భోజనం పూర్తయ్యాక మరో అయిదు నిమిషాలు అనవసరంగా మేల్కొని శ్రీరామ్ నిద్రపోయాడు. ఆ సమయంలోనైనా శ్రీరామ్ తనతో ప్రేమగా మాట్లాడతాడని, తన మనసులో భావాలన్నీ శ్రీరామ్ కి చెప్పి పాలుపంచుకోవాలనీ, భవిష్యత్తు అనే బంగారు కలలకు పునాది ఆ పడక మీదే పడుతుందనీ ఆశించిన భార్గవికి నిరాశే మిగిలింది. పగలంతా ఆఫీసులో పనిచేసి వచ్చాడేమో శ్రీరామ్ గాఢంగా నిద్ర పోతున్నాడు. ఆమెకు మాత్రం నిద్రపట్టలేదు.
పెళ్ళిపనుల్లో పడ్డాక ఆమెకు క్షణం తీరిక లేకుండా అయిపోయింది. పెళ్ళి నాలుగురోజులుందనగా శ్రీరామ్ కి సెలవు దొరికింది. పిలుపులకి వెళ్ళినప్పుడే శ్రీరామ్ తో మొదటిసారిగా ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళడం!
యామిని పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళికొడుకు తరపువాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అన్నింటికి తట్టుకుంటూ, సమాధానపరుస్తూ సవ్యంగా జరిపించేటప్పటికి శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా అలసిపోయారంతా.
ఇద్దరూ చిన్నవాళ్ళయినా అంతపెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వహించగలిగినందుకు అందర్లోనూ మెప్పు మాత్రం మిగిలింది. ఆ తృప్తితో ఉప్పొంగిపోయిన శ్రీరామ్ హాయిగా నిద్రపోయాడా రాత్రి. భార్గవి రాత్రంతా అలా కూర్చునే వుండిపోయింది. అందర్లోనూ ఎక్కువగా అవస్థపడిందామే..... అన్నీ సక్రమంగా నిర్వహించానన్న తృప్తితోపాటు గుండె పొరల అడుగునించి వలయంగా తిరుగుతున్న అసంతృప్తి.
పెళ్ళిలో చెల్లెలికి అన్ని ముచ్చట్లూ జరిపించాడు శ్రీరామ్. చెల్లెలు ఏ విషయంలోనూ ఎలాంటి లోటూ ఫీలవకూడదని తపనపడ్డాడు. కాని తన భార్యకూడా ఒక కొత్త పెళ్ళికూతురే - ఆమెకు ఆశలూ కోరికలూ వుంటాయని అతడికి తట్టలేదు. పెళ్ళికొడుకువాళ్ళు మూర్ఖంగా అడిగినవన్నీ చిరునవ్వుతో, సహనంతో నిర్వర్తించాడు. అలకపాన్పు మీద అబ్బాయి కోరితే తన పెళ్ళికి బహుమతిగా యిచ్చిన బీరువాని యిచ్చేశాడు. హనీమూన్ కి వెళ్ళాలి- డబ్బు యిమ్మని అడగ్గానే భార్గవిని అడిగి తమకు హనీమూన్ కోసమని ఆమె తండ్రి ఇచ్చిన డబ్బు అంతా తీసి ఇచ్చేశాడు.
భార్గవిలో అసూయ లేదు. తన బాధ్యతలేవో తెలుసుకుని అవసరానికి అనుగుణంగా ప్రవర్తించే స్వభావం గలది కాబట్టి ఆ ఇంట్లో గొడవలు మొదలవలేదు. కాని ఆమెకూడా ఒక మనిషే ఎంత నిగ్రహించుకున్నా అణిగిపోని అసంతృప్తి, బాధ ఆమెకు నిద్రలేకుండా చేశాయి. మనిషికి స్వార్ధం వుండకూడదని అన్న వాడెవడో గొప్ప ఋషి అయివుండాలి. ఋషులందరూ మనుష్యులే. కాని మనుషులంతా ఋషులు కాదు.
3
జనం వెళ్ళిపోయినా పెళ్ళి హడావుడి ఇంకా తగ్గలేదు.
"భార్గవీ టిఫిన్ పెడతావా? ఆఫీసుకు టైమవుతోంది" అన్న అతడి కేక విని వంటింట్లోంచి బయటకు వచ్చింది ఆశ్చర్యంగా.
