Previous Page Next Page 
జీవాత్మ పేజి 40


    ఇద్దరూ తిరిగి డాక్టర్ గదికి చేరుకున్నారు. అతనూ అప్పుడే లేచి మహదేవ్ గదికి వెళ్లేందుకు సిద్దమవుతున్నాడు. "వచ్చారా? రండి వెళదాం" అంటూ మహదేవ్ గదివైపు నడిచారు ముగ్గురూ.
    
    'మహదేవ్ కి తెలివిరావాలి. అతనికేం కాకూడదు' మనసులోనే భగవంతుని ప్రార్దించాడు అభిరాం.
    
    డాక్టర్ మహదేవ్ గది తలుపులు తెరిచాడు. అప్పుడే ఓ నర్స్ ఖాళీ అయిన సెలైన్ బాటిల్ స్థానంలోనే కొత్తది అమరుస్తోంది. మహదేవ్ కి తెలివి రాలేదు.
    
    ముగ్గురూ బయటికి వచ్చి వెయిట్ చేయసాగారు. క్షణాలు కూడా యుగాల్లా గడుస్తున్న భావన అభిరాంలో వరప్రసాదం మొహం భావ రహితంగా వుంది. డాక్టర్ పరిస్థితి మాత్రం ఇద్దరికీ భిన్నంగా వుంది.
    
    'తను ఎక్స్ ఫెక్ట్ చేసిన టైంకి ఎందుకు పేషెంట్ కి తెలివిరాలేదు?' అనుకుంటున్నాడతను.
    
    'తన అంచనా తప్పయిందా? అంటే... పేషెంట్..... కోమాలోకి జారుకుంటున్నాడా..?' ఎందుకో ఒక్కసారి అతనికి అరచేతులు చెమట పట్టిన భావన. జేబులోంచి కర్చీఫ్ తీసి తుడుచుకున్నాడు.
    
    ఇంతలో మెల్లగా మహదేవ్ గది తలుపు తెరుచుకుంది. తెల్లని దుస్తుల్లో ఉన్న నర్స్ శాంతి సందేశం మోసుకొస్తున్నట్లుగా వారి వద్దకు వచ్చి-
    
    "డాక్టర్! పేషెంట్ కి తెలివొచ్చింది" అని చెప్పింది. వాళ్ళ ముగ్గురిలో ఆమె మాటలకి ముందు సంతోషించింది డాక్టర్ మాత్రమే.
    
    అభిరాం, వరప్రసాదంలు మాత్రం ఇంకా భయపడుతూనే వున్నారు. 'తెలివొచ్చినా లాభం లేదు. అతను జ్ఞాపకశక్తి పోగొట్టుకుంటే మాత్రం లాభమేముంది?' అనుకున్నారిద్దరూ.
    
    ముందుగా డాక్టర్ గదిలోకి ప్రవేశించాడు. వెనకే వరప్రసాదం! చివరికి లోపలికి వెళ్ళింది అభిరాం.
    
    మహదేవ్ కనులు తెరిచే వున్నాయి. తనెక్కడున్నదీ అర్ధం కానట్లు వెర్రిచూపులు చూస్తున్నాడు. తన ప్రకక్నే వున్న స్టాండ్ వైపు దానికి అమర్చిన సెలైన్ వైపూ చూసుకున్నాడు. తర్వాత తన దృష్టి డాక్టర్ మీద పడి ప్రశ్నార్ధకమయింది!
    
    అతని పక్కన నుంచున్న వరప్రసాదాన్ని అయోమయంగా చూశాడు. వారిద్దరి వెనుకనుంచీ అంతా చూస్తున్న అభిరాంకి మహదేవ్ జ్ఞాపకశక్తిని పూర్తిగా పోగొట్టుకున్నాడనిపించింది.
    
    "మీరిటు రండి అభిరాం" అన్న డాక్టర్ మాటలకు నిస్తేజంగా అటు నడిచాడు అభిరాం.
    
    నర్స్ ఓ వారగా నుంచుని చూస్తోంది.
    
    మహదేవ్ దృష్టి అభిరాం మీద పడింది... చిన్నగా గొణిగాయ్ అతని పెదవులు అభిరాం అయోమయంగా చూశాడు.
    
    "అభిరాం!" వేరే గ్రహం నుంచి శాటిలైట్ ద్వారా అతి చిన్నగా విన్పించినట్లు అతని చెవులకు సోకాయి మహదేవ్ ఉచ్చరించిన అక్షరాలు.
    
