"నేను వస్తాను. మీ పాపకు ఇలా నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. నే నన్నమాటలుకూడా చెప్పండి." వెళ్ళడానికి రెండడుగులు వేశాడు.
"ప్రేమిక ఉందా, సుందరయ్య మామా?" అంటూ వచ్చింది ఒకామె. ఆమె చంకలో తలకి దెబ్బ తగిలించుకొన్న పిల్లవాడు ఉన్నాడు. బెదిరిపోయినట్టుగా ఏడుస్తున్నాడు. గాయంనుండి ధారగా కారుతూన్న రక్తం ఆ పిల్లవాడి చొక్కాను, తల్లిచీరనూ తడుపుతూంది: "రాయిమీద పడ్డాడు. కత్తిలా దిగబడింది రక్తం చూచేసరికి నాకేం తోచలేదు. ఇలా ఎత్తుకు వచ్చేశాను."
"ముందు గాయం అదిమి ఉంచమ్మా."
ప్రేమిక లోపలినుండి వచ్చింది ఈ గోలవిని. "రక్తం అంత కారిపోనిచ్చావేం జయక్కా? అరే! గాయం లోతుగా దిగిందే. హాస్పిటల్ కి తీసికెడితే కుట్లు వేస్తారు!" గిన్నెలో నీళ్ళు తెచ్చి తెల్లగుడ్డతో గాయం శుభ్రం చేసి దూది టించరులో తడిపి గాయంమీద ఉంచి కట్టుకట్టేసింది చకచకా. అలాంటి పనుల్లో ఆరితేరినట్టుగా చేతులు ఎంతో నేర్పుగా, చురుగ్గా కదిలాయి.
"డాక్టరు దగ్గరికి వెళ్ళడానికి తోడుకావాలీ? అబ్బా! ఏం ధైర్యస్తురాలివే, జయక్కా?...నాన్నా! స్టౌమీద డికాక్షన్ ఉంది. పాలుకలిపి ఆయనకిచ్చి మీరు తీసుకోండి!" ప్రేమిక ఆమెతో వెళ్ళిపోయింది.
"మా పాప అందరికీ ఆపద్భాంధవి. ఎవరికే ఆపదవచ్చినా 'ప్రేమికా! ప్రేమికా!' అని కలవరిస్తారు ఒక విధంగా ఆమె జన్మ సార్ధకమైందని నా ఉద్దేశ్యం. ముళ్ళ చెట్లలోపడిన పిల్లను తీసుకువచ్చి సమాజానికి ఉపయోగపడే మనిషిగా తయారు చేశానని గర్వపడుతుంటాను."
"గాలికి రాలిన పువ్వును చేతిలోకి తీసుకొని ఇంత చక్కటి వ్యక్తిత్వం దిద్దినమీరు నిజంగా అభినందనీయులు. చూడడానికి మీ జీవితం ఎంతో సామాన్యం! కాని, మీలో ఒక గొప్పవ్యక్తి దాగున్నాడనిపిస్తుంది. మీరు గర్వపడడం ఎంతో సమంజసం. మా గీతత్త ఒక లేడిపిల్లలాంటిది. ఆమె కడుపున పుట్టిన ఈ బిడ్డమాత్రం పులిపిల్ల అనిపించుకోదగింది." అని సెలవు తీసుకొన్నాడు విశాల్.
* * *
విశాల్ రాకకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నది గీతాభవాని.
వస్తూనే అలసటగా ఈజీ చెయిర్ లో శరీరం వాల్చి, "నీ కూతుర్ని చూసొచ్చాను, గీతత్తా." అన్నాడు విశాల్.
"మాట్లాడావా?"
"ఉహుఁ. మాట్లాడలేదు. ఆమె పెంపుడు తండ్రితో మాట్లాడాను. మరోసారి ఆ అమ్మాయితో మాట్లాడడానికి వస్తానని ఆయనతో చెప్పి వచ్చాను."
