కూడనిదేదో జరగబోతుందన్న సూచనగా ఆ లోగిలిలో చిత్రమైనస్తబ్ధత.
అయినా ఆమె ఆరా తీయలేకపోయింది.
సావేరి బ్రతుకు ఏ దిశకు ప్రయాణం చేస్తూందీ తెలీని బాధో లేక తల్లిగా తన కర్తవ్యమేమిటో అర్ధంకాని స్థితికో ఆమె కలవరపాటుతో గడుపుతూమ్ది ప్రతిక్షణం.
ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర వీర్రాజుగారూ మౌనంగానే వున్నారు.
ఏ సమస్యకి కలతచెందని వీర్రాజు ఆ ఫోన్ కాల్ విషయమే ఆలోచిస్తున్నారు గంటల తరబడి.
హాల్లోనుంచి సావిడిలోకి వెళుతుంటే ఫోన్ రింగయ్యింది మళ్ళీ.
అక్కడే మామయ్యతో ఏదో మాట్లాడాలని తారట్లాడుతూ రాజేందర్ ఫోన్ అందుకోబోతుంటే అవకాశమివ్వకుండా తనే రిసీవరు తీసుకున్నాడు వీర్రాజు.
"వీర్రాజుని మాట్లాడుతున్నాను."
"కొన్ని లిప్తల నిశ్శబ్దం తర్వాతే వినిపించింది. నేనే...."
"అంటే....?"
"నిన్న ఫోన్ చేశానుగా?"
"అసలు నువ్వు...."
"ఎవరో చెప్పను వీర్రాజు.....చెప్పాల్సిన ఆగత్యమూ లేదు.....కానీ నీ ముద్దుల కూతురు కథని నేను త్వరలో చిత్రమైన దిక్కువేపు మలుపు తిప్పబోతూన్నాను. పాపం సెంటిమెంటల్ గా చాలా కలవరపడిపోతున్నావు కదా.....యూ బుచ్చర్....ఇలాగే ప్రతి మనిషీ తన వాళ్ళ కోసం తపించి పోతాడని ఎందుకనుకోవు? ఓ నిజం చెప్పనా? నీ వినాశనానికి ముఖ్యంగా కారకుడయ్యేది నీ అండతో బరితెగించి నడుస్తున్న నీ బావమరిది కనక మేనల్లుడు రాజేందర్ మాత్రమే....సో డియర్ వీర్రాజు! గెట్ రెడీ....."
ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.....
"ఎవరు బావా?"
వీర్రాజు మొహంలో మారిన రంగుల్ని చూస్తూ అడిగాడు రాజేందర్.
చెప్పలేకపోయాడు. చెప్పటానికి మనసొప్పటం లేదు.
ఏ రూపంలో కానీ ప్రమాదం చాలా వేగంగా దూసుకొస్తూందన్న విషయం స్పష్టమైపోతూంది!
తాత్పర్యం చేయలేడిక....
"రాజేందర్" సాలోచనగా అన్నాడు. "సావేరి....అహ....! ఒకవేళ నేనిచ్చిన మాట ప్రకారం నువ్వీ యింటి అల్లుడివే అయ్యావనుకో....."
ఇంత త్వరగా ఊహించని ఈ ప్రపోజల్ కి ఆనందంతో అప్రతిభుడయ్యాడు రాజేందర్. "సావేరిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను"
"అది నాకు తెలుసు రాజూ! కానీ ఒక్క హామీ కావాలని.....సావేరిని జాగ్రత్తగా కాపాడుకోగలవా?"
రాజేందర్ భ్రుకుటి ముడిపడింది ఎన్నడూ లేనిది ఎందుకిలా మాట్లాడుతున్నాడు? "ఏమైంది బావా? నీ నోటినుంచి యిలాంటి...."
"అదికాదు రాజేందర్" అహం అడ్డం వచ్చిందేమో! మొహంలో భావాలు కనిపించకుండా అన్నాడు. "సావేరి ఇంతకి వారసురాలో నీకు తెలుసు.....అంతకుమించి సావేరి నాకెంత ప్రేమో నీకు చెప్పాల్సిన అగత్యము లేదనుకుంటాను."
అస్పష్టంగా వున్న అనుమానం బలపడిపోయిన రాజేందర్ నెమ్మదిగా శంకూ విషయం చర్చించబోయి ఆగిపోయాడు బావలో అలాంటి సందిగ్ధతకి కారణం సావేరి శంకూని యిష్టపడుతూందని తెలిసిపోయిందా? అదే విషయాన్ని యిప్పుడు ఫోన్ లో ఎవరన్నా చెప్పి వుంటారా?
అంటే కాగల కార్యం గంధర్వులు తీర్చేశారన్నమాట.....
"రాజా" తూగుటుయ్యాలలో కూర్చున్నాడు వీర్రాజు "లక్షల మంది గుండెకోసి హృద్రోగం నుంచి కాపాడిన గొప్ప డాక్టర్ కూడా తనకే హార్ట్ అటాక్ వస్తే ప్రాణభీతితో నలిగిపోతాడు కదూ?"
"అవును బావా! కానీ ఇదంతా...."
