Previous Page Next Page 
మోహిత పేజి 42


    "ముందు మన అంబాసిడర్ కార్లన్నిటినీ  మొకానిక్ షెడ్స్ లో పడెయ్యండి. పోలీసులు మారుతీకార్లను, అంబాసిడర్ కార్లను సెర్చ్ చేస్తున్నారు. లారీల్ని సెర్చ్ చెయ్యరు కదా..... మనవాళ్ళ దగ్గరినుంచి ఓ లారీ తీసుకోండి. ఆ లారీ  వెనక మోహితను కట్టిపడెయ్యండి. గోనెలు కప్పేసి కొంతమంది కాపలా వుండండి. ఈరోజు రాత్రి ఆమెను కొల్లెగాళ్ అడవిలోని మన గెస్ట్ హౌస్ కి తరలించండి. కొంతమంది స్కూటర్స్ మీద రండి. నేనుకూడా అక్కడకు వచ్చేస్తాను. మోహితను చంపేసి, నేను ఢిల్లీ వెళ్ళిపోతాను. ఓ.కె." పెల్లుబుకుతున్న క్రోధాన్ని, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు.

 

    ఆ తర్వాత అతను సెల్ ఫోన్ అందుకున్నాడు.

 

    ఆ ఇంటిముందున్న అంబాసిడర్ కార్లు, ఒక్కొక్కటీ వరుసగా కదిలి రోడ్డుమీదకొచ్చాయి.

 

    సరిగ్గా అదే సమయంలో.....

 

    ఒక పోలీస్ జీప్ ఆ వీధి కార్నర్ లో ఆగి వుంది.

 

    డ్రైవర్ సీట్  పక్కన కూర్చున్న సబ్ ఇన్స్ పెక్టర్ దృష్టి, ఆ అంబాసిడర్ కార్లమీద పడింది.

 

    ఆ కారు నెంబర్లను అతను నోట్ చేసుకుని, వైర్ లెస్ సెట్  ఆన్  చేశాడు.

 

    ఏ.సి.పి. రమేష్ బాబు లైన్ లోకి వచ్చాడు.

 

    "సార్! నేను త్రీ టౌన్ ఎస్.ఐ.ని మాట్లాడుతున్నాను. ఆనుమానాస్పదంగా కొన్ని అంబాసిడర్ కార్లు కూర్గ్ కాలనీ లోంచి సిటీలోకి బైలుదేరాయి సార్. ఆ కారు  నెంబర్లను రాసుకుంటారా?"

 

    చెప్పాడు ఎస్.ఐ. రవివర్మ.

 

    "ఆ కార్లను మీరు ఫాలోకండి. అయిదు నిమిషాల్లో మీకు మెసేజ్ యిస్తాను" చెప్పాడు ఏ.సి.పి. రమేష్ బాబు.

 

                                         *    *    *

 

    ఒక కారు డ్రైవరు విండో మిర్రర్ లోంచి, దూరంగా తమను ఫాలో అవుతున్న జీపుని, అందులోని పోలీసుల్ని చూసి కారు వేగం పెంచాడు.

 

    "పోలీసులు......పోలీసులు....."మిగతావాళ్ళను అలెర్ట్ చేశాడు. మూడుకార్లు మైసూర్ గవర్నమెంట్ మెడికల్  కాలేజీవరకూ వచ్చి, రెండు  నంజన్ గడ్ వేపు, ఇంకో కారు రేస్ కోర్స్ గ్రౌండ్ వేపు దూసుకుపోయాయి.

 

    పోలీస్ జీపు వేగం కూడా పెరిగింది.

 

    రేస్ కోర్స్ గ్రౌండ్ వేపు వెళుతున్న కారుని వెంబడించాడు ఎస్.ఐ. రవివర్మ.

 

    మితా రెండు కార్లు సంజన్ గడ్ వేపు వెళుతున్న విషయాన్ని ఏ.సి.పి. రమేష్ బాబు తెలియజేశాడు.

 

    అటు నంజన్ గడ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ఇటు త్రీ టౌన్ స్టేషన్ సిబ్బందినీ అలర్ట్ చేశాడు ఏ.సి.పి. రమేష్ బాబు.

