Previous Page Next Page 
భారతి పేజి 41

   
    "వాళ్ళు  నిజం తెలుసుకుంటున్నారు."

    ఒక్క నిమిషం మౌనంగా  గడిచింది. అటువంటి  మనుషుల్ని  ఉపన్యాసాలతో  మార్చగలుగుదామన్న  నమ్మకం లేదు భారతికి. అర్దరాత్రి పూట  ఈ సోదేమిటని  విసుక్కుంటూ  అతనెప్పుడు  వెళ్ళిపోతాడా  అని ఎదురు చూస్తూంది.

    ఉన్నట్లుండి  పెద్ద పెట్టున  నవ్వు  వినిపించేసరికి  ఉలిక్కిపడి  చూసింది. డాక్టరు తమ యిద్దరి మధ్యా ఏర్పడ్డ  గంభీర  వాతావరణాన్ని  తన నవ్వుతో  ఎగరకొట్టి  వేయటానికి ప్రయత్నిస్తూ "బలే, ఈ విషయంలో ఎవరి సిద్ధాంతాలు వారివి. వ్యక్తిగతంగా  నువ్వంటే  నాకేం ద్వేషం లేదు. పైపెచ్చు  యిష్టం కూడా. ఐ లైక్ యు" అన్నాడు.

    భారతి హఠాత్తుగా  మారిన  అతని ధోరణికి  విస్తుపోయి, అలాగే కళ్ళప్పగించి  చూస్తూంది.

    "నిజం. నువ్వంటే  చాలా యిష్టం. చెప్పాలంటే  జాలి కూడానూ!"

    ఆమె రెండు చేతులూ  హృదయం మీదుగా  కట్టుకుని  నిలబడింది. "జాలా? అదెందుకని?" అంది కంఠంలో  వ్యంగ్యం ధ్వనిస్తూండగా.

    "ఎందుకా? నీ జీవితాన్ని చూసి"

    "నా జీవితం  గురించి మీకేం తెలుసు?"

    "తెలియకుండా  వుండటానికి  అందులో  ఏమీ మిస్టరీలేదు. నువ్వు రావ్ బహదూర్ గంగాధరంగారి కోడలివి! పెళ్ళయి ,కాళ్ళ పారాణి యింకా  ఆరకుండానే  నీకున్న  జబ్బుని  తెలుసుకుని  నీ భర్త నిన్ను వదిలేశాడు. ఏం? చాలా?"

    ఎంత ధైర్యంగా  ఉందామన్నా  చేతకాలేదు. కాళ్ళ క్రింద  భూమి కంపించినట్లయింది. శరీరం తూలి  క్రింద పడబోయి, తలుపు చెక్కను  గట్టిగా  పట్టుకుని  సంబాళించుకుని  నిలబడింది.

    పరీక్ష చేయించుకునేందుకు  తండ్రితో  వెళ్ళినప్పుడు  తప్ప  తిరిగి ఎప్పుడూ చూడని  తనని గురించి  అతను ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నాడు? అంత బలహీన స్థితిలోనూ  అవే ఆలోచిస్తూందామె.

    డాక్టరు లేచి మెల్లగా అడుగులు వేస్తూ  ఆమె దగ్గరకు వచ్చి  ఎదురుగా  నిలబడ్డాడు. ఆమె అతన్ని  గమనించలేదో, గమనించినా సరిగ్గా బోధపడక ఊరుకుందో, ప్రక్కకి  తప్పుకోక అలాగే  నిలబడింది.

    అతనామెను  మరింత  సమీపించి  ఇంచుమించు  తాకుతూ  నిలబడ్డాడు. అతని ఒంట్లో  రక్తం  వేడెక్కి  ప్రవహిస్తోంది. గుండె దడదడమని  కొట్టుకుంటూంది. వణుకుతూన్న  చేతుల్ని  స్వాధీనంలోకి  తెచ్చుకునేందుకు  ప్రయత్నిస్తూ, ధైర్యంగా  వాటిని   ఆమె భుజాలమీద వేశాడు.

    ఆమెలో  ఉలికిపాటు లేదు. తీవ్రంగా  ఆలోచిస్తూంది. ఎవరితను? ఎప్పుడో మళ్లీ చూసినట్లుగా  వుంది ఎప్పుడు?

