మరో అడుగు ముందుకేశాడు.
ఇక్కడ సావేరి తెలియకుండా చేసిన పొరపాటు తన శరీరాన్ని, చేతుల్ని, మనసులాగే శంకూకి అడ్డంగా ఉంచి నిలబడటం.
"సా....వే....రీ...." నిగ్రహం కోల్పోయిన వీర్రాజు హంటరు దెబ్బ తగిలితే ముందు సావేరి కథ ముగిసేదేమో.
కాని ఎవరో పట్టుకున్నారు.
రోషంగా పక్కకు తిరిగేసరికి జవహర్ నిలబడి వున్నాడు.
"ప్లీజ్...." వీర్రాజుగారి అహం ఎంత దెబ్బతిని వుంటుందీ అర్ధం చేసుకున్న జవహర్ అన్నాడు- "నాకు కొంత గడువిస్తే నేను కనుక్కుంటాను విడిచిపెట్టండి."
"మాస్టారూ!" ఇక్కడ ఆమాత్రం సహనమైనా వీర్రాజు పాటించాడూ అంటే జవహర్ పై వున్న అభిమానమే.
మీ స్థాయికి చెందినవాళ్ళు యిలా ఆవేశపడటం ఓ చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధించడంలాంటిది.
"కానీ అవతల నా కొడుకు...."
"స్పృహలోకొచ్చాడు. మీరు వెళితే అసలు విషయం చెబుతాడు."
క్షణంలో వీర్రాజు ఆవేశం చల్లారిపోయింది.
సరాసరి హాస్పిటల్ నుంచి వచ్చిన జవహర్ కొన్ని నిమిషాల క్రితమే రవితో మాట్లాడాడు. అది చెప్పాలని వచ్చేసరికి కూడా ఇలాంటి సంఘటన చూశాడు.
అదే ఆ క్షణంలో శంకూని రక్షించింది.
వీర్రాజు ఇక ఆలస్యం చేయలేదు.
వెంటనే కారులో బయలుదేరాడు.
రాజేందర్ యిదే అవకాశంగా తీసుకోవాలని తనూ అనుసరించాడు.
రివ్వున దూసుకుపోతున్న కారులో కూర్చున్న వీర్రాజు యింకా ఇందాకటి టెన్షన్ నుంచి తేరుకోలేదు.
"అర్ధమైంది బావా...."
ఓ చిన్న అస్త్రాన్ని పదునుగా సంధించాడు.
నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ అర్ధంకానట్టుగా చూశాడు వీర్రాజు.
"అదే.....శంకూకి, రవికి మధ్య స్పర్ధత కారణం....."
సాలోచనగా చూశాడు వీర్రాజు.
"ఎక్కడ సావేరి....ఎక్కడి శంకూ.....వాళ్ళ మధ్య ఇలాంటి బంధమేమిటి...అందుకే రవి తొలిసారి శంకూని అవమానించింది."
అస్పష్టంగా వున్న అనుమానం ధృవపడిపోయింది.
అక్కడ సావేరి ప్రవర్తించిన తీరుకి, ఇప్పుడు వింటున్న దానికి అన్వయించుకుంటే....
శంకూ ఇంకా బ్రతికే వుంటే చాలా అనర్ధం జరిగిపోయినట్టే అనుకున్నాడు.
అయిదు నిమిషాలలో హాస్పిటల్ కి చేరిన వీర్రాజు సరాసరి రవి గది లోకి దూసుకుపోయాడు.
"నాన్నా రవీ!" వీర్రాజు గొంతులో ఇలాంటి ఆర్ద్రత ఈమధ్య కాలంలో రావికీ అనుభవంలేదు. "నీకు కళ్ళొస్తాయి. వచ్చి తీరతాయి! చెప్పు.....నీకెవరిమీద అనుమానం వుంది?"
కళ్ళకున్న బాండేజ్ నీ, కాలి వివర్ణమయిన రవి మొహాన్నీ చూస్తూ నిభాయించుకోలేకపోతున్నాడు.
"చెప్పరా....ఇదంతా చేసింది ఆ శంకూగాడే కదూ?"
రవి జవాబు చెప్పలేదు.
రవి శంకూని ఎంత ద్వేషించేదీ రాజేందర్ కీ తెలుసు! అందుకే తొందర చేశాడు. "అప్పుడే శంకూగాడ్ని చెట్టుకు కట్టి మీ డాడీ ఒళ్ళు హూనం చేశాడ్రా....చెప్పెయ్.... మీ యిద్దరి మధ్యా కక్ష మూలంగానే ఏసిడ్ పోశాడని, దానికి సురేంద్ర సహకరించాడనీ చెప్పెయ్...."
రవి చెంపలు సన్నగా ప్రకంపిస్తున్నాయి.
"బాబూ రవీ...."
"డాడీ...." అప్పుడు నోరు తెరిచాడు. "మీరు శంకూని...."
"చావగొట్టాన్రా...."
