రోజు రోజుకూ డాక్టరు మీద ఆమె వినే ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి. అతనికేం జరిగిందో తెలియదు. క్రమంగా అతనిలో కఠినత్వం ఎక్కువైపోతూ ఆమె కంటికి రాను రాను కిరాతకుడిలా కనిపించసాగాడు. వేళప్రకారం రోగులకు అందే ఆహారం కూడా మార్పును తెచ్చుకుంది. అక్కడి వారెవరికి భోజనం సరిగ్గా అందటం లేదు. మందులు వుండటంలేదు. వాళ్ళలో అలజడి బయల్దేరింది. అతన్ని వాళ్ళసహ్యించుకుంటున్నారు. అతన్ని చూస్తేనే మండిపడుతున్నారు.
డాక్టరు ధైర్యం, మొండితనం భారతికి అర్ధం కాలేదు. ఎందుకంత గొప్ప అతనికి? ఎప్పటికీ పట్టుబడనని ఏమిటా నమ్మకం? ఆసుపత్రి పరిస్థితి చూసేసరికి ఆమె మనసు అల్లకల్లోలమై పోయింది.
రోగులలో అశాంతి ఎక్కువై పోయింది.
ఎన్నోసార్లు అతన్ని నిలవేసి అడిగింది. "నీకనవసరం" అని అతని జవాబు. లేకపోతే విషపు నవ్వు నవ్వుతాడు. ఈ గొడవల్లో భారతికి మనశ్శాంతి ఉండటంలేదు.
ఒకరాత్రి ఆమె గదిలో లైటు వేసుకుని మల్లికకూ, నాగరాజుకూ ఉత్తరాలు రాస్తూంది.
మల్లిక దగ్గర నుంచి ఆమెకు కనీసం పదిహేను రోజులకో ఉత్తరమైనా వస్తుంది. తను కూడా అలాగే జవాబు లిస్తూంది. హౌస్ సర్జన్ అయిపోవచ్చింది మల్లికకు. తరువాత గవర్నమెంటు ఉద్యోగంలో చేరుదామా, ప్రైవేటు ప్రాక్టీసు పెడదామా_యింకా నిశ్చయించుకోలేదామె. పై చదువు చదివే ఆలోచన మాత్రం లేదు.
'మల్లిక లైఫ్ లో సెటిల్ అయిపోయే రోజు వస్తున్నది. అయిపోతుంది. తరువాత పెళ్ళి కూడా చేసుకుంటుంది. అప్పుడింకా పూర్తిగా స్థిరపడిపోయినట్లే' అని తలపోసేది భారతి.
మల్లిక పెళ్ళి అనుకోగానే__ఆమెతో తరుచూ కనిపించే యువకుడు గుర్తు వచ్చేవాడు, అవును. అతనైతే బాగుంటాడు. వాళ్ళిద్దరి జోడీ బాగుంటుంది....అనుకునేది.
ఒకసారి ఆమె నాగరాజుకు ఉత్తరం రాసింది. నాగరాజూ! ప్రతి జీవితానికి ఒక పరమార్ధం ఉండాలి. రోజులు మొండిగా, బండగా గడిచిపోకూడదు. అలా ఒంటరిగా ఏ సంబంధమూ, ఏ బాంధవ్యమూ లేకుండా ఎన్నాళ్ళని గడుపుతావు? నువ్వు పెళ్ళిచేసుకో నాగారజూ! నువ్వో యింటివాడివి అయితే అదే నాకు పరమానందం. నీ నుంచయినా కనీసం అలాంటి తృప్తిని నాకు ప్రసాదించు."
దానికి అతని దగ్గరి నుంచి జవాబు వచ్చింది.
"....పెళ్ళి! దానిమీద నాకు అభిరుచి చచ్చిపోయింది భారతీ!
"అది నా జీవితానికి అంత అవసరమైనదిగా నాకు కనబడటం లేదు"
"పైగా ఈ అవిటివాణ్ణి ఎవరు పెళ్ళి చేసుకుంటారు చెప్పు."
"నా కిలాగే అలవాటయిపోయింది. ఇదే బాగుంది."
"సంబంధాలూ, బాంధవ్యాలూనా? అన్నిటికీ మించి నువ్వున్నావు. అది చాలదూ?"
"ఇంతకంటే నాకేం కావాలి?"
జవాబు చదువుకుని భారతి మనస్సంతా వికలమైపోయింది. కాని, ఓ నిట్టూర్పు విడిచి అన్నిటినీ మరిచిపోవటం అలవాటు చేసుకుంది. అదే జరిగింది.
ఆ రాత్రి మల్లికకూ, నాగరాజుకూ ఉత్తరాలు పూర్తిచేసి, కవర్లలో పెట్టి అంటించి, తరువాత ఎంతసేపటికి నిద్రపట్టక వసారాలోకి వచ్చి నిలుచుంది. కృష్ణ పక్షపు చీకటి. ఆ చీకట్లో ఎత్తుగా, విశాలంగా పెరిగిన చెట్లూ, అక్కడక్కడా వున్న పొదలూ, దూరదూరంగా కట్టివున్న పెంకుటిళ్ళూ, అస్పష్టమైన ఆకారాలతో కనిపించాయి.
ఆమె అలా ఎంతసేపు నిలబడి వుందో తెలియదు. ఎదురుగా కొద్దిదూరంలో తన వంక ఓ నీడ కదిలి రావటం చూసి ఉలిక్కిపడింది .రెప్పవాల్చకుండా అటే చూడసాగింది.
క్రమంగా ఆ ఆకారం ఆమె దగ్గరకు వచ్చి నిలబడిపోయింది. "ఇలా చీకట్లో నిలబడి వున్నావేం భారతీ!" అంది డాక్టరు గోవిందరావు గొంతు.
