Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 40

   

     "ఈ కేసు జరగటం మొదలుపెట్టినప్పట్నుంచీ ఆయన్తోబాటు మీరు కోర్టుకు వస్తూనే వున్నారు?"
   
    "ఆయన్తోబాటు రాలేదు. విడిగా వచ్చాను."
   
    "విడిగా ఎందుకు రావల్సి వచ్చింది?"
   
    "ఈ కేసు యింటరెస్టింగ్ గా వుండి, వివరాలు తెలుసుకుందామని."
   
    "మీరు చాలా బిజీ ప్రాక్టీషనర్ అనుకుంటాను."
   
    "నాకు ప్రాక్టీస్ బాగానే వుంది."
   
    "కాబట్టి మీకోసం అక్కడ పేషెంట్స్ పడిగాపులు కాస్తుంటే మీ యింటరెస్ట్ కోసం మీ కోర్టుచుట్టూ తిరుగుతున్నారన్నమాట."
   
    మాలతి ఏమీ మాట్లాడలేదు.
   
    "మీకోసం హస్పిటల్ కు వచ్చేవారిలో మీమీద ఎంతో ఆశపెట్టుకుని వచ్చేవాళ్ళు వుంటారు. ఎమర్జన్సీ కేసులుండి వుంటాయి. మీరక్కడ లేకపోతే కొందరికి ప్రమాదంకూడా వాటిల్లవచ్చు. దాన్ని డాక్టర్స్ నెగ్లిజెన్స్ అనవచ్చునా?"
   
    మాలతి దానికీ జవాబు చెప్పలేదు.
   
    "ఈ కోర్టులో యిదివరకు యింటరెస్టింగ్ గా వుండే కేసులనేకం జరిగాయి. వాటికెప్పుడైనా అటెండయారా?"
   
    "లేదు."
   
    "ఎందుకని?"
   
    "నాకు అవకాశం లభించలేదు."
   
    "మీరు పర్సనల్ గా ఎవిడెన్స్ ఇవ్వవలసిన కేసులు, అంటే డాక్టరుగా మీరు ఎవిడెన్స్ యివ్వవలసి వచ్చిన కేసులు-ఏమైనా వుంటే అవి మినహా యించి, అసలే కేసుకైనా యింటరెస్టింగ్ గా వుండి మీరు అటెండయారా?"
   
    "లేదు."
   
    "అంటే కేవలం యీ కేసుకే మీ ప్రాక్టీస్ కూడా పాడుచేసుకుని, మీ పేషెంట్స్ బాధపడుతున్నా లక్ష్యపెట్టకుండా అటెండవుతున్నారు?"
   
    మాలతి జవాబివ్వలేదు.
   
    "మీకు రాధ వాళ్ళ కుటుంబంతో ఏమీ పరిచయం లేకపోయినా వాళ్ళయింటికి వెళ్ళి పరామర్శ చేసేటంతటి యింటరెస్ట్ మీలో కొనసాగిందా?"
   
    "ఆ పాప జీవితాన్ని చూసి వెళ్ళకుండా వుండలేకపోయాను."
   
    "మీరిదివరకు ఎప్పుడైనా శ్రీలక్ష్మి హాస్పిటల్ కు వెళ్ళారా?"
   
    "వెళ్ళాను."
   
    "ఏ సందర్భాలలో?"
   
    మాలతి కొంచెం తటపటాయించింది.
   
    "చెప్పండి, ఏ యే సందర్భాలలో వెళ్ళారు?"
   
    "హాస్పిటల్ ఇనాగ్యురేషన్ జరిగినప్పుడు, తర్వాత ఒక డాక్టరుగా కొన్ని కొన్ని కేసులు డిస్కషన్ అవసరమొచ్చి."
   
    "ఆ కొన్ని కొన్ని కేసులు ఏమిటో చెప్పగలరా?"
   
    "గుర్తులేదు."
   
    "పోనీ గుర్తున్న ఓ కేసేదయినా చెప్పండి."
   
    మాలతి మాట్లాడలేదు.
   
    "ప్రదీప్ గారి భార్య శ్రీలక్ష్మి హాస్పిటల్ లో డెలివరీకని ఎడ్మిట్ అయి, కొన్ని కారణాలవల్ల మరణించటం జరిగినప్పుడు డాక్టర్ మైథిలిగారితో మాట్లాడటానికి వెళ్ళారా లేదా?"
   
    మాలతి 'వెళ్ళలేదు' అని చెబుదామనుకుంది. కాని ఆమె సంస్కారం అడ్డువచ్చింది. ఏమి చెయ్యాలో తోచక కొద్దిదూరంలోనే కూర్చున్న ప్రదీప్ ముఖంలోకి చూసింది. అతని ముఖంలో ఎలాంటి భావమూ ద్యోతకం కావటంలేదు.
   
    "చెప్పండి. వెళ్ళారా లేదా?"
   
    "....వెళ్ళాను."
   
    "వెళ్ళి ఏం మాట్లాడారు?"
   
    "ప్రదీప్ గారి భార్య చనిపోయిన కారణాలు చర్చించాను ఒక డాక్టరుగా."
   
    "అఫ్ కోర్స్ ఒక డాక్టరుగానే లెండి. మిగతా కేసులుగురించి మీరు డిస్కస్ చేసిన సందర్భాలు గుర్తులేదు. ప్రదీప్ గారి భార్య కేసుగురించి మాత్రం గుర్తుంది. ఎందుకంటే ఆయన మీకు బాగా ఫామిలీఫ్రెండ్ కాబట్టి అవునా?"
   
