Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 42


    హరిణి చాలా శ్రద్ధగా రిపోర్టులన్నీ చూసింది. బేరియమ్ మీల్ ఎక్స్ రేలు అనేకసార్లు తియ్యబడ్డాయి. స్టమక్ లోగాని, డియోడినమ్ లోగాని ఎక్కడా అల్సర్ కనబడటంలేదు. ఒకవేళ ఎక్స్ రేలో పడలేదేమోనని ఎన్ డోస్కోపీ చేసి చూశారు. క్లియర్ గా వుంది. ఎబ్డోమినంతా స్కేవింగ్ చేసి చూశారు. లివర్, పేన్ క్రియాన్, కిడ్నీస్, స్ల్పీన్, గాల్ బ్లేడర్ అన్నీ ఆరోగ్యంగానే వున్నాయి. యూరిన్ కల్చర్ రిపోర్టంతా నార్మల్ గా వుంది. ఎమీబియాసిన్ కు చాలాసార్లు ట్రీట్ మెంట్ యివ్వబడింది. వర్మ్స్ అవన్నీ ఎప్పుడో ఎలిమినేట్ చెయ్యబడ్డాయి.
    అయినా నొప్పి తగ్గటంలేదు. ఇహ డయాగ్నైజ్ చెయ్యలేక తాత్కాలికంగా ఉపశాంతి కలగటం కోసం ఏంటిస్పాస్ మాడిక్స్, నిద్రపోవటానికి పెథిడిన్, మార్ఫిన్ లాంటి యింజక్షన్లు ఇవ్వసాగారు.
    హరిణికి ఆ కేసు టేకప్ చెయ్యటమిష్టంలేదు. కాని పేషెంటు బాధపడుతోంటే ఆ బాధ చూడలేక, సరైన నిర్ణయం తీసుకోలేక ఎడ్మిట్ చేసేసుకుంది.
    ఆమె పేరు శ్రీకాంత.
    ముఖం చాలా అందంగా వుంది. కాని దీర్ఘకాల అనారోగ్యం వల్ల చాలా శుష్కించి కళ లోపించి వుంది. హరిణికి ఆమె అంటే ఎందుకో చాలా అభిమానం కలిగింది.
    ఆమెకు భర్త, యిద్దరు పిల్లలు.
    భర్త మొహం దీనాతిదీనంగా వుంది. పిల్లల బట్టలు చిరిగిపోయి హృదయవిదారకంగా కనిపిస్తున్నారు.
    ఆమెను ఎడ్మిట్ చేసుకున్నాక హరిణి గదిలోంచి బయటకు వెళ్ళబోతుంటే "అమ్మా! ఒక మాట" అంది శ్రీకాంత.
    హరిణి ఆగింది. "మా వాళ్ళు కేవలం కర్తవ్యధర్మం మీద నన్నిక్కడకు తీసుకొచ్చి ఎడ్మిట్ చేశారుగాని_ నావల్ల మీకు అపారమైన యిబ్బంది కలగబోతోంది." అన్నది శ్రీకాంత.
    "దేనికని?"
    "నా జబ్బు తగ్గదు. తగ్గించడానికి మీరు అహర్నిశలూ ఎంతో శ్రమపడతారు. కాని అది మీకు లొంగదు."
    "డాక్టర్ కి ఇలాంటి అనుభవాలు తప్పవుకదా" అంది హరిణి.
    "కాని నాలాంటి పరమ నికృష్టమైన పేషెంటుని చూసి వుండరు. మిమ్మల్ని అనుక్షణం హింసించటానికీ, మనశ్శాంతి లేకుండా చేసివెయ్యటానికి ఇక్కడ చేరాను" హరిణి నవ్వింది "ఫర్వాలేదు."
    "అమ్మా. మీరింటికి వెళ్ళటానికి ఆలస్యమౌతుందా? మీకో విషయం చెప్పాలి" అంది శ్రీకాంత.
    "ఫర్వాలేదు చెప్పు."
    "మావారు ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దాదాపు పదిహేనువందల దాకా జీతమొస్తుంది. ఇదివరకు మూడు నాలుగు లక్షల రూపాయల దాకా ఆస్తి వుండేది. సొంత యిల్లు వుండేది. ఆయన నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. నా మీద ప్రేమతోకాని, భర్తగా ఒక బాధ్యత ఫీలవుతూ వుండటం బట్టిగాని నా జబ్బుకోసం తన ఆస్థంతా  ఖర్చుపెట్టసాగారు. లక్షలరూపాయలు స్వాహా అయిపోయాయి. ఇల్లు అమ్మివేశారు. నాకోసం హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ ఎప్పుడూ అత్తమామల చేత తిట్లు తింటూ వుంటారు. జీతంలో ఎప్పటికప్పుడు అడ్వాన్స్ తీసుకోవటం చేత సగానికి పైగా కట్స్ పోతూ వుంటాయి, ఆఖరికి నా రోగం వల్ల పిల్లల్ని సరిగ్గా చదివించలేకపోతున్నారు. స్కూల్ ఫీజు కట్టలేక చదువుల్లో వెనకబడిపోతున్నారు. వాళ్ళ వొంటిమీద సరైన బట్టలులేవు. కడుపునిండా సరైన తిండికూడా పెట్టటానికి వీల్లేని స్థితిలో వున్నాం. రోజురోజుకూ మా కుటుంబం దిగజారిపోతున్నది. ఒకరకంగా చెప్పాలంటే నాశనమైపోతున్నది. ఇదంతా ఎవరివల్లో తెలుసా? నావల్ల....అందుకే డాక్టర్! మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. దయవుంచి మూడో కంటివాడికి తెలీకుండా నన్ను చంపెయ్యండి."
