Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 40


    మాతోపాటు అక్కడున్న చాలామంది ఉలిక్కిపడ్డారు.
    "అప్పడాలవాన్ లు ఆర్టీసీ బస్ లా"
    "అవును! నిన్న పేపర్లో వేశారు కదా! చూళ్ళేదా?"
    "ఏమని?"
    "ఇవాళ్టి నుంచీ బస్ లకు నంబర్లు- డెస్టినేషన్ పేర్లూ ఉండవ్! కేవలం వ్యాపార ప్రకటనల్ని బట్టే గుర్తుపట్టాలి!"
    "అవును! నేను బ్లేడ్స్ కంపెనీ బస్ ఎక్కాలి!" అన్నాడు ఓ వ్యక్తి తన చేతిలోని డయిరీ తీసి తను వెళ్ళాల్సిన చోట కెదురుగ్గా ఉన్న ప్రకటన చూస్తూ.
    "మేము సెక్రటేరియట్ కెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండీ?" నేను ఆ పెద్దమనిషిని వినయంగా అడిగాను.
    అతను మళ్ళీ డయిరీ చూశాడు.
    సెక్రెటేరియట్ అని ఉన్నచోట అప్పడాల కంపెనీ అని ఉంది.
    "అందుకేనయ్యా! నేను చెప్పింది! అప్పడాల కంపెనీవి మరి రెండు బస్ లు వెళ్ళాయికదా?" నవ్వుతూ అన్నాడు సాయిబుగారు.
    జనార్ధన్ ఆ పెద్దమనిషి నడిగి ఏ వ్యాపార ప్రకటన బస్ ఎక్కడి కెళ్ళుతుందో తన డయిరీలో రాసుకోసాగాడు.
    ఈసారి బ్రాందీ బస్ వచ్చింది.
    "మందిరా బ్రాందీ- బ్రాందీ" అని అరచాడు కండక్టర్ లోపల్నుంచీ!
    "అంటే! పంజాగుట్ట మీదనుంచీ వెళ్ళుతుందా?" ఒకావిడ అనుమానంగా అడిగింది.
    "లేదమ్మా? విస్కీబస్ పంజావ్గుట్ట మీదనుంచి వెళ్తుంది! బ్రాందీ బస్ కూడా అంటే వెళ్తుంది గానీ సందుల్లో నుంచి తిరిగి వెళ్ళుతుంది!"
    "మరి బీరు బస్సో?"
    "బీరు బస్ అంతదూరం వెళ్ళదు మాష్టారూ! ఖైరతాబాద్ దగ్గరే ఆగిపోతుంది!" అంటూ గంట కొట్టాడతను. బస్ వెళ్ళిపోయింది. మరో పదినిమిషాల తర్వాత ఒడియాల బస్ వచ్చింది.
    "అప్పడాలూ, వడియాలూ ఒకటే జాతికదా! ఇది సెక్రటేరియట్ దగ్గర కెళ్ళుతుందేమో" అన్నాడు జనార్ధన్ అనుమానంగా.
    శాయీరామ్ కండక్టర్ దగ్గరకెళ్ళి వివరం అడిగాడు.
    "అప్పడాలు వేరు ఒడియాలు వేరు సార్! బస్ లకడీకపూల్ నుంచి మెహిదీపట్నం పోతుంది-"
    "లకడీకాపూల్ లో దిగినడిచి వెళ్దాంలే పదండి- ఇందులో వెళ్దాం!" అన్నాడు రంగారెడ్డి.
    లోపల ఎక్కడ చూసినా ఒడియాల బొమ్మలే కనబడుతున్నాయి కండక్టర్ మాత్రం చేగోడీల డిజైన్ ఉన్న యూనిఫారం వేసుకున్నాడు.
    "మరేంలేదా సార్! ఒడియాల బస్ కండక్టరు రాలేదని నన్ను బుక్ చేశారు" అన్నాడతను మా ఆశ్చర్యం చూపి చిరునవ్వు నవ్వి!
    మా అముందు నిలబడ్డ ఓ కళ్ళజోడు పెద్దమనిషి ఒక్కసారి భీకరంగా అరిచాడు. బస్ లోని వాళ్ళంతా అదిరిపడి లేచి నిలబడ్డారు. ఫుట్ బోర్డుమీద నిలబడ్డ కొంతమంది యాక్సిడెంట్ అయిందేమోనని కిందకు దూకేశారు.
    "భయపడకండి సార్! మేడమ్! అశేషాంధ్రలోకాన్ని అద్భుతమైన స్పెన్స్ తో, సరికొత్త కథలతో ఈ బస్ లాగా ఒళ్ళు గగుర్పొడిపించే మలుపులతో ఉర్రూతలూగిస్తున్న ఆంధ్రుల అభిమాన ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు ఎవరికి కావాలో ఇప్పుడే ఆర్డర్ బుక్ చేయండి సార్! ప్రతి నాలుగు నవలలు కొన్నవారికి ఓ నవల ఉచితంగా ఇవ్వబడుతుంది. అంతేకాదు. దానిమీద రచయిత ఆటోగ్రాఫ్ కూడా ఉంటుంది.
