మరో ఓటమి బాహాటంగా....
ఏదైతే గోప్యంగా వుండాలని రవి అమితంగా కోరుకున్నాడో ఇప్పుడది అందరికీ అర్ధమైపోతుంటే ఆవేశంతో కదిలాడు తనూ....
అయితే....
ఇదంతా దూరంనుంచే గమనిస్తూ నిశ్శబ్దంగా స్పందిస్తున్నాడు ఒకే ఒక వ్యక్తి ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ జవహర్!
* * * *
"ఏమిటి నీ ఉద్దేశ్యం?"
లంచ్ అవర్ దాటి కాలేజీలో వుండలేకపోయిన రవి సావేరిని బలవంతంగా ఇంటికి బయలుదేరమని చెప్పి తోవలో కారాపుతూ అడిగాడు.
ఇలాంటి పరిస్థితిని ఆమె వూహించింది.
ఎదుర్కోవాదానికి సిద్దంగానే వుంది. కాబట్టే అన్నయ్య ఇంటికి వెళదామని చెప్పగానే వస్తానంది తప్ప తిరస్కరించలేదు.
"నిన్నేనే మాట్లాడవేం?"
ఆకాశంలోని సూర్యుణ్ని మించిన వేడి రవి కళ్ళల్లో.
జవాబు చెప్పలేదు సావేరి.
వయసుకాదు....జీవితం ఇప్పుడిప్పుదే నేర్పుతున్న అనుభవాల పాఠాల్ని జీర్ణించుకోగలుగుతున్న తెలివైన అమ్మాయిలా నిశ్చలంగా చూస్తూంది.
"ఏమిటీ వాడికీ, నీకూ వున్న సంబంధం?" అనలేదు రవి....ఒకవేళ సావేరి దుడుకుగా కోరని జవాబు యిస్తే ఆ తర్వాత చర్చించుకోడానికి యింకేంగలదని రావికీ తెలుసు. "నీ మూలంగా అందరిముందూ నా తల వాలిపోయింది."
"తప్పదన్నయ్యా.....తప్పు చేశాక తలవంచుకోక తప్పదు" సావేరి గొంతులో అదే ప్రశాంతత... ఉలికిపడ్డాడు రవి.
ఆమె ఎంతదూరం వూహించిందో ఆ జవాబే చెబుతూంది....సూటిగా ఆమె కళ్ళల్లోకి చూడలేనట్టు ఆవేశంగా కారుదిగి బయటికి వచ్చాడు.
పిడికిళ్ళు బిగించుకుని సమీపంలోని మామిడితోపులోకి చూస్తూ వుండిపోయాడు చాలా సేపటిదాకా. "సావేరీ" ఆ పిలుపు చాలు చెల్లి నతడెంతగా ప్రేమించేదీ అర్ధం చేసుకోడానికి "మన కుటుంబం గురించి నీకు తెలుసు...."
"వద్దన్నయ్యా!" మృదువుగా అంది. "కాలేజీ ఎగ్గొట్టి వచ్చిన మనం యిక్కడిలా బయోడేటా గురించి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు."
"అదికాదే" ఎలా నచ్చచెప్పాలో రవికీ అంతుబట్టడం లేదు.
"డాడీకి తెలిస్తే...."
"ఏమిటీ?"
"అదే!"
"అదే అంటే....?"
ఎంతకి తెగించింది. తన నోటినుంచే చెప్పించాలని చూస్తూంది.
"అదీ అంటే ఏమిటో నీకు తెలుసు."
"నీకంటే చిన్నపిల్లనన్నయ్యా! నాకు తెలీని చాలా విషయాల్ని లాలనగా బుజ్జగిస్తూ మరీ చెప్పేవాడివిగా....ఇప్పుడెందుకలా కంగారుపడుతున్నావు..."
"సావేరీ" ఇప్పుడు తను చర్చిస్తున్నది మహాసముద్రమంత సమస్య...అది కూడా కాదు. ఈ కథ యిక్కడే ఆగిపోకపోతే అదో బడబాగ్నికి కారణమైన బహుశా అందులో సావేరీ సమసిపోతుందనిపించిందేమో అతగాడి గొంతూ వణికింది.
"నీకు దణ్ణం పెడతానే.... శంకూని...." గొంతులో అదోలాంటి పెనుగులాట "శంకూని మరిచిపో....ప్లీజ్...."
"థేంక్సన్నయ్యా...." సావేరి నేత్రాలు సజలాలయ్యాయి. "అంతా శంకూ తప్పులాగే ఇన్నాళ్ళూ అతన్ని వెంటాడి వేటాడుతున్న మీకు తప్పేదన్నా వుంటే ముందు అది నాదీ అని తెలుసుకోగలిగినందుకు మెనీ థేంక్స్....కానీ...ఎలా....శంకూని ఎలా మరిచిపోను....."
"మా అందరికోసం" ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు.
