Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 41

 

      "అదే మరి మీ అంత వయసు రాలేదు ఒక పొడవాటి లిస్ట్ తయారు చేయటానికి."
   
    మేజిస్ట్రేట్ గారు "ఇదిగో ప్రతాపరావుగారూ! ప్రదీప్ గారూ!" అని పిలుస్తూ "ఊరుకోండి, ఊరుకోండి" అని హెచ్చరిస్తున్నా ఎవరూ వినిపించుకోక వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది.
   
    కోర్టులో వున్నవారంతా వుత్కంఠగా చూస్తున్నారు.
   
    "క్రిమినల్ కేసు పెట్టగానే సరికాదు, అది ఫేస్ చేసే సత్తా వుండాలి. సాక్ష్యానికి రావటమంటే మనకిష్టమైన ప్రశ్నలే అడగరు. ఎలాంటి ప్రశ్ననైనా ఎదుర్కోవటానికి సిద్దపడి వుండాలి" అన్నాడు ప్రతాపరావు.
   
    "అంటే సాక్ష్యం యివ్వటానికి ఓ గౌరవస్థానంలో వున్న వ్యక్తి కోర్టుకి రావటం తప్పన్నమాట. వచ్చినందుకుగాను అర్ధం పర్ధంలేని ప్రశ్నలడిగీ, లేకపోతే అవసరమున్నా లేకపోయినా వాయిదాలమీద వాయిదాలు తీసుకుని కొన్ని వందలసార్లు త్రిప్పించీ విట్ నెస్ లను వేధిస్తారన్నమాట" అన్నాడు ప్రదీప్ ఆవేశంగా.
   
    "అనవసరంగా ఎవరూ వాయిదాలడగరు. సాక్షుల్ని వేధించటానికి వాయిదాలు తీసుకోరు. ప్రతిదానికీ ఓ లీగల్ ప్రొసీజర్ వుంటుంది. నువ్వు కుర్రలాయరివి కాబట్టి ఎక్కువ వర్క్ వుండక ఒకటే కేసు అంటిపెట్టుకు తిరుగుతూ వుండవచ్చు. మాలాంటివాళ్ళకి బోలెడు వర్క్ ఉంటుంది. వాయిదా వున్న రోజుకి కేసుగురించి ప్రిపేర్ అవటానికి టైం వుండదు. వాయిదా లెక్కువగా తీసుకున్నారని కోర్టువారిని ప్రెజుడిస్ చెయ్యాలని చూడకు."
   
    "ఏమిటి ప్రొసీజర్? కేసుని ఎంతకీ తెమలమీయకుండా ప్రొలాంగ్ చెయ్యటమా? కోర్టువారు అనుమతించకపోతే కోర్టు ట్రాన్స్ ఫర్ కి పిటీషన్ పెట్టటం, యీ కోర్టు కాకపోతే డిస్ట్రిక్టు కోర్టు, లేకపోతే హైకోర్టు వుందిగా యివీ సవాళ్ళు, లేకపోతే ఏదో ఓ క్లాజ్ మీద స్టే తెచ్చుకుంటూ వుండటం ఇదేగా మీ లీగల్ ప్రొసీజర్?"
   
    "లా తెలిసినవాడికి లీగల్ ప్రొసీజర్ తెలుస్తుంది. నీలాంటి కుర్రలాయర్...."
   
    "మీలాంటి వృద్దలాయర్లకు తెలిసిన ముసలి లా మాలాంటి కుర్రలాయర్లకు తెలీని మాట నిజమే."
   
    కోర్టులో గలభా పెరిగిపోతూ వుండటంతో మేజిస్ట్రేట్ గారు గట్టిగా జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
   
    చివరకు "మీరడగవలసిన ప్రశ్న అడగండి. ఆవిడకు నచ్చిన సమాధానం ఆవిడ చెబుతుంది" అన్నారు.
   