    ఆమె భుజాలను గట్టిగా పొదివి పట్టుకుని  ముఖం మీదకు వంగుతున్నాడు డాక్టరు.

    హఠాత్తుగా  ఆమె తలలో మెరుపు  మెరిసినట్లయింది. అప్పుడు  కనిపించింది  తన ముఖానికి  కొన్ని సెంటిమీటర్ల  దూరంలో  వున్న డాక్టరు  మొహం  త్రుళ్ళిపడి  తన బలమంతా  ఉపయోగించి  అరచేత్తో అతన్ని  దూరంగా  త్రోసింది. "దుర్మార్గుడా!" అంటూ.

    వెనక్కి  తూలిపడిన  డాక్టరు, "బలేదానివి" అంటూ  నవ్వటానికి  ప్రయత్నం  చేశాడు.

    భారతి  అతనివంక  నిప్పులు  క్రక్కుతూ  తీవ్రంగా  చూసింది. "నువ్వు  నా పెళ్ళికి  వచ్చావు. రిసెప్షన్ రోజున మా మామగారితో  కలిసి నడుస్తూంటే  వెనుకనుండి  చూశాను. ఆ హడావుడిలో  ఎవరో  గుర్తుపట్టలేకపోయాను" అంది కంఠంలో  అంతకంటే  తీవ్రత  ధ్వనిస్తూండగా.

    డాక్టరు ఆమె ఆరోపణను  ఆమోదిస్తున్నట్లుగా  నవ్వాడు. విస్కీ మూడు పెగ్గులు  బిగించి  అర్ధనిషాలో  ఉన్న అతను సిగ్గును గౌరవంగా రూపొందించుకున్నాడు.

    "అవును. నేనే!" అన్నాడు  భుజాలెగురవేస్తూ. "గంగాధరం నాకు బాల్యమిత్రుడు. అతని హోదాకు, అంతస్తుకు  నువ్వు కోడలుగా  పనికిరావు. అందులో  అప్పుడు నువ్వు  లెప్సరీవి. వాళ్ళ ఇంట్లో  పని చేసేదానివిగా  వుండటానికి కూడా నీకు అర్హత లేదు. అందుకే  నేను నిజాన్ని  చెప్పి నిన్ను బహిష్కరించేటట్లుగా  చేశాను."

    అతని మాటల్లో  విజయగర్వం  తొణికిసలాడుతూంది.

    "ఛీ! ఎంత  నీచుడివి!" అంది భారతి  అసహ్యంతో. అతనంటే  కలిగిన ఏవగింపుతో ఆమె శరీరం  గగుర్పొడిచింది.

    "నేను  చేసినపనికి  ఎప్పటికీ  విచారించను నేను. భారతీ! కాని, నిన్ను చూస్తేనే నాకు జాలేస్తూంది. మొగుడు వదిలేశాడు. యౌవనం పాపం....ప్చ్__వృధాగా  కరిగిపోతోంది....నువ్వేమీ దిగులుపడకు భారతీ! మళ్లీ బయటివాళ్ళెవరో  అయితే  లోకమంతా  గుప్పుమంటుంది. నేనిక్కడి అధికారిని. మూడో కంటివాడికి  తెలియనివ్వను" అంటూ  మళ్లీ నవ్వి, ఆమెకు దగ్గరగా వెళ్ళి, నీలో  చెలరేగేకోరికలు  నాకు తెలియవనుకున్నావా? నువ్వు మాత్రం ఉప్పు కారం  తినటం లేదా? చూడు! మా ఆవిడ  ఇంకో పదిహేను  రోజులదాకా  రాదు. బలే అవకాశం కదూ" అని ఆమె భుజంమీద చెయ్యి  వెయ్యబోయాడు.

    ఆమె చప్పున  దూరంగా  తొలగిపోయి, "ఏడిశావు  కానీ  ఇక్కడి నుంచి  దయచెయ్యి" అంది కఠినస్వరంతో.

    "ఎంత  మాటపడితే  అంత  మాట అనకు, భారతీ! నేను నీ పై అధికారినని  మరిచిపోకు."
   
    "అధికారి వైతే  ఏం చేస్తావ్?"

    "ఏమయినా  చెయ్యగలను! నీ ప్రవర్తన  సక్రమంగా  లేదని పైకి రాసి నీ ఉద్యోగం  ఊడపీకించగలను."