"అదేమిటి మరో రెండు రోజులు సెలవుందిగా. నిన్నటివరకు రెస్టేలేదు. ఒకటే హడావుడి, ఇవ్వాళ వెళ్ళకపోతేనేం?" అంది.
"మైగాడ్! బ్యాంకులో పని అంతా అలాగే వుంది. పండక్కి బావా వాళ్ళు మళ్ళీ వస్తే రెండు రోజులు సెలవు పెట్టకపోతే బావుండదు. అందులో మా మేనేజరు అప్పుడే కబురు చేశాడు- పని చాలా వుందట రమ్మని".
భార్గవి అవాక్కయింది.
అతడు కనీసం ఈ రెండు రోజులన్నా తనతో సరదాగా గడుపుతాడనుకుంది. విశాఖపట్నం వచ్చాక రోజూ బీచ్ కి షికారు వెళ్ళచ్చుననుకుంది. కాని సముద్రాన్ని దూరంనించైనా చూసే అవకాశం మాత్రం రాలేదింకా. మారు మాట్లాడకుండా అతడికి టిఫిన్ వడ్డించింది.
"చాలా అలసిపోయావు గదూ! సాయంత్రం వరకూ పూర్తి రెస్టు తీసుకో భార్గవీ! త్వరగానే వచ్చేస్తా, అలా బీచ్ కి వెళదాం" అన్నాడు.
ఆ ఒక్కమాటకే ఆ బాధంతా తీసేసినట్లనిపించింది.
స్త్రీ అంత ఆశాజీవి ప్రపంచంలో ఇంకెవరూ వుండరనుకుంటా.
..... సాయంత్రం అతడొచ్చే వేళకు అతడి కిష్టమైన జీడిపప్పు పకోడీలు చేసింది. స్నానంచేసి అతడి కిష్టమైన గులాబీరంగు చీర కట్టుకుని అందంగా అలంకరించుకుని కూర్చుంది. ఇన్నాళ్ళకు సముద్రాన్ని చూడబోతున్నాననీ, అలల మధ్య గంతులేస్తూ పరుగులు తీయొచ్చుననీ కళలు కంటోందామె. కాలింగ్ బెల్ చప్పుడికి పరుగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఎవరో ఆగంతకుడు.
"నేను మీ వారి బ్యాంక్ లోనే పనిచేస్తాను. డే బుక్ బ్యాలెన్స్ అవలేదనీ ఇవ్వాళ చాలా ఆలస్యం అవుతుందని చెప్పమన్నారు" అని చెప్పి వెళ్ళిపోయాడతను.
ఉత్సాహమంతా చచ్చిపోయి నీరసంగా అనిపించింది భార్గావికి. ఇలాంటి సమయాల్లో ఆడవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో సినిమాల్లో చూసింది. నవలల్లో చదివింది. ఇంట్లో వస్తువులన్నీ విరగగొట్టడం, జుట్టు విరబోసుకుని అలకపాన్పు ఎక్కడం, ఉపవాసాలు చెయ్యడం, అందరిమీదా ఎగిరిపడటం వగైరా కాని చదువుకుని మెచ్యూరిటీ వచ్చిన తనుకూడా అలా ప్రవర్తించగలదా? అలకలోని అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించడం తనకూ ఇష్టమే. కాని చిన్న చిన్న విషయాలకు లేని కోపం తెచ్చుకుని నటించే కోరిక కలగడం లేదు. పెళ్ళయి రెండు నెలలయినా కాలేదు. కాని ఎన్నో సంవత్సరాలుగా ఆ స్థానంలో వున్నట్లు అనుభవం వచ్చేసింది. కొత్తగా పెళ్ళయిన దంపతుల్లో కలిగే చిలిపి కజ్జాలు, ప్రణయ కోపాలకు, తాము అతీతంగా వున్నట్లనిపిస్తోంది. పుట్టింట్లో అలవాటు పడ్డట్లు ఈ వాతావరణానికి అలవాటుపడడం అవసరమేమో! ఆమెకు గురజాడ ముత్యాలసరాలు గుర్తొచ్చాయి.
విరిగి పెరిగితి, పెరిగి విరిగితి
కష్టసుఖముల సారమెరిగితి
పండుతున్నవి ఆశలెన్నో
యెండి రాలగ బొగిలితిన్.
