"కార్ల్ మార్క్స్ జిందాబాద్! కామ్రేడ్ శాయీరామ్ జిందాబాద్!"
కేకలు దగ్గరయాక చూస్తే- వాళ్ళంతా మా కాలనీ కుర్రాళ్ళే!
వాళ్ళందరూ మార్క్సిస్ట్ (ఎక్స్ట్రీమ్, లెనినిస్ట్ మీడియమ్ గ్రూప్) ఇది మా కాలనీలో కొత్తగా ప్రారంభించిన కమ్యూనిస్ట్ పార్టీ! ఎవరికిష్టమొచ్చిన పార్టీవాళ్ళు స్థాపించుకునే సాంప్రదాయం మనకెలాగూ ఉండనే ఉంది కదా! ఇప్పుడు సంగతేమిటంటే మా కాలనీ వాళ్ళు తీయబోయే సినిమా కేవలం మార్క్సిస్ట్ భావాలతో విప్లవాత్మకంగా తీయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఊరేగింపు జరిపారన్నమాట.
సంగతేమిటో కనుక్కుందామని శాయీరామ్ ఇంటికెళ్ళేసరికి అందరూ అక్కాడే సమావేశమయి కనిపించారు.
"మరేంలేదు. మార్క్సిస్ట్ భావాలతో సినిమా తీయాలని వప్పుకునేసరికి "నాకే" జైకొట్టేస్తున్నారు" చిరునవ్వుతో చెప్తున్నాడు శాయీరామ్.
"అదేమిటి మనం మొదటి సినిమా పూర్తిగా కమర్షియల్ మసాలాతో వ్యాపార చిత్రం తీయాలనుకున్నాం గదా?" అడిగాడు జనార్ధన్.
"అందుకేనయ్యా బాబూ.... మార్క్సిస్ట్ వ్యవహారంతో సినిమా తీయటం! ఈ రోజుల్లో అవే వ్యాపార చిత్రాలు! ఆ మషాలా పెట్టి, మిగతా మషాలాలు కొంచెం తగిలిస్తే చాలు!" అన్నాడు శాయీరామ్.
"అవునవును!" అంది పార్వతీదేవి.
"కానీ మార్క్సిస్ట్ సినిమా ఎలా తీయాలో మనకెలా తెలుస్తుంది?" అనుమానంగా అడిగాడు రంగారెడ్డి.
"నాకు తెలుసు నేను చెప్తానులే!" అన్నాడు జనార్ధన్.
జనార్ధన్ వాళ్ళ అన్నయ్యకు ఆ మధ్య వ్యాపారంలొ లక్షలు లక్షలు లాభం వచ్చేసరికి ఆ కుటుంబమంతా మార్క్సిస్ట్ లతో చేరిపోయారు.
మార్క్సిస్ట్ నాయకులవాలంటే లక్షలకు లక్షల ఆస్తి ఉండాలంట! కాదని మేమెంత చెప్పినా వినిపించుకోలేదు. కావాలంటే మన రాష్ట్రంలోని కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీల నాయకులు ఆస్తి వివరాలు కనుక్కోమంటాడు.
"మరి దీనికి కథెవరు తయారు చేస్తారు?" అడిగాను నేను.
"ఇంకెవరు? నేనే! ఎలాంటి కథయినా రాయగలను నేను" అన్నాడు చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ ఉరఫ్ రామసుబ్బయ్య.
"నువ్వా! నీకసలు మార్క్సిజం అంటేనే తెలీదుకదయ్య?" అడిగాను చిరాకుగా.
"భలేవారే సార్! మార్క్సిజం సినిమా తీయడానికి మార్క్సిజం అంటే ఏమిటో తెలియాలా? భలేవారే సార్! విమానం ఎక్కడానికి విమానం డ్రైవింగ్ తెలిసుండాలా? భలేవారే సార్ మీరు" అందరూ నన్ను చూసి నవ్వారు.
"అయితే ఓ వారంలో కథ తయారుచెయ్! లాగించేద్దాం!" అన్నాడు శాయీరామ్.