"తొందరపడ్డారు డాడీ"
"ఏమిటీ?!" వీర్రాజు నిర్ఘాంతపోయాడు. రాజేందర్ పరిస్థితి ముళ్ళపై నిలబడినట్టుంది.
"అవును డాడీ! ఎవరో ఏసిడ్ పోయగానే నన్ను తొలిసారి ఒడిలోకి తీసుకుని రక్షించే ప్రయత్నం చేసింది శంకూ."
"లేదు" రాజేందర్ అరిచాడు. "పొదల మధ్య దాగుని తను ఏసిడ్ పోయించాక తనమీద అనుమానం రాకుండా యిలా నటించాడు?"
"స్టు....పి.....డ్...." అరిచాడు రవి.
అక్కడ క్షణకాలం కాలం స్థంభించింది.
"డాడీ...." రొప్పుతున్నాడు రవి. "శంకూపై ఏసిడ్ పోయించటానికి రాజేందర్ ప్రయత్నిస్తున్నాడని తెలిసి నేను శంకూని రక్షించాలని వెళ్ళాను. కానీ చీకటిలో నేనే శంకూ అనుకుని నాపైన పోశారు."
"అబద్దం" రాజేందర్ గొంతు ఖంగుమంది.
"యూ బ్లడీ పేరసైట్.... నా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి చెప్పమంటావా?" రవి కంఠం తీవ్రంగా పలికింది.
అవాక్కయి చూస్తున్నాడు వీర్రాజు రాజేందర్ ని.
ఒకవేళ రవి కళ్ళకి బేండేజ్ లేకపోఇయి వుంటే అమాంతం రాజేందర్ కంఠం పట్టుకుని నొక్కేవాడే....
కానీ అతడి స్థితి ఆ క్షణంలో అశక్తుడిగా మార్చింది.
"డాడీ! పాపపుణ్యాల గురించి మాట్లాడేంత తెలివితేటల్లేవు నాకు. ఇప్పుడు నేను ఈ స్థితికి రావటానికి కారణం అన్యాయంగా ముందు నేను శంకూని అవమానించటమే కారణం అయ్యుంటుంది."
రవి ఇలా ఇంత నిబ్బరంగా ఇలాంటి విశ్లేషణతో తండ్రితో ఏనాడూ మాట్లాడలేదు. ఒక్క సంఘటనతో రవి వయసు పెరిగి చాలా పెద్దరికం వచ్చినట్టు చెప్పుకుపోతున్నాడు. అది కూడా కాదు. శంకూని హింసించటం ఎంత పాపమో యింతకన్నా అదను రానట్టు హడావుడిగానయినా స్పష్టం చేస్తున్నాడు.
"ను....వ్వు....రె....స్టు....తీసుకో రవీ!" నిర్లిప్తంగా బయటికి నడవబోయిన తండ్రి కంఠాన్ని వింటూ తడుముకుంటూనే చేతులు పట్టుకున్నాడు.
"డాడీ...." రవి గొంతు పూడుకుపోతూంది. రెండు క్షణాల నిశ్శబ్ధము తర్వాత అన్నాడు. "తప్పు చేస్తే కళ్ళు పోతాయీ అని నా చిన్న తనంలో నాన్నమ్మ అంటుంటే....నవ్వుకునేవాడ్ని."
"ఇప్పుడిదంతా...."
"నన్ను మాట్లాడనీయండి డాడీ...ఏనాడూ పెదవి విప్పి మీతో ఏదీ చెప్పలేని పిరికివాడ్ని నేను. నా కళ్ళు రావాలీ అంటే...."
"చెప్పు...."
"తప్పు జరక్కూడదు."
అర్ధం కావడంలేదు వీర్రాజుకి.
ఇలాంటి స్థితిలో తండ్రి తనపై విరుచుకుపడలేదన్న ధైర్యమేమో నెమ్మదిగా అన్నాడు "సావేరి.... నా చెల్లెలు.... అర్హుడైన వ్యక్తికి భార్య కావాలి....బావలాంటి అనర్హుడికి కాదు."
రాజేందర్ స్థాణువై చూస్తున్నాడు.
"అవును డాడీ....నాకు కళ్ళు రావాలీ అంటే....వచ్చాక అంతా మంచే చూడగలుగుతున్నానూ అన్న సంతృప్తితో నేను బ్రతకాలీ అంటే సావేరి భర్త స్థానంలో రాజేందర్ వుండకూడదు. యస్ డాడీ" కమిలిన రవి చెంపలు మరింత మాగిపోతుంటే చూడలేనట్టు తల తిప్పుకున్న వీర్రాజు చేయి విడిపించుకుని నెమ్మదిగా బయటికి నడుస్తున్నాడు.
"డాడీ....శంకూని హింసించకండి. ఆ పాపంతో నా కళ్ళు పూర్తిగా పోయేట్టు నన్ను శపించకండి!"
అప్పటికే కారిడార్ దాటి హాస్పిటల్ ఆవరణలోని కారు దగ్గరికి నడిచిన వీర్రాజు మొత్తం కథ అర్ధం కావడంతో దూరంగా ఎటో చూస్తూ నిలబడిపోయాడు.