    అంతే! అప్పటిదాకా అతనిలో దాగున్న అనుమానాలూ, భయాలూ అన్ని  పటాపంచలై పోయాయ్. "మహదేవ్ కి జ్ఞాపకశక్తి పోలేదు. ఓగాడ్! నువ్వున్నావయ్యా! నా మొర విన్నావ్..." అనమధంతో అభిరాం మనసు నురుగులతో పరవళ్ళు తొక్కుతున్న సముద్రమై ఉప్పొంగింది. వరప్రసాదం డాక్టర్ లు రిలీఫ్ గా ఫీలయ్యారు.

    "అభిరాం! పేషెంట్ ని ఎక్కువసేపు మాట్లాడించకండి! జస్ట్ ఓ టూ మినిట్స్ మాత్రం మాట్లాడి వచ్చేయండి" అని బయటకు నడిచాడు డాక్టర్.
    
    అభిరాం, వరప్రసాదం మహదేవ్ కి దగ్గరగా కుర్చీలు లాక్కుని కూర్చున్నారు. మహదేవ్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా పట్టుకున్నాడు అభిరాం.
    
    మహదేవ్ వరప్రసాదం వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
    
    అతనెవరో అర్ధంకాలేదతనికి.
    
    "అమ్మమ్మ ఊరివారే వీరు. పేరు వరప్రసాదం మనకి కావలసిన వారు" పరిచయం చేశాడు అభిరాం.

    అతనికి విష్ చేస్తున్నట్టు కుడిచెయ్యి ఎత్తి కదిలించాడు మహదేవ్.

    "ఫర్వాలేదు బాబూ! కదలండి" అన్నాడు వరప్రసాదం.

    "అమ్మమ్మకి చెప్పానా?" మెల్లగా అడిగాడు శక్తి కూడదీసుకుంటూ మహదేవ్.
    
    "లేదు. మనస్వినికి కూడా చెప్పలేదు. నీక్కొంచెం నయమయ్యాక చిన్నగాయాలే అని చెప్పి తీసుకొద్దామని" వివరించాడు అభిరాం.
    
    "మంచిపని చేశావన్నట్టు" అతని వంక ప్రశంసగా చూశాడు మహదేవ్.
    
    "ఇంక రెస్ట్ తీసుకోండి మహదేవ్ బాబూ! మేం బయటనే వుంటాం" అతనికి స్ట్రెయిన్ యివ్వకూడదని అన్నాడు వరప్రసాదం.
    
    "సరే" నన్నట్టు తలూపాడు మహదేవ్.
    
    అభిరాం మాత్రం అతన్ని వదలలేనట్లు యింకా అక్కడే కూర్చుని వున్నాడు.
    
    "ఇంక పేషెంట్ ని రెస్ట్ తీసుకోనియ్యండి. ఎక్కువ స్ట్రెయిన్ అవకూడదు" చెప్పింది నర్స్.
    
    తప్పనిసరయి లేచి నిలబడ్డాడు అభిరాం.
    
    "రెస్ట్ తీసుకో! ఇక్కడే వుంటాం" అని బయటికి నడిచాడు అభిరాం. అతనికోసం బయట ఎదురుచూస్తున్నాడు వరప్రసాదం.
    
    ఇద్దరూ కలిసి డాక్టర్ గదిలోకి నడిచారు.
    
    "నా అంచనా తప్పకుంటే మరో రెండురోజుల్లో లేచి తిరగ్గలరు మీ ఫ్రెండ్. ఆ తర్వాత ఓ నాలుగయిదు రోజులుంటే ఇంటికి వెళ్ళచ్చు" అన్నాడతను.
    
    ఇద్దరి మనాసులూ తేలికపడ్డాయి.
    
    "నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ నుంచీ నా డ్యూటీ! ఏదయినా ప్లాబ్లముంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. ఇది నా విజిటింగ్ కార్డ్. హాస్పిటల్, రెసిడెన్స్ అడ్రస్ లతోపాటు ఫోన్ నెంబర్లు కూడా వున్నాయి. అయినా అవసరం రాకపోవచ్చు. డ్యూటీ డాక్టర్ వుంటారుగా...." అని చెప్పేసి బయటకు నడిచాడతను.

 Previous Page Next Page