తాగుతూ సైతం మౌనంగానే ఉండిపోయిన వీర్రాజు తూర్పున వేగుచుక్కని చూస్తూ అప్పుడు పెదవి విప్పాడు "ఎవరు చేసుంటారిలా?"
ఈ ప్రశ్న రాజేందర్ ఊహించనిదేం కాదు.
"ఎవరు?" గుండె బీటలువారుతున్నట్టు అరిచాడు. "ఎవడికింత దమ్మున్నది?"
"నీ సంగతి తెలిసిన వాడెవడూ నిన్నెదిరించలేడు బావా!" నెమ్మదిగా అన్నాడు రాజేందర్ "కాకపోతే..."
తాత్పర్యాన్ని అభినయిస్తున్న అతడిని చూస్తూ అడిగాడు "చెప్పు?"
"ఏవో గొడవలుంటాయి కాలేజీలో" అన్నాడు.
"అంటే?" వీర్రాజు చేయి గ్లాసు చుట్టూ బిగుసుకుంది.
"ఈ మధ్యకాలంలో రవి, మరో స్టూడెంట్ తరచూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది ఆమధ్య ఏటి ఒడ్డున కొట్టుకున్నారట కూడా.....దానితో కాలేజీలో రెండు గ్రూపులు ఏర్పడి అంతు చూసుకుంటాం అని హెచ్చరించేదాకా వెళ్ళిందట."
వీర్రాజు చేతిలో గ్లాసు ముక్కలైంది. కోపంగా రాజేందర్ మెడ పట్టుకున్నాడు. "ఎందుకు.....ఈ విషయం యిన్నాళ్ళూ నాకెందుకు చెప్పలేదు?"
"చిన్నపిల్లల గొడవలనీ...."
"ర్రేయ్" తాగిన మందు విషమైనట్టు బుసకొట్టాడు వీర్రాజు.
"ఎదురులేనివాణ్నిరా నేను.....యిప్పుడు యిలా వెధవనైపోయాను. ఎందుకంటే మీరంతా నా నుంచి అంతా దాచారు కాబట్టి....చెప్పు....ఎవడు?"
"శంకూ...." లక్ష్మమ్మ మనవడు.
నిద్రలేచిన కళింగనాగులా చూశాడు వీర్రాజు. "అంటే....మన వూరి వాడేనన్నమాట!"
"అవును బావా....నువ్వు సరేనంటే వాడ్ని నేను....."
"లేదు నువ్వుకాదు రాజా.....నా రాజసాన్ని యిలా దెబ్బతీయాలను కున్నవాన్ని నేను సత్కరిస్తాను. లాక్కురండి."
నరమేథానికి మరో రోజు మొదలైన సూచనగా తూర్పున వెలుగురేఖలు విచ్చుకున్నాయి.
శంకూ కోసం నలుగురు వ్యక్తులు బయలుదేరారప్పటికే.
* * * *
"అమ్మా!"
శంకూ చర్మం పొరలుగా చిట్లిపోతూంది.
వీర్రాజుగారి చేతిలోని హంటరు మృత చరిత్ర రాస్తున్న కలం జుళిపింపులా నర్తిస్తుంటే ఉదయసూర్యుడు ఆకాశంలో బిక్కచచ్చిపోయాడు.
గాలి నిస్సహాయమ్గా గోడు పెడుతూంది.
ఊరి జనం వెర్రివాళ్ళయి చూస్తున్నారు.
"చెప్పు....చేసింది నువ్వేకదూ?" అలసటగా ఆగాడు వీర్రాజు.
కాదనీ చెప్పి చెప్పి నిస్సత్తువగా తల వాల్చుకున్న శంకూ కళ్ళ నుంచి ఇందాక రాలిన నీటిబొట్లు యిప్పుడు చారికల్లా మారాయి.
ఆ లోగిలి ప్రాంగణంలో చెట్టుకు కట్టేయబడిన శంకూ ఒక బలవంతుడి దౌష్ట్యానికి బలయిన ఎందరో నిర్భాగ్యుల చరిత్ర పుటల చివరి వాక్యంలా వున్నాడు.
తెల తెలవారకముందే మనవడ్ని లాక్కెళుతున్న వీర్రాజు మనుషులతో ఏం జరిగిందయ్యా అంటూ వాపోతూ వెంటబడిన బామ్మ లక్ష్మమ్మ మొదటి హంటరు దెబ్బకి అడ్డుపడబోయి, అప్పటికే స్పృహ తప్పిపోయింది.
ఇది వూరా వల్లకాడా తెలీని మంగ కళ్ళు ఉధృతంగా వర్షిస్తున్నాయి.
వలదని చెప్పినా వినని వెర్రిబాగుల శంకూ కథ యింత తొందరగా యిలా ముగిసిపోతుందని తెలీని మంగ కనిపించని దేవుళ్ళకే మొక్కుకుంటుంది. ప్రాణాలు కడగంటిపోతున్న శంకూని చూస్తూ నిశ్శబ్దంగా విలపిస్తూంది.
"ర్రేయ్....మాట్లాడరా?"
