Previous Page Next Page 
భారతి పేజి 39

    అతనివంక  చురుగ్గా చూసింది. అతను కూడా ఆమె వైపు  ఓరగా  చూసి, తానా మాటలు ద్వంద్వభావంతో అనలేదన్నట్లు  తేలిగ్గా నవ్వేస్తూ  "అదే, రోగులు వచ్చి  కొద్దిరోజులయినా  వాళ్ళందరితో  ఎంతో ఆత్మీయంగా  కలిసిపోయావుగా!" అన్నాడు.

    భారతి మెల్లగా అడుగులు వేస్తూంది. "నా విద్యుక్తధర్మం  నేను నెరవేరుస్తున్నాను" అంది వాడిగా.

    డాక్టరు మళ్ళీ నవ్వాడు. "నువ్వలా అనుకోవటం  మంచిదే. కానీ, వచ్చేదారి  చూసుకోవటంలేదు. అదిగాకుండా  నువ్వు  వేళాపాళా చూసుకోకుండా  పనిచేస్తున్నావని  విన్నాను. అలా చేస్తే  నీ ఆరోగ్యం దెబ్బతింటుంది కూడా."

    "మరేం ఫర్వాలేదు"

    "నీ యిష్టం. నీ మంచికోసమే  చెబుతున్నాను. ఒకప్పుడు నువ్వు  లెప్రసీ  పేషెంటువని  మర్చిపోకు. ఇలా అతిగా  వారిమధ్య  తిరిగితే  చాలా  సులభంగా  నీకు మళ్ళీ సంక్రమిస్తుంది.

    దెబ్బ ఎక్కడ  కొట్టాలో  అక్కడ  కొట్టాననుకున్నాడు డాక్టరు. మొదట, వెంటనే పరిపరిభావాలతో  తల క్రిందులై  నిలువునా  వణికిపోయింది భారతి. ముఖం  ఎర్రబడిపోయింది. కాని, ఆ దశ ఒక్క నిమిషమే. తిరిగి అంతలోనే  తనని తాను నిగ్రహించుకుని  ఆమె మళ్లీ మామూలు  భారతి  అయిపోయింది. ఆమె  పెదవుల మీదికి  అసహ్యంతో కూడిన చిరునవ్వు  ఒకటి చిగురించింది.

    డాక్టరు  ఆగాడు. "అందులో  నవ్వొచ్చేదేముంది?" అన్నాడు దెబ్బతిన్నట్లుగా.

    "మీలాంటివాళ్ళు  డాక్టరుగా  వున్నందుకు" అని, భారతి ఇహ అక్కడ  ఆగకుండా  తన క్వార్టర్సువైపు  వడివడిగా నడిచి  వెళ్ళింది.


                                                                   *    *    *


    కొన్నాళ్ళయ్యాక  భారతి  ఒకసారి  డాక్టరు  గోవిందరావు  దగ్గరకు వెళ్ళి అడిగింది: "డాక్టర్, ఇది రోగులపాలిట  చెరసాలలా  ఉంది గాని  ఆసుపత్రిలా  నాకు  కనబడటంలేదు. వాళ్ళ కాలక్షేపానికి, వాళ్ళ మనుసులు  వికసించటానికి, వాళ్ళ వృత్తి విద్యలు  నేర్చుకోవటానికీ  సదుపాయాలు  ఏవి? మందులు మ్రింగుతూ, విధిని తిట్టుకుంటూ  కూర్చోవటమేనా వారి పని?"         

    "అంతకంటే  ఏం చేస్తారు? కుష్ఠురోగులు!" వెటకారంగా  నవ్వి అతనన్నాడు.

    ఆమె అతనివంక  తీక్షణంగా  చూసింది. "డాక్టర్! ఇది మీ స్థానంలో  వున్న వ్యక్తి అనవలసిన మాటకాదు. గుండెల్లో  కరుణ చిమ్మని మనిషి  వైద్యుడు కానేరడు" అంది ఆవేశంగా.

    "నేనయ్యాను, ఏంచేయమంటావు?"

    భారతికి "ఛీ" అనిపించింది  కాని, ఆమె అసహ్యాన్ని  మనసులోనే  దాచుకుని, "ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఫండ్స్  ఉన్నాయటగా. వాటిని  దుర్వినియోగ పరచకపోతే కావలసిన సదుపాయాలన్నీ  చెయ్యకూడదూ?" అంది.

