"ఏమిటీ? మీరు రిపోర్టు ఇయ్యనిది నాకోసమా? ఇదంతా నామీద ప్రేమేనా? ఆహా! ధన్యురాలిని!"
"సూనా!"
"ఛీ! ఛీ! నన్నలా పిలవకండి."
చివాలున లేచి వెళ్ళబోతూ గుమ్మందగ్గర ఆగి వెనక్కు తిరిగింది.
"సాయంత్రం కూలిపేటకు వస్తారుగా! అక్కడ మీకు కావలసినన్ని కేసులు. తిండికిలేక గుప్పెడు మెతుకులు 'దొంగ తనం' చేసిన వాళ్ళుంటారు. యజమాని పెట్టే బాధలు భరించలేక ప్రాణాలు విసుగెత్తి ఎదురు తిరిగే 'గుండా'లు ఉంటారు. గుక్కెడు గంజినీళ్ళకోసం ఒళ్ళమ్ముకునే 'నీతి మాలినవాళ్ళు' ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకుంటే మీకు కావలసినంత పేరు ప్రఖ్యాతు లొస్తాయి. మీ నిజాయితీని, ధర్మ తత్పరతను ముందు తరంవాళ్ళు కూడ గానం చేస్తారు."
సెగలు కక్కుతూ సాగిపోయింది ప్రసూన......
కొన్ని క్షణాలు మోహన్ కు మనసు పని చెయ్యలేదు అంతలో కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఈ దొంగనోట్ల వ్యవహారం సాధ్యమైనంత త్వరలో తేల్చేయ్యాలి! ఇందుకు చిరంజీవి సహకారం కావాలి!
చిరంజీవి 'పార్టీ, పార్టీ' అని మురిసిపోతున్నది ఆ రోజేనని గుర్తువచ్చింది. ఏకంగా హోటల్ లోనే చిరంజీవిని కలుసుకోవచ్చునని బయలుదేరాడు.
కాని మోహన్ ఆశించినట్లు చిరంజీవి హోటల్ లొ లేడు. హుషారుగానూ లేడు- హోటల్ కెదురుగా ఉన్న చెట్టునానుకుని నించున్నాడు. సూట్ లో లేడు. ఎప్పటి ముతక బట్టలలోనే ఉన్నాడు. ఎప్పుడూ లేనంత దీనంగా ఉన్నాడు.
మోహన్ దగ్గిరగా వచ్చి భుజంమీద చెయ్యివేసి 'చిరంజీవి!' అన్నాడు.
ఆప్యాయతతో కూడిన ఆ పలకరింపుకు చిరంజీవి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతి ప్రయత్నంమీద నిగ్రహించుకున్నాడు.
"వినండి సార్! మా స్టూడెంట్స్ అంతా ఎంత సరదాగా నవ్వుకుంటున్నారో?"
"అది సరే! నువ్విక్కడెందుకున్నావ్? పార్టీలో జాయిన్ అవలేదేం?"
"జాయిన్ అవలేదేం? అని అడుగుతున్నారా సార్! ఈ క్షణంలో వాళ్ళ మధ్య వుండటానికి నాకున్న దేదైనా వదులుకోగలను సార్!"
"మరి..........."
"వాళ్ళు రానివ్వలేదు సార్!"
"అంటే విద్యార్దులలో కూడా బీదా, గొప్పా........"
