"నువ్వు మరోదాన్ని కట్టుకొంటేనో, నువ్వు మరోదాన్ని తగులు కొంటేనో నువ్వుకాదా ఎంగిలి వాళ్ళకు?"
"ఎంగిలి అన్నపడం మగవాడి జీవితంలో లేదు."
"అని ఎవరన్నారు? మనువు అన్నాడా? పరాశరుడన్నాడా? యాజ్ఞవల్క్యుడన్నాడా? ఏశాస్త్రకారు డన్నాడు?" ప్రేమీ కొట్టినట్టుగా అడిగింది. "ఆడదాని జీవితం ఇంతహీనంగా, మగవాడి జీవితం అంతదర్జాగా శాసించిన ఆ శాస్త్రకారు లెవరో ఇప్పుడుంటే నా వాళ్ళందరినీ లాక్కుపోయి కట్టగలిపి సజీవ దహనం చేసేదాన్ని."
"పోనీయ్, పాపా! రమణయ్య ఒక మామూలు సంసారి. అతడితో ఎంత పోట్లడినా ప్రగతి వైపు ఒక్క అడుగు కూడా వేయలేవు. ఎందుకొచ్చిన కంఠశోష? మీ యుద్ధం చదువుకొన్న వాళ్ళతో జరగాలి. అభ్యుదయం తలుపులు అటునుండి తెరవబడాలి?"
"మా యుద్ధం క్రిందినుండి ప్రారంభం కావాలి, నాన్నా! చదువు కొన్న వాళ్ళతో పెద్దగా యుద్ధం చేయక్కరలేదు. వాళ్ళకి కొంచెంచెబితే చాలు. ఈ రమణయ్య చూడు. పాతిక సంవత్సరాలుగా తనను నమ్మిసేవచేస్తున్నస్త్రీకి అతడిస్తున్న బహుమతి చూడు. పిల్లలకోసం మళ్ళీ పెళ్ళాడతాడట. ఈయన చిన్న భార్యతో కులుకుతూంటే అత్తచూడాలి. ఆడదానికి అంతకంటే హృదయశల్యం ఏమైనా ఉందా? అత్తకి ఇదే చింత అయిపోయిందట ఎప్పుడు తనింట్లో సవతి అడుగుపెడుతుందోనని. ఆమెవస్తే తనింటికే తను పరాయిదైపోవాలికదా? తలుచుకొంటే రాత్రిపూట నిద్రపట్టడం లేదట. ఇతడు అత్తకి సవతిని ఎలాతెస్తాడో చూస్తాను. మగవాళ్ళ ఈ అన్యాయం ఎలా సాగుతుందో చూస్తాను."
"ఏం చేస్తావు? పిల్లల్లేని కారణంతో నేను రెండోపెళ్ళి చేసుకోవచ్చు. అది చట్టవిరుద్దం కాదు." రమణయ్య ధీమాగా లేచాడు. "కూతురు! కూతురికి తగ్గ అబ్బ. కూతురికి ఏమైనా బుద్ది చెప్పకొంటా డనుకొంటే ఇదీ వరుస. సుందరయ్యా, నీకు ఏళ్ళొచ్చాయి ఎందుకు? ప్రపంచజ్ఞానం లేకపోయాక."
"నేను మరోసారి మాట్లాడతాను నీతో. ఇప్పుడు కాదు." కొంచెం విసుగుతో చేతులు జోడించాడు సుందరయ్య. "పాపా! లోపలికి వెళ్ళమ్మా."
వస్తూన్న కోపాన్ని ఆపుకొని తండ్రిమాట మీరలేనట్టుగా లోపలికి నడిచింది ప్రేమీ. విసురుగా తిరగడంలో ఆమెజడ ఒకటి నడుముకి పాములా చుట్టుకుంది.
రమణయ్య నిష్క్రమణంతో వాన వెలిసినట్టుగా అయింది.
"ఈ మధ్య పాప తగువులు తేవడం ఎక్కువైపోయింది. ఏం చేయను? అన్యాయం ఎవరికీ జరిగినా చూసి సహించలేదు. ఏదో అనేస్తుంది. అవి తగువులై ఇలా ఇంటి మీదికి వస్తాయి యుద్దానికి." విచారంగా అన్నాడు సుందరయ్య. ఆ విషయం అంతటితో వదిలివేస్తున్నట్టుగా, "ఇక చెప్పండి, బాబూ! మీ అత్తగారు పంపించారా మిమ్మల్ని? ఏమని చెప్పండి?" అనడిగాడు.
