Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 41


    "చక్రివారి రెడీమేడ్ దుస్తులు! ఇంత తెల్లగా ఎలా వచ్చాయో తెలుసా? మురికి పట్టిన పాతబట్టలు పారేసి చక్రివారి రెడీమేడ్ దుస్తులు కొన్నందువల్ల! మీరూ నేడే చక్రివారి దుస్తులు కొనండి! మొఖం పగిలే తెలుపుతో తిరగండి!"
    "సరే తిరుగుతాం- మీరింక మమ్మల్ని వదుల్తే..."
    అతను చిరునవ్వుతో మా చొక్కాలమీద చక్రివారి స్టిక్కర్ లు అంటించి "థాంక్యూ" అంటూ వెళ్ళిపోయాడు.
    ఆ స్టిక్కర్లు తీసేయడానికి మేము ఆ రోడ్ పక్కనే గంటసేపు కూర్చుని తన్నుకున్నా రాలేదు.
    చేసేదిలేక అలాగే బస్ స్టాప్ కెళ్ళి నిలబడ్డాం. బస్ స్టాప్ లో అంతవరకూ జెంటిల్మన్ లాగా నిలబడ్డ ఓ వ్యక్తి గట్టిగా విరగబడి నవ్వాడు.
    అందరం ఇదేదో హిస్టీరియా  బాపతేమో అనుకున్నాంగానీ కాదంట!
    "నేను మామూలు మనిషనుకుంటున్నారు కదా! కాదండీ! ప్రఖ్యాత రచయిత రామజోగ్ ని 'భావన' వారపత్రికలో రాసే సీరియల్ నాదే! ఆ సీరియల్ మీధమీరు రాసే ఓ మాంచి ఉత్తరానికి నేను 196 ఫోజులతో కనిపించే వీడియో కాసేట్ ఉచితం" అన్నాడు. ఆ రచయితని వదిలించుకుని పెళ్ళికి వెళ్ళాం.
    పెళ్ళిపందిరంతా సెంటుకంపెనీ వాళ్ళ పోస్టర్లతో నిండివుంది.
    పెళ్ళికూతురిని వేదికమీద చూసి ఉలిక్కిపడ్డాం! ఆమె పక్కనే ఓ బోర్డు తగిలించి ఉంది.
    "ఈమె అంబికావారి పెళ్ళికూతురు. చూడండి! ఎంత గొప్ప చీరలో! ఆహా! ఈమె ధరించిన దుస్తులన్నీ అంబికా సిల్క్ ఎంపోరియంలో సందర్శించండి- ఇట్లు - అంబికాసిల్క్ ఎంపోరియం- బాలక్ స్ట్రీట్ - కోఠి-" వెంటనే మేము సుదర్శన్ ని పక్కకు పిలిచాం.
    "ఇదేమిటి ఆ బోర్డు...."
    "ఇవాళ్రేపు అందరూ ఇట్లాగే చేస్తున్నార్లే! ఆ బోర్డు పెళ్ళి రోజంతా అలా ఉన్నందుకు గాను ఆ సిల్క్ ఎంపోరియం వాళ్ళు ఓ పట్టుచీర ఫ్రీగా ఇస్తున్నారు. కరువు రోజుల్లో అదీ ఓ లాభమే కదా?" మరి కాసేపట్లో పెళ్ళికొడుకుని తీసుకొచ్చారు. అతని నోట్లో రెండుగజాల పొడుగున్న చుట్ట ఉంది. గుప్పుగుప్పున పొగ వదులుతున్నాడతను. నెత్తిమీద మెరుస్తోన్న కిరీటం ఒకటి! దానిమీద రంగురంగులతో మెరుస్తోన్న అక్షరాలు!
