"మీరు వెళ్ళి భోజనం చేసి రండి" వరప్రసాదంతో అన్నాడు అభిరాం.
"ముందు మీరు తినేసి రండి! నా భోజనానికి వేళాపాళా వుండదు" బదులిచ్చాడతను.
* * * * *
ఆ సాయంత్రానికి మహదేవ్ పరిస్థితి మరికొంచెం బాగుపడింది. వరప్రసాదం అతని దగ్గరుండగా అభిరాం ఓసారి తన ఆఫీస్ కు వెళ్ళి అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని తెలుసుకుని వెనక్కి వచ్చేశాడు.
ఒకరి తర్వాత ఒకరుగా మహదేవ్ ని కంటికి రెప్పలా వాళ్ళిద్దరూ చూసుకున్నారు.
* * * * *
రెండు రోజులు గడిచాయి. ఇప్పుడు మహదేవ్ మామూలుగా తిరగగలుగుతున్నాడు. కొంచెం నిస్సత్తువ మాత్రం అతన్నింకా ఆవరించుకుని వుంది. మనసు మాత్రం హుషారుగానే వుంది.
ఇంతలో పేషెంట్ల హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి రౌండ్స్ కొచ్చిన చీఫ్ మహదేవ్ గదిలోకొచ్చాడు. అతనికి ఏభై ఏళ్ళుంటాయ్. మనిషి నల్లగా, పొట్టిగా వుంటాడు. అతన్ని చూడగానే మొహం పంది మొహంలా కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది- అదే అతనిలో ప్రత్యేకత! మాట మాత్రం సౌమ్యం. అతనెళ్ళిపోయాక చిన్నగా నవ్వుతూ "అతన్ని చూస్తే పంది రూపంలో వున్న మనిషిలా లేడూ?" అన్నాడు అభిరాం. అవునన్నట్టు తలూపాడు వరప్రసాదం.
"పొరపాటు! అతన్ని చూస్తే ఓ జీవిత సత్యం.... శాస్త్రవేత్తలు మాటలు నిజమని తెలుస్తున్నాయి" అన్నాడు మహదేవ్.
తమ సంభాషణలో అతనూ పాలుపంచుకోవడంతో సంతోషం కలిగిన అభిరాం- "ఏమిటా జీవిత సత్యం? ఏం చెప్పారు శాస్త్రవేత్తలు?" అన్నాడు.
"క్షీరదాల్లో మానవునికి అత్యంత పూర్వీకులు పందులను పోలిన జంతువుల రూపంలో వుండేవారని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పంది ఆకారాన్ని కలిగి వున్న ఈ జీవులు ఇరవై అయిదుకోట్ల సంవత్సరాల తర్వాత నేటి మనిషిగా పరిణామం చెందాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ జీవులకు సంబంధించిన ఆధారాలు దక్షిణాఫ్రికాలోని ఎడారి ప్రాంతంలో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. పెరిమియన్ యుగానికి చెందిన ఈ అరుదైన నమూనాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
ఇంతకు ముందువరకూ క్షీరదాల్లో మానవునికి అత్యంత పూర్వపు తరం రాక్షస బల్లులని భావించేవారు. అయితే ఈ నూతన పరిశోధనతో ఇంతవరకూ వాడుకలో వున్న సిద్దాంతాలన్నీ తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది. రాక్షస బల్లులకంటే ముందు పెరిమియన్ యుగంలో పందుల రూపంలో వుండే జీవులే భూమిపై ఆధిపత్యాన్ని చెలాంచేపని పరిశోధకులు తెలుపుతున్నారు.
"లిస్ట్రోసార్"ను మొట్టమొదటి క్షీరదంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆ రోజులలో సంభవించిన భయంకర ప్రళయంలో పెరిమియన్ యుగంలోని ఈ జీవులలో చాలా మట్టుకు నశించిపోయి వుంటాయని ఈ పరిశోధనా బృందానికి చెందిన నిపుణులు తెలిపారు. ప్రకృతి కన్నెర్రతో నశించిపోగా మిగిలిన లిస్ట్రోసార్ లు ఆ తర్వాత కొంతకాలానికి "ట్రియాసిక్, జురాసిక్" యుగాల్లో రాక్షసబల్లులుగా పరిణామం చెందాయి.
