Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 41

   

     భార్గవికి వొళ్ళు మండిపోయింది. చదువు మానేయమన్నందుకు అంత బాధ అనిపించలేదు. పైసా పైసా లెక్క పెట్టుకుంటూ, నాలుగు చీరలతో గడపడంకంటే చదువు మానేయటమే మంచిదనిపించింది. కాని తను ఉద్యోగంచేసి సంపాదించడం దేనికి? తన ఆర్ధిక స్వాతంత్ర్యం కోసం కాదు. డబ్బు కూడబెట్టి కాబోయే భర్తకు యివ్వబోయే కట్నం కాస్త తగ్గుతుంది. ఉద్యోగం చేయాలని ఎంత కోరిక వున్నా తండ్రిమీద కోపంతో ఒప్పుకోలేదు భార్గవి. ఏ ఉద్యోగానికీ అప్లయ్ చెయ్యలేదు. తండ్రి బలవంతంగా అప్లికేషన్ పంపితే  ఉత్తపేపరు యిచ్చి వచ్చేది. ఇంటర్వ్యూలో తిక్క సమాధానాలు చెప్పేది.
   
    పగలంతా లైబ్రరీనుంచి తెచ్చుకున్న పుస్తకాలు చుదువుతూ, సాయంత్రం తండ్రి ఇంట్లోవుంటే పక్కవాళ్ళింట్లో గడిపేది. కొన్నాళ్ళకు అదీ బోర్ కొట్టింది. రకరకాల బొమ్మలు చేయడం, కుట్లూ, అల్లికలూ అన్నీ నేర్చుకుంది. ఆమెలో ఉత్సాహం చూసిన తల్లి రహస్యంగా దాచుకున్న డబ్బు తీసియిచ్చేది. భార్గవి "మూడీనెస్" ఆమెను భయపెడుతోంది. భర్తకోసం కూతుర్ని దూరం చేసుకుంటానేమోననే గిల్టీఫీలింగ్ కూడా ఏర్పడిపోయింది.
   
    పెళ్ళికొడుకుల వేటలో మరో ఏడాది గడిచిపోయింది. చాలామంది ఆమెకు ఉద్యోగం లేదని, కట్నం సరిపోదని తిరస్కరించిన వాళ్ళే ఆ విషయం విన్న ప్రతిసారీ తండ్రి ఎగిరిపడటం, దాంతో భార్గవి మొండితనం మరింత పెరగడం జరుగుతోంది.
   
    అప్పుడే వచ్చింది శ్రీరామచంద్రుడి సంబంధం. శ్రీరామ్ బి.కాం. పాసయ్యాడు. ఓ నేషనలైజ్ డ్ బ్యాంక్ లో ఆఫీసరు. కష్టపడి పైకి వచ్చినవాడు. తల్లిలేదు. తండ్రీ, ఒక అక్కా ఒక చెల్లెలూ వున్నారు. ఈ మధ్యనే అక్క పెళ్ళిచేశాడు. చెల్లెలి పెళ్ళికూడా దాదాపు సెటిలయినట్లే.
   
    సంప్రదాయకంగా పెళ్ళిచూపులు జరిగాయి. అతడు గొప్ప అందగాడు కాదు. కాని భార్గవికి కాబోయే భర్త అందం గురించి పెంచుకున్న ఆశలేం లేవు. ఆమెకు కావలసింది స్వేచ్చ. ఆ ఇంటినుంచి బయటపడడం! అందరూ తండ్రి  అంత దుర్మార్గులుగా వుండరు. ఇన్నేళ్ళు తండ్రి దగ్గర పెరిగాక ఎలాంటి మగవాడితోనయినా సర్దుకుపోగలనన్న ధైర్యం వుందామెకు.
   
    "ఏం బాబూ! అమ్మాయి నచ్చిందా?" అన్న మధ్యవర్తి ప్రశ్నకు-
   
    "బావుంది నేనేమంత అందగాన్నని ఆమెకు నేను నచ్చానా లేదా ఆ విషయం కనుక్కోండి" అన్నాడతను.
   
    అతడి రూపం ఏమోగాని ఈ మాటలు బాగా నచ్చాయి భార్గవికి.
   
    "మరో విషయం కట్నం యివ్వకూడదులాంటి ఆదర్శాలున్నాయా మీకు? ఎందుకంటే ఈ మధ్యనే అక్కయ్య పెళ్ళిచేసి అన్నీ అప్పులు చేశాను. చెల్లి పెళ్ళికి కట్నం యివ్వక తప్పదు... అంటే నేను తీసుకోక తప్పదు" అన్నాడు.
   