    "రాబందు మార్క్ చుట్టల పెళ్ళికొడుకు! పెళ్ళినాటిరాత్రి ప్రతి పెళ్ళికొడుక్కి ఆనందం కలిగించేవి రెండే రెండు. అందమైన పెళ్ళికూతురు, రాబందు మార్క్ వారి పొడుగాటి కింగ్ సైజ్ చుట్ట!"
    "మరి పెళ్ళికొడుక్కి అది తగిలించుకున్నందుకు ఆ చుట్టల కంపెనీ వాళ్ళు ఏమిస్తారు?" అడిగాడు రెడ్డి అనుమానంగా.
    "ఓ సూట్ బహుకరిస్తారు! ఈ కరువు రోజుల్లో మరి అది కొనాలంటే కష్టమే కదా" అన్నాడు సుదర్శనం.
    ఈలోగా ఓ పెద్దమనిషి వేదికమీద కొచ్చి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మధ్య నిలబడి మైక్ లొ మాట్లాడాడు. "ఈ నూతన దంపతుల ఫస్ట్ నైట్ ని మా ఎయిడ్స్ నిరోధక సంస్థ సమర్పిస్తోంది. నేడే మీరంతా కూడా హెచ్ ఐ వి పరీక్షలు చేయించుకోండి! భార్యలు, భర్తలు పరాయివ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఫరవాలేదు. కండోమ్స్ వాడండి- నో ప్రాబ్లెమ్- నేడే ఎయిడ్స్ నిర్మూలన దినం పాటించండి" మాకు మతిపోయింది.
    అక్కడినుంచీ మా కాలనీ కెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలా అని డయిరీ చూశాడు శాయీరామ్. టెలివిజన్ కంపెనీల బస్ ఎక్కాలని రాసి ఉందందులో.
    అరగంటసేపు ఎదుర్చూసినా టెలివిజన్ కాదుగదా రేడియో బస్ కూడా రాలేదు. ఇక లాభంలేదని ఆటో ఎక్కాం నలుగురం- కొంత ఎక్ స్ట్రా చార్జ్ ఇచ్చేట్లు మాట్లాడి.
    కొంతదూరం వెళ్ళాక ఆటోడ్రైవర్ వెనక్కు తిరిగి "సుఖమైన బసకూ సొంత ఇంటి వసతులకూ- హోటల్ ఛత్రపతిలోనే దిగండి! అనురాగంతో మిమ్మల్ని సేవిస్తుంది హోటల్ ఛత్రపతి" అన్నాడు చిరునవ్వుతో.
    మాకేం అర్ధం కాలేదు. ఏదో చెప్పబోయి ఏదో చెప్పాడేమోలే అని సరిపెట్టుకున్నాం.
    ఇంకాస్త దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కు తిరిగి మళ్ళీ అదే మాట్లాడాడు.
    "వీడెవడో పిచ్చాడులాగున్నాడు! మనం ఆటోదూకి పారిపోవడం మంచిది" అన్నాడు రంగారెడ్డి అనుమానంగా.
    ఎలాగోలాప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నాం కాలనీ చేరేవరకూ! కాలనీలో దిగి చార్జి చెల్లించగానే మళ్ళీ మొదలు పెట్టాడువాడు. "సుఖమైన బసకూ సొంత ఇంటి వసతులకూ - హోటల్ చత్రపతిలోనే దిగండి! అనురాగంతో మిమ్మల్ని సేవిస్తుంది హోటల్ ఛత్రపతి" అన్నాడు మళ్ళీ!
    "ఆ హోటల్ పేరెందుకు చెప్తున్నావ్?" అన్నాడు రెడ్డి అనుమానంగా.
    "అలా చెప్తే వాళ్ళు నాకు డబ్బు ఇస్తారండీ! ప్రతి పాసింజర్ కి పబ్లిసిటీ చేస్తూండాలి నేను. మర్చిపోకండి! అనురాగంతో మిమ్మల్ని సేవిస్తుంది హోటల్ ఛత్రపతి" అంటూ కాలనీ దగ్గర ఆపి మీటర్ ఛార్జీ మీద ఎక్ స్ట్రా తీసుకుని వెళ్ళిపోయాడతను.