"వీర్రాజు మాట్లాడటంలేదు రాజూ! సావేరి తండ్రి ఇలా ఆలోచిస్తున్నాడు. జనాల్ని గడగడలాడించిన తిరుగులేని ఈ వ్యక్తి ఇప్పుడు కూతురి సుఖం కోసం తపించిపోతున్నాడు.....సో.....చాలా త్వరలో మీ పెళ్ళికి ఏర్పాటు చేస్తాను."
"నిజంగానా బావా?" నమ్మలేకపోతున్నాడు రాజేందర్.
"తప్పదు రాజూ.... దానికి కాలేజీ చదువులెందుకు....? అసలేం తక్కువవని?" మొన్న రాజేందర్ మాటల్నే యిప్పుడు వీర్రాజు రిపీట్ చేస్తుంటే అక్కడికి సమీపంలో నిలబడ్డ ఓ వ్యక్తి చాలా ఆందోళన పడుతున్నాడు.
అతడు రవి.....!
* * * * *
"ఏమిటంత వుత్సాహంగా వున్నావు?" రాజేందర్ చేతుల్లో నలిగి పోతున్న రజని ఉక్కిరిబిక్కిరవుతూనే అంది రొప్పుతున్నట్టుగా.
"సావేరికి నేను మొగుడ్ని కాబోతున్నాను...." పైకి లేస్తూ అన్నాడు.
"ఆ మాట వినగానే గుండె కలుక్కుమంది రజనిని తనకేదో నష్టం జరుగుతుందని కాదు. శంకూ స్థానంలో రాజేందర్ ని ఊహించలేక" నువ్వెప్పుడూ చెప్పేదేగా?"
"ఎప్పటిలా నేనిప్పుడు చెప్పటంలేదు రజనీ...." బయట చీకటిలోకి చూస్తూ అన్నాడు రాజేందర్. "ఇందాక మా బావ తనంతట తానుగా ప్రపోజల్ పెట్టాడు వెంటనే యిద్దరికీ పెళ్ళి జరిపించాలని."
నిర్వీన్నురాలైందామె. "ఇన్నాళ్ళూ లేనిది ఈ రాత్రి ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నట్టు....?" ఒకవేళ సావేరి 'ప్రేమ' సంగతి తెలిసిపోయిందా?"
సావేరి 'ప్రేమ' అని రజని అనటం బొత్తిగా నచ్చకపోయినా నిభాయించుకున్నాడు. "బహుశా తెలిసిపోయి వుంటుంది" ఫోన్ సంగతి క్లుప్తముగా చెప్పాడు "ఏ స్టూడెంటో లేకపోతే మావయ్య సంగతి తెలిసిన ప్రిన్సిపాల్ అక్కడ తతంగం చెప్పివుంటాడు. అంటే....సావేరి త్వరలో నా భార్యవుతుంది...."
సీలింగ్ వేపు చూస్తూ వుండిపోయింది రజని చాలాసేపటిదాకా.
"ఏమిటి....ఏమిటి ఆలోచిస్తున్నావు? నీకేదో కీడు జరిగిపోతుంది అనా.....?" మరోసారి పక్కకి చేరుతూ అన్నాడు.
నిర్లిప్తంగా నవ్వేసింది. "పతనమైన నాలాంటి ఆడపిల్ల పతితల గురించి అంతగా ఆలోచించరు రాజా.....ఎక్కడో, ఏ మారుమూలనో యింకా చావని మానవత్వం ముగిసిపోయే మరో కన్నె బ్రతుకు గురించి ఆందోళన పడుతుంది."
"ఏమిటి.....కొత్తగా మాట్లాడుతున్నావు?"
సావేరి, శంకూల రూపాలు ఆమె కళ్ళముందు నిలిచి కలవరపెడుతున్నాయేమో!"ఈ రోజు కాలేజీలో జరిగింది గుర్తు చేసుకుంటే అనిపిస్తూ వుంది."
"ఏమని?"
"సావేరి శంకూని మరిచిపోలేదని....!"
"మెడవంచి బలవంతంగా తాళి కడతాను."
"అప్పుడు అందరమ్మాయిల్లా సావేరి తల వంచుకొని కాపరం చేయదేమో?" రాజేందర్ కి చురుక్కుమంది.
"బహుశా ఆ స్థితి రాకముందే ఎదురు తిరుగుతుంది తప్పితే పసుపు తడుకి బదులు ఉరితాడుతో బ్రతుకుని అంతం చేసుకుంటుంది."
"నీకు పిచ్చెక్కుతున్నట్టుంది."
నిర్వేదంగా చూస్తూనే అదోలా నవ్వింది రజని. "నిజానికి పిచ్చి దానిలా నీ వెంటపడ్డ నాకు ప్రేమ గురించి అంత అవగాహన లేకపోవచ్చు. కానీ సాటి ఆడపిల్ల మనస్తత్వం గురించి కొంత ఆలోచించగలను."
"నీతో అసలిదంతా మాట్లాడాటం నా బుద్దితక్కువ...." విసుగ్గా అన్నాడు. కానీ రాజేందర్ లోనూ అలాంటి భయం చోటుచేసుకునే వుంది. అప్పటికే....ఇప్పుడు రజని మాటలు వింటుంటే అది ద్విగుణీక్రుతమయిపోయింది.