    "నాకేం అభ్యంతరం లేదు, నా తండ్రి యిస్తాడో లేదో అది కనుక్కోండి" అని మనసులోనే అనుకుంది. సామాజిక స్పృహమీద క్రితం రాత్రి చదివిన ఓ రచయిత్రి వ్యాసం గుర్తు తెచ్చుకుంటూ.
   
    "గుడ్! అయితే మీ నాన్నగారితో మాట్లాడతాను. మీరు ఏదయినా అడగాలంటే అడగండి. నిరభ్యంతరంగా సమాధానాలు చెపుతాను. సందేహించకండి" అన్నాడు.
   
    "ఏమీలేదు" అంది భార్గవి.
   
                              *    *    *
   
    శ్రీరామచంద్రుడు చాలా మెతక మనిషి. అతి సాధారణమైన వ్యక్తి. పెళ్ళిలో ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. మొదటిరాత్రి శ్రీరామ్ మాటలతో అతడి గురించి చాలా తెలుసుకుంది భార్గవి.
   
    "భార్గవీ! నేను జీవితంలో చాలా కష్టపడ్డాను అనేకంటే మా కోసం మా నాన్న చాలా కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు. ఆయన ఓ గవర్నమెంటు ఆఫీసులో ఫ్యూనుగా పనిచేశాడు. నేనిలా ఉన్నతస్థితిలోకి రావాలని ఆయన చాలా త్యాగాలు చేశాడు, అయినా నాకు పి.యు.సి. వరకు చెప్పించడానికే ఆయన చాలా కష్టపడవలసి వచ్చింది. ఆ విషయం అర్ధం చేసుకున్న నేను చుదువు మానేసి ఉద్యోగం చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. బ్యాంకులో గుమాస్తాగా ఉద్యోగం వచ్చింది. రాత్రనక పగలనక కష్టపడ్డాను, ఆఫీసులో అందరూ వెళ్ళిపోయినా ఎంత రాత్రయినా కూర్చుని పని పూర్తిచేసేవాణ్ణి ఈ విధంగా మా మేనేజరు అభిమానం సంపాదించగలిగాను ఆ తర్వాత వచ్చిన ఆఫీసర్లు కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ ప్రోత్సాహంతోటే నైట్ కాలేజీలో బి.కాం. చేశాను బ్యాంకు పరీక్షలు పాసయ్యాను. వెంటనే ఆఫీసరుగా ప్రమోషన్ వచ్చింది. ఇలాగే కష్టపడితే త్వరలోనే మరో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం వుంది. ప్రమోషన్ రాగానే నాన్నని రిటైర్ మెంటు తీసుకోమన్నాను. అక్కపెళ్ళి చేయడానికి చాలా అవస్థపడ్డాం. డానికి చదువాలేదు, చూడ్డానికి అంతంత మాత్రమే. అన్ని రకాల అప్పులు తీసుకున్నాను. ఓ పక్క చెల్లెలి చుదువు. మొత్తానికి ఇన్నాళ్ళకి దాని పెళ్ళి సెటిలయింది. మీ నాన్నగారిచ్చిన డబ్బు పూర్తిగా సరిపోదు. కొంత అప్పుచేసయినా ఆ కార్యం పూర్తిచేస్తే నా బాద్యతలన్నీ తీరిపోయినట్లుగా అవుతుంది. దానికి నీ సహకారం కావాలి".
   
    ఆ రాత్రంతా అతడు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులూ, పదిమందిచేత పడ్డ మాటలూ చెపుతూనే వున్నాడు. వింటున్నంతసేపూ భార్గవి మనసు ద్రవించిపోయింది. ఇన్ని రకాలుగా జీవితంలో కష్టాలుపడ్డవాడి దగ్గర తను తప్పకుండా సుఖపడగలనన్న నమ్మకం కలిగింది.
   
    ఆ మర్నాడు మధ్యాహ్నం ఒంటరిగా పడుకున్నప్పుడుగాని ఆమెకు తట్టలేదు- అతడు అంతా తన గురించే చెప్పాడని, భార్య గురించి ఏమీ అడగలేదని, చెప్పడానికి అవకాశం యివ్వలేదనీ.
   
                               *    *    *
   
    అటూ ఇటూ తిరగటంలో కొద్దిరోజులు క్షణం తీరికలేకుండా గడిచిపోయాయి. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తమ్ముడితో సహా యింటిల్లిపాదీ కంటతడి పెట్టడం ఆశ్చర్యం కలిగించిందామెకు. హాస్టల్ కంటే అత్తవారిల్లు భయంకరమయిన ప్రదేశం అని వాళ్ళ ఉద్దేశ్యం కాబోలు అని నవ్వుకుంది.
   