"నిజం చెప్పన్నయ్యా....నాకేదన్నా అయితే అంటే ఒకవేళ నేను చచ్చిపోయానే అనుకో..... చెప్పనియ్ అన్నయ్యా! నేను హఠాత్తుగా ప్రాణాలు పోగొట్టుకుంటే నన్ను మీరంతా మరిచిపోగలరా?"
ఆ ఊహే భరింపశక్యం కాలేదో, ఆ మాటే మనసుపొరల్ని తూట్లు చేసిందో రవి కళ్ళల్లోనూ నీళ్ళు ఉబికాయి. "ఎందుకే....ఎందుకే అలాంటి మాటలంటావు....నువ్వు లేకుండా మేమంతా ఎలా బ్రతగ్గలం...."
"శంకూ విషయంలోనూ నా సమస్య అదే అయితే...."
రవి స్తబ్దుడైపోయాడు.
"ఇలా అనిపించడాన్ని స్పష్టంగా ఏమంటారో నాకూ తెలీదన్నయ్యా. కానీ అమ్మానాన్నల్ని, అన్నయ్యగా నిన్నూ ఎలా యిష్టపడుతున్నానో అలాగే శంకూనీ...."
"సావేరీ...." అర్ధోక్తిగా వారించాడు. "శంకూ నీకు కలిసింది నిన్న గాక మొన్న...."
"అయినా చిన్నప్పటినుంచే నేను చూస్తున్న బావకన్నా ఎక్కువ యిష్టమైపోయాడు. ఎందుకోమరి మీరెన్ని ప్రయత్నాలు చేసినా శంకూని నేను యిష్టపడాలనే అనిపిస్తూంది."
"సరైన అవగాహనలేని వయసు నీది."
"కావచ్చన్నయ్యా! అలా అని చిన్నప్పటినుంచీ ఇష్టపడింది కావాలని అడగకుండా ఊరుకున్నానా.... నా పదేళ్ళ వయసులో ఏ రంగు గౌను కావాలమ్మా అని నువ్వు అడిగేవాడివి....పలానాది అని ఇష్టంతో చెప్పాను తప్ప అవగాహనతోనా?"
"సావేరీ.... సావేరీ.... ఇది వేరమ్మా..... నీ బ్రతుక్కి సంబంధించిన సమస్యని కట్టుకునే బట్టలతో ఎలా పోల్చుకుంటావు!"
"అన్నయ్యా!" ఇప్పుడు సావేరి కళ్ళు నీటికుండలాలయ్యాయి. "అది కాకపోయినా యిప్పుడు నాకు అంతా అర్ధమౌతూంది శంకూని మీరు ఇష్టపడరు. నన్ను యిష్టపడినా నా యిష్టాన్ని మీరు అంగీకరించరు. మంచో చెడో నిర్ణయించుకునే వయసు కాకపోవచ్చు నాది అయినా శంకూని ఇష్టపడ్డాను ఎందుకు ఎలా ఏంచూసి మీరంతా నన్ను నిలదీసినా నా దగ్గిర జవాబులేదు అవునన్నయ్యా! జరగబోయేది కొద్దిగా నేనూ వూహించగలుగుతున్నాను శంకూని మీరిలా టార్చర్ చేస్తారు బహుశా చంపేసారేమో కూడా కాని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ తర్వాత నేను బ్రతికుండను. ఆ- నిజమన్నయ్యా! ఒకవేళ శంకూని నేను కోరుకోవడం మీకు అభ్యంతరమైతే ముందు.....ముందు నన్ను చంపేయండి. ఎందుకంటే మాటలతో నేను విననుగా. అంతే మరి....అంతేగాని మరోసారి శంకూమీద ఎలాంటి ప్రయత్నం జరిగినా ఊరుకోనంతే."
మాటల్ని కూడగట్టుకుంటూనే హెచ్చరికలా అంతా చెబుతూంటే స్థాణువై విన్నాడు రవి సావేరి మొండితనం తెలుసు.....అనుకున్నది సాధించాలంటే ఏ స్థాయిదాకా వెళ్ళగలదో అనుభవమే. అయితే ఇంత నిక్కచ్చిగా సావేరి ఏనాడూ మాట్లాడలేదు.
ఇప్పుడు రవి ఆలోచిస్తున్నది అదికూడా కాదు.
శంకూ విషయంలో సావేరి ఎన్నటికీ నెగ్గలేదు.
అసలు తండ్రి మనస్తత్వంకన్నా బావ రాజేందర్ పట్టుదల తను
తెలుసు.
ఇప్పుడేం జరగబోతూంది?
బహుశా రవి బుద్దెరిగాక చెల్లి విషయంలో ఇంతలా ఎప్పుడూ ఆలోచించలేదేమో.
ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళాక మౌనంగా వున్నాడు రవి.
సావేరిలో మునుపటి ఉత్సాహం లేదు.
ఇదంతా గమనిస్తూనే వుంది రాధమ్మ.