ఇంత రాత్రివేళ అతను తన క్వార్టర్సుకి రావటం ఆమెకు చికాకనిపించింది." నిద్రపట్టక నిలుచున్నాను" అంది.
ఏదో అర్ధమైనట్లు డాక్టరు పెద్ద పెట్టున నవ్వాడు. "మా ఫామిలీ అంతా మా చెల్లెలుగారి యింటికి వెళ్ళారు కదూ, నేనూ ఒంటరిగా ఉన్నాను. ఎంతకూ నిద్రపట్టక బయటకు వచ్చేసరికి దూరంగా ఇక్కడి నుంచి నువ్వు నీడలా కనబడ్డావు. ఒకవేళ సహాయమేమైనా కావలసి వస్తుందేమోనని వచ్చేశాను. ఇక్కడ బయటెందుకూ? లోపల కూర్చుని కబుర్లు చెప్పుకుందాం పద!"
ఆ చీకట్లో భారతి ముఖం చిట్లించటం అతనికి కనిపించి వుండదు. కనిపించినా తలకెక్కదు. అతనికి కటువుగా ఎలా ప్రత్యుత్తరమివ్వాలో భోధపడక, మౌనంగా లోపలకు నడిచింది.
గదిలో లైటు ఆర్పేసే ఆమె ఇందాక బయటకు వచ్చింది. ఇప్పుడు లోపలకు వెళ్ళగానే లైటు వేసింది.
లోపలకు వెళ్ళాక, ఆమె చెప్పకముందే అక్కడున్న కుర్చీలో కూర్చుని, నలువైపులా కలయజూస్తూ "బ్యూటిఫుల్! సింపుల్ గా వుంచుతూనే ఎంత డీసెంట్ గా డెకరేట్ చేశావు! నీ టేస్టుని అభినందించాలి" అన్నాడు పొగుడుతూ.
భారతి ఏమీ మాట్లాడలేదు. తలుపుకు ఆనుకుని నిలబడి ఒకసారి తల ఆడించి వూరుకుంది.
"ఒంటరిగా వుంటున్నావు కదా! నీకు భయం వెయ్యదూ?"
"భయం ఎందుకు?"
డాక్టరు కృతకంగా నవ్వాడు. "అదే! ఆడదానివి. ఒంటరితనం భయం కాదూ?"
"నేను భయాన్ని మరిచిపోయాను" అంది వెంటనే. "ప్రక్కన ఎవరన్నా తోడు ఉంటే భయం వేస్తుంది పైగా."
ఆమెవంక రెప్పవాల్చకుండా చూస్తూ డాక్టరు అన్నాడు. "బలే దానివి భారతీ! అది సరే, ఆ విషయమలా వుంచు. నీకో సలహా చెప్పాలని వుంది నాకు.
చెప్పండి. సలహాలకు ఫీజు ఇవ్వనక్కరలేదుగా!"
"బలేదానివి. దేనికీ ఇవ్వనవసరం లేదు ఫీజు. అందులో నీకూ నాకూ మధ్యనా? చూడూ! చిన్నదానివి. పైకి రావలసిన దానివి. నీ ఆశయాలు మంచివే గాని. ఇలా పనికిమాలిన సేవలు చేస్తూ జీవితాన్ని వృధా చేసుకోవటం నాకు నచ్చలేదు. అందులోనూ ఇలాంటి రోగుల మధ్యనా నీ ఆదర్శాలు? ఇది లెప్రసీ భారతీ! లెప్రసీ! ఏ జన్మలో పాపం చేసుకున్నారో వాళ్ళిలా పుట్టారు. వాళ్ళని యాంత్రికంగా ట్రీట్ చెయ్యాలిగాని, ఇలా మితిమీరిన దయ చూపకూడదు. చూపితే వాళ్ళు మననెత్తి కెక్కుతారు."
తనకు హితబోధ చేస్తున్నట్లు అతను మాట్లాడే ధోరణి చూసి ఆమె నవ్వింది.
"అందులో నీ ఆరోగ్యం మంచిదికాదు. నువ్వు ఒకప్పుడు...."
"థాంక్స్! ఆ విషయం పదే పదే గుర్తుచేయనక్కర్లేదు."
"నీ మంచిని కోరి చెబుతూంటే నువ్వాలకించటం లేదు" అన్నాడు డాక్టరు విసుగుతో.
భారతి తల ఎత్తి అతనివంక కోపంగా చూసింది. "ఏమిటండీ మంచి? ఒక డాక్టరు అనవలసిన మాటలా యివి? వాళ్ళ తిండి, వాళ్ళ వసతులు, వాళ్ళ సౌకర్యాలు ఏమీ చూడటం లేదు మీరు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని మనుషులుగా చూడటం లేదు మీరు. కాల్చుకు తింటున్నారు. వాళ్ళంతా మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా?"
"ఏమనుకుంటున్నారేం?"
ఆమె ఓ క్షణం ఆగింది.
"రాక్షసు డనుకుంటున్నారు...."
అతనామెవంక అసలే ఎర్రగా వుండే తన కళ్ళని మరింత ఎర్రజేసి చూశాడు, అన్నాడు కఠినంగా: "నువ్వే దానికంతటికీ కారణం. నువ్వే"
ఆమె అతని మాటల్ని లెక్కచేయనట్లు నిర్లక్ష్యంగా చూసింది.
"అవును, నువ్వే. అంతకుముందు వాళ్ళందరూ ఏం చేసినా కిక్కురు మనకుండా అణిగి మణిగి పడివుండేవారు. నువ్వు వచ్చి వాళ్ళను రెచ్చగొట్టావు. ఇప్పుడు ఎదురు జవాబులు చెబుతున్నావు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు."