Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 40

    సింగపూర్, బ్యాంకాక్ పర్యటించి  వచ్చాక తన బావ శ్రీకాంత్ చెప్పిన అనుభవాలు ఆమెకు గుర్తువచ్చాయి.
ఎందుకో వళ్ళు  జలదరించింది. మరో వైపు తన స్నేహితురాలు ప్రజ్ఞ స్వచ్చమైన హృదయంతో అనే మాటలు, ఆమె అమాయకత్వం గుండెల్లో కదుల్తున్నాయి. ఈ ప్రపంచం ఎటువైపు పయనిస్తోంది. ఇన్ని భిన్న ధృవాలు, యింత వైవిధ్యంతో కూడిన మనస్తత్వాలు ...

    ఉన్నట్టుండి ఆమె తన గురించి తాను ఆలోచించింది. ప్రతి చిన్న విషయాన్ని గురించీ, ఎదురయే ప్రతి సంఘటన గురించీ  తానెంతో నిశితంగా, చిత్త శుద్దితో పరిశీలిస్తున్నాననుకుంటుంది. కాని యితరుల దృష్టిలో ఎలా కనబడుతుంది! ఆమె ముఖం పాలిపోయినట్లయింది.

    "డాడీ! నా మాటలు  కూడా  చాలా  పెర్ వెర్టివ్ గా వుంటాయా?" అనడిగింది. ఆమె గొంతు కొంచెం వొణికింది.

    ధర్మారావు కూతురి వంక ప్రేమగా చూశాడు. ఆమె మనసులో మెదుల్తోన్న సంఘర్షణ అతని కర్దమయింది. తాను జీవితంలో ఎదగటానికి ఎన్నో రకాల షెర్ వర్ షన్స్  వున్నవారిలో సన్నిహితంగా మెలగవల్సి వచ్చింది. అతిధోరణి అనేది తనకు కొత్తేమీ  కాదు. అని మనుషుల్లో పొంచివుండి అవసరమొస్తే  బయటపడుతూ వుండడం  అతను  చాలా విరివిగా చూశాడు. వాటిని భరించటమూ  నేర్చుకున్నాడు.

    "లేదు తేజా ! నీ గురించి అలా ఎప్పుడూ  అనిపించలేదు" అన్నాడు.

    తేజ మానసికంగా చాలా చాలా ఎదుగుతోందని  అతనికి తెలుసు. ఒక వ్యక్తి  మానసికంగా ఎదుగుతున్నప్పుడు ఎలాంటి ఆత్మ  మధనకు గురి అవుతుంటాడో  కూడా  అతనికి తెలుసు.

    తేజ ఏదో అనబోతోంది. ఇంతలో  బయట కారాగిన చప్పుడయింది.
 
    తేజ మూడ్ చెదిరినట్లయి  తాననబోయే మాట  మరిచిపోయింది. ఓ నిమిషం తర్వాత విద్యుల్లతాదేవి  లోపలకు వచ్చింది.

    తేజ తలెత్తి తల్లి ముఖంలోకి చూసింది. ఈ క్లబ్బులూ, పేకాట, సొసైటీ _ యిదంతా  చూస్తోంటే  అసలీమె తన తల్లేనా, తాను మాతృప్రేమ ననుభవిస్తోందా  అనిపించింది. లేచి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది.

    "మీరిద్దరూ  కూచుని  నా గురించి  ఆడిపోసుకుంటున్నారా?" అనడిగింది విద్యుల్లతాదేవి.

    "మా ఇద్దరి  మధ్యా  నీ ప్రమేయం  రాకుండా  మేమెప్పుడూ జాగ్రత్తపడుతూ  వుంటాము."

    "ఏం? నేనంత కానిదన్నయిపోయానా ?"

    "అయినదానివి  కాబట్టే  పరోక్షంగా  మాట్లాడి  అగౌరవపర్చటమిష్టంలేక."

    "తేజ నన్ను ఓ తల్లిగా చూడటంలేదనిపిస్తుంది!"

    "అది తన తప్పుకాదు!"

    "అంటే నా తప్పంటారా?"

    "ఆ మాట నేననలేదు."

    "ఈ మధ్య మనిద్దరి మధ్యా దూరం ఎక్కువవుతోందని  నా కనుమానంగా వుంది."

    "మనిద్దరం భార్యాభర్తలుగా  జీవితాన్ననుభవిస్తూనే వున్నాం."

    రెండు నిమిషాలు నిశ్శబ్దంగా  దొర్లాయి.

    "నాకు ఎల్లుండికల్లా  అయిదు  లక్షల రూపాయలు కావాలి" అంది నొక్కి నొక్కి  చెబుతున్నట్టు.

    అతనేం జవాబివ్వలేదు.

    "మాట్లాడరేం ?"

    "ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు"

    "కాని కావాలి _ అవసరం!"

    "లేదని చెప్పాను" అని అతను లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

    ఆమె వొదిలిపెట్టకుండా  అతని వెనకాలే  వెళ్ళింది. "ఎంతో  అవసరం వుండి డబ్బడిగితే  అలా నిర్లక్ష్యంగా  జవాబు చెప్పి  వచ్చేస్తారేం. ఇస్తారా, యివ్వరా ?" అనడిగింది నిలదీస్తున్నట్టుగా.

    కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోన్న వాడల్లా ధర్మారావు యిటుకేసి తిరిగాడు.

    "అంత డబ్బు ఒక్కసారి దేనికి?" అన్నాడు అతని గొంతులో మునుపెన్నడూ వినిపించని కాఠిన్యం ధ్వనిస్తోంది.

    "ప్రతి చిన్న విషయం మీకు చెప్పాలా ?"

    "ఇది మరీ అంత చిన్న విషయం కాదని  నా ఉద్దేశం."

    "మీ ఉద్దేశాలతో  నాకవసరం  లేదు. మనకిద్దరికీ  సంబంధించినంతవరకూ  నా సొంత విషయాలు మీకు చెప్పే అవసరం  నాకు లేదు."

    "అయితే నేను చెబుతున్నాను  విను. నువ్వీ మధ్య ఆచార్య జగదీష్ శిష్యకోటిలో  చేరావనీ, అందుకనే  చీటికీ మాటికీ యీ  మధ్య హైదరాబాద్ వెళ్ళి వస్తున్నావనీ, జగదీష్ ఆశ్రమానికి డొనేషనివ్వడానికి యీ డబ్బు అడుగుతున్నావనీ నాకు తెలుసు. అవునా ?"

    ఆమె మొహం  వెలవెలబోయింది. శరీరంలో  చిన్న  ప్రకంపన బయల్దేరింది.

    "విద్యుల్లతాదేవీ!" ధర్మారావు కంఠం  ఖంగుమని మ్రోగింది.

    "మనిద్దరి మధ్యా ఒడంబడికలాంటిది  వున్నదని నువ్వనుకోవటం, నీ ఆస్తితో నువ్వు నన్ను  కొనేశానని  అనుకోవటం  నీ అజ్ఞానం. నా సంస్కారంమీద, జీవితానుభవం  నేర్పిన లౌక్యం  వల్ల  నిన్ను  భరిస్తూ  వచ్చాను  గాని నీకు  ఘడిసి  కాదు. ఈ మధ్య నాకు  బిజినెస్ లో బాగా నష్టమొచ్చింది. ఇంచు మించు పాతిక  లక్షల  రూపాయిలదాకా  పోయింది. అందుకని  నీకు సర్దడానికి ప్రస్తుతం నా దగ్గర  డబ్బు లేదు."

    ధర్మారావు విసురుగా  బయటకు వెళ్ళిపోయాడు.


                *                     *                    *  

 

 Previous Page Next Page