"నీ కోరికంతా ఆ అమ్మాయిని తీసుకువచ్చి నీ కప్పగించాలనే కదా? అదంత సులభంగా కనిపించడంలేదు. అయితే కష్టమని మాత్రం వదలను. ఏది కష్టసాధ్యమనిపిస్తుందో అది సాధించడంలోనే అద్భుతం ఉందనిపిస్తుంది! తప్పకుండా నీ కూతుర్ని గెలుచుకువచ్చి నీ కప్పగిస్తాను. కాని, ఇంత తొందరగా, హఠాత్తుగా కాదు! నాకు టైం కావాలి."
"ఎంత టైం కావాలి?"
"కార్యరంగంలో అడుగుపెడితే తప్ప చెప్పలేను. అవునూ! ఆమెను తీసుకువచ్చాక ఏం చేయాలని నీ ఆలోచన?"
"బొమ్మను చేసి ఆడుకొంటాను. సరేనా?" కోపంగా అంది. విశాల్ అంతదూరం వెళ్ళి ఏం మాట్లాడకుండా వచ్చాడని కినుకగా ఉంది. విశాల్ ఈ పని నెరవేరుస్తాడా. నాకెందుకులే అని ఊరుకొంటాడా అన్న భయం ఉంది. విశాల్ తనపని అలక్ష్యంచేస్తే ఇంకెవరిసాయం తీసుకోవాలి? తన నోటితో తనకథ ఇంకెందరితో చెప్పుకోవాలి?
"బొమ్మనిచేసి ఆడుకొంటావా?" గలగలా నవ్వాడు. ఆ నవ్వుకి ఈజీచెయిర్ క్రిందికి మీదికి ఊగింది. "ఆ పిల్ల చిన్నగా ఉన్నప్పుడు నీకా అదృష్టం లేకపోయింది. ఆమె ఆటపాటలన్నీ పెంపుడు తల్లిదండ్రులకే దక్కాయి. ఇప్పుడా లోటు తీర్చుకోవాలనుకొంటున్నావా? అదేం కుదరదు. ఆ పిల్ల ఎవరికీ ఆటబొమ్మకాదు. అందరినీ ఆడిస్తుందేగాని."
"మాట్లాడకపోయినా చాలా తెలుసుకువచ్చా నత్తా." రమణయ్యతో ప్రేమిక చేసినయుద్ధం, జయలక్ష్మి కొడుక్కి దెబ్బతగిలి ప్రేమిక కోసం పరిగెత్తుకురావడం, అంతా వివరంగా చెప్పాడు. చెప్పి అన్నాడు: "ఆమెను చూస్తే మండే దీపశిఖలా అనిపించింది. అబ్బా! ఏం తీవ్రత? ఏం పౌరుషం? టపీటపీమని ఎలా మాటలు విసురుతుందో? నిజం చెప్పొద్దూ? ఆమెను పలకరించాలంటే, నన్ను పరిచయం చేసుకోవాలంటే భయం వేసింది."
"అంత భయపడేవాడివి! ఆమెను గెలుచుకువచ్చి నా కప్పగిస్తానని ఎందుకు ఆశ పెడుతున్నావు?" కొంచెం నిష్టూరంగా అంది గీతాభవాని.
"నా శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. నేనొక మాట ఇచ్చానంటే దానికోసం ప్రాణం పణం పెట్టి పోరాడతాను. తెలుసా?"
గీతాభవాని కళ్ళలో ఆశ నక్షత్రంలా తళుక్కుమంది. "నిజమా? వాగ్దానమేనా? నిజంగా నా కధ బయటికి రాకుండా నా కూతుర్ని తెచ్చి నా కప్పగించావా...నీ రుణం నే నుంచుకోను తెలుసా?" అంది కొంచెం ఉద్వేగస్వరంతో.
"రుణం ఉంచుకోవా? ఎలా? ఏమిచ్చి తీర్చుకొంటావు?"
"ఇప్పుడు చెప్పను. ముందు నా కూతుర్ని నా కప్పగించు!"