"నా ఒక్కడివల్ల ఏమవుతుంది? అంతే! వెల్లువలో పూచిక పుల్లలం__" అన్నాడు.
"నేను ఎంతచెప్పినా వినిపించుకోలేదు- ఆ సందర్భం లోనే మాకు మాటామాటా వచ్చింది. చివరకు విడిపోయాం అందుకే మీరెవరన్నా మీ ఒక్కరివల్లా ఏమవుతుందీ? అంటే నేను సహించలేను-నేను రవిని ఎంతగా ప్రేమించానో రవికి మాత్రమే తెలుసు. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రవి గుర్తుకు రాణి క్షణం వుండదు అతనికోసం ఆరాటపడకుండా ఉండలేను. అంతమాత్రంచేత ప్రతికూల పరిస్థితులకు లొంగిపోయిన అతని బలహీనతతో రాజీ పడలేను- అలా నరకం అనుభవిస్తున్నాను- ఒక సిద్దాంతానికి కట్టుబడి ఉండటం మాటలు కాదు. దానికి ఏరోజు ఎలాంటి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో మనం ఊహించలేము- దేనినైనా అర్పించుకోగలిగిననాడే దృఢంగా నిలవగలము......"
పరమేశ్వరి చివరి వాక్యాలు అక్కడి అందరి మనసులు లోనూ మళ్ళీమళ్ళీ మార్మోగాయి.
సుశీలతో కలసి సుఖంగా జీవితం గడపాలని ఎంత వుందో తాను ఇరుక్కొన్న విషవలయంనుండి బయట పడాలని కూడా అంతగా వుంది శేఖర్ కి. అయితే అందుకు సుశీలను పావుగా వాడుకొనే స్వార్ధం మాత్రం లేదు. అందుకే సుశీలకు వున్నవిషయం స్పష్టంగా చెప్పటానికే సంకల్పించుకున్నాడు.
"సుశీలా! మనం బయట పడటానికి ఒకేఒక మార్గం ఉంది. కానీ అందులో సాధక బాధకాలు చాలా ఉన్నాయి......"
"అసలు మార్గమేమిటో చెప్పండి___ మార్గమంటూ ఉంటె ఎన్ని బాధలు పడటానికైనా నేను సిద్దమే__"
ఉత్సాహంగా అంది సుశీల.
అమాయకంగా చిరునవ్వుతో వెలిగిపోయే సుశీల ముఖం చూస్తూ "నేనెంత అదృష్టవంతున్ని!" అనుకున్నాడు శేఖర్.
"సుశీ! మా తమ్ముడు స్టేట్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ముందుగా మా కుటుంబాన్ని అక్కడికి పంపించెయ్యాలి. అందుకు ఏ రహస్యమైన ఏర్పాట్లూ అక్కర్లేదు. ఆ తరువాత మనిద్దరం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి! దీనికి ఏర్పాట్లు రహస్యంగా జరగాలి___అది నేను చూసుకోగలను!"
"ఎక్సెలెంట్!"
"ఆలోచన బాగానే ఉంది. కానీ దీనిని ఆచరణలో పెట్టాలంటే చాలా డబ్బుకావాలి!" "నాన్నగారు తన లాభాలన్నీ ఎప్పటికప్పుడు సగం అమ్మ పేరుమీద సగం నా పేరు మీద ఉంచుతారు....."
"అది నాకు తెలుసు!"
"ఇంక ఆలోచన దేనికి?"
"సుశి జాగ్రత్తగా ఆలోచించుకో! నీ డబ్బంతా నా కోసం ఖర్చుపెట్టి......"
"మీకోసం కాదు! నాకోసమే ఖర్చుపెట్టుకుంటున్నాను మీరు సందేహించకండి!"
"సుశీ! నా మాట విను- నిదానంగా ఆలోచించుకో! అమాయకురాలివి. మీ నాన్నగారు నీకు అన్నివిధాలా నా కంటే మంచి వరున్ని తీసుకురాగలరు."
"ఇక్కడినుండి పారిపోనా?"
కోపంగా అంది సుశీల.
సుశీల చెయ్యిపట్టుకుని తన గుండెలమీదకు లాక్కుని చుట్టూ చేతులు బిగించాడు శేఖర్.
"మిగిలిన లోకమంతా ఏమనుకున్నా నువ్వు మాత్రం నన్ను అపార్ధం చేసుకుంటే నేను సహించలేను సుశీ! నీమీద ప్రేమలేక కాదు. ఈ ప్రేమ నీకు సుఖాలకు బదులు కష్టాలను తెచ్చిపెడుతుందేమో నని భయపడుతున్నాను."
సుశీల శరీరమూ, మనసూ కూడా పులకరించి పరవసించాయి.
"ఇలాంటి ప్రేమను పొందగలిగితే - ఫరవాలేదు, ఎలాంటి కష్టాలైనా పడవచ్చు......"
మనసారా అంది.....
శేఖర్ తో కలిసి విదేశాలకు వెళ్ళిపోవటానికి నిర్ణయించుకుంది సుశీల.
ఇప్పుడు శేఖర్ ను హ్కోస్తుంటే సుశీలకు సైతానుకు ఆత్మ అమ్ముకొన్న "ఫాస్ట్" గుర్తురావటం లేదు. లోకాలన్నీ గెలవబోతున్న మహావీరుడు గుర్తుకొస్తున్నాడు__
తమ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూడటంలో మునిగిపోయాడు శేఖర్.
లలిత ఎప్పుడూ తనకాలం వ్యర్ధం చెయ్యదు__సాధారణంగా చదువుకొంటుంది. లేకపోతే కుట్లూ, అల్లికలూ మొదలైనవి చేస్తుంది. అప్పుడప్పుడు తోటపని చూస్తుంది. పరమేశ్వరి, లలిత చిన్నప్పటి స్నేహితులు__లలిత బ్రతిమాలుకోగా ఎప్పుడైనా పరమేశ్వరి లలిత దగ్గరకొస్తుంది అలా వచ్చినరోజు లలితకు పండుగే! ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు___అలా మాట్లాడుకున్నంత సేపు తను రెక్కలు కట్టుకుని ఎక్కడికో ఎగిరి పోతున్నట్లు అనిపించేది లలితకు___కానీ లలితమాత్రం పరమేశ్వరి దగ్గరకు వెళ్ళేది కాదు.
అందుకు కారణం సాంబశివానికి ఇష్టంలేకపోవటం కాదు. ఆ కూలిపేటలో అందరికీ సాంబశివం తెలిసినవాడు కావటం. సాంబశివం భార్యగా అక్కడికి వెళ్ళలేదు తను.
ఎన్ని పనులలో ఉన్నా, వంట మనుష్యులున్నా, సుశీలకు ఎప్పుడు తనే స్వయంగా వడ్డిస్తుంది లలిత.