    భారతి  వెటకారంగా  నవ్వింది. "ఇంతవరకూ  వచ్చాక నేనింకా  ఇక్కడ పనికి  ఆశిస్తాననుకున్నావా? నేనే రిజైన్ చేస్తాను."

    "సరే! కాని, నేను మాత్రం  నిన్నీవేళ  వదులుతాననుకున్నావా!"

    "నీ ఉద్దేశం...." 

    "నా ఉద్దేశం" అంటూ  బిగ్గరగా  నవ్వాడు. "అర్దరాత్రి పూట  నీ ఇంట్లో  చేరి ఇంత పెద్దగా  నవ్వగలిగానంటే  ఎందుకో  తెలుసా? ఇక్కడేం  జరిగినా  బయటవారెవరికీ  తెలిసే  అవకాశం లేదనే. ఈ క్వార్టర్స్__పాపం! వాళ్ళెంత  దూర దృష్టితో  కట్టించారో  కదా!" అని గభాలున  తలుపులు  రెండూ మూసి గడియ వేసేశాడు.

    ఆమెవంక  తిరిగాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా  మండుతున్నాయి. ముఖంలో  ఓ అసహ్యపూరితమైన ఆవేశం  గోచరిస్తూంది. అన్నాడు: "రేప్ అంటే  ఏమిటో  ఇంతవరకూ  పేపర్లలో  చదివి వుంటావు. ఇప్పుడు  ప్రత్యక్షంగా...." మాట పూర్తి  చేయకుండానే  మీదకు వచ్చాడు.

    "ఆగు!" భారతి ఆవేశంతో  అరిచింది. ఆమె చేతిలో  పదునైన  చాకు విద్యుత్ వెలుగులో  తళతళమని మెరిసింది.

    డాక్టర్ జంకి  ముందుకు  వేయబోయిన  అడుగును  ఉపసంహరించుకుని, ఉన్నచోటనే  నిలబడిపోయాడు. మళ్ళీ వెంటనే  తమాయించుకుని, తనేమీ ఆమె బెదిరింపును  లెక్కచేయనట్లు  కనిపించడానికి  ప్రయత్నిస్తూ, "పరిహాసాలు  కట్టిపెట్టు  భారతీ! పండ్లు  కోసుకోవటానికి  ఉపయోగపడే కత్తి....అది నీకే విధంగానూ  అడ్డుపడదు" అన్నాడు.

    భారతి ధైర్యాన్ని  కోల్పోకుండా  దృఢస్వరంతో  అన్నది: "అవును  పండ్లు  కోయటానికీ  ఉపయోగిస్తుంది: ఈవేళ  నీ గొంతు కోయటానికి కూడా ఉపయోగిస్తుంది. బహుశా మర్డర్  గురించి  పత్రికల్లో  చదివి ఉంటావు. ఈవేళ  ప్రత్యక్షంగా  చవిచూస్తావు."

    డాక్టరు ఆమె ముఖంలోకి  పరిశీలనగా  చూశాడు. అందులో  ప్రస్పుటమౌతూన్న  పౌరుషం. ఆమె కన్నులలో  ప్రతిబింబిస్తూన్న  ఆత్మవిశ్వాసం  అతని ధైర్యాన్ని  చెడగొట్టి  భీరుణ్ణి  చేసివేశాయి. ఎంత ప్రయత్నించినా  అడుగు ముందుకు పడలేదు. 'అమ్మో! ఆడది తెగిస్తే ఎంత పనయినా  చేస్తుంది. జీవితంలో  సంభవించిన దారుణమైన ఓటమిని చిరునవ్వుతో  మ్రింగివేసిన స్త్రీకి తన  అంతు కనుక్కోవటం  పెద్ద సమస్యకాదు. ఆమె ఉద్రేకంలో పొడిచేస్తే  తను వెంటనే  మరణించకపోవచ్చు. కాని, తాను డయాబిటస్ పేషెంట్. తన కాలికి చిన్న ఎదురుదెబ్బ  తగిలినా  కోతిపుండు  బ్రహ్మరాక్షసై  సతాయిస్తుంది. ఈ రిస్క్ ఎవడు తీసుకుంటాడు!"

 Previous Page Next Page