మరో హంటరు దెబ్బ.
సన్నగా మూలిగిన శంకూ ఏదో చెప్పాలని చెప్పలేక సొమ్మసిల్లి పోతున్నాడు. చేయని తప్పుకి శిక్షేమిటో తెలీక నాకీ జన్మెందుకిచ్చావ్ అంటూ కనిపించని అమ్మని మనసులోనే తిట్టుకుంటున్నాడు ఆ స్థితిలో కూడా.
"చెప్పు...." శంకూ జుట్టుపట్టుకుని వాలిపోతున్న తలని పైకెత్తాడు వీర్రాజు."ఎవడు....ఇదంతా ....నీచేత చేయించినవాడెవడు?"
జవాబు చెప్పలేని శంకూ చర్మం మళ్ళీ చిట్లిపోయింది.
రక్తం ఉబ్బిన ఒంటి పగుళ్ళలోనుంచి లేత చర్మం కంటతడి పెట్టుకుంటున్నట్టు ఎర్రని అశ్రువుల్ల వూరుతున్న రక్తం.
కుంకుమ పూలని గంధంగా నూరి మృత్యువుకి బలిగా మార్చే లేత పసికందు ఒంటికి అద్దినట్టు ఉబుకుతున్న చిక్కని రక్తం.
"చెప్పరా?"
ఏ క్షణంలో అయినా శంకూ ప్రాణం లేచిపోయేట్టుంది.
జవాబు అందని అహం ఉధృతంగా రెచ్చగొడుతుంటే ఆగకుండా హంటరుతో బాదుతున్నాడు వీర్రాజు.
నెల రాలిపోతున్న లేత పిందెని చూస్తూ అందరి మనసుల్లోనూ చెప్పలేని పగుళ్ళు. కానీ రాజేందర్ పాశవికంగా ఆనందిస్తున్నాడు ఓ మూల నిలబడి.
ఎవరు....ఎవరా వ్యక్తిని ఆపగలరని....
ఎంత సానుభూతి వున్నా ఎవరు వారించగలరని.....
శంకూ ఇప్పుడు చర్మం తొలిచిన లేడిపిల్లలా వున్నాడు.
అదికాదు, మరో రెండు క్షణాల్లో ఈ ప్రపంచంతోనే బంధాన్ని తెంచుకునేట్టున్నాడు.
అదిగో....
అప్పుడు అమ్మతోబాటు అక్కడికి వచ్చింది సావేరి.
రాకపోయేదే.....అన్నయ్యతో మాట్లాడాలని హాస్పిటల్లో యింకా నిరీక్షించేదే కాని ఇక్కడి విషయం తెలిసిన సురేంద్ర ముందు ఆమెకి తెలియచేశాడు హాస్పిటల్ కి వెళ్ళి.
"డాడీ...."
శంకూకి అడ్డం నిలిచిన సావేరి ఒంటిని తాకింది హంటర్.
"లే....నువ్వు...."
"వద్దు డాడీ! శంకూ చచ్చిపోతాడు!" సావేరి మామూలుగా తండ్రిని ఆపుతున్నట్టు లేదు.... వెక్కిపడుతూంది శకలంగా మారిన శంకూని అలా చూడలేకపోయిందో అది కానినాడు తనకన్నా ముందు శంకూ రాలిపోవడం కూడా విషయమే అని అనిపించిందో ఏడుస్తూనే తండ్రిని ఎదిరించింది. "వద్దు....శంకూని కొట్టొద్దు."
"వాడు నీ అన్న కళ్ళని...."
"అబద్దం"
"నీకు తెలీదు"
"నీకస్సలు తెలీదు" రోషంగా అరిచింది ఏడుస్తూనే...."నీకన్నా' మీరందరికన్నా శంకూ గురించి నాకు బాగా తెలుసు ఆ!"
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది.
వీర్రాజు భ్రుకుటి ముడిపడింది అనుమానంగా.
తన సామ్రాజ్యంలో సామాన్యులు మాట్లాడటానికే సాధ్యంకాని యువరాణి తన ముద్దులపట్టి యిప్పుడు తనకేదో సత్యాన్ని ఎరుకపరుస్తూంది. చుట్టూ చేరిన జనం ముందు తాను ప్రదర్సిస్తున్న అహానికి అడ్డుకట్ట వేసి తన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది.
"అడ్డులే!" మరింతగా రెచ్చిపోతున్నాడు.
తల అడ్డంగా వూపింది.
"నిన్నేనే....పక్కకు జరుగు!"
సాధ్యంకానట్టు తల పంకించింది ఇందాకటిలాగే
"సా....వే....రీ...."
ఒక్కో అడుగు ముందుకేస్తున్న వీర్రాజుకిప్పుడేదో కొత్త అర్ధం స్పురిస్తుంటే ఇక తాత్సార్యం చేయలేనట్టు ఆవేశంగా హంటరు పైకెత్తాడు.
రాధమ్మ అడ్డుకోబోయింది.
అంతే! ఓ మూలగా తూలిపోయింది అతడు నెట్టగానే.