    క్షణంలో  డాక్టరు ముఖం వివర్ణమైంది. ఎలాగో  తమాయించుకుని, 'ఆ విషయాలన్నీ  అడగటానికి నీకు అధికారం లేదు. నేను నీ బాస్ ని ఆసుపత్రి యోగక్షేమాలు  నీకంటే నాకు బాగా తెలుసు. నిన్నగాక మొన్న వచ్చినదానివి. అనవసరమైన  విషయాలలో  తలదూర్చకు   అన్నాడు  కఠినస్వరంతో.

    భారతి నవ్వింది. "మీపై  అధికారం  ఉన్నవారు  ఈ ప్రశ్న  అడగరు. మీ క్రింద పనిచేసేవారికి  ఇటువంటి  ప్రశ్న  అడిగే అధికారం లేదు. ఈ సమస్య  పరిష్కారం  కావటమెలా  డాక్టర్?" అంది.

    'పరిష్కరించటానికి  మొనగత్తెవి  దిగివచ్చావులే! అనవసరపు ప్రసంగం చెయ్యక వెళ్ళి నీ పని చూసుకో!" అన్నాడు డాక్టరు  మండిపడుతూ.

    "థాంక్యూ, సర్" అంటూ  ఆమె అక్కడి నుంచి కదిలింది.

    అక్కడి రోగుల్ని  చూస్తే  ఆమెకు ఒక్కోసారి  కళ్ళనీళ్ళు నిండుకొచ్చేది. ఒకవారంతోనో ,నెలతోనో  పోయే  జబ్బుకాదు  ఇది. కొందరైతే  సంవత్సరాల  తలబడి  వుండిపోవలసి వస్తుంది. ఏ వ్యాపకమూ, ఏ మానసిక వికారమూ, ఏ చైతన్యమూ  లేకుండా  జీవచ్చవాలలాగా  ఎలా కాలం వెళ్ళబుచ్చటం?

    మనసులో  ఎన్నో  ఊహలు  ప్రవాహంలా  వచ్చాయి. వీళ్ళందరూ  తోటపని చెయ్యవచ్చు. రకరకాల చెట్లు  మొలిపించవచ్చు. వడ్రంగం, దర్జీపని, బుట్టలు నేయటం__ఇలా ఎన్నో వృత్తి విద్యలు  ఎవరి అభిరుచుల్ని  బట్టి వారు నేర్చుకోవచ్చు. కాని ఎవరు పట్టించుకుంటారు?

    ఈ దిగులుతో  ఆమెకు  రాత్రింబవళ్ళు  గడిచిపోసాగాయి.

    డాక్టరు గోవిందరావు  కుత్సితత్వాన్ని  గురించి  ఆమెకు క్రమంగా  చాలా విషయాలు తెలిశాయి. అక్కడ పనిచేసే కాంపౌడర్లు  చెప్పారు.

    ఆసుపత్రి  అభివృద్ధికోసం  కేటాయించబడిన  డబ్బంతా  అతను కబళించి వేస్తున్నాడట. అధికారులు ఎప్పుడైనా  తనిఖీకివస్తే  ఏదో కలగా పులగం  చేసి  చూపించి, ఇబ్బంది  దాటేస్తాడట. లేకపోతే వాళ్ళని ఖుషీచేసి  పంపిస్తాడట. డాక్టరుగారు  పానీయప్రియులు. చుక్క గొంతులో  దిగకపోతే  ఆయనకు  కంటిమీదకు నిద్రరాదు. ఇంట్లో పెళ్ళాం, పిల్లలూ తతంగం చాలా వుంది. అందుకని  పై సంపాదన ముఖ్యావసరంగా పరిణమించింది.

