విశారద ఎక్కువసేపలా ఉండలేకపోయింది.
"ఎందుకలా ఉన్నారు?" అనడిగింది తర్వాత.
"ఊ?"
ఎందుకలా ముభావంగా ఉన్నారు?"
"ఏమీ లేదు."
"మీ ప్రవర్తనలో ఏదో తేడా- ఉంది."
"విశారదా- నువ్వనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు."
విశారద ఇహ నిగ్రహించుకోలేకపోయింది.
"ఎందుకలా.... ఏదో ప్రచ్చన్నయుద్దంలా సమ్ థింగ్... సమ్ థింగ్... జరుగుతోంది మన మధ్య అహర్నిశలూ మీ గురించే ఆలోచించి మీకోసమే బతికి ఇన్నాళ్ళూ... నో... నాకేం అర్ధం కావటంలేదు."
వెక్కి వెక్కి ఏడుస్తుంది. అంత దుఃఖంలో కూడా తన కొచ్చిన ఫోన్ కాల్స్ గురించి చెప్పలేదు. విజ్ఞతను గురించి అడగలేదు.
రాజాచంద్రకు గుండె కరిగిపోయింది. ఆమెను దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకుని "విశారదా! విశారదా! ఐ లవ్ యు" అని ఎలుగెత్తి చాటుదామనుకున్నాడు.
కాని ఏదో పొర ఇద్దరిమధ్యా అల్లుకుపోతోంది. అనుకున్నట్లు చెయ్యలేకపోయాడు.
"విశారదా! ఆపరేషనయాక నీ మైండ్ కొంచెం వీక్ అయింది. ప్రతి చిన్నదాన్ని గురించీ ఎక్కువగా చిత్రీకరించుకుంటున్నావు."
"నా మైండ్ బాలెన్స్ గానే ఉందండీ. ఇలాంటి ఆపరేషన్లు ఒకటి కాదు పది జరిగినా అదేం బెదిరిపోదు."
అతనేం మాట్లాడలేదు.
"ఆల్ రైట్ ఆల్రైట్" అంటూ ఆమె అక్కడ్నుంచి వినూత్న గదిలోకి వెళ్ళి పోయింది.
పది నిమిషాలు నిస్సహాయుడిలా నిలబడి అతని బెడ్ రూమ్ లోకి వెళ్ళి పోయాడు.
* * *
మరో అరగంట గడిచింది. రాఖేష్, మనోజ్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. విశారద లేచి ఇవతలకు రాలేదు.
ఇంకో పది నిమిషాలు పోయాక వినూత్న వచ్చింది.
ఆమె ఇంకా హాల్లోకి పూర్తిగా రాలేదు. విశారద సుడిగాలిలా లోపల్నుంచి వచ్చింది.
"ఎక్కడికెళ్ళావు?" అంది.
వినూత్న తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది- అడగరాని ప్రశ్న ఏదో అడిగినట్లు.
"నిన్నే అడుగుతున్నాను."
వినూత్న తల్లి మొహంలోకి పరిశీలనగా చూసింది. "మమ్మీ! నీకు వంట్లో బావున్నదా?"
"షటప్ అడిగిందానికి జవాబు చెప్పు."
"ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లాను."
"ఎవరా ఫ్రెండ్స్?"
"ఆఁ అలాంటి వన్నీ చెప్పాలంటే చాలా సిల్లీగా ఉంటుంది మమ్మీ."
"ఉంటే ఉంటుంది జవాబు చెప్పి తీరాలి."
"సరిగమ, మధురిమ, చంపకమాల, ఉత్పలమాల- ఇలా బోలెడు ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయి. ఎలా చెప్పను మమ్మీ?"
"అన్నీ ఆడపేర్లు చెప్పాడు. మగపేర్లు చెప్పావుకాదే?"
"ఓహ్ నువ్వు ఈవేళ చాలా డిస్టర్బ్ డ్ గా మాట్లాడుతున్నావు మమ్మీ."
"బికాజ్ ఐ యామ్ డిస్టర్బ్ డ్ వినూత్నా! దేర్ ఈజ్ సమ్ థింగ్ రాంగ్ విత్ యువర్ బిహేవియర్ గాడి తప్పిపోతున్నావు. తల్లిగా నిన్ను సరిదిద్దాల్సిన అవసరం నాకుంది."
"మమ్మీ! డాడీ మమ్మల్ని... ఐ మీన్... న న్నర్ధం చేసుకున్నారు. నువ్వే..."
"మీ డాడీకేమీ తెలీదు. ఆయన అమాయకులు ఈవేళ నుంచీ నేను పట్టించుకుంటాను."
"ఐ సీ."
"నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళటానికి వీల్లేదు. ఇంటికి ఆలస్యంగా రావటానికి వీల్లేదు. బాయ్ ఫ్రెండ్స్ తో తిరగటానికి వీల్లేదు."
తల్లి ఇలా మాట్లాడటం వినూత్న ఎప్పుడూ వినలేదు. ఆమెకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది.
"మమ్మీ! నువ్వు నన్ను చాలా దిగజార్చి మాట్లాడుతున్నావు."
"అలా.... అనుకునేకంటే ఒక తల్లి కడుపులో రగిలే మంట అర్ధం చేసుకోవే. డాషింగ్ గా ఉండటం ఒకటే గొప్పనుకోకు. నువ్వు పాకెట్ మనీ కింద ఎంత ఖర్చు పెడుతున్నావో- ఆ డబ్బుతో రెండు మూడు కుటుంబాలు వెళ్ళమారిపోతాయి."
"మమ్మీ! మమ్మీ! నీకేదో జరిగింది."
"నాకేమీ జరగలేదు. ఐయామ్ ఆల్ రైట్ మీ అందరకూ... మీకే ఏదో జరిగింది."
"మమ్మీ! సపోజ్ ఓ బాయ్ ఫ్రెండ్ తో తిరిగినంత మాత్రాన అది చెడిపోయినట్లు లెక్కా? దానికి మంచి అర్ధం తీసుకోకూడదా?"
"వేళాపాళా లేకుండా ఓ మగాడితో తిరుగుతూ, స్కూటర్ల మీద షికార్లు చెలాయిస్తూ మంచి అర్ధం తీసుకోమంటే మోసపోయేటంత తెలివి హీనురాలని కాదు వినూత్నా."
వినూతన ఇహ కోపం ఆపుకోలేకపోయింది. ఆమెలోని అహం, అజ్ఞానం పడగలు విప్పి బుసలు కొట్టినట్లయాయి.
"అయితే డాడీ కూడా ఓ అమ్మాయితో తిరుగుతున్నారు. డాడీ కూడా చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నట్లేనా?"
"ఏమన్నావు?" వినూత్న చెంప చెళ్ళుమంది.
పిల్లల మీద చేయి చేసుకోవటం విశారదకు జీవితంలో మొదటిసారి. చిన్నతనంలో మంకుపట్టి పట్టి అల్లరి చేసేటప్పుడూ, ప్రాణాలు విసిగించి నప్పుడూ, పెద్దయాక తమ ఇష్టానికి వ్యతిరేక భావాలతో పెరుగుతూ మనసుని చిత్రవధ చేసినప్పుడూకూడా ఆమె సహించి ఊరుకుంది. కాని భర్తను అంత హేయంగా వ్యాఖ్యానం చేశాక భరించలేకపోయింది.