Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 42


    రాజాచంద్రగదిలోకి వెళ్ళాడు. విశారద వాలు కుర్చీలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని పడుకుని ఉంది.
    
    "విశారదా!"
    
    ఆమె కళ్ళు తెరిచింది.
    
    "అన్నట్లు నువ్వు విశాఖపట్టణంలో ఉన్నప్పుడు ఆయన్నెప్పుడయినా చూశావా? అతని బాల్యమంతా అక్కడే గడిచిందని చెప్పాడులే."
    
    ఆమె అతని మొహంలోకి చూసి ఆశ్చర్యంగా చూసింది. అతను చూపులు పక్కకి తిప్పుకుందామని అనుకుని కూడా నిగ్రహించుకుని ఉండిపోయాడు.
    
    "మీకేం జరిగింది?"
    
    "ఊఁ."
    
    "మీ మైండ్ సరిగ్గా వుందా?"
    
    రాజాచంద్ర ఉలికిపాటుతో ఆమె వంక చూశాడు.
    
    "అతని ఎడ్యుకేషనంతా బాంబేలో జరిగిందనీ, అసలు చిన్నప్పుడెప్పుడూ విశాఖపట్నం చూడలేదనీ మీతో అంటుంటే వినిపించింది. అసలు మీకేం జరిగింది? ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఎందుకిలా చిన్న చిన్న అబద్దాలు చెబుతున్నారు? మన ఇద్దరి మధ్య అబద్దాలు.... ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదండీ ఏమిటండీ? ఎందుకిలా జరుగుతుంది మన మధ్య? అసలు మీ మనసులో ఏముంది?"
    
    "ఏమీ లేదు ఏమీ లేదు నువ్వనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు."
    
    "ఏమీ లేదా?"
    
    అతను జవాబు చెప్పలేదు. అయిదు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి.
    
    "నే నిప్పుడే అలా వెళ్ళి వస్తాను" అంటూ అతను లేచి బయటకు వెళ్ళిపోయాడు.
    
    అతను కారు స్టార్ట్ చెయ్యటం, గేటు దాటి రోడ్డుమీదకు వెళ్ళిపోవటం ఆమెకు వినబడుతూనే ఉంది. అయినా కూచున్న చోటునుంచి కదల్లేదు.
    
                                          * * *
    
    "విజ్ఞత నిద్రపోతుందా?" అనడిగాడాయన రాత్రి పదకొండు గంటలవేళ.
    
    "పడుకుంది" అన్నది భ్రమరాంబగారు.
    
    "మేలుకుని ఉందా? నిద్రపోతుందా?"
    
    "చూసి వస్తానుండండీ" అంటూ ఆమె లోపలికి వెళ్ళి తిరిగి రెండు నిమిషాల్లో వచ్చి మంచి నిద్రలో ఉంది" అని చెప్పింది.
    
    "కూచో! నీతో కొంచెం మాట్లాడాలి."
    
    ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూచుంది.
    
    "మనం ఈ ఊరు రావటం పొరపాటు చేశామేమోననిపిస్తుంది."
    
    "ఏం?"
    
    "విజ్ఞత ద్వారా రాజాచంద్ర అనే వ్యక్తి పరిచయమయ్యారు గుర్తుందా? నాకంటే ముందు నువ్వే అతన్ని చూశావు."
    
    "అవును."
    
    "ఇవేళ అతని భార్యను చూశాను. విశారద ఆమె పేరు. క్షణంసేపు నాకు ఊపిరాడలేదంటే నమ్ము. అచ్చం విజ్ఞత ఆమె నోట్లోంచి ఊడిపడ్డట్లు కనిపించింది. మొన్న విజ్ఞత ఓ నాటకంలో యాక్ట్ చేస్తూ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ మేకప్ చేసుకుంది చూశావా? అచ్చం అలాగే.... ఆ కళ్ళు మొహం....ఉచ్చారణ..."
    
    భ్రమరాంబగారి మొహం రక్తం లేనట్లు పాలిపోయింది.
    
    "అంతే కాదు రాజాచంద్ర ఏదో ఉద్దేశంతోనే అనుమానంతోనే వాళ్ళింటికీ తీసుకెళ్ళాడు. కావాలనే అతని మిసెస్ కు అప్రిచయం చేశాడు. ఆమె రూపాన్ని నేను గమనిస్తున్నప్పుడు నా ఫీలింగ్స్ కనిపెట్టడానికి నన్ను చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నాడు. నేనెందుకో అతని ధోరణి ముందుగానే అనుమానించినా ఫీలింగ్స్ మాత్రం బయట పడకుండా జాగ్రత్తపడ్డాను."
    
    "ఇప్పుడేం చేద్దాం?"
    
    "అదే ఆలోచిస్తున్నాను."
    
    "లేని పోని సమస్యలలో ఇరుక్కుంటావేమో, ఈ ఊరునుంచి వెళ్ళిపోతే?"
    
    కాంట్రాక్టులకోసం పది లక్షలదాకా పెట్టుబడి పెట్టాను. ఆ వర్క్ పూర్తయ్యేదాకా ఇక్కడ్నుంచి కదలడం కష్టం."
    
    "పోనీ విజ్ఞతను ఏదో మిషమీద ఇక్కడ్నుంచి పంపించేస్తే?"
    
    "అది మంచి ఆలోచనే" హాల్లో ఒక పక్కన ఉన్న ఫోన్ మోగింది.
    
    "ఇంత రాత్రివేళ ఎవరు?" అనుకుంటూ ఆయన లేచివెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు.
    
    "హలో..."
    
    అవతల్నుంచి ఏదోగొంతు అతని పేరడిగారు.
    
    "నేనే మాట్లాడుతున్నాను."
    
    "నేను తారాచంద్రను."
    
    "తారాచంద్రా? అంటే?"
    
    "నా పేరెప్పుడూ వినలేదా?"
    
    "వినలేదు."
    
    "ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా."
    
    "మీరెవరో ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలీదు. సమాజంలో ఒక స్థానంలో ఉన్న వ్యక్తిమీద ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించటం మంచిది కాదు."
    
    "సమాజంలో స్థానంలో ఉంటే చీప్ ట్రిక్స్ ప్రయోగించటానికి అతీతులా?"
    
    "అలాంటివాళ్ళతో కొంత సంస్కారంగా ప్రవర్తించాలి."
    
    "సంస్కారం అనే మాట ప్రపంచంలోంచే తొలగిపోయింది బ్రదర్. దాన్ని గురించి అట్టే చించుకోవటం మంచిది కాదు."
    
    "అసలు మీరెవరు?"
    
    "చెప్పానుగా తారాచంద్రనని."
    
    "తారాచంద్ర అంటే?"
    
    "ముందు ముందు తెలుస్తుంది."
    
    "అయితే అప్పుడే చెయ్యొచ్చుగా ఇప్పట్నుంచి దేనికి?"

 Previous Page Next Page