ఆ రాత్రి బాగా ఆలోచించాడు రాజేందర్.
ఓ అబబయిని యిష్టపడిన అమ్మాయిని దారి మళ్ళించాలంటే అతడు తననుకున్నంత గుణవంతుడు కాదని నిరూపించాలి. అది మొదటిది ఆ ప్రయత్నంలో తను ఫెయిలైపోయాడు.
ఇక మిగిలిన రెండోది, ఆఖరుది ఒక్కటే! అసలు మనిషినే అసహ్యించుకునేట్టు చేయాలి.
అంటే....
అహంకారంతో ఏదన్నా సాధించటం తప్ప అభిమానమనే మరో పటిష్టమైన అస్త్రం గురించి సరైన అవగాహన లేని అతను చివరి పథకానికి ఆ రోజే ముహూర్తం నిర్ణయించాడు తొందరపాటులో.
* * * * *
మసక చీకటిలో సాగిపోతున్న శారదానది అలసి అస్తమించిన సూర్యుడి కన్నీటి వాగులా వుంది.
ఏదో కొండను తాకివస్తున్న గాలి అలలు ఉస్సురోమనే నిస్సహాయత చివరి నిట్టూర్పులా వున్నాయి.
ఇసుక తిన్నెలపై జనం సందడి క్రమంగా తగ్గుముఖం పడుతున్నా శంకూ లేవలేదు. ఇంకా అలాగే కూర్చుని వున్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో_
నదికి ఒడ్డున ఉన్న మామిడితోపులోని రెండు ఆకారాలతో రహస్యంగా చెబుతున్నాడు రాజేందర్ "వాడు ఎంతసేపలా కూర్చున్నా వచ్చేది యీ తోపులోనే కాబట్టి అవకాశం మిస్ చేసుకోకూడదు. ఏసిడ్ పడాల్సింది ఒంటి మీద కాదు, మొహంమీద....కళ్ళు పోవటం, మొహం వికృతంగా మారటం ఒకేసారి జరిగిపోవాలి."
"సరాసరి అక్కడికే వెళ్ళి చేసేస్తే?" అన్నాడో వ్యక్తి.
"లాభంలేదు! వాడి సమీపంలో పిల్లలతో ఊళ్ళోని పెద్దమనుషులూ కొందరు కూర్చొని వున్నారు. అటూ యిటూ అయితే మీ వెంటపడతారు. దొరికారంటే ప్రమాదం"
తల పంకించారు ఇద్దరు ప్రొఫెషనల్సూ.
మరో అరగంట గడిచింది.
చీకటి దట్టంగా ఆవరించింది.
సమీపంలో పొదల్లోని మిణుగురులు రాలిపడే ఉల్కల్లా మెరుస్తున్నాయి. కీచురాళ్ళ రొదతో నిశ్శబ్దం చెదిరిపోతూంది.
అప్పుడు చూశారు కదిలివస్తున్న ఆకారాన్ని.
చేతిలోని జార్ కవర్ తెరిచారు. కాన్ సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ ఏసిడ్ సెగలు కక్కుతుంది.
ఒకటి....
రెండు....
మూడు....
పది క్షణాలు గడిచాయి.
ఒక్క అంగలో గట్టుని చేరుకున్న యిద్దరు వ్యక్తులూ ఏసిడ్ ని మొహంపై చల్లారు గురితప్పకుండా.
"అ....మ్మా...."
ఓ ఆర్తనాదంతో ముందుకు తూలిన ఆకారం గగుర్పాటుగా అరుస్తూ నేలపై పడ్డాడు.
చెట్లపై గుడ్లగూబలు ఉలిక్కిపడినట్టు రెక్కలు టపటపలాడిస్తుంటే జయప్రదంగా పని ముగించిన యిద్దరు వ్యక్తులూ వేగంగా పొదల్లోకి పరుగుతీశారు.
ఒక పథకంతో శంకూపై దెబ్బతీయాలనుకున్న రాజేందర్ ఆ సమీపంలో వుండి వుంటే జరిగిన అనర్దానికి గుండెలు బాదుకునేవాడే!
కానీ లేడు.
ఆక్రందనలు వింటూ ముందుకు పరుగెత్తుకొచ్చింది శంకూ!
నేలపై పడి రోధిస్తున్న రవిని చూస్తూ అదిరిపడ్డాడు.
ఏం జరిగిందో బోధపడటంలేదు.
కేవలం తనను కలుసుకోవాలని, తనతో ఓ ముఖ్యమైన విషయం చర్చించాలని రవి అటు వస్తుండగా తనకు బదులు బలయ్యాడని అతనికే తెలీదు.
"ఏమైంది? ఏమైంది రవీ?" ఆందోళనగా ఒడిలోకి తీసుకున్నాడు అతను.