చంద్రకాంత్ ఛటోపాధ్యాయ ఆనందంగా కాగితాలు కలం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ వారమంతా సినిమా వ్యవహారంలో బిజీ అయిపోయే వాళ్ళేమో గానీ ఈలోగా, మా కాలనీ పిల్లలందరూ చదువుతోన్న స్కూల్ తాలూకూ ప్రిన్సిపాల్ గారి దగ్గర్నుంచీ మా అందరకూ ఉత్తరాలు వచ్చాయ్. అన్నిట్లోనూ మేటర్ ఒక్కటే.
"మీ పిల్ల పిల్లగాడు..... కి టి.సి. ఇచ్చి స్కూలు నుంచి గెంటేయాలని ఆలోచిస్తున్నాము. ఆ విషయంలో మీ సహకారం కోసం అర్ధిస్తూ-
-ప్రేమతో మీ ప్రిన్సిపాల్.
పిడుగుపడ్డట్టు అందరం స్కూలుకి పరుగెత్తాం పిల్లకాయలను వెంట బెట్టుకుని అప్పటికే అక్కడ ఓ జాతరలాగుంది తల్లిదండ్రులూ, పిల్లలతో! ప్రిన్సిపాల్ రూమ్ బయట అప్పుడప్పుడూ పిల్లల్ని మింగేసేలా చూస్తూ తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు.
రంగారెడ్డి చాలామందిని ఇంటర్వ్యూ చేసి వచ్చాడు.
"అందరికీ అవే ఉత్తరాలు వచ్చాయట. ఇప్పటికిప్పుడే ఇద్దరు పిల్లలకి టి.సి. ఇచ్చి పంపించేసిందట కూడాను" వివరాలు చెప్పాడు మాకు. ఈలోగా ప్రిన్సిపాల్ రూమ్ లో నుంచి ఓ తండ్రి గొంతు గట్టిగా బ్రతిమాలుతూ వినిపించింది.
"అలా అనకండి మేడమ్! ప్లీజ్ మేడమ్! ఇప్పుడు టి.సి. ఇస్తే సీటెక్కడ దొరుకుతుంది మేడమ్."
"లేకపోతే ఏమిటది? ఏమిటి చదువు? ఏమిటీ మార్కులు? మాథ్స్- ట్వంటీ పర్సెంట్ సైన్స్ ఫిఫ్టీస్ పర్సెంట్! నో! నో! టి.సి తీసుకెళ్ళిపోండి! పిల్లల చదువు మీద శ్రద్దలేని తల్లిదండ్రులు మాకక్కర్లేదు- మా స్కూల్లో "సీటు" కు ఎంత డిమాండ్ ఉందో తెలుసా మీకు?"
"తెలుసండీ!"
"సీటు" ఇస్తాను అంటే చాలు! వేలకు వేలు డొనేషన్లు కట్టే పేరంట్స్ వేలకు వేలున్నారన్న సంగతి తెలుసా మీకు?"
"తెలుసండీ!"
"తెలిసే ఇంత నిర్లక్ష్యం అన్నమాట! తీసుకుపోండి!".
"క్షమించండి మేడమ్- ఈసారికి క్షమించండి! వచ్చే పరీక్షలకు ముందు నేనే శెలవుపెట్టి బాగా చదివి మా పిల్లలక్కూడా చెప్పి మంచి మార్కులు వచ్చేలాచేస్తా!"
"ఇప్పటి పరీక్షల సంగతి మాట్లాడు! ఇప్పుడెందుకు మంచిమార్కులు రాలేదు?"
"నాదే బుద్ది తక్కువండీ! చాలా పొరపాటు చేశాను."
"అవునా? ఇంక నోర్మూసుకుని టి.సి. తీసుకెళ్ళండి!"
"బాబోయ్ అంతమాట అనకండి మేడమ్- టెక్స్ట్ పుస్తకాలు లేకపోవటంవల్ల ఆ రెండింటిలో తప్పారండి....."
"టెక్స్ట్ పుస్తకాలెందుకు లేవు?"
"ఏమో మేడమ్! అడ్డమయినా షాపులూ తిరిగాను. ఇంతవరకూ ఎక్కడా రాలేదంటున్నారు-"
"పిచ్చివాగుడు వాగకూడదు! క్లాస్ టీచర్ దగ్గర ఒక టెక్స్ట్ పుస్తకం నేను చూశాను. ఇంతవరకూ రాకపోతే క్లాస్ టీచర్ దగ్గరకెలావచ్చాయ్?"