ఉదయం ఎనిమిది గంటలప్పుడు గోపీకృష్ణ స్నేహితుడొకడు చెమటలు క్రక్కుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. అప్పటికి గోపీకృష్ణ డ్రెస్ చేసుకుని బయటకు బయల్దేర బోతున్నాడు.
"గురూ ! కొంపమునిగింది" అన్నాడు వగరుస్తూ.
"ఏం జరిగిందిరా ?" అన్నాడు గోపీకృష్ణ తొట్రుపాటు పడకుండా.
"అస్మిత కిరసనాయిలు పోసుకుని వళ్ళు కాల్చేసుకుంది."
గోపీకృష్ణ గుండె గుభేల్ మంది. మొహం రక్తం లేనట్లు పాలిపోయింది.
"అదేమిరా ?" అన్నాడు వొణికే కంఠంతో.
"అవును. రాత్రి పదిగంటలకు అంతా పడుకున్నాక వంటినిండా కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకున్నదట. వంటింట్లోంచి కేకలు వినిపిస్తే అంతా పరిగెత్తి వెళ్ళి చూశారట. అప్పటికే చాలాభాగం కాలిపోయిందట."
"ఇప్పుడెలా ... వుంది ?"
"గవర్నమెంట్ హాస్పటల్లో చేర్చారు. చాలా సీరియస్ గా ఉంది. బ్రతకడానికి ఛాన్సెస్ ఏవీ లేవంటున్నారు."
గోపీకృష్ణ గుండె గబగబా కొట్టుకుంటోంది. గొంతు తడారి పోతోంది.
"ఇలా ఎందుకు జరిగి వుంటుంది?" అన్నాడు కష్టంమీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని.
"బహుశా నీ కోసమే అయివుంటుంది."
"నా కోసమా ?"
"అవును. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసింది కదా, మీరిద్దరూ కలుసుకోవడం తన పేరెంట్స్ కిష్టంలేదు. అందుకని ..."
"గవర్నమెంటు హాస్పటల్లో చేర్చారు కాబట్టి _ పోలీసులు నీకోసం వస్తారు."
గోపీకృష్ణకు ముచ్చెమటలు పోశాయి. కళ్ళముందు తన కోసం తరుముకుంటూ పోలీసులు వస్తున్న దృశ్యం కదలాడింది.
"అస్మిత ...అస్మిత బ్రతుకుతుందా ?" అన్నాడు తడబడే కంఠంతో.
చెప్పానుగా, కండిషన్ చాలా సీరియస్ గా వుందని. బ్రతకడం కష్టమంటున్నారు."
కొంతసేపు గోపీకృష్ణ మాట్లాడకుండా వుండిపోయాడు, షాక్ లోకి వెళ్ళిపోయాడు. 'ఒకవేళ అస్మిత చనిపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు, పోలీసులు _ వీళ్ళబారినుంచి ఎలా తప్పించుకోవాలి?' ఇవే ఆలోచనలతన్ని చుట్టుముట్టాయి.
తర్వాత అతన్లోని మానవత్వం కొంతవరకూ మేల్కొని అస్మిత గురించి ఆలోచించాడు. పిచ్చిపిల్ల. ఎందుకలా తొందరపడింది! ఇప్పుడే మంత ప్రమాదం ముంచుకొచ్చిందని! ఆ అమ్మాయికి యిప్పుడప్పుడే పెళ్ళి చేసే ఆలోచనలో తల్లిదండ్రులు లేరు. కాకపోతే తనని కలుసుకోకుండా కట్టడి చేశారు. కలుసుకోవాలంటే ఎన్నో ఉపాయాలుంటాయి. అంతగా బెదిరిపోయి ఆత్మహత్యకు ప్రయత్నించాల్సిన అవసరమేమొచ్చిందిప్పుడు ?
పాపం! చావుబ్రతుకులమధ్య ఎలా కొట్టుకుంటోందో !
అతనికి అస్మితను చూడాలనిపించింది. "ప్రకాష్, మనం హాస్పిటల్ కెళ్ళి తనని చూడవచ్చా?" అన్నాడు.
"వెళ్ళవచ్చు.బర్న్స్ వార్డ్ లో వుంచారు. కాకపోతే వాళ్ళ వాళ్ళంతా అక్కడ వుంటారు."
"దూరంనుంచి చూసి వచ్చేద్దాం" అన్నాడు గోపీకృష్ణ ధైర్యం తెచ్చుకుని.
ఇద్దరూ కలిసి హాస్పటల్ కి వెళ్ళారు.
వార్డులో ఓ బెడ్ మీద అస్మిత పడుకోబెట్టబడి వుంది. తెలివిలో లేదు. ముఖం, శరీరంలో చాలా భాగం కాలిపోయి, మనిషి గుర్తుపట్టటానికి వీల్లేకుండా వుంది. వెయిన్స్ దొరకటం కష్టమైంది. పాదాల దగ్గర యిరువైపులా ఓపెన్ మెథడ్ లో వెయిన్ కట్ చెయ్యబడి ఒకవైపు సెలైన్, రెండో వైపు బ్లడ్ ఫ్లో అవుతున్నాయి. ఇంచుమించు యిరవై ముప్పయి మంది మనుషులు ఆమె కుటుంబానికి చెందినవాళ్ళయి వుంటారు _ వార్డు బయట గుమిగూడి వున్నారు.
వాళ్ళ కంటపడకుండా గోపీకృష్ణ ఓ ప్రక్కన నిలబడి చాలాసేపు ఈ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయాడు.
రాను రానూ అతని హృదయం కలచివేసినట్లవుతోంది. కళ్ళలోకి నీళ్ళు ఉబుకుతున్నాయి.