    మేము ఎవరింటికి వాళ్ళు చేరుకున్నాం. మా ఇంటి ముందు తలుపులకు అడ్డంగా పెద్దబోర్డులు కనిపించినాయి. వాటిమీద పెద్ద తాటికాయంత అక్షరాలు. అక్షరాల మధ్యలో నుంచి ఇంట్లో కెళ్ళడానికి చిన్న తలుపులు రెండు కనబడుతున్నాయి.
    "నువేగా గాస్ స్టవ్ లు- కూరగాయాలను కసిగా తరిగే ఏకైక గాస్ స్టవ్ నువేగా! "గా" అనే అక్షరాలు మధ్య నుంచి దూరి వెళ్ళిలోపలకు వెళ్ళేసరికి మా ఆవిడ ఆనందంగా గులాబ్ జామ్ తింటోంది. "బయట అడ్డంగా ఆ బోర్డు ఎవరు పెట్టారు?" చిరాకుగా అడిగాను.
    "అయ్యో! అదేంటండీ! వాళ్ళ బోర్డులు మన కాలనీలో అందరిళ్ళకు ముందు తగిలించారుగా!"
    "అదేనేనడిగేది! ఎందుకు పెట్టారు అని"
    "అవి అలా పెట్టనిచ్చినందులకు మనకు పెద్ద గులాబ్ జామ్ పాకెట్ ఉచితంగా ఇచ్చారండీ! అలా నెలకొకటి ఇస్తారట! పిల్లలు ఆనందంగా గులాబ్ జామ్ తింటుంటే చూసి ఏమీమాట్లాడలేక పోయాను. ఆ బోర్డులో నుంచి 'గా' అనే అక్షరం మధ్య నుంచే వెళ్ళటం, రెండు మూడుసార్లు ప్రాక్టీస్ చేశాను!
    రాత్రి పది గంటలకు కాలనీ బయట ఎవరో అరుస్తూండటం వినిపించి కిటికీ తెరిచి చూశాను! శ్యామల్రావ్ గారూ, వాళ్ళబ్బాయితో సహా కాలనీ అంతా తిరుగుతూ "రాత్రిళ్ళు పడుకునే ముందు- మీరందరూ "వేపిక్స్" సేవించండి. ఆలసటను పోగొట్టి, ఆతృతను లేవగొడుతుంది. మర్చిపోకండి "వేపిక్స్-వేపిక్స్-" అని అరుస్తున్నారు.
    నాకు అర్ధమయింది. ఆ కంపెనీ వారు శ్యామల్రావ్ ద్వారా చేయిస్తున్న మరో పబ్లిసిటీ వ్యవహారం ఇది. నిద్రపోవడానికి ఉపక్రమించి లైటార్పబోయేసరికి ఎదురుగ్గా గోడమీద పెద్దవెల్తురు కనిపించి అదిరిపడి లేచి కూర్చున్నాను.
    "నిరోధ్ వాడండి! సర్వకాల సర్వావస్తలయందు ఉపయోగపడుతుంది నిరోధ్!" అని చెప్తోంది అమ్మాయి గోడమీద నిలబడి. ఆ తర్వాత ఠక్కున మాయమయిపోయింది.
    'ఆ తరువాత నేను నిద్ర కుపక్రమించాను అర్దరాత్రి మా ఆవిడ నన్ను భయం భయంగా లేపింది. లేచి "ఏమిటి సంగతి" అని అడిగాను.
    "చదవండి! వెంటనే చదవండి! హ్యూమరాలజీ! మీ జీర్ణశక్తి అభివృద్దికి హ్యూమరాలజీ" అంటున్నారండీ ఎవరో అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.
    
                                *    *    *

 Previous Page Next Page