిన హరిణినుంచా యీ మాటలు వినవల్సి వస్తున్నది.
అప్రయత్నంగా అతని చేతులామె మీదనుండి తొలగిపోయాయి.
జీవితంలో హరిణిని మొట్టమొదటిసారిగా ద్వేషించిన క్షణమది.
14
ఒక మనిషంటే ఎంత ప్రేమయినా వుండనీ, ఆ మనిషి ఎంత ప్రాణప్రదమైన వ్యక్తి అయినా కాని, ఒకానొక సందర్భంలో కారణం ఎలాంటిదైనా కావచ్చు. ద్వేషభావం ఏర్పడిందంటే అంతకు ముందున్న అమరభావమంతా క్షణంలో గాల్లోకి ఎగిరిపోయినట్లవుతుంది. ఇంతకుముందు జరిగిందంతా అసత్యమేమోనన్న భావన ఏర్పడుతుంది.
మర్నాడు మహేష్ కు హరిణిని చూస్తే మాట్లాడాలనిపించలేదు. బ్రేక్ ఫాస్ట్ దగ్గర కూడా మౌనంగా కూర్చున్నాడు.
"మహేష్! అలా వున్నావేం? అనడిగింది హరిణి.
"ఏమీలేదు" అన్నాడు ముక్తసరిగా మహేష్.
హరిణి యింకేమీ ప్రశ్నించలేదు.
కారులో హాస్పటల్ కి వెళుతున్నప్పుడు కూడా ఇద్దరూ మౌనంగానే వున్నారు. మహేష్ నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు.
మహేష్ అలా ముభావంగా వుండటం ఆమె ఇదివరకెన్నడూ చూడలేదు. ఒక్కక్షణం తాను మాట్లాడకపోతే గిలగిల్లాడిపోయేవాడు. ఇంట్లో ఉన్నంతసేపూ "హరిణీ!" అంటూ ఎప్పుడూ పిలిచి ఏదో ఒకటి గలగల మాట్లాడేవాడు. మరి ఎందుకని సరిగ్గా మాట్లాడడు?
ఈ మధ్య తనకు ప్రాక్టీస్ ఎక్కువగా వుంది. అతని కోసం వచ్చే పేషెంట్ల కంటే తనకోసం వచ్చే పేషెంట్లు ఎక్కువగా వున్నారు. లేడీ డాక్టర్స్ కిది సహజం. మేల్ డాక్టర్స్ కి ఎవరికో స్పెషలిస్ట్ లకి తప్ప మిగతా వారికి అన్ని సీజన్స్ లో రష్ గ వుండదు. లేడీ డాక్టర్స్ కు సీజన్ తో పెద్దగా పనిలేదు. డెలివరీ కేసులు, బ్లీడింగ్ కేసులు, యింకా ఇతర స్త్రీ బంధమైన లుకోరియా కేసులు నిరంతరం వస్తూ వుంటాయి. అందులో యీమధ్య ఆడవాళ్ళకి నెలతప్పినప్పట్నుంచీ హెల్త్ చెకప్ అనీ, అవనీ యివనీ లేడీ డాక్టర్ల చుట్టూ తిరగటం పరిపాటి అయింది. అతనికన్నా తనకోసం పేషంట్స్ ఎక్కువగా వస్తున్నారని అతన్లో ప్రొఫెషనల్ జలసీ బయల్దేరిందా? మహేష్ లాంటి ఉదాత్తమైన వ్యక్తిలో ఇటువంటి అల్పపు ఆలోచనలు వుంటాయా?
కారు హాస్పటల్ ముందాగింది. హరిణి మాట్లాడకుండా దిగిపోయి లోపలకు వెళ్ళిపోయింది.
శ్రీకాంతకు ఎటాక్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి. వచ్చినప్పుడు పడే బాధ రోజురోజుకూ ఎక్కువయిపోయింది.
హరిణికి పేషెంట్లతో క్షణం ఊపిరిసలపడంలేదు. డెలివరీ కేసులు, సిజేరియన్ కేసులు, హిస్టిరెక్టమీ కేసులు_బెడ్సన్నీ నిండిపోయి హాస్పిటల్ కిటకిటలాడిపోతోంది.
ఆ రోజు తండ్రి అర్జునరావుగారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.
"హరిణి! ఎలా వున్నావు?"
"బాగానే వున్నాను డాడీ! మీ ఆరోగ్యమెలావుంది?"
"అంతా బాగాలేదమ్మా. అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది"
"అయ్యో! ఇ.సి.జి. తీయించకపోయారా డాడీ" నార్మల్ గానే వుంది! సీరం కొలెస్ట్రాల్ ఎక్కువగా వుంది. మూడొందల యాభైకి పైగా వుంది. బి.పి. కూడా ఎక్కువగానే వుంది. వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ (180/120)"
"డాడీ! మిమ్మల్ని చూడాలని వుంది డాడీ!"
"హరిణి! మహేష్ తో కలిసి యిక్కడకు రాకూడదూ ఓ సారి?"
"రావాలనేవుంది డాడీ! యిక్కడ యిద్దరం చాలా బిజీగా వున్నాం. పోనీ ఎలాగైనా మీరే రాకూడదూ? కొన్నాళ్లపాటు యిక్కడే రెస్ట్ తీసుకుందురుగాని."
"ప్రయత్నిస్తానమ్మా. హరిణీ ఒకమాట."
"ఏమిటి డాడీ!"
డాక్టర్ల జీవితం నాకు తెలుసునమ్మా. వాళ్ళ గురించి వాళ్ళకు ఆలోచించటానికి కూడా తీరిక వుండదు. అసలు వాళ్ళ సొంత జీవితమంటూ వుండదు."
హరిణికి యిప్పుడిప్పుడే యీ విషయం అనుభవానికి వస్తోంది.
"కాని ఎంత బిజీగావున్నా హజ్బండ్ యోగక్షేమాలు చూడడం మరిచిపోకు. అందులో మహేష్ చాలా 'ఉత్తముడు' అటువంటి భర్త దొరకటం నీ అదృష్టం"
హరిణికి నవ్వొచ్చింది. "అతన్ని చేసుకోవద్దనేగా డాడీ మీరెన్నో ఆంక్షలు విధించారు" అనాలనుకుంది. కాని మళ్ళీ ఆయన్ని బాధపెట్టడమెందుకని ఊరుకుంది.
"హరిణీ! విన్నావా?"
"విన్నాను డాడీ."
"వారానికోసారయినా ఫోన్ చేస్తూ వుండు. అన్నట్లు హరిణీ! నీదగ్గర కొచ్చిన పేషెంటు గురించి చిన్న బాధగానీ, పెద్ద బాధగానీ ఏ పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా చూడకు. అవతలి వ్యక్తిది ఓ ప్రాణం అని గుర్తుంచుకో. రోగిలోంచి ఆ బాధ తొలగించినప్పుడే నువ్వు మంచి డాక్టరువి కాగలుగుతావు"