 

    తమ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి జీపులో బయల్దేరాడు. ఏ.సి.పి. రమేష్ బాబు.

 

    శ్రీరంపట్టణం, కొడగు జిల్లాకు దారితీసే రోడ్లమీద పోలీసులు మొహరించారు.

 

    ఏ.సి.పి రమేష్ బాబు జీపు శ్రీ భువనేశ్వరి టెంపుల్ దగ్గరకు రావడం, అదే సమయంలో ఒక అంబాసిడర్ కారు అక్కడికి రావడంతో, ఆ అంబాసిడర్ కారుని చుట్టుముట్టేశారు పోలీసులు.

 

    ఆ కారులో వున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    "సార్. కొడగు రూట్ లో శ్రీరంగపట్టణం దగ్గర రెండు అంబాసిడర్ కార్లను పట్టుకున్నాం సార్! కానీ మనుషులెవరూ దొరకలేదు..... కార్లని వదిలేసి వాళ్ళు పారిపోయారనుకుంటాను....." ఓ  పోలీస్  ఎస్.ఐ. చెప్పాడు.

 

    కారుతోపాటు ఆ ఇద్దరు వ్యక్తుల్నీ పోలీస్  కంట్రోలర్ రూమ్ కి తీసుకెళ్ళాడు ఏ.సి.పి. రమేష్ బాబు.

 


                                         *    *    *

 

    హెబ్బెళ్ళ రోడ్ వరకూ మోహిత వున్న అంబాసిడర్ కారుని, ఆటోలో వెంబడించిన మైత్రేయకి ఆ అంబాసిడర్ కారు , కొండల పక్కనుంచి కాలనీలోకి వెళ్ళిపోవడంతో ఆ జంక్షన్ లో దిగిపోయి, ఆటోని పంపించేసి కాలనీలో వెతకడం మొదలెట్టాడు.

 

    అటూ, ఇటూ కొండలు.....

 

    మధ్యలో కాలనీ...... దాదాపు రెండువేలకు పైగా వున్న ఇళ్ళు.

 

    కాలనీ రోడ్లన్నీ గాలిస్తున్నాడతను.

 

    ఏ అంబాసిడర్ కారు కూడా అతనికి కనిపించలేదు.

 

    అనుమానించదగ్గ ఏ వ్యక్తీ కనిపించలేదు.

 

    కార్లు ఎలా మాయమైపోయాయో అతనికి అంతుపట్టకుండా ఉంది.

 

    మూడుగంటలు గడిచాయి......

 

    ఆటో ఎక్కాడు...

 

    "ఎక్కడికి సార్ ?" ఆటో డ్రైవర్ అడిగాడు.

 

    "సిటీకి పోనీ" చెప్పాడు మైత్రేయ.

 

    
                                            *    *    *

 

    మోగుతున్న సెల్ ఫోన్ ని అందుకున్నాడు రాజేంద్రకుమార్.

 

    అట్నుంచి విన్పించిన ఇన్ఫర్మేషన్ ని వింటున్నాడు ఉద్వేగంగా.

 

    "సార్ ఏ.సి.పి. రమేష్ బాబు మన నర్సన్నని, నాగారాజుని పట్టుకున్నాడు. పోలీస్ కంట్రోల్ రూమ్ కి  తీసుకెళ్లాడు. మేం  నలుగురం కార్లని వదిలేసి, సోనార్ స్ట్రీట్ లాడ్జీకి వచ్చేశాం. మీరు చెప్పినట్టుగా లారీలో మొహితను కొల్లెగాళ్ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తాం" ఫోన్ కట్ అయింది.

 

    సెల్ ఫోన్ ని విసిరికొట్టి లేచి నలబడ్డాడు రాజేంద్రకుమార్.

 

       
                                             *    *    *

 

    చర్చ్ సందులో మార్కెట్ పక్కన చిన్న హొటల్.

 

    అప్పుడే ఒక లారీ వచ్చి ఆగింది.

 

    లారీ డ్రైవర్ పక్కనున్న వ్యక్తి దిగి, హోటల్ లోపలికి  నడిచాడు. ఆ వ్యక్తి రాజేంద్రకుమార్  అనుచరుల్లో ఒకడయిన రతన్.

 

    రతన్ నేరుగా హోటల్లోని సెకండ్ ఫ్లోర్లోని రూమ్స్ వేపు నడిచాడు. కార్నర్ లో వున్న రూమ్ దగ్గర ఆగాడు అటూ, ఇటూ చూసి వేళ్ళతో డోర్ మీద కొట్టాడు. డోర్ రెండు క్షణాల్లో తెరుచుకోగానే లోనికడుగు పెట్టాడు.

 

    చిన్నరూమ్. ఆ రూమ్ లో బెడ్ మీద  మోహిత కూర్చుంది.

 

    ఆమెకు కొంచెం దూరంలో ముగ్గురు వ్యక్తులు నుంచున్నారు.

 

    "నువ్వు  మాతో వస్తున్నావ్...... దారిలో తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా, గొడవ చేసినా, షూట్ చేసెయ్యమని కుమార్ గారు ఆర్డర్" చెప్పాడు రతన్.

 

    "నన్నెక్కడికి తీసుకెళుతున్నారు?" అడిగింది మోహిత.

 

    "ఆ విషయం నీకు తెలియాల్సిన అవసరం లేదు. గప్ చుప్ గా మాతో రా....."

 

    రతన్ ముందుకు నడిచాడు. అతని వెనక ముగ్గురు అనుచరులు.

 

    మోహిత లేచి నిలబడి వాళ్ళని అనుసరించింది. అప్పటికే ఆమె మెదడులో ఓ కొత్త పథకం క్రమంగా రూపుదిద్దుకోసాగింది.

 

    హోటల్లోంచి బయటకొచ్చాడు రతన్.

 

    "లారీ ఎక్కి ఎవరికీ కనిపించకుండా ఒక పక్కన కూర్చో కదిలితే మావాళ్ళు నిన్ను కాల్చేస్తారు....." మరోసారి చెప్పాడు రతన్.

 

    హోటల్ మెట్లు దిగి లారీ ఎక్కుతోంది మోహిత.

 

    సరిగ్గా అదే సమయంలో ఆటోని చర్చ్  దగ్గరకొచ్చిన మైత్రేయ, ఆ వీధిమలుపు తిరుగుతూనే హోటల్ మెట్లు దిగుతున్న మోహితను చూసి "మోహితా...." అంటూ గట్టిగా అరుస్తూ ఆటో దిగి లారీవేపుగా దూసుకుపోసాగాడు.

 

    ఆ అరుపసును విన్న మోహిత, మైత్రేయవేపు చూసింది.

 

    లారీవేపు దూసుకు వస్తున్నా మైత్రేయని చూసిన రతన్.....

 

    "డ్రైవర్ ..... వెంటనే లారీని స్టార్ట్  చెయ్....." కేకేశాడు.

 

    మరో క్షణంలో లారీ స్టార్ట్ అయి ముందుకు దూసుకుపోయింది. ఆ లారీ వెనక పరిగెడుతున్నాడు మైత్రేయ.

 

    సగందూరం పరిగెత్తి ఆటో ఎక్కాడు మైత్రేయ. లారీ వెనక ఆటో వేగంగా ఫాలో కాసాగింది.

 

    
                                         *    *    *    

 

    పోలీస్ కంట్రోల్ రూమ్ లో లాకప్ సెల్....

 

    సిటీ పోలీస్ కమీషనర్, ఏ.సి.పి. రమేష్ బాబు తమకు ఎదురుగా వున్న వ్యక్తులవేపు చూశారు.

 

    నర్సప్ప, నాగరాజు చేతులు కట్టుకుని నుంచున్నారు.

 

    "మర్యాదగా చెప్పెయ్యండి...." రాజేంద్రప్రసాద్ ఎక్కడున్నాడు? మోహితను ఎక్కడ దాచారు?" అడిగాడు రమేష్ బాబు.

 

    "తెలీదు సార్."

 

    "అంటే మీకు తెలుసన్నమాట.....?" ఏ.సి.పి. రమేష్ బాబు లాఠీ తీసుకున్నాడు.

 

    పదినిమిషాలు అక్కడ హా హాకారాలు చెలరేగాయి.

 

    ఎట్టకేలకు-

 

    వాళ్ళిద్దరి నోళ్ళూ తెరుచుకున్నాయి.

 

    "కూర్గ్ కాలనీలో ప్లాట్  నెంబర్ 303...." మరుక్షణంలో ఆరు జీపులు కూర్గ్ కాలనీకి బయలుదేరాయి.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    కూర్గ్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 303 నుంచి బయటకొచ్చాడు రాజేంద్రకుమార్. వీధి చివర కార్నర్ లో వున్న మారుతీ కారు దగ్గరకొచ్చాడు. అతన్ని చూడగానే డ్రైవర్ కారు స్టార్టు చేశాడు. కారులో బ్యాక్ సీట్లో  కూర్చున్నాడు రాజేంద్రకుమార్.

 

    "హెబ్బెల్లీ రోడ్ లో ఫారెస్ట్ కి పోనివ్వు" చెప్పాడు

 

    ఆ మరుక్షణం కారు ఆడదారిలో వేగాన్నందుకుంది.

 

                                         *    *    *    

 

    హోగెనకల్ ఫాల్స్ కి వెళ్ళే దారిలో కుడిపక్కన రెండు కిలోమీటర్ల దూరంలో వున్న ఎర్రమట్టిదిబ్బల మధ్య వుంది ఆ భవనం. పూర్వకాలానికి చెందిన బిల్డింగ్ కావడం వలన, ఆ బిల్డింగ్ కొంతమేరకు శిథిలావస్థలో వుంది.

 

    ఆ బిల్డింగ్ చుట్టూ ఒకపక్క కొబ్బరిచెట్లు..... రెండోపక్కన ఎత్తయిన కొండలు. దూరంగా కావేరీ నది. ఆ పక్కన దట్టమయిన గంధం చెట్లు.

 

    రాత్రి తొమ్మిది గంటలు దాటింది.

 

    మేడమీద చివర రూమ్ లో, మసక మసగ్గా వెలుగుతున్న లైట్ వేపు చూస్తోంది మోహిత.

 

    రాజేంద్రకుమార్ కి మళ్ళీ ఇలా  దొరికిపోతుందనుకోలేదామె. తను లారీలోకి ఎక్కడం చూసిన మైత్రేయ ఇక్కడకు రాగలడా? రాజేంద్రకుమార్ ఇప్పుడెక్కడున్నాడు? ఆలోచిస్తుందామె.

 

    సరిగ్గా.....

 

    అదే సమయంలో తలుపులు తెరుచుకున్నాయి.

 

    ఎదురుగా రాజేంద్రకుమార్.

 

    "చూశావా...... మోహితా...? పోలీసులు నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నాకు ప్రమాదం...... అందుకే ఇక్కడికి తీసుకురాబడ్డావు. ఇక నువ్వు నా చేతుల్నుంచి తప్పించుకోలేవు.

 

    నువ్వు చంపినా ఆ ముగ్గురితో నీకు అక్రమసంబంధం వుండటాన్ని ప్రత్యక్షంగా చూసిన నేను నీకు విడాకులిచ్చేశాను. ఆ ముగ్గురూ, నిన్నూ నీ శీలాన్ని అవమానించారు. కాబట్టి నువ్వు నీ ప్రియుడు మైత్రేయ సహాయంతో ఆ ముగ్గురిని ప్లాన్డ్ గా మర్డర్స్ చేశావు. అని స్వయంగా నువ్వు ఒప్పుకున్నట్లుగా లాయర్ చేత రాయిఅమ్చిన పేపర్స్ ఇవి. ఈ పేపర్స్ మీద ఒక్క చిన్న సంతకం చెయ్యి...... నిన్ను నేను వదిలేస్తాను" ఆ కాగితాలను ఆమె కెదురుగా వున్న టేబుల్ మీద పెట్టాడు రాజేంద్రకుమార్.

 Previous Page Next Page