"అమ్మా! ఇవాళ నేను నీతోనూ, నాన్నగారితోనూ కలిసి తింటాను."
సాధ్యమయినంత అమాయకంగా ముఖం పెట్టి అంటోన్న సుశీలను విస్తుపోయి చూసింది లలిత.
సాంబశివంతో కలిసి కూచుని ఏనాడూ భోజనం చెయ్యలేదు లలిత,__చివరక్జు పెళ్ళయిన కొత్తలోకూడా ఆ సంగతి ఇంట్లో అందరికీ తెలుసు. సుశీల ఇప్పుడెందుకిలా మాట్లాడాలి? అంత పసిపిల్ల కాదే!
చివాలున అక్కడినుంచి లేచిపోయింది. సుశీల గుండెలు దడదడ కొట్టుకున్నాయి. తను తలపెట్టిన కార్యం సామాన్యమైనది కాదు. పిల్లిలా తల్లిదగ్గిర చేరింది. ఎర్రగా కందిపోయిన ముఖాన్ని పుస్తకంలో దాచుకుంది లలిత.
"కోపం వచ్చిందా అమ్మా?" అంది జాలిగా సుశీల.
సుశీల అలా జాలిగా మాట్లాడితే లలిత కోపం నిలవదు.
"నాకేం కోపం?" అంది దెప్పుతున్నట్లుగా.
సుశీల లోలోపల చాలా బాధపడింది.
తండ్రి అంటే తనకు ప్రేమ ఉంది. తండ్రికి తన మీధ ఉన్న ప్రేమ తలుచుకుని గర్వమూ ఉంది. కాని తన ఎదురుగా ఉన్న -రూపమూ, చదువూ, సంస్కారము అన్నీ ఉన్న ఆ ఉత్తమురాలికి భర్తగా ఊహించుకుంటే.......
"ఛీ! ఛీ! నేనిలా ఆలోచించకూడదు" అనుకుంది సుశీల.
"అమ్మా! నీ చేతులలో నేను ఇంతదాన్ని అయ్యాను. చిన్నప్పుడు నువ్వు నాకు మాటలు నేర్పించావు. వాటి సాయంతో నేనింకెన్నో మాటలు నేర్చుకున్నాను. నీతో కొంచెం కూతురిగా కాక స్నేహితురాలిలా మాట్లాడాలని ఉంది."
ఆశ్చర్యంగా చూసింది లలిత.
తల్లి అంగీకారంకోసం ఆగకుండానే మొదలుపెట్టింది సుశీల.
"ద్వేషంతో, కసితో మనసు మరిగించుకుంటూ బ్రతికేవాళ్ళు కొందరుంటారమ్మా! నువ్వు ఆ జాతికి చెందిన దానివి కావు. మనసునిండా ప్రేమ నింపుకొని అది చుట్టు పక్కలవాళ్ళకి పంచి ఇస్తేనేకాని నువ్వు బ్రతకలేవు. నువ్వు క్షమించాలమ్మా! నీకోసమే. నీమీది ప్రేమతోనే నిన్ను క్షమించమని బ్రతిమాలుతున్నాను. నీ పెదవులు చిరునవ్వు నవ్వినా, ఆ వెనుక ఉన్న విషాదం సహించలేక పోతున్నాను. లోకంలో చాలా తక్కువమందికి లభించే విజ్ఞానమూ, సంస్కారమూ, నిన్ను నువ్వు దహించుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతోంటే భరించలేక పోతున్నానమ్మా!"
సుశీల కళ్ళు చెమ్మగిల్లాయి___
లలిత నివ్వెరపోయింది. సుశీల స్పష్టంగా చెప్పకపోయినా ఏ విషయం మాట్లాడుతుందో లలితకు అర్ధమయింది. ఇంత ఎదిగిందా తన సుశీల! తన చిన్నారి పాప!
"అమ్మా! ఎవరి ముఖంచూసి నీ సుఖం నువ్వు చూసుకోకుండా అలిసిపోయావో ఆ నా కోసమే ఇప్పుడు నువ్వు క్షమించాలమ్మా! నీ మనసు ఎంత నలుగుతుందో నేను ఊహించలేనని అనుకోకు, నలగటం ఎలాగూ తప్పనప్పుడు__ బ్రతుకుతో రాజీపడుతూ నలగ నీయటమే మేలుకదూ!"
లలిత సుశీలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని సుశీల చెమ్మగిల్లిన కళ్ళను తుడిచింది.
ఆరోజు తనతోపాటు భోజనానికి కూచున్న సుశీలనూ లలితనూ చూసి ఆశ్చర్యపోయాడు సాంబశివం.
ఈ రకంగా ఉంటే బాగుండునని అతడు ఎంతగా కోరుకున్నా పెళ్ళయిన ఇన్ని సంవత్సరాలలో ఎన్నడూ ఇలా జరుగలేదు.
"వాట్ ఏ వండర్!" అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ లలితను చూసి.
లలిత మాట్లాడలేదు. సుశీల కల్పించుకుని "ఇందులో ఆశ్చర్యమేముంది నాన్నా!" అంది దబాయింపుగా.....
సాంబశివం తగ్గలేదు.
"నువ్వు నాతో కూచోవటంలో ఆశ్చర్యంలేదు సుశీ! శ్రీమతి లలితాదేవిగారు కూర్చోవటమే విశేషం! ఈ దీనుడిమీద తమకు ఇంత అనుగ్రహం ఎందుకు కలిగిందండీ! ఏంకావాలి?"
లలిత కళ్ళెత్తి సుశీలను చూసింది. సుశీల చటుక్కున తల దించుకుంది. ఆ దించివున్న కళ్ళనుండి రెండు నీటి బిందువులు జారిపడ్డాయి. అవి చూశాకకాని వాతావరణంలో ఏదో ఉందని అర్ధం కాలేదు సాంబశివానికి.
"ఏమిటది సుశీ? ఇప్పుడు నేనేం అన్నానని? ఛ! ఛ! నేను___అసలు__తిను."
ఏదో ఒకదానికొకటి పొందకుండా అన్నాడు. ఆ తరువాత యెవరూ మాట్లాడలేదు. లలిత సరిగ్గా తినలేకపోయింది. అది చూసి సుశీలా తినలేదు. సంబసివం సాధారణంగా ఏ విషయానికీ కలతపడడు. కానీ సుశీల కన్నీళ్లు......తన మాటల కారణంగా సుశీల సరిగ్గా తినకపోవటమూ అతనినీ కలవరపరిచింది. అతనూ ఏమీ తినలేకపోయాడు.
సుశీలకు మొదటినుండీ తండ్రిదగ్గర చాలా గారాబం. తల్లి దగ్గిర ఏదైనా మాట్లాడటానికి భయపడుతుంది. కాని, తండ్రి దగ్గిర యెలా అంటే అలా మాట్లాడుతుంది.
"నీ పద్దతి నాకు నచ్చలేదు నాన్నా!" అంది.
సుశీల అలా సంజాయిషీ అడుగుతున్నట్లు మాట్లాడినా ముద్దుగానే ఉంటుంది సాంబశివానికి......
"ఏమిటమ్మా?" అన్నాడు వాత్సల్యంతో......
"నిన్న అమ్మతో యెందుకలా మాట్లాడావు?" అంది.