Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 39

    "రమణయ్యా!" సుందరయ్య ముఖం జేవురించినట్టుగా అయింది. "ఏం ముంచుకువస్తుందంటున్నావు? పాప తెలివితక్కువది కాదు ప్రలోభాలకి లోబడదు. ఆ పిల్లమీద నాకా నమ్మకముంది. ఆడపిల్లకు నాలుగు గోడల మధ్య జీవితమే సురక్షితమని, నిశ్చింత అని నే ననుకోవడంలేదు. బయట ఎంత తిరిగితే ప్రపంచం గురించి అంత తెలుస్తుంది. ప్రమాదాన్ని ఎదుర్కొనేశక్తి అదే ఏర్పడుతుంది. ఏదో ముంచుకు వస్తుందని నే నెప్పుడూ అనుకోను," తీక్షణంగా అన్నాడు.

    "కోపం తెచ్చుకోవద్దు, సుందరయ్యా. నువ్వు నీ పిల్లను నమ్మొచ్చు గాని ఆ పిల్లకి వచ్చిన వయసుని నమ్మకూడదు. దాన్నిఎవరూ నమ్మకూడదు. చిన్నపిల్లేం కాదుగా? ఓ అయ్యచేతిలోపెడితే నీ బాధ్యత తీరిపోతుంది. నీ ఆరోగ్యమూ బాగా లేదుకదా? రేపు హరీ అన్నావనుకో. ఊరికే అనుకో. ఆ పిల్ల కెవరు దిక్కు? ఆ పిల్ల పుట్టుపూర్వోత్తరాలు తెలిసినవాళ్ళు ఎవరు చేరదీస్తారు?"

    సుందరయ్య ఏదో అనబోయేంతలో ప్రేమీ వచ్చింది. "ఓ రమణయ్యమామా! ఏమిటి? ఇలా దయచేశావు?" వేళాకోళంగా అడిగింది.

    విశాల్ కళ్ళు విశాలం చేసుకొని ఆ పిల్లనే చూస్తున్నాడు. గీతత్త ఇరవై సంవత్సరాల వయసు తగ్గించుకొని వచ్చినట్టుగా ఉంది. అచ్చు గుద్దినట్టుగా తల్లిపోలికలో ఉండడం సాధ్యమా? ఆశ్చర్యపోతున్నాడు. పక్కపాపిడి, రెండు పెద్ద పెద్ద జడలు. ఆ తలకట్టే ఆమెకు తరగని సిరిసంపద అనిపిస్తుంది. కాని, గీతత్తలో సౌమ్యత, ఈ పిల్ల కళ్ళలో ఏదో తీక్షణత! ఆ కదలికలో ఏదో చైతన్యం. ఏదో చురుకుదనం. గీతత్త శాంతమే భూషణమన్నట్టుగా ఉంటుంది. రూపంలో తప్పితే గుణంలో పూర్తిగా విరుద్దమని తొలిచూపులోనే పసికట్టాడు.

    "నువ్వు నిన్న అన్నమాట చెబుతున్నాను మీ నాన్నకు." కొంచెం బెదురుగానే అన్నాడు రమణయ్య.

    ప్రేమీ గర్వంగా తలూగిస్తూ, "పాప అన్నదాంట్లో తప్పులేదంటాడు నాన్న. అవునా, నాన్నా?" అంటూనే తండ్రి మంచం మీద కూర్చొన్న విశాల్ ని చూసింది. తెల్లటిబట్టల్లో స్వచ్చంగా, హుందాగా ఉన్నాడతడు. పెద్దపెద్దగా ఉన్న ఆ కళ్ళు తనని ఆసక్తిగా గమనిస్తున్నాయి! ఎవరితడు? ఇంత చొరవగా తండ్రి మంచం మీద కూర్చొన్నా డేమిటి? ప్రేమీ ప్రశ్నార్ధకంగా తండ్రికేసి చూసింది.

    "పోట్లాడేది ఇంకా ఏమైనా మిగిలి ఉంటే రేపురా, రమణయ్యా!" అన్నాడు సుందరయ్య. వచ్చిన పెద్దమనిషి ముందు రభస అయితే బాగుండదని.

    "ఏం, మామా? పోట్లాటకి వచ్చావా?" యుద్దానికి కాలుదువ్వుతున్నట్టుగా అడిగింది ప్రేమీ.

    "మరి అలా మాట్లాడొచ్చా?"