    సెలవు లేదంటూ ఆ పూటే బ్యాంక్ కి వెళ్ళిపోయాడు శ్రీరామ్. పరీక్షలు దగ్గరకొస్తున్నాయని ఆడపడుచు కాలేజీకి వెళ్ళిపోయింది. అస్వస్తుడైన మామగారు ఒక గదిలో పడుకున్నాడు. భార్గవి తన గదిలో ఒంటరిగా మిగిలిపోయింది.
   
    వచ్చిన మొదటిరోజునే అందరూ తనని వదలి వెళ్ళిపోవడం ఆమెకు బాధ కలిగించలేదు. స్వేచ్చ..... ఆమెకు కావలసిన స్వేచ్చ దొరికింది. పంజరం నుంచి బయటపడి నందనవనంలో విహరిస్తున్న పక్షిలాగుంది ఆమె మనసు. ఆమె ఇల్లంతా కలియతిరిగింది. ఖరీదైన సామానంటూ ఎక్కువగా లేదు! అయినా ఇది తనిల్లు. దీన్ని అందంగా తీర్చి దిద్దుకుంటుంది. తనకంటూ ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటుంది. ఉన్న కాస్త స్థలంలోనే చిన్న తోట వేసుకుంటుంది.
   
    సాయంత్రం శ్రీరామ్ వచ్చేవేళకు పనులన్నీ చేసుకుని నీట్ గా తయారయి కూర్చుంది భార్గవి. ఆరు దాటింది. ఏడయింది. ఎనిమిది దాటాక కూడా అతడు రాకపోయేసరికి ఆమె గాభరాపడింది.
   
    "నీకు తెలియదులే వదినా! అన్నయ్య రావడానికి ఒక్కోసారి పది కూడా దాటుతుంది. నువ్వూ మాతో భోంచేసి పడుకో" అంది యామిని.
   
    భార్గవికి భోజనం చెయ్యాలనిపించలేదు. రాత్రి పదకొండింటికి శ్రీరామ్ తిరిగి వచ్చేసరికి ఆమె వాకిట్లోనే యెదురు చూస్తూ కూర్చుంది. అతడి నోటినుంచి గుప్పున ఏ వాసనా రాలేదు. మొహంలో అలసట కనిపిస్తూంది.
   
    "బ్యాంక్ లో పనెక్కువగా వుంది. ఆలస్యం అయింది. నాన్నా వాళ్ళు పడుకున్నారా? భోజనం చేశారు గదూ?" అడిగాడతను యింట్లోకి అడుగుపెడుతూనే.
   
    భార్గవి మాట్లాడలేదు. ఇద్దరికీ వడ్డించింది. నోరు విప్పితే దుఃఖం పొంగుకొస్తుందేమోనని భయం.
   
    "అరే! నువ్వు భోజనం చెయ్యలేదా? నా కోసం ఇలా ఎదురుచూడకు ఎప్పుడూ. నేనే టైముకి వచ్చేది నాకే తెలియదు".
   
    "అంటే ఇవ్వాళ ఒక్కరోజే కాదా? రోజూ ఇంత ఆలస్యం అవుతుందా?" అంది ఆశ్చర్యంగా.
   
    "అవును మరి పదిహేను రోజులు లీవులో వున్నానా, పనంతా పెండింగు పడింది" అన్నాడు మొత్తం బ్యాంకంతా తనమీదే ఆధారపడ్డట్టు.
   
    సెలవు లేదని అతడు హనీమూన్ కి వెళ్ళడానికి కూడా తిరస్కరించాడు.
   
    ఆ రాత్రి చెల్లి పెళ్ళి గురించి ప్రస్తావిస్తూ "మా పిన్ని వస్తుంది నాలుగు రోజుల్లో ఉత్తరం రాసేశాను. రాగానే నువ్వూ, ఆవిడా పెళ్ళి పనుల్లోకి దిగండి. ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేసుకోకపోతే తర్వాత యిబ్బంది పడాల్సివస్తుంది. వాళ్ళ తరపునుంచి ఒక్కమాట కూడా రాకూడదు. వాళ్ళ నాన్నకి షార్టు టెంపర్" అని అతడి ధోరణిలో అతడు చెప్పుకుపోతున్నాడు.
   
    ఎదుటివారికి ఎంత పని చెప్పినా అది శ్రమగా అనిపించకుండా వాళ్ళలో ఉత్సాహం కలిగించేలా చెప్పడం ఒక కళ. పాడే పాటకు ఒక రాగం, లయ వున్నట్లే మాట్లాడే మాటకూ ఒక స్వరం వుంటుంది. కాస్త మృదుత్వం, అనునయం జోడిస్తే కఠోరమైన కార్యం కూడా వీనులవిందుగా కనిపిస్తుంది. శ్రీరామ్ కలాంటి పరిజ్ఞానం ఏ మాత్రమూ లేదు.

 Previous Page Next Page