Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 40


    ఆ రోజురాత్రి చాలాసేపటివరకూ డాబామీద వెన్నెల్లో కూర్చుని ఏవేవో మాట్లాడుకుంటూగడపారు వాళ్ళు. వెన్నెలలో ద్విగుణీకృతమవుతున్న ఆమె అందం అతనిని విపరీతంగా ఆకర్షించసాగింది. నిజానికి ఆమెలో అదివరకటి అందం, ఆకర్షణా లేనేలేవు. అయినా ఆమెను వివాహంచేసుకోవాలి అన్న తలంపు వచ్చి దగ్గర్నుంచీ ఆమెయెంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించసాగిందతనికి.
    ఆమె నవ్వుతూ, తుళ్ళుతూ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఏదేదో కబుర్లుచెప్తోంది. తన మనసులోని ఆలోచన ఆమె ముందుంచడానికిఅదే సమయమనుకున్నాడు చంద్రకాంత్.
    "మీకు ఎప్పటినుంచో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను హేమగారూ! కానