అందులో హాట్ హాట్ న్యూస్ ఏమీ లేకపోయేసరికి సంచిక మరీ చప్పగా వుండి సగంపైగా కాపీలు తిరిగి వచ్చేశాయి. మార్కెట్ లో అంకుశం అడుగడుక్కి దిగజారిపోతున్నదనీ, అవతల త్రిశూలం రోజు రోజుకీ దూసుకు వస్తున్నదనీ, యిలా అయితే ఏజన్సీ విరమించుకుని డిపాజిట్లు తిరిగి తీసేసుకుంటామనీ బెదిరిస్తూ రాశారు ఏజంట్లు. దాంతో పరాంకుశం పిచ్చెత్తినట్లయిపోయి తన గత ప్రాభవం గుర్తుతెచ్చుకుని నానా తిప్పలూ పడి యింకో సంచిక తీసుకొచ్చి అందులో యిద్దరు ముగ్గురు ఊళ్లోని ప్రముఖుల పెళ్ళాలని గురించీ, కూతుళ్ళని గురించీ యిష్టమొచ్చినట్లు రాసేశాడు. సంచిక బాగానే అమ్ముడయిందిగానీ, ఓ రాత్రి హోటల్లో కాఫీ త్రాగి యింటికి తిరిగి వస్తుంటే ఓ సందులో నలుగురు అటకాయించి ఎముకల్లో సున్నంలేకుండా చితగ్గొట్టి వదిలిపెట్టారు. ఆ గాయాలు మాని మళ్ళీ ప్రజల్లో పడటానికి పదిహేనురోజులు పైగా పట్టింది. ఒడ్డున పడ్డాక పరిస్థితి మళ్ళీ మొదలు. తిరిగి అప్పులు.
రెండు మూడు రోజులు తీవ్రంగా ఆలోచించి, యిహ యే మార్గం కనబడక శ్రీలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్ర దగ్గరకు బయల్దేరాడు.
దాదాపు గంటన్నర వెయిట్ చేశాక లోపల్నుంచి పిలుపు వచ్చింది.
అంతకుముందే విజిటింగ్ కార్డు పంపించటంచేత అతనెవరో ఉపేంద్రకు తెలుసు. అయినా కూర్చోమని అనలేదు.
ఒకక్షణం ఎదురుచూసి జీవితంలో యిలాంటివి చాలా చూసినవాడు కాబట్టి లెక్కచెయ్యకుండా ఎదురుగా వున్న సోఫాలో తనే కూర్చున్నాడు పరాంకుశం.
"నేను అంకుశం ఎడిటర్ని."
"అలాగా?" అన్నట్లు చూశాడు ఉపేంద్ర.
"మీ కేసు ఫాలో అవుతున్నాను. అడపా తడపా చాలా ప్రాముఖ్యత యిచ్చి మా పత్రికలో ప్రచురిస్తున్నాను."
"అయితే ఏమిటి?"
"ఆ ప్రదీప్ గనక కేసు గెలిచినట్లయితే మీ హాస్పిటల్ అప్రదిష్ట పాలయే అవకాశముంది. ఇప్పటికే చాలామందిలో శ్రీలక్ష్మి హాస్పిటల్ లో జాయినయితే ఇంతేసంగతులు అన్న నానుడి బాగా ప్రబలిపోయింది. మీ హాస్పిటల్ ని పైకెత్తుతూ, ఆ ప్రదీప్ ని, అతని చేష్టలనూ దుయ్యబడుతూ ఈకేసు నడిచి నన్నాళ్ళూ అంకుశంలో రాద్దామనుకుంటున్నాను."
"రాయండి. మంచిదే."
"మరి.. దానికంతా... కొంత ఖర్చవుతుంది."
"ఓహో! డబ్బుకోసం వచ్చారన్నమాట."
"మరి పత్రిక నడపాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం."
"చూడండి. మా కేసు చాలా స్ట్రాంగ్ గా వుంది. మాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు. మీరిహ వెళ్ళవచ్చు."
పరాంకుశం మొహం కోపంతో ఎర్రబడింది. "మీరిలా మొండికేస్తే మీ గురించి వ్యతిరేకంగా రాయాల్సి వస్తుంది" అన్నాడు.
"అలాగా?" అన్నాడు, "ఈ మధ్య ఏవో పిచ్చిపిచ్చి రాతలు రాస్తే నిన్ను చావ చితకకొట్టినట్లున్నారు" అన్నాడు యీసారి 'నువ్వు' అని సంబోధిస్తూ.
"అందుకని...?"
"అనవసరంగా నామీదికి వచ్చావో తన్నించటం కాదు, శాల్తీ లేకుండా చేస్తాను. గెటవుట్."
పరాంకుశం లేచి నిలబడ్డాడు. అతని మొహం కోపంతో, అవమానంతో జేవురించింది. ఏదో అనబోయి, ఉపేంద్ర చెయ్యి బెల్ మీదకు పోవటంచూసి, ఫ్యూన్ ని పిలిచి బయటకు గెంటిస్తాడని, తమాయించుకుని బయటకు వెళ్ళిపోయాడు.