    "కాదు డాక్టర్ ధర్మంతో వెళ్ళాను."
   
    "అదే ఆ డాక్టరు ధర్మం మిగతా కేసులకి వర్తించలేదు. ఏమంటారు?"
   
    "మిగతా కేసులకు వెళ్ళవలసినంతటి సందర్భాలు వుండకపోవచ్చుగా!"
   
    "ఇందాక వున్నాయన్నారు?"
   
    మాలతి నిరుత్తరురాలైనట్లు నిలబడింది.
   
    ప్రతాపరావు మేజిస్ట్రేట్ గారి వంక చూశాడు. ఆయన శ్రద్దగా పాయింట్సన్నీ వివరంగా రాసుకుంటున్నారు.
   
    శ్రీలక్ష్మి హాస్పిటల్ మీద మీకు ప్రదీప్ గారి భార్య మరణించినప్పట్నుంచి దురభిప్రాయముంది?"
   
    "లేదు."
   
    "సరే యీ ప్రశ్నకు జవాబుచెప్పండి. ఒక డాక్టరు కావాలని ఎప్పుడన్నా పొరపాటు చేస్తాడా?"
   
    "కావాలని చెయ్యడు కాని పొరపాటేదైనా క్షమించటానికి వీల్లేని సందర్భాలు...."
   
    "నేను మీ వ్యాఖ్యానం అడగటంలేదు. నేనడిగిన ప్రశ్నకు 'అవును' లేక 'కాదు' అని జవాబు చెప్పండి. ఒక డాక్టరు కావాలని ఎప్పుడైనా పొరపాటు చేస్తాడా?"
   
    ప్రదీప్ లేచి నిలబడ్డాడు. "అబ్జక్షన్ యువరానర్! ఈ ప్రశ్న యుక్తితో కూడివున్నది. కొన్ని కొన్ని ప్రశ్నలకు వ్యాఖ్యానం లేకుండా జవాబు చెబితే అది అర్ధరహితమైన కమిట్ మెంట్ అవుతుంది. మాలతిగార్ని పూర్తి జవాబు యివ్వటానికి అనుమతించ కోరుతున్నాను" అన్నాడు.
   
    "ఈ ప్రశ్నలో కుయుక్తి ఏమీ లేదు యువరానర్! చాలా డైరెక్టు ప్రశ్న అడిగినడానికి సూటిగా జవాబు చెప్పకుండా అయితేలూ, గియితేలూ చేర్చి జవాబివ్వటం మొదలుపెడితే ఏ ప్రశ్నా-జవాబు సరిగ్గా వుండదు" అన్నాడు ప్రతాపరావు.
   
    "కొని ప్రశ్నలకు డైరెక్టుగా జవాబివ్వటం కుదరదు యువరానర్! ఉదాహరణకి ఒక సాక్షిని 'నువ్వు నీ పెళ్ళాన్ని చంపావా లేదా?' అని అడిగారనుకోండి. అసలతనికి పెళ్ళామే వుండదు. అందుకని 'నాకు భార్యలేదు' అని అతను జవాబుచెప్పాలి. 'నేనడిగిన ప్రశ్న అదికాదు నువ్వు పెళ్ళాన్ని చంపావా లేదా' అని లాయరు నొక్కిస్తే 'చంపలేదు' అని సాక్షి జవాబు చెబితే అతని భార్య లేకపోయినా వున్నట్లు రాంగ్ యింటర్ ప్రిటేషన్ తీసుకునేందుకు అవకాశముంటుంది" అన్నాడు ప్రదీప్.
   
    "అంత రాంగ్ యింటర్ ప్రిటేషన్ వచ్చే జవాబు యిచ్చేటంత అమాయకురాలు కాదులే మీ విట్ నెస్. ఆమె ఎడ్యుకేటెడ్ లేడీ."
   
    "ఎడ్యుకేటెడ్ లేడీ కావచ్చు. కాని మీ కోర్టు భాష ఆమెకర్ధం కాకపోవచ్చు."
   
    "కోర్టుకొచ్చేటప్పుడు కోర్టుభాషని ఎదుర్కోవాలని తెలిసి బోను ఎక్కాలి."
   
    "ఒక నిజాన్ని చెప్పటంకోసం రావటం మీలాంటి లాయర్లు వేసే ప్రశ్నలతో వేధింపుకు గురవటంతప్ప..."
   
    "నువ్వడిగావుగా యింతకన్నా గొప్ప ప్రశ్నలు."
   
    "అడిగాను మీలా అవకతవకగా కాదు."
   
    "అవకతవకగా అడగబట్టే నువ్వూ, నేనూ, ఎదుర్కొన్న కేసులు ఎన్ని వున్నాయో ఎన్ని ఊడాయో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది."
   
    "అబ్బా! ఎన్ని గెల్చారేమిటి నా మీద కేసులు? మీరు ఓడిపోయిన కేసులు చెప్పమంటారా?"
   
    "మహా చెప్పావులే. బయటికొచ్చి నిలబడితే నీ వెనక ఎంత లిస్ట్ వుందో నా వెనక ఎంత లిస్ట్ వుందో తెలుస్తుంది."

 Previous Page Next Page