    ఒకసారి  తన క్రింద  పనివారందరిచేతా  ఫస్టుతారీఖు రాగానే  జీతాలు ముట్టినట్లు  సంతకాలు పెట్టించి రసీదులు తీసుకున్నాడట. గవర్నమెంటు  ఆఫీసులలో  అలా రసీదులు  ముందుగానే  తీసుకోవటం  రివాజే. తీసుకుని, జీతాలు ఎంతకీ  ఇవ్వలేదట? పనివాళ్ళు  అడుగుతూంటే  ఇదిగో, అదిగో అని రోజులు  వెళ్ళబుచ్చాడట, ఎన్ని రోజులకీ ఆయన దగ్గరినుంచి  రొక్కం రాలకపోయేసరికి, వాళ్ళు ప్రాణం  విసిగి నిలదీసి అడిగారట "జీతాలేమిటి?" అని ఆయన ఆశ్చర్యపోయినట్లుగా  ముఖంపెట్టి, "మీకెప్పుడో  ముట్టాయి" అన్నాడట తాపీగా. ఆ మీదట పెద్ద వాగ్వివాదం  జరిగింది ఆయనకూ, పనివారికీ  ఎంత దబాయించినా  ఆయన్ని  జయించలేక పోయారు. చివరకు  ఇలా పేచీలు పెడితే ముందు  ముందుకూడా  వారికలాంటి  శాస్తే  చేస్తానని  బెదిరించేసరికి  వాళ్ళింక ఏమీ  చేయలేకపోయారట.

    ఇంకో కథ  చెప్పారు.

    వెనకటి  ఆయన  యుద్ధంలో  పనిచేస్తూ  వుండేవాడట. అప్పుడు భార్యను వరసగా  రెండు మూడు సంవత్సరాలపాటు  పుట్టింట్లో  బావమరదులు దగ్గర  వుంచాడు. నెలనెలా  భార్యకు డబ్బు పంపించేవాడు. అయితే  భార్య పేరున  కాకుండా  బావమరది  పేరున  పంపించేవాడట.

    యుద్ధం నుంచి  తిరిగివచ్చాక  భార్యను  తనతో  తీసుకుపోతూ బావమరిదితో "నా డబ్బు తెమ్మన్నాడట"

    "నీ డబ్బేమిటి?" అన్నాడట  బావమరిది  తెల్లబోయి.

    "అదే  నేను  అక్కడి నుంచి పంపించిన డబ్బు"

    "నా దగ్గరెక్కడుందీ? ఎప్పటికప్పుడు  అక్కయ్యకే ఇచ్చేస్తూ వచ్చాను" అన్నాడు బావమరిది అమాయకంగా.

    "తను తీసుకోలేదు. నీ దగ్గరే  వుంచానని  చెబుతున్నది. ఏమే! అవునా?" అని ఆయన భార్యవంక చూశాడట. రాత్రంతా  ఏమి చెప్పి వుంచాడో, ఏమో, ఆమె భర్తను  సమర్ధిస్తూ  తల ఆడించింది.

    బావమరిది  మతిపోయింది. "అబద్ధం, అన్యాయం" అని అరిచాడట.

    "ఎవరది  అన్యాయం? నా పెళ్ళానికి ఇస్తావు కదా  అని నీ పేర పైకం  పంపిస్తే  అదంతా  తినేసి, ఆడకూతురికి అన్యాయం చేసి  పైగా  బూకరిస్తున్నావూ?" అని ఆయన  గట్టిగా కేకలు పెట్టాడట.

    నలుగురూ పోగయారు. పెద్ద  గలటా  జరిగింది.

    చివరకు  బావమరిది  చేసేది లేక  "అక్కయ్య గనుక ఆ డబ్బు నేను తనకు  ఇవ్వలేదని  నలుగురి ఎదుటా  తలమీద చెయ్యి పెట్టుకుని  ప్రమాణం చేస్తే  ఆ డబ్బు  ఇచ్చేస్తా" అన్నాడట.

    "చెయ్యవే. ఉన్న  విషయం  చెప్పటానికి  భయమెందుకు?" అన్నాడట  భార్య వంక ఉరిమిచూస్తూ.
    ఆ మహాతల్లి  అలాగే  ప్రమాణం చేసింది.

    బావమరిది  హతాశుడైపోయి, చేసేదిలేక  మాట నిలబెట్టుకోవటానికి డబ్బు లెక్క  పెట్టి  నాలుగు వేల రూపాయలూ  గుమ్మరించాడట.

    ఇలాంటివన్నీ  వినేసరికి  భారతికి  అతనంటే  అసహ్యం హెచ్చు మీరిపోయింది. అతని భార్యతో  మాట్లాడటానికి  ఆమె మనస్సు  విముఖంగా  వుండేది. ఎప్పుడూ  వాళ్ళ ఇంటికి వెళ్ళేదికాదు.

 Previous Page Next Page