"జరిగిందంతా చెప్పింది. ఆవిడకి ముచ్చటగా ఇద్దరాడపిల్లలు, ఆదరంగా చూచుకొనే భర్త. అంతులేని ఐశ్వర్యం వున్నాయి. ఇవేమీ ఇప్పుడు ఆమెకు ఊరట కలిగించటం లేదు. మీరు పేపరులో ఆ ప్రకటన ఇచ్చి ప్రశాంతంగా ఉన్న ఆమె జీవితాన్ని కల్లోలంచేశారు. నిశ్చింతగా ఉన్న మనసులో అలజడిరేపారు. అహర్నిశలూ ఆమె ఆలోచనంతా ఈ కూతురి మీదే ఉంది. ఆమెను చూస్తుంటే కుంతీదేవి కథ ఈ కలియుగంలో రిపీట్ అవుతుందేమోననిపిస్తుంది. నిజంగా మా గీతత్త హృదయం ఒక రణరంగంలా ఉందిప్పుడు. ఈ సమాజంలో గౌరవప్రదమైన తనస్థానాన్ని పోగొట్టుకోలేదు. ఈ కూతుర్ని వదులుకోలేదు. ఇరవై ఏళ్ళక్రితం ఈ సమాజ భయం తల్లి మమకారాన్ని తలెత్తనీయలేదేమోగాని ఈ రోజు మాత్రం అది అణిచి ఉంచలేకపోతూంది. అది శాఖోపశాఖలుగా ఒక మహావృక్షమై పోయింది. ఆ వృక్షచ్చాయ క్రిందికి కూతుర్ని చేర్చుకొంటే తప్ప ఆమెకు తృప్తి, శాంతీ లేవు."
మృదు మధురంగా, గంభీరంగా ఉన్న అతడి మాటలు ప్రేమీకి వినిపిస్తూనే ఉన్నాయి.
"యదార్ధ పరిచయం చేసుకొంటే తప్ప పాప ఆ వృక్షఛాయని ఆశ్రయించలేదు."
"గౌరవంగా సంసారం చేసుకొంటున్న గృహిణి. పెళ్ళికాకముందు తనకి ఓ బిడ్డ పుట్టిందని చెప్పుకోగలదా? కేవలం గృహిణిమాత్రమే కాదు. మరో ఇద్దరాడపిల్లలకు తల్లికూడా. వాళ్ళ భవిష్యత్తుకూడా ఆమెకు ముఖ్యమే."
"పాపని మీరు ఒప్పించగలిగితే నాకేమీ అభ్యంతరం లేదు పాప తనవాళ్ళని చేరుకొంటే నాకూ నిశ్చింత నేను పోయాక ఆమె దిక్కులేని దవుతుందనే పేపరుకి ఆ ప్రకటన ఇచ్చాను."
"మీ పాపతో మాట్లాడడానికి నేను మరోసారి వస్తాను. ఇప్పుడు కాదు అయినా మీరున్నంతవరకు ఆమె మీ దగ్గరుండాల్సిందేగా?"
"ఆమె భవిష్యత్తుకు సోఫానం నాకళ్ళముందే పడితే నాకు నిశ్చింత ఏర్పడుతుంది."
"మీరు ఆ విషయంలో మాత్రం నిశ్చింతగా ఉండమని కోరుతున్నాను. మాగీతత్త తన కూతుర్ని దిక్కులేని దాన్నిగా ఉంచదు ఇరవయ్యేళ్ళనాడు ఆమె తల్లిదండ్రుల చాటు ఈ కూతుర్ని పారేసుకొందేమోగాని ఇప్పుడు మాత్రం పారేయలేదు."
"పాప అభిమానం గురించి మీకు తెలియదు. ఆమె పట్టుదల గురించి అసలు తెలియదు."
"తెలియకపోతే తెలుసుకొంటాను. ఆమెను గెలిచే మార్గంకూడా తెలుసుకొంటాను. ఇది వరలో గీతత్త ఈ విషయంలో ఒంటరిది. ఇప్పుడు ఆమె వెనుక నేనున్నాను. ఆమె రహస్య ప్రయాణగాధకు, కూతుర్ని పారేసుకొన్న కరుణగాధకు వాళ్ళన్నయ్యతో నేనూ ఒకసాక్షిని. మీ పాపని ఒంటరిదానిగా మాత్రం వదిలేయం."
సుందరయ్య కళ్ళు విప్పార్చుకొని విశాల్ ముఖంలోకి చూడసాగాడు. చూడగానే గొప్పఇంటివాడుగా కనిపించే ఈ యువకుడిలో కావలసినంత సంస్కారం, ఏ విషయమైనా తుదివరకూ చూచే సహనం ఉన్నాయనిపించింది.