మనకు లభ్యమయ్యే ఆధారాలను బట్టి శాస్త్రీయంగా మానవునికి మొదటి పూర్వికుడని కూడా కనుగొన్నట్లు అయింది.
"లిస్ట్రోసార్" నుంచే భూమిపై క్షీరదాల జీవితం ప్రారంభమయి వుంటుందని భావిస్తున్నారు.
పంది ఆకారంలో ఉండే ఈ జీవులు సముద్రంలో నుంచి భూమి పైకివచ్చి జీవనాన్ని ప్రారంభించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే జీవన పరిణామక్రమంలో ఈ జీవులకు, రాక్షస బల్లులతో పాటు తర్వాత తరాలకు చెందిన క్షీరదాలకు ఎక్కడో లింక్ తెగిపోయింది.
ఈ జీవుల ఎముకలు చాలా పలచగా ఉన్నాయనీ, వీటి ద్వారానే ఇవి ఉష్టరక్త జీవులని తెలుస్తుందని పరిశోధనకులు తెలుపుతున్నారు.
ఇంతవరకూ ఏవో చిన్న జీవులు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత రాక్షస బల్లులుగా పరిణామం చెందాయని భావించేవారు. ఈ పరిశోధనలు ఆ సిద్దాంతాలు సరయినవి కావని తేల్చాయి.
లిస్ట్రోసార్ మనకు బహుదూరపు బంధువని బ్రిటన్, వాషింగ్ టన్ ల పరిశోధనా బృందానికి సమన్వయకర్తగా పనిచేస్తున్న బ్రిటీష్ జీవశాస్త్రవేత్త పీటర్ వార్డ్ అన్నారు. ఈ జీవులే ఆ తర్వాత క్రమంలో రాక్షసబల్లులుగా, ఉడుతలు, కోతులుగా పరిణామం చెందాయని ఆ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
18 కోట్ల సంవత్సరాల కిందట రాక్షసబల్లులను సర్వనాశనం చేసిన ప్రళయం కంటే 10 రెట్లు పెద్దదైన బీభత్సం ఏర్పడి ఈ లిస్ట్రోసార్ లు చాలామట్టుకు తుడిచిపెట్టుకుపోయాయని ఈ పరిశోధనా బృందం పేర్కొంది.
అప్పట్లో అగ్నిపర్వతాలు బద్దలు కావడమో, భూమి చీలిపోవడమో గ్రహ శకలాలకు ఢీ కొనడమో జరిగి అంతటి ప్రళయం సంభవించినప్పటికీ లిస్ట్రోసార్ లు పూర్తిగా తుడిచిపెట్టుకోలేదు. అందులో కొన్ని జీవించి వుండటం వల్లనే నేడు మనం ఈ భూమిపై ఉండగలిగాం. లేకపోతే మానవజాతి అంటూ వుండకపోయేది.
ఇలాంటి భీకర ప్రళయాలు భూమిపై ఇప్పటికి ఐదుసార్లు సంభవించి ఉంటాయని, చివరి ప్రళయంలో రాక్షస బల్లులు అంతరించి పోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ కాలుష్యం వలన భూగోళం వేడెక్కిపోతుందని, దీనితో అరవ ప్రళయం సంభవించ వచ్చునని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.
మరో 400 సంవత్సరాలలో భూమిపై వున్న 60 శాతం జీవులు నశించిపోయే అవకాశం వుంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణకోటిని రక్షించాల్సిన బాధ్యత..."
"ఆ భగవంతుడిదే!" అతని మాట సరిగ్గా పూర్తికాకుండానే అందుకున్నాడు అభిరాం.
"....కాదు మానవుడే" అంటూ పూర్తి చేశాడు మహదేవ్.
వరప్రసాదం నవ్వుతూ తల వూపాడు.
* * * * *
మేడం ప్రమీలాదేవి గదిలో ఫోన్ మోగింది. అప్పుడు సమయం సాయంత్రం ఆరవుతోంది.