వినూత్న నిరుత్తరురాలయి చెంప సవరించుకుంటూ నిలబడిపోయింది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
రాజాచంద్ర బెడ్ రూంలోంచి ఇవతల కొచ్చి నిశ్చేష్టుడై చూస్తున్నాడు.
రాఖేష్, మనోజ్ కూడా తమ గదిలోంచి ఇవతలికొచ్చి నిలబడ్డారు.
వినూత్న ఒక్క నిమిషమలా నిలబడి, తరువాత విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయి లోపల తలుపు గడియ పెట్టేసుకుంది.
"విశారదా!" అంటూ దగ్గర కోచహాడు రాజాచంద్ర.
"ఎందుకలా చేశావు?"
"చెయ్యాల్సి వచ్చింది."
"వినూత్న లోపలి తలుపు గడియ పెట్టేసుకుంది. ఏమన్నా..."
"ఏమన్నా..."
"అఘాయిత్యం..."
"ఏం చేస్తే..."
"విశారదా! నువ్వు చాలా కోపంలో ఉన్నావు."
"ఏమండీ! పిల్లలు తప్పు చేసినా, ఎంత దుడుకుగా ప్రవర్తిస్తున్నా- వాళ్ళకి కోపమొస్తుందని, వాళ్ళేదయినా అఘాయిత్యం చేస్తారనీ ఎన్నాళ్ళపాటు బహయప్డుతూ రాజీపడుతూ ఉంటామండీ? దేర్ ఈజ్ సమ్ థింగ్ విత్ హర్. ఇంకా నేను టాలరేట్ చెయ్యలేకపోతున్నాను."
అతను విశారద కళ్ళలోకి చూశాడు. గతంలో ఆమెను ఎన్నోసార్లు బాధతో ఉన్నప్పుడు చూశాడు. ఆవేశంలో ఉన్నప్పుడు చూశాడు. ఇంత ఆవేశంగా ఎప్పుడూ కనిపించలేదు. ఆ సమయంలో ఆమెను చూస్తే భయమేసింది.
13
మర్నాడు పొద్దుట ఏడు గంటలకు వినూత్న తలుపు తీసుకుని ఇవతల కొచ్చింది. ఎవరితోనూ మాట్లాడలేదు. చాలా సీరియస్ గా ఉంది.
మౌనంగా తల్లి ఇచ్చిన కాఫీ తీసుకొని మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది.
తన కుటుంబం ఏదో ఒడుదుడుకుల్లో పడబోతోంది. రాజాచంద్రకు అర్ధమై చాలా అసహనంగా ఉంది. ఇందులో తన భాగం కూడా కొంచెముంది. పరిస్థితులు చేతుల్లోంచి జారిపోతున్నాయి.
* * *
ఆ సాయంత్రం విజ్ఞత తండ్రి రాజాచంద్ర ఇంటికి వచ్చాడు- ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ.
"రండి" అన్నాడు రాజాచంద్ర లోపలకు ఆహ్వానిస్తూ.
ఆ సమయానికి మొగపిల్లలు ఇంట్లో లేరు వినూత్న తన గదిలో తలుపులు బిడాయించుకుని కూర్చుంది.
ఎందుకో ఈ సమావేశం కృత్రిమంగా ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. సహజంగా తాను చాలా మొహమాటస్థుడు. ఎంతో అపరిచయం ఉంటేనేగాని ఇతరులతో చొరవగా మాట్లాడడు. అటువంటిది ఆయన్ని మొదటి పరిచయం లోనే ఇంటికి ఆహ్వానించటం, ఏవో కొన్ని సత్యాలు తెలుసుకోవాలని ఆరాట పడటం- తనమీద తనకే అసహ్యంగా ఉంది.
ఏవో కొన్ని సత్యాలు, ఏమిటవి? ఏమి తెలుసుకోవాలని తన మనసు ఆరాటపడుతుంది?
విశారద తన జీవితంలో, తనతో స్నేహానికి ముందు.... ఏమయినా....ఏమయినా.... పర్సనల్ లైఫ్ ఉండటానికి అవకాశముందా"?
పర్సనల్ లైఫ్ అంటే?
ముమ్మూర్తులా విశారదను పోలివున్న విజ్ఞత రూపం కళ్ళముందు మెదుల్తుంది.
రూపంలో, మాటల్లో, మేనరిజమ్స్ లో అన్ని పోలికలు ఏ సంబంధమూ లేకుండా ఎలా సంభవం?
"విజ్ఞత రాలేదా?" అనడిగాడు రాజాచంద్ర. ఆమెను విశారదను చూపించి, షాక్ ట్రీట్ మెంటివ్వాలని అతని ఉద్దేశం.
"రాలేదు" అన్నాడాయన "ఇంటికెవరో గెస్ట్ వస్తే ఆగిపోయింది."
కొత్త వ్యక్తిని చూసి విశారద గదిలోంచి బయటకు రాబోయి సంకోచంతో ఆగిపోయింది.
"విశారదా!" అని పిలిచాడతను. విశారద హాల్లోకి వచ్చింది.
"వీరు..." అంటూ తనకు తెలిసినంతవరకూ పరిచయం చేశాడు.
విశారద ఆయన మొహంలోకి చూసి సభ్యతగా నమస్కారం చేసింది.
రాజాచంద్ర ఆమె ముఖంలోని హావభావాలను పరిశీలిస్తున్నాడు. ఎటువంటి మార్పూ లేదు చాలా మామూలుగా ఉంది.
మళ్ళీ అతని మొహంలోకి చూశాడు. అతనూ అలాగే చాలా మామూలుగా ఏమీ తేడాలేనట్లు ఉన్నాడు.
విశారద లోపలకెళ్ళి అయిదు నిమిషాల్లో రెండు ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి మళ్ళీ లోపలికెళ్ళిపోయింది.
ఆయన కాంట్రాక్ట్ లూ, అందులో ఉన్న సాధక బాధకాలూ అన్నీ చెబుతున్నాడు.
"అన్నట్లు మీరు ఆంధ్రా యూనివర్శిటీలో చదివే రోజుల్లో నా మిసెస్ అంటే విశారదనెప్పుడో చూసి ఉండాలే ఆమె ముందునుంచీ విశాఖపట్టణం లోనే చదువుకుంది" అన్నాడు రాజాచంద్ర అతని మాటల కడ్డు తగుల్తూ.
"నేనెప్పుడూ ఆంధ్రా యూనివర్శిటీలో చదవలేదే. అసలు నేను చదువుకునే రోజుల్లో విశాఖపట్టణమెప్పుడూ చూడలేదు. నా ఎడ్యుకేషనంతా బాంబేలో సాగింది."
"అవునవును అలా చెప్పారు కదూ మరిచిపోయాను."
ఓ అరగంట కూర్చుని ఆయన వెళ్ళిపోయాడు.