    "ఏం మాట్లాడాను? అత్తకు మళ్ళీపెళ్ళి చెయ్యమన్నాను. మీరు ప్రతిదానికీ భారత రామాయణాలు ఆదర్శంగా తీసుకొంటారుగా, రమణయ్య మామా? భారతకథలో సంతానయోగ్యుడుకాని భర్త ఉంటే అతడి భార్యలు ఏం చేశారో తెలీదూ? విచిత్ర వీర్యుడు సంతానానికి యోగ్యుడు కాడు. వంశం ఎలానిలబడాలి అని ఆలోచిస్తారు పెద్దలు. అతడి భార్యలైన అంబికనూ, అంబాలికనూ వ్యాసమహర్షి దగ్గరికి పంపుతారు, శోభనానికి ముహూర్తం నిర్ణయించి. పాండురాజు శాపగ్రస్తుడై సంతానార్హతను పోగొట్టుకొంటాడు. వంశోద్దరణకోసం, అతడిభార్య కుంతి భర్త అనుమతితోనే యమున్ని, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి ఆహ్వానించి వాళ్ళవల్ల పిల్లల్ని కంటుంది. ఆవిణ్ణి 'కుంతీ మాత' అని సగౌరవంగా కీర్తిస్తున్నాం! భారతంలో ఈ స్త్రీలను ఎవరైనా తప్పుపట్టారా?"

    "ఆ కాలంలో తప్పులేదేమోగాని ఈ కాలంలో శుద్దతప్పు తెలుసా?" విరుచుకుపడ్డట్టుగా అన్నాడు  రమణయ్య. "ఈ రోజు నీ సంగతేమిటో తేల్చేసుకొంటాను. నీ నోరు ఎవరూ మూయించేవాళ్ళు లేరనుకొన్నావా? నీలా పురాణాలు నోటపెట్టుకోకపోవచ్చు. కాని మాట్లాడటం చాతకదని మాత్రం అనుకోవద్దు."


    "అబ్బా! పెళ్ళానికి మళ్ళీ పెళ్ళిచేయమంటే ఎంత పౌరుషంపొడుచుకు వచ్చిందో మగాడికి "ఒకచెయి నడుంమీద ఉంచుకొని, మరోచెయ్యి గడ్డం మీద ఆన్చి, ఆకర్షణీయమైన భంగిమలో నిలబడింది ప్రేమీ. "అవునూ! ఇష్టమైతే నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. అత్త ఎందుకు చేసుకోకూడదు? అత్తకి మాత్రం పిల్లల్ని కనాలని తపనలేదా? తన ప్రతిరూపం చూచుకోవాలన్న కోరిక ఉండదా? తల్లికావాలన్న తహతహ ఉండదా? లేదేమో అడుగుదాం పద!"

    "మీ అత్త రంకులాడి కాదు. అది పతివ్రత."

    "అయితే రాళ్ళను గుగ్గిళ్ళనుచేసి పంచుతుందన్నమాట. కాకపోతే, కాలపరిస్థితులనుబట్టి పతివ్రతలకి మహిమలు సిద్దించడం మానేసి ఉంటాయనుకోవాలి."

    నవ్వువస్తూంటే ముఖం త్రిప్పుకొన్నాడు విశాల్.

    ఉడుక్కున్నాడు రమణయ్య. "మహిమలు లేకపోతే మాత్రం ఒక భర్తతో ఉన్న ఆడది పతివ్రతకాకుండాపోదు ఎంత పిల్లల్లేకుంటే మాత్రం అది మరో మగాడిని కలలోనైనా ఊహిస్తుందేమో అడుగుదాం, పద!"

    "నువ్వడిగితే చెబుతుందా? నీ ఎదురుగా చెబుతుందా?"

    "మీ అత్తగురించి పిచ్చిపిచ్చిగా ఊహించకు. కళ్ళు పోతాయి. మీ అత్తసాధ్వి. "సాధ్వి అని చెప్పడంలో అతడి ఛాతీ గర్వంతో ఉబ్బినట్టుగా అయింది.

    "ఆ సాధ్వికి నువ్వివ్వబోతున్న బహుమతి సవతి నన్నమాట."

    "మీ అత్త అంటే నాకు ప్రేమ లేకకాదు, మరో ఆడదాన్ని కత్తుకోవడం. పిల్లలు కావాలనే మళ్ళీ పెళ్ళి."

    "అంత పిల్లలు కావాలని అల్లాడిపోయేవాడివి, ఈ సమాజంలో ఎందరో అభాగ్యస్త్రీలున్నారు. వాళ్ళలో ఒకదాన్ని నీ వంశోద్దారకురాలిని చేసుకొంటే ఏం? పిల్లలు కనడానికి కూడా నీకు శీలవతి సింగినాధం కావాలి."

    "ఎంగిలి కూడు ఎవడు తింటాడు?" కంపరంగా అన్నాడు రమణయ్య.
   

 Previous Page Next Page