    అంతేకాదు! ఆ నవలలో ఓ తప్పు ఉంది. ఈ తప్పేమిటో కనుక్కొన్న మొదటి వెయ్యిమంది పాఠకులకు ఇంకో తప్పు కనుక్కునేందుకు "క్యూ" ఇవ్వబడుతుంది" అని మళ్ళీ భీకరంగా కేకశాడతను. ఈసారి అతని పక్కనే కూర్చున్న ఓ గర్భిణీ స్త్రీ మూర్చపోయింది.
    బస్ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఆగింది. పోలీస్ చేతిలో కనబడుతున్న స్టాప్ బోర్డ్ మీద "దోమ మార్కుగల పళ్ళపొడినే వాడండి!" అని రాసి ఉంది పెద్ద అక్షరాలతో అడుగున చిన్న అక్షరాలతో "స్టాప్" అని ఉంది.
    బస్ దిగి సెక్రటేరియట్ కి పరుగెత్తాం. "గేట్లమీద ఓ బిస్కెట్ కంపెనీ వారి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనబడుతున్నాయి. అదేమిటి- ఇక్కడ బిస్కెట్ కంపెనీ ఎప్పుడు పెట్టారు?" సెక్యూరిటీ గార్డు నడిగాము ఆశ్చర్యంగా.
    "ఇవాళ్టి నుంచేనండీ!"
    "మరి సెక్రటేరియట్ ఏమయింది?"
    "వెనుక రాత్రి కొత్తగా వేసిన పాకల్లో పెట్టారండీ!"
    "ఎందుకలా?
    "బిస్కట్ కంపెనీ వారికి- గవర్నమెంట్  వారికి కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం ఈ ఏర్పాట్లు జరిగాయండీ! దీనివల్ల గవర్నమెంట్ కి ఏటా తొంభయ్ లక్షల రూపాయలు లాభం వస్తుంది!" మేము వేనుకవేపు నడిచి కొత్తగా పాకల్లో ఏర్పాట్లు చేసిన మా ఆఫీస్ లో కూర్చున్నాము.
    "ఇవాల్టి నుంచీ ఆఫీస్ డ్రాఫ్టులకు ఈ కాగితాలే వాడండి!" అంటూ ఓ తెల్లకాగితాల కట్ట అందించాడు ఫ్యూను.
    కాగితం ఒకవేపు తెల్లగా రెండోవేపు వ్యాపార ప్రకటనలతో నిండి ఉంది.
    "భూతమ్ వారి ఎలక్ట్రిక్ ఫాన్లు ఇప్పుడు దేశంలో 90 శాతం ఉపయోగిస్తున్నారు కనుక మీరు ఈ ఫాన్ కొని శాతాన్ని పెంచండి!"
    "మిగతా కాగితమంతా రకరకాల  ఫాన్లబొమ్మలు-
    లంచ్ టైమ్ లొ జనార్ధన్ వచ్చాడు.
    "సాయంత్రం రామ్ కోటిలో మన సుదర్శనంగాడి సిస్టర్ మారేజ్ ఉందట.
    మనల్నందర్ని రమ్మని మరీమరీ చెప్పాడు...." అన్నాడు.
    అఫీసవగానే అందరం కలిసే పెళ్ళికి బయల్దేరాం. నాలుగడుగులు వేశామో లేదా మా ముందు నడుస్తున్న వ్యక్తి హఠాత్తుగా ఆగిపోయి వెనక్కు తిరిగి మా వేపు చూసి చిరునవ్వు నవ్వాడు.
    "ఆహా! ఏం తెలుపు? మొఖం పగిలిపోయే తెలుపు!" అన్నాడు.
    మేమంతా భయంగా వెనక్కు తగ్గాం! "వాటీజ్ దట్?" ధైర్యం తెచ్చుకుని అడిగాడు జనార్ధన్.
    "అదేనండీ! అద్భుతమయిన తెలుపు. ఇంత తెల్లగా ఎలా వచ్చిందో తెలుసా?" ఇదేదో పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చిన కేసు- తెలుస్తూనే ఉంది.
    ఎందుకయినా మంచిదని రోడ్డుకి మరో పక్కకు పరుగెత్తాం! కానీ అతను మా కంటే ముందు అక్కడికి చేరుకున్నాడు "మిమ్మల్నే! ఎంత తెలుపు- మొఖం పగిలే తెలుపు!" అన్నాడు మళ్ళీ చిరునవ్వుతో.
    ఇంకా చేసేదిలేక "అవును! పిచ్చి తెలుపు!" అన్నాడు శాయీరామ్ సపోర్ట్ చేయకపోతే అటాక్ చేస్తాడేమో అని.
    "చాలా మరీ ఎక్కువ తెలుపు" అన్నాడు రెడ్డి.
    "ఇంత తెలుపు ఎలా వచ్చిందో చెప్పండి?" అన్నాడతను మళ్ళీ నవ్వుతూ.
    "ఇంకేముంది! మురికిపట్టిన పాతబట్టల్ని మీ కంపెనీవారి వాషింగ్ పౌడర్ వాడినందువల్ల-" అన్నాడు శాయీరామ్ సినిమాల్లో ఓ వాషింగ్ పౌడర్ పబ్లిసిటీ గుర్తు తెచ్చుకుని.
    "ఛీ! మాది వాషింగ్ పౌడర్ కాదు!"
    "మరి!"

 Previous Page Next Page