రాత్రి పది దాటాక వచ్చాడు శ్రీరామ్
"సారీ భార్గవీ! మా మేనేజరు ఏదో పని చెప్పాడు. ఎట్లాగైనా పని పూర్తి చేసుకుని రావాలనుకుంటే కుదరనే లేదు. రేపు కూడా వెళ్ళాలి మళ్ళీ. ఇంతకీ ఏమిటి చదువుతున్నావ్?"
"ఊర్వశి" అంది తలెత్తకుండానే.
"తెలుగు పుస్తకమా?" అసహ్యంగా అన్నాడు. "ఈ తెలుగు నవలలన్నీ ఇంగ్లీషు పుస్తకానికి కాపీలటగా. మా బ్యాంకులో అనుకుంటూ వుంటారు" అన్నాడు. ఆమె అతడివైపు సానుభూతితో, ఆర్తితో, జాలితో, దుఃఖంతో చూసింది. మొట్టమొదటిసారిగా తన భర్త ఎంత సగటు మనిషో తెలిసింది. అనుకుంటూ వుంటారు....టగా....వాళ్ళు చెప్పారు.. 'అట'....గా!
"అవును" అంది కాస్త కఠినంగా "కృష్ణశాస్త్రిగారూ షిడ్నీ షెల్డాన్ ని కాపీకొట్టి వ్రాశారు".
"నాకు చదవడం రాదు. సెంట్రల్ స్కూల్లో చదివాను. నువ్వెప్పుడన్నా ఉత్తరాలు రాయాలన్నా ఇంగ్లీషులో రాయాల్సిందే" గొప్పగా అన్నాడు శ్రీరామ్.
"అయితే మీకు ఇంగ్లీషు లిటరేచర్ అంటే ఇష్టమన్నమాట. షెల్లీ, వర్డ్స్ వర్త్ నా అభిమాన కవులు" ఉత్సాహంగా క్షణం క్రితం కోపాన్ని మర్చిపోయి అన్నది.
"అవన్నీ ఇప్పుడెవరికి జ్ఞాపకం వున్నాయి? చదువుకునేటప్పుడు ఏదో బట్టీబట్టి పరీక్షలు వ్రాశాను. ఇప్పుడంతా బుర్రలో డెబిట్లు, క్రెడిట్లు. పద ఆకలేస్తోంది, వడ్డించు" అని లోపలికి వెళ్ళిపోయాడు.
నీరసంగా వంటింటికేసి నడిచింది భార్గవి.
"అదేమిటి నువ్వింకా భోజనం చేయలేదూ? ఎన్నిసార్లు చెప్పాను నా కోసం ఎదురు చూడవద్దని?" కోపంగా అన్నాడు.
"నాకు ఒంటరిగా తినాలనిపించడంలేదు" ముభావంగానే సమాధానమిచ్చింది.
"అయితే నాన్నగారితో కలిసి భోజనం చెయ్యి యామిని వెళ్ళిపోయాక తోడుగా ఎవరూ కూర్చోవడం లేదు. ఆయనకూ బాధగా వుండొచ్చు".
ఆమెకు ఆ మాటలు ఆశ్చర్యం కొలిపాయి. "నాకు మీతో కలిసి భోజనం చెయ్యడంలోనే ఆనందం వుంది. ఎంత ఆలస్యమయినా ఎదురు చూస్తాను" అంది నిర్లిప్తంగా.
"అలా మొండికేస్తే ఎలా చెప్పు! నా ఉద్యోగం విషయం నీకు సరిగ్గా అర్ధమయినట్లు లేదు. బ్యాంక్ లో ఆఫీసరంటే చాలా పెద్ద బాధ్యత. అందరూ పని ముగించుకుని వెళ్ళాకే మా పని మొదలవుతుంది. నేను లేకపోతె బ్రాంచే లేదని మా మేనేజర్ అంటూ వుంటాడు".
భార్గవి మాట్లాడలేదు. మాట్లాడవలసిన అవసరం కనిపించలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండియా గురించి అలా అనుకుని వుండడు.
మనసు ఓ సముద్రం వంటిది. పైకి నిశ్చలంగా కనపడినా లోతుల నుండి కనిపించని వ్యధలు ఎగసి కెరటాలుగా కదులుతూనే వుంటాయి. అవి కన్నీటి చుక్కలవుతాయి.
* * *
"అమ్మా భార్గవీ!" మామగారి పిలుపు విని బయటకు వచ్చింది.