    "అక్కర్లేదు. నేను క్రాస్ ఎగ్జామినేషన్ ముగిస్తున్నాను" అని ప్రతాపరావు విసురుగా టేబులుదగ్గరకు వెళ్ళిపోయాడు.
   
                            * * *
   
    "అన్నయ్యా!" అంది మాలతి ప్రతాపరావు ఆఫీసుగదిలోకి అడుగుపెడుతూ.
   
    తన సీటులో కూర్చుని లా జర్నల్ ఒకటి రిఫరెన్స్ కోసం చూస్తున్న ప్రతాపరావు తలెత్తాడు.
   
    "ఇది చాలా అన్యాయం."
   
    "ఏది?"
   
    "నువ్వింత సీనియర్ లాయర్ వి అయివుండీ, నిజం ఏం జరిగిందో తెలిసీ నువ్విలా వాదించటం."
   
    "నిజం ఏం జరిగిందో నువ్వు చూచావా మాలతీ?"
   
    మాలతి ఉలికిపడింది.
   
    "నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు నిజమనుకుంటున్నావు. కాని నీకు తెలిసిందే నిజం కావాలని లేదు."
   
    "కాని నిజం అనేది ఒకటే వుంటుంది. రెండుచోట్ల వుండదు."
   
    "కాని ఆ ఒక్కటీ మీదే కావాలని రూలెక్కడుంది మాలతీ?"
   
    "అది అందరకూ తెలిసిన నిజంకాబట్టి."
   
    "అందరూ తెలిసినంతమాత్రాన అది నిజం కావాలని ఎక్కడుంది మాలతీ?"
   
    "అన్నయ్యా! నువ్వు ఓ లాయర్ గా మాట్లాడకు. ఓ మనిషిగా ఆలోచించి చూడు."
   
    "లాయరు వేరు, మనిషి వేరు కాదు మాలతీ! ఒక రోగం గురించి పేషెంటు ఆలోచించే తీరు వేరు. డాక్టర్ ఆలోచించే తీరు వేరు. అలాగే ఓ నేరంగురించి క్లయింట్ ఆలోచించే తీరు వేరు, లాయరు ఆలోచించే తీరు వేరు."
   
    "అన్నయ్యా!"
   
    "అసలు నిజమెక్కడ వున్నది మాలతీ! నిజానికి ఓ రూపంలేదు. మనం అర్ధం చేసుకునే పద్దతిని బట్టి దానిరూపం క్షణక్షణం మారుతూ వుంటుంది. డాక్టర్ అశోక్ నీకు మూడోవ్యక్తి కాబట్టి నిజం యీ రూపంలో దర్శనమిస్తుంది. ఆ సంఘటనలో నువ్వే వుండివుంటే యిదే నిజం యింకోరూపంలో నిన్ను మైకంలో ముంచివేస్తూ వుంటుంది మాలతీ! తన రోగాన్ని నీ చేతుల్లో పెట్టిన రోగికి రక్షణ యివ్వటం డాక్టరుగా నీకెంత బాధ్యతవుందో, తనకేసుని నా చేతుల్లో పెట్టిన క్లయింట్ కి పూర్తి రక్షణ యివ్వటంలో నా బాధ్యత అంతే వుంది. నాకు అర్ధమైన నిజం అంతే."
   
    మాలతి నిస్పృహగా అతనివంక చూసి గదిలోంచి బయటకు వెళ్ళి పోయింది.
   
    ప్రతాపరావు అయిదునిముషాలసేపు స్తబ్దుగా కూర్చున్నాడు. అతని మొహంలో ఎలాంటి భావం కనబడటంలేదు. తరువాత ఏదో గుర్తువచ్చినట్టు ఫోన్ రిసీవర్ చేతిలోకి తీసుకుని ఓ నంబరు డయల్ చేశాడు.
   
    అవతల్నుంచి ఉపేంద్ర కలిశాడు.
   