"అదికాదు సార్! మరొకటి! మా కెమిస్ట్రీ లెక్చరర్ కి ఒక పన్ను ఊడిపోయింది సార్ - తెలివైనవాడే కాని మాట కొంచెం తొస్సిగా వస్తుంది. మొన్న ఆ లెక్చరర్ పాఠం చెప్తోంటే ఒక స్టూడెంట్ ఆయనను ఇమిటేట్ చేస్తూ గొడవ చేసాడు. క్లాసంతా గందరగోళం మయింది. లెక్చరర్ ఆ స్టూడెంట్ ని క్లాస్ నుంచి వెళ్ళి పొమ్మన్నారు- తనను మెడ పట్టి గెంటాడని ఆ స్టూడెంట్ కంప్లెయింట్ చేసాడు- స్టూడెంట్సు అందరూ ఒకటయ్యారు. ప్రిన్సిపాల్ నన్ను అడిగారు..........నేను నిజం చెప్పాను సార్! పాపం. ఒక పన్ను లేనంత మాత్రాన ఆయన్ని ఉద్యోగంలోంచి పీకెయ్యాలనటం నేను ఒప్పుకోలేక పోయాను. వాళ్ళందరితో ఒక మాటమీద నిలవనందుకు స్టూడెంట్స్ కి నామీద కోపం వచ్చింది. నన్ను బాయ్ కాట్ చేసారు........"
మోహన్ ని చూసి దీనంగా నవ్వాడు చిరంజీవి ఏమీ అనలేని మోహన్ ఓదార్పుగా చిరంజీవి భుజం తట్టాడు.
"పరమేశ్వరిగారి దగ్గిరకు పోదాం పదండి సార్?" అన్నాడు చిరంజీవి.
"ఇప్పుడా!........."
"అవును సార్! మనకంటే దౌర్భాగ్యులను చూసి మన దుఃఖం మరచిపోవచ్చు........" కాదనలేక పోయాడు మోహన్.
మోహన్ ను చూడగానే కోపంతో మండిపడిన ప్రసూన చిరంజీవిని చూడగానే సమస్తమూ మరచిపోయింది......
"అదేమిటి చిరంజీవి? అలా ఉన్నావేం?" అంది......
చిరంజీవి నవ్వుతూ త్రుళ్ళుతూ జరిగినదంతా చెప్పాడు. అతడు పైకి ఎంతగా నవ్వుతోన్నా లోలోపల ఎంత మధన పడుతున్నాడో అందరికీ అర్ధమయింది- ఈ మాత్రానికే ఇలా అయిపోతున్నావా చిరంజీవి! నా కధ వింటే ఏమంటావో?........" అంది పరమేశ్వరి - అందరూ కుతూహలంగా చూసారు.
"రవిని నేను ప్రేమించింది ప్రధానంగా అతని వ్యక్తిత్వాన్ని చూసి........మేం పెళ్ళి చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్సు అందరూ మమ్మల్ని ఆదర్శ దంపతులని పొగిడారు. రవిది మొదటినుండీ క్రమబద్దమైన జీవితమే! కొన్ని విలువ లకు కట్టుబడి ఉండే మనిషి- అప్పుడప్పుడు నేను సరదాకి అబద్దాలాడినా నన్నూ మందలించేవాడు. డిగ్రీలు తీసుకున్న ఇద్దరమూ ఉద్యోగాన్వేషణలో పడ్డాము. కొంత శ్రమ పడ్డాక నాకు ఉద్యోగం దొరికింది. కానీ రవికి ఎంత ప్రయత్నించినా దొరకలేదు. నా జీతంమీద ఆధారపడి ఉండటానికి అభిమాన పడేవాడు. లంచం పెడితేగాని ఉద్యోగం దొరకని పరిస్థితి.......'మనబోటివాళ్ళం కూడా లొంగిపోతే ఎలా? లంచం ఇయ్యవద్దు.....' అని నేను ......రవికికూడా లంచం ఇయ్యటం అంటే అసహ్యం..... కానీ తనను పట్టి పీడించే నిరుద్యోగ పిశాచి ముందు నిలవలేక పోయాడు. లంచం ఇయ్యటానికి సిద్దపడ్డాడు- నేను ఒప్పుకోలేదు.
"ఎవరిమటుకు వాళ్ళమే ఇలా లొంగిపోతే ఈ విషయాల్లోంచి బయటపడేదెప్పుడు? ప్రతిఘటించి పోరాడాలి".