ఒకప్పుడు తన పత్రికన్నా, తన రాతలన్నా జనం ఝడుసుకునేవారు. రానురానూ, తన ప్రతిష్ట యిలా దిగజారిపోతున్నదేమిటి?
కాళ్ళు చచ్చుబడినట్లయి బస్సుగాని, రిక్షా గాని ఎక్కుదామని, ఏదో అనుమానం తోచి జేబులు తడిమి చూసుకున్నాడు. ఖాళీగా తగిలాయి. ఉసూరుమంటూ లేని ఓపిక తెచ్చుకుని నడవసాగాడు.
ఇంటికి చేరేసరికి ఓ అరగంటకు పైగా పట్టింది. తలుపులు వేసి వున్నాయి. నూన్ షోకి వెళ్ళటం దీనికి మామూలేగా అనుకుంటూ లాక్ తీయబోయేసరికి లోపల గడియ వేసి వున్నట్లు గమనించాడు. 'దీనికి అయితే సినిమా, లేకపోతే బండనిద్ర' అనుకుంటూ బజర్ నొక్కాడు.
వెంటనే జవాబు లేదు.
పరాంకుశానికి చాలా కోపమొచ్చింది.
'ఒక మొగుడని గౌరవం లేదు, భక్తీ, భయమూ లేదు. ఇవాళ దీని అంతు చూడాలి' అనుకుంటూ కసితీరా బజర్ ఎడాపెడా నొక్కేశాడు.
లోపల ఏదో అలికిడి.
ఓ నిముషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
గుమ్మం అవతల పంకజం నిలబడి వుంది.
"నీకేమన్నా బుద్దుందా?" అనబోయి ఉలిక్కిపడి చూస్తూ వుండిపోయాడు. పంకజం జుట్టు చెదిరిపోయి వుంది. కళ్ళలో మత్తు. పెదిమలు నలిగినట్లు ఎర్రబడి వున్నాయి. జాకెట్ హుక్స్ సరిగ్గా లేవు. చీరెకుచ్చెళ్లు వూడివున్నాయి.
గుండె తిరగబడ్డట్లు, గొంతు పిసకబడినట్లు కళ్ళు అప్పగించి చూస్తూ వుండిపోయాడు.
"ఏమిటలా చూస్తారు దెయ్యం పట్టినట్టు? బజర్ అంతసేపు కొట్టకపోతే వచ్చేదాకా ఆగరాదూ?"
పరాంకుశం లోపలకడుగు పెట్టాడు.
"ఎందుకలా వున్నావు?"
"ఎలా వున్నాను."
"అలా?"
"అలా అంటే?"
"ఏదో జరిగినట్లు."
"అలా డైరెక్ట్ గా అడగరాదూ? అలా... అలా... అని నసక్కపోతే జరిగింది కాబట్టి సరేనా?"
"జరిగిందా? జరిగిందా?" అతని గుండె ఆగిపోతున్నట్లయింది.
"అవునయ్యా, జరిగిందా?" అతని గుండె ఆగిపోతున్నట్లయింది.
"అవునయ్యా, జరిగింది రామలింగం! ఇవతలకు రా భయం దేనికి ఏదో తప్పు చేసినట్లు" అన్నది పంకజం.
రామలింగం నెమ్మదిగా లోపలిగదిలోంచి బయటకు వచ్చాడు. మొహం మీద అక్కడక్కడా చెమట పట్టివుంది. అయితే అది భయంవల్ల కాదు.
"తప్పు చెయ్యలేదా? ఇది తప్పు కాదా? చూసుకోండి. మీ ఇద్దర్ని ఏం చేస్తానో, నరికి పోగులు పెడతాను. ఉప్పుపాతర వేస్తాను."
ఈ మాటలు బయటకు అనలేదు లోలోపల రంకెలు పెడుతున్నాడు.
"పంకజం! యిది తగునా?" అన్నాడు బిక్కమొహం వేసి.
"ఏం? ఊళ్ళోవాళ్ళ అందరి పెళ్ళాలమీద, కూతుళ్ళమీద రాసి నప్పుడు, వున్నవీ లేనివీ కల్పించి రాసినప్పుడు ఆ బాధ ఎలాంటిదో, అది ఎలా గుచ్చుకుంటుందో యిప్పటికైనా తెలిసిందా? కాని ఇది కేవలం వార్త కాదయ్యా, నిజం నీ కళ్ళారా చూసిన నిజం న్యూసో న్యూసో అని కలవరిస్తున్నావు కదా. రాయవయ్యా రాయి. అంకుశం ఎడిటర్ పరాంకుశం పెళ్ళాం పరాయి మొగాడి ఒళ్ళో కులుకుతుందని కూడా రాయి. రా, రామలింగం రా యిక్కడ్నుంచి వెళ్ళిపోదాం" అని అతని చెయ్యిపట్టుకు లాగింది.