    హరిణి నిరుత్తరురాలయి చూస్తోంది.
    "అవునమ్మా ప్రాణదానం చేసే డాక్టరు మనుషుల్ని చంపడమేమిటి అనుకుంటారు. కాని ఫలితంలేని జీవితం బతికి కుటుంబంలో మిగతా వారిని జీవచ్చవాలు చేసేకంటే ప్రయోజనంలేని జీవితాన్ని అంతం చేసెయ్యటమే మంచిదని నా అభిప్రాయం. చూస్తూ చూస్తూ చావటానికి నాకు తెగింపు కలగటంలేదు. నాకు తెలీకుండా ఏ మత్తుమందునో ఎక్కువగా యిచ్చి నన్ను చంపెయ్యండి. అమ్మా! పాపం అంటుకుంటుందని సంకోచించకండి. మీరు చెయ్యబోయే యీ పనివల్ల ఓ కుటుంబం నిలబడుతుంది. నా భర్తకు ప్రశాంతత లభిస్తుంది. నా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. మీరు జీవితంలో మొన్నెన్నడూ ఎరుగనంతటి పుణ్యఫలం ఏర్పడుతుంది."
    హరిణి ఏమీ జవాబు చెప్పలేక నిస్సహాయంగా చూసి వెనక్కి తిరిగింది.
    ఇంకా తలుపు దాటి వుండదు. వెనకనుండి ఓ ఆర్తనాదం వినిపించింది.
    శ్రీకాంత బెడ్ మీద బాధతో మెలికలు తిరిగిపోతోంది. అంతవరకూ కొంచమో గొప్పో జీవచ్చాయలను ప్రదర్శించిన ఆమె కళ్ళు పూర్తిగా కాంతిని కోల్పోయి, తేలపడిపోయాయి. ఆ బాధ మామూలు బాధలా లేదు. చూడడానికే దుస్సహంగా వుంది. బయటనుంచి ఆమె భర్తా, పిల్లలూ పరిగెత్తుకొచ్చారు. సిస్టర్ కూడా హడావుడిగా వచ్చింది. హరిణి నొప్పి తగ్గటానికి గబగబ రెండు మూడు యింజక్షన్లు చేసేసింది. పదినిమిషాల్లో శ్రీకాంత నొప్పి తగ్గి మగతలో పడిపోయింది. పల్స్ చూస్తే చాలా వీక్ గా వుంది. బి.పి. కూడా చాలా పడిపోయింది. ప్రిస్కిప్షన్ రెండు గ్లూకోజ్ బాటిల్సూ యింకా కొన్నిరకాల మందులూ రాసి భర్తచేతికిచ్చి మందుల షాపుకెళ్ళి అర్జంటుగా తీసుకురమ్మంది. ఆ చీటీ అందుకుంటూ అతను చూసిన చూపు ఆమె గుండెల్లోంచి దూసుకుపోయింది. మెల్లిగా లేచి నిలబడి గది కిటికీ దగ్గరకెళ్ళి నిలబడింది.
    అతను ఎదురుగావున్న మెడికల్ షాపుకు వెళ్ళి చీటీ చూపించి ఏదో అడుగుతున్నాడు. షాపతను ఏదో జవాబు చెబుతున్నాడు.
    వాళ్ళ హావభావాలను బట్టి ఆమె కర్థమయిందేమిటంటే _ శ్రీకాంత భర్త అప్పుయివ్వమని షాపతన్ని అడుగుతున్నాడు. షాపు యజమాని నిరాకరిస్తున్నాడు.
    షాపు యజమాని మంచివాడే. అతను డబ్బుపెట్టి కొంటే గాని మందులు రావు. తెలిసినవాళ్ళు ఎలాగూ అప్పులు పెట్టి కొంత యిచ్చీ కొంత యివ్వకా వేధిస్తూ వుంటారు. కొత్తవాళ్ళకు కూడా అప్పుపెట్టి అతనెక్కడ బాధపడగలడు.
    చివరకు అంగీకరించి గ్లూకోజ్ బాటిల్స్, మెడిసిన్స్ యిచ్చాడు.
    హరిణి డ్రిప్ స్టార్ట్ చేసి, పల్స్ కొంచెం బాగుపడ్డాక అక్కడ్నుంచి బయటికొచ్చింది.
    మహేష్, హరిణి కలిసి లంచ్ తీసుకుంటున్నారు.
    "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు మహేష్.

 Previous Page Next Page