Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 39

    ఎక్కడ్నుంచో  శీతల వాయువులు వీస్తున్నట్టు చిన్న చిన్న శబ్దతరంగాలు మధుర ధ్వనులుగా మారి మృదువుగా వీనుల్లో మార్మోగుతున్నట్టు అమరానుభూతులు.

    "రా" అన్నాడు పిలుస్తున్నట్టు.

    అతని చెయ్యింకా ఆమె భుజంమీదే వుంది. మంత్రముగ్దురాలయినట్టు అతని కౌగిలిలో అలా వుండే నడిచి వెళ్ళింది.

    ప్రక్కనున్న ఓ ద్వారం తెరుచుకుంది. ద్వారం దాటి ఇద్దరూ అవతలకు నడిచారు.

    ఆ స్థితిలో కూడా ఆమె విస్మితురాలయిపోయినట్లు నిలబడిపోయింది.

    ఏకాంత మందిరంలో ప్రత్యేకంగా తనకోసమే నిర్మించుకున్నట్టు అత్యంతాధునికమైన స్విమ్మింగ్ ఫూల్.

    "నువ్వు స్విమ్మింగ్ లో   ప్రవీణురాలవయి  వుంటావని  నా నమ్మకం."

    ఆమె తల ఊపింది.

    సరాసరి నీటిలోకి దూకవచ్చు. మెట్లు దిగి  లోపలకు ప్రవేశించవచ్చు. ఆమెను కౌగిలిలో వుంచుకునే మెట్లు దిగి నీళ్ళలోకి వెళ్ళాడు.

    మొదట చాలా చల్లగా వున్నట్టనిపించింది. కొద్దిగా శరీరం జలదరించినట్టయింది. ఆమె నీటిలో ఈదుతూ  అతని వంక చూసింది. అతి సునాయాసంగా, ఎంతో అనుభవమున్నట్లు...అలా...అలా...కదుల్తూ తేలిపోతున్నట్లు ...ఓ దివ్య పురుషుడిలా గోచరించాడు. క్రమంగా నీళ్ళు వెచ్చగా మారిపోతున్నాయి. ఆమె వెల్లకిలా పడుకుని నీటిలో తేలుతూ పైకి చూసి ఉలిక్కిపడింది.

    తానెక్కడుంది? మందిరంలో బయటకి కనబడకుండా నిర్మించిన కొలనులోనా? బాహ్య ప్రపంచంలోనా ?
    పైన వినీలాకాశం _ నక్షత్రాలు మిలమిలమెరుస్తున్నాయి. ఓ ప్రక్క చందమామ  పూర్ణరూపంలో వెలిగిపోతున్నాడు. వెన్నెల కురిసిపోతోంది.

    ఆమె ఆశ్చర్యం గమనించి "మనం లోపలే వున్నాం. బయటకు వెళ్ళలేదు. నువ్వు చూస్తున్నది  ప్లానిటోరియమ్. సృష్టికి ప్రతిసృష్టి చేశాను" అన్నాడు.

    ఆమె అలా చూస్తుండగానే నక్షత్రాలు అటూ ఇటూ  కదులుతున్నాయి. చంద్రుడు ముందుకు జరుగుతున్నాడు.
    ఎక్కడో సముద్రంలో ఈదులాడుతూ  సృష్టిలో  విహరిస్తున్నట్లుంది. "అద్భుతం" అన్నది తన్మయంగా.
    అతనామెకు దగ్గరగా వచ్చి చేతుల్లోకి పూర్తిగా తీసుకుని గాఢంగా హత్తుకున్నాడు. పెదవులూ పెదవులూ కలిసిపోతున్నాయి.

    అధరామృతం మధుర మధురంగా గ్రోలుతున్నారు.

    నీళ్ళు ఇందాకటికంటే వెచ్చబడ్డాయి.

    ఇద్దరూ స్థిరంగా లేరు. హత్తుకు పోయిన రెండు చేపల్లా, జలజీవుల్లా నీటిలో కదుల్తూనే వున్నారు.

    కృత్రిమాకాశంలో మేఘాలు  క్రమ్ముకొస్తున్నాయి. ఆ తన్మయ స్థితిలో వుండే ఈ వింతను గమనిస్తోంది.

    అలా నీటిలో  అంటిపెట్టుకుని  విహరిస్తూనే  సునాయాసంగా కదుల్తూనే ఆమెలో పూర్తిగా విలీనమైపోయాడు.

    "ఊ" అని ఆనందపారవశ్యంతో  చిన్నశబ్దం చేసింది. ఈ బంధం ఏ శృంగార కావ్యకర్త అయినా ఇదివరకు వర్ణించాడో లేదో తెలియదు. వారి ఊహలకు అందిందో లేదో తెలీదు. కాని ...పెనవేసుకుని వున్న కదలికలే ఈతగా, సాగర గర్భంలో శృంగార యాత్రగా, మోహ విహారంగా పరిభ్రమిస్తున్నారు.

    పై నుంచి పన్నీటి చుక్కలు పడినట్టనిపించి  కనురెప్పలు  కొద్దిగా తెరచి చూసింది.

    నక్షత్ర  మండలాన్ని  కప్పేసిన  మేఘాలు  సుతారంగా వర్షిస్తున్నాయి _ వివిధ పరిమళాలను  వ్యాపింపచేస్తూ.
    దేవతలు ఆశీర్వదిస్తూ  పూలవర్షం కురిపిస్తున్నట్టు నిషానుభూతికి లోనవుతూ తిరిగి కనురెప్పలు మూసి, అతన్లో తాను భావించుకుంటున్న ఆ దివ్య పురుషుడిలో ఇంకా ఇంకా ఇమిడిపోతోంది.
 

                                                      14


    చేతిలోని పత్రికను విసురుగా  టీపాయ్ మీదకు గిరాటేసింది తేజ. ఆమె కెదురుగా పేము కుర్చీలో  కూచుని పేపరు  చదువుతున్న ధర్మారావు తలెత్తి చూశాడు.

    "ఆచార్య జగదీష్ ! ఎవరు డాడీ యీ విచిత్రమైన సిద్దాంతాన్ని లేవదీస్తున్న యుగపురుషుడు."

    ధర్మారావు నవ్వాడు. "మన దృష్టిలో విచిత్రమనుకుంటోన్న యీ వాదం ప్రపంచాన్ని ఉద్దరించటంకోసం సృష్టించిన సహజ సిద్దాంతమని ఒకానొక కార్యం నెరవేర్చడం కోసం ఉద్భవించిన కారణజన్యులనుకుంటారు." అన్నాడు.

    "డాడీ ! ఈ అతివాదం  అనే వ్యామోహం చాలా మందికి వుండడం, దాని ప్రభావంతో ప్రపంచంలోని ఓ నూతన శక్తిలా ప్రభవిస్తూ చొచ్చుకుపోవాలని చూడడం నా కెంతో ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది" అన్నది తేజ. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.

    "తేజా ! ఓ చిత్రం  చెప్పమంటావా? ఎంత వికృతంగానైనా వుండనీ _ యీ అతివాదం అనేది లేకుండా ప్రపంచానికి మనుగడలేదు. పెర్ వెర్షన్సే   సహజత్వంగా  భూమిని ముప్పాతిక వంతులు ఆక్రమించి పారేస్తున్నాయి. 
         
 

 Previous Page Next Page