    "నేను ప్రతాపరావును. ఇవేళ్టితో ఫ్లేయింటిఫ్ తరపున విట్ నెస్ లున్న ఎగ్జామిన్ చెయ్యటం పూర్తయిపోయింది. వచ్చే వాయిదాకు క్వశ్చనింగ్ వుంటుంది. ఎ 'వన్' అయిన డాక్టర్ అశోక్, ఎ 'టూ' అయిన మిమ్మల్నీ యింతవరకూ అయిన సాక్ష్యాలను కేసు స్వభావాన్ని ఆధారం చేసుకుని మేజిస్ట్రేట్ గారు ప్రశ్నలు వేస్తారు. డానికి మీరిద్దరూ విడివిడిగా జవాబులు చెప్పవల్సి వుంటుంది."
   
    "అంటే?"
   
    "అంటే ఉదాహరణకి మీరు నేరం చేసినట్లు మీ మీద అభియోగం వున్నది. ఫలానా వారిట్లా చెప్పారు. మీరేమంటారు అని అడుగుతారు. మేజిస్ట్రేట్ గారు అడిగినదానికి ఖండిస్తూ వుండాలి."
   
    "నావరకూ ఫర్వాలేదు. కాని డాక్టర్ అశోక్ ఎంతవరకూ నిలకడగా జవాబు చెబుతాడో అని నా అనుమానం. ఇప్పటికే ఎన్నోసార్లు 'నేను వొప్పుకుంటాను' అని మధనపడిపోతున్నాడు.
   
    "నా అనుమానం కూడా అదే. పోనీ ఒకపని చేద్దాం అవును- కాదు అని ఏదో ఒక జవాబు చెప్పకుండా నిరాకరించేటట్లు చేయవచ్చు. లీగల్ గా దానికీ అవకాశముంది."
   
    "ఆఁ యీ ఆలోచన బాగుంది."
   
    "తర్వాత మీరెవర్నయినా సాక్షుల్ని పెట్టుకుంటారా అని అడుగుతారు."
   
    "ఏం చేద్దాం?"
   
    "పెట్టుకుంటాం అని చెప్పండి. మన తరఫుణ యిద్దర్నీ విచారిద్దాం. థియేటర్ యిన్ చార్జి స్టాఫ్ నర్స్ నూ, ఎనస్థటీస్ట్ నూ వీళ్ళిద్దరూ మనం చెప్పినట్లు వింటారుగా."
   
    "వింటారు."
   
    "ఓ.కే. అయితే వుంటాను" అని ప్రతాపరావు రిసీవర్ పెట్టేశాడు.
   
                                                    19
   
    అంకుశం ఎడిటర్ పరాంకుశం తన టేబులుముందు కూర్చుని తెగ ఆలోచిస్తున్నాడు. ఈమధ్య ఏపని చెయ్యబోయినా చుక్కెదురు అవుతుంది. లాయర్ ప్రదీప్ ని డబ్బులడిగితే నిరాకరించాడు. దానిమీద కోపమొచ్చి అతనిమీద పత్రికలో బొమ్మలతో సహా కసాపిసా రాసి పారేశాడు. అదిచూసి అతనేం చలించినట్లు లేదు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల పత్రిక సరిగ్గా నడపలేక పోతున్నాడు. పేపరువాళ్ళు, ప్రెస్సువాళ్ళు డబ్బులకోసం రాచి రంపాన పడేస్తున్నారు. అప్పులబాధ పడలేక ఏజంట్ల దగ్గర ఎడ్వాన్సులు ముమ్మరంగా పుచ్చేసుకుని పత్రిక సకాలానికి రిలీజు చెయ్యకపోయేసరికి ఉత్తరాలు రాసీ, టెలిగ్రాంలిచ్చీ కాల్చుకు తినసాగారు. అష్టకష్టాలుపడి ఒక యిష్యూ ఎలాగోలా బయటకు తీసుకొచ్చాడు.

 Previous Page Next Page