"పంకజం ఆగు. యిది న్యాయంకాదు. అసలే బాధల్లో వున్నాను. పోనీ ఏదో విధంగా సరిపెట్టుకుంటాను చూసీచూడనట్లు."
"నువ్వు సరిపెట్టుకుంటావయ్యా. ఈ చాటుమాటు వ్యవహారం నాకు ఫ్రీగా వుండొద్దూ?" అని "రామలింగం! చూస్తావేం? పోదాం దా" అని ఆ చెయ్యి అలాగే పట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోయింది.
* * *
"అంకుశం" ఎడిటర్ పరాంకుశం పెళ్ళాం పంకజం రామలింగంతో పరారీ.
పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో, ఫొటోలతో, ఆ ఫొటోల క్రింద అశ్లీలకరమైన వ్యాఖ్యలతో త్రిశూలంలో రాయబడ్డ రాతలు టేబుల్ మీద అటూ ఇటూ కదులుతున్నాయి.
పరాంకుశం కళ్ళలో నీళ్ళు, గుండెల్లో నొప్పి, వళ్ళంతా మంటలు.
బాధంటే యిలా వుంటుందా?"
అది అనుభవించినవాడికి ఇలా తెలుస్తూ వుంటుందా?
* * *
ఎనస్థటిస్ట్ డాక్టర్ గంగాధరరావు మీద విచారణ మొదలయింది.
ఎక్స్యూజ్ డ్ వైపు సాక్షులు కాబట్టి మొదట ప్రతాపరావు చీఫ్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టాడు.
ఓత్ టేకింగ్, పేరు, ఉద్యోగం వగైరా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయినాయి.
"రాధ కేసుకు ఎనస్థటిస్టుగా ఎపియరయింది మీరేనా?"
"అవును."
"ఆ పాపకు చేసిన ఆపరేషన్ ఎన్యుక్లియేషన్ కదా అది జనరల్ ఎనస్థీషియాలో చేశారా? లోకల్ లో చేశారా?"
"జనరల్ ఎనస్థీషియానే యిచ్చాను."
"ఆపరేషన్ మొదలు పెట్టేముందు కేస్ షీట్ మీరుకూడా చూస్తారా?"
"చూస్తాను. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కేస్ షీట్ ప్రిపేర్ అయినాక అయిదారు కాపీలు టైపుచెయ్యబడుతుంది. ఆపరేషన్ చెయ్యబోయే డాక్టరు దాన్ని చదివి సైన్ చేశాక థియేటర్ యిన్ చార్ట్ అయిన స్టాఫ్ నర్స్ కూ, ఎనస్థిటిస్టుకూ కాపీలు అందజెయ్యబడతాయి."
"మీకు అందజెయ్యబడిందా?"
"అందజెయ్యబడింది."
"మీరు కేస్ షీట్ థరోగా చదివారా?"
"చదివాను."
"కేస్ షీట్ లో రాధ కళ్ళకున్న డిసీజ్ గురించి ఏముంది?"
"రాధ రెండుకళ్ళలోనూ రెటీనో బ్లాస్టోమా వున్నట్లు డయాగ్నైజ్ చెయ్యబడి వుంది. రెండుకళ్ళకూ ఒకేసారి ఆపరేషన్ చెయ్యటం సాధ్యంకాదని నిర్ణయించబడింది. కాబట్టి కుడికన్నుకి మాత్రం ఆపరేషన్ చెయ్యటానికి మార్క్ చెయ్యబడింది."
ప్రతాపరావు మేజిస్ట్రేట్ వంక తిరిగి "యువరానర్! ఎగ్జిబిట్ నంబర్ ఫోర్ గా కేస్ షీట్ కోర్టువారికీ ముందే దాఖలు చేశాను. చిత్తగించండి" అన్నాడు.
"మేజిస్ట్రేట్ చేతిలోని కాగితాలు తిరగేస్తున్నాడు.
ప్రతాపరావు తన చేతిలోని కేస్ షీట్ పాడ్ లో రెండుకళ్ళలోనూ రెటీనో బ్లాస్టోమా వున్నది అన్నచోట, ఆ రోజు కుడికంటికి ఆపరేషన్ అన్నచోట ఎనస్థటిస్ట్ ని చదవమని యిదేనా యిదేనా అని అడిగి మార్కింగ్ చేయించాడు.
"కాబట్టి రాధకు రెండుకళ్ళలో రెటీనో బ్లాస్టోమా వున్నదని మీ నిర్ణయం."
"అవును."
"రాధకు కుడికంటికి ఆపరేషన్ చెయ్యటం సమంజసమేనంటారు."
"అవును."
చీఫ్ ఎగ్జామినేషన్ ముగిసింది.
ప్రదీప్ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాడు.
"డాక్టర్ అశోక్ సైన్ చేసిన కేస్ షీట్ మీ దగ్గరకు ఎప్పుడొచ్చింది?"
"ఆపరేషన్ కు ముందురోజు."
"ఎన్నిగంటలకు?"
"మధ్యాహ్నం దాదాపు రెండుగంటల సమయానికి."
"ఆ టైముకు మీరేం చేస్తున్నారు?"
"ఆపరేషన్ థియేటర్ లో వర్క్ ముగించుకుని యింటికి వెళ్ళబోతున్నాను."
"ఇంటికి వెళ్ళబోయే హడావుడిలో కేస్ షీట్ సరిగ్గా చూడకపోయే అవకాశం వుందా?"
"లేదు. ఇలాంటి విషయాల్లో నెగ్లెక్ట్ చెయ్యను."
"ఆపరేషన్ ఫలానా అవయవానికి అని నిర్ణయం తీసుకునేది మీరా? ఆపరేషన్ చేసే డాక్టరా?"
"ఆపరేషన్ చేసే డాక్టరు."
"డయాగ్నైజ్ చేసేది?"
"అదికూడా ఆయనే."
"ఇందాక ఛీఫ్ ఎగ్జామినేషన్ లో అది మీ నిర్ణయమైనట్లుగా చెప్పారు."
డాక్టర్ గంగాధరరావు మాట్లాడలేదు.
"ఆపరేషన్ జరిగినప్పుడు వున్న కేస్ షీటూ, యిప్పుడు కోర్టువారికి దాఖలు చేసిన కేస్ షీటూ ఒకటి కాదంటాను. ఏమంటారు?"
"ఒకటేనంటాను."
"ఒరిజినల్ కేస్ షీటు నేను యిప్పుడు చూపిస్తే?"
డాక్టర్ గంగాధరరావు ముఖంలో కలవరపాటు కనిపించింది. ప్రతాపరావు వంక కంగారుగా చూశాడు. ప్రతాపరావు ముఖం నిశ్చలంగా వుంది.
"ఒరిజినల్ కేస్ షీటు మీకెలా దొరుకుతుంది?"
"ఎలాగో ఓలా దొరికింది."
"అసంభవం. దొరకదు."
"కాబట్టి ఒరిజినల్ కేస్ షీట్ అంటూ యింకొకటి వుందని ఒప్పుకుంటారన్న మాట" అని మేజిస్ట్రేట్ వంక తిరిగి "యువరానర్! ఈ పాయింటు జాగ్రత్తగా నోట్ చేసుకొమ్మని కోరుతున్నాను" అన్నాడు ప్రదీప్.
"కాబట్టి ఒరిజినల్ కేస్ షీట్ అంటూ యింకొకటి వున్నదని ఒప్పుకుంటారన్నమాట."
"ఒప్పుకోను."
"మరి యిందాక అది దొరకటం అసంభవమన్నారు."
అప్పటికప్పుడు సర్దుకున్నాడు. "ఒరిజనల్ కేస్ షీట్ అంటూ యింకొకటి లేదు కాబట్టి, మేము కోర్టువారికి సబ్మిట్ చేసింది అదేకాబట్టి అసంభవమని చెప్పాను."
"కాదు. మీరు మాట మారుస్తున్నారు."
"లేదు. ఇందాకా యిప్పుడూ ఒకే అభిప్రాయం వెలిబుచ్చుతున్నాను."
"మీరు శ్రీలక్ష్మి హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టరు కాబట్టి, ఆ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరయిన ఉపేంద్రగారికి సన్నిహితులు కాబట్టి మీరు నిజాన్ని కప్పిపుచ్చి అబద్దాలు చెబుతున్నారంటాను."
"కాదు. నిజం తెలిసిన ఓ బాధ్యత గల డాక్టరుగా ఆ నిజాన్ని వెల్లడిస్తున్నాను."
తర్వాత థియేటర్ యిన్ చార్జి స్టాఫ్ నర్స్ విచారణ ఇంచుమించు అదే పద్దతిలో సాగింది.
కేసు వాయిదా పడింది.
* * *
ప్రదీప్ సోఫాలో కూర్చుని విస్కీ బాటిల్ ముందుపెట్టుకుని పెగ్గుమీద పెగ్గు సేవిస్తున్నాడు.
ఫోన్ రింగయింది. రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు.
"నేను మాలతిని."
"మాలతీ! ఎలా వున్నావు?"