ఆ గొంతు ఎవరిదో గుర్తించాడేమో దారుణంగా కంపించిపోతూ "నా కళ్ళు....నా కళ్ళల్లో ఏసిడ్ పోసేశారు..... నా కళ్ళు పోయాయ్....మంట...." కలలోలా అంటుంటే ఏం చేయాలో పాలుపోలేదు అతడికి.
అప్పటికే సమీపంలోని పొదల్లోనుంచి జనం అక్కడికి పరుగెత్తుకొచ్చారు.
క్షణాల్లో ఈ వార్త ఊరందరితోపాటు వీర్రాజుని చేరుకుంది.
పదిహేను నిమిషాల వ్యవధిలో అనకాపల్లిలోని ఓ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేయబడ్డాడు రవి.
అంతకన్నా వేగంగా ప్రముఖులయిన నేత్రవైద్య నిపుణులు రంగం లోకి రప్పించబడ్డారు.
అరగంట, గంట, గంటన్నర గడిచింది.
థియేటర్ బయట నిలబడివున్నాడు వీర్రాజు.
అతడికి సమీపంలో భార్య రాధమ్మ, కూతురు సావేరి ఒడార్పుని అభినయిస్తూ....రాజేందర్ ఓ మూల, చీకటిలో శంకూ, సురేంద్రలు భరింపశక్యంకాని టెన్షన్ తో చూస్తున్నారు థియేటర్ వేపుగా.
మరో పది నిమిషాలలో బయటికి వచ్చాడు ఐ స్పెషలిస్ట్.
అప్పటికిగానీ చలనంరాని వీర్రాజు "వాడి కళ్ళు...." ఆందోళనని అదిమిపెట్టుకుంటూ గొణుగుతున్నత్తుగా అడిగాడు.
శాసించడం మాత్రమే అలవాటైన ఓ వ్యక్తి యిప్పుడు తన కొడుకు విషయంలో తన ముందు చాలా మామూలు స్థాయికి చెందిన డాక్టర్ ని అర్ధింపుగా అడిగాడు "వాడి కళ్ళకేం ప్రమాదం లేదుగా?"
"ప్రస్తుతం ఏమీ చెప్పలేం!"
డాక్టర్ జవాబు ఓ విస్పోటనంలా వినిపించిందక్కడందరికీ.
"అవును వీర్రాజుగారూ! ఏసిడ్ మూలంగా కంటిపాపలు చాలాదాకా టర్నయిపోయినట్టు వుంది. కాబట్టి...."
"నో...." వీర్రాజుగారి కంఠం ఉద్విగ్నంగా పలికింది. "లేదు! వాడి కళ్ళకేమీ ప్రమాదం జరక్కూడదు. ఎంత డబ్బయినా సరే!"
"సమస్య డబ్బుతోనే అయితే ఆ మాట ఈపాటికే చెప్పేవాడిని" వీర్రాజుగారి స్థితిగతులను గురించి బాగా తెలిసిన ఆ డాక్టర్ మృదువుగా అన్నాడు. అది కూడా కాదు....డబ్బుతో చాలా చేయగలంగాని అన్నీ చేయలేము అన్న సత్యాన్ని పరోక్షంగా తెలియచేశాడు.
వెళ్ళబోతున్న డాక్టర్ ని చూస్తూ "వాడితో మాట్లాడాలి డాక్టర్ గారూ!" అన్నాడు రోషాన్ని అదిమిపెడుతూ.
ఎవరో తను తెలీని ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తన సార్వభౌమాధికారాన్ని ప్రస్నిస్తున్నాడు. సావేరి విషయంలో ప్రమాదాన్ని వూహిస్తుంటే ముందు తన కొడుకు బలైపోయాడు.
ఒక చిన్న ఆధారం కోసం రవిని నిలదీసి అడగాలనుంది...."చెప్పండి డాక్టర్! వాడితో మాట్లాడొచ్చా?"
"ప్రస్తుతం స్పృహలో లేడు"
"అదేం?"
"ఆ షాక్ మూలంగా స్పృహ కోల్పోయాడు."
"స్పృహ ఎప్పుడొస్తుంది?"
"చెప్పలేం"
వీర్రాజు పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
కసి, ఉక్రోషంతో అతడి రక్తం సలసలా కాగిపోతూంది.
బయటకు నడిచిన వీర్రాజు కనీసం భార్యతోనయినా చెప్పలేదు ఎక్కడి కెళుతున్నదీ!
రాజేందర్ అనుసరించాడు.
చాలాసేపటిదాకా తేలుకుట్టిన దొంగలా వుండిపోయిన రాజేందర్ బావతోపాటు యింటికి వచ్చేశాడు. తెల్లవార్లూ వీర్రాజు తాగుతూంటే ఆ రాత్రికి బుద్దిమంతుడైన సేవకుడిలా లిక్కర్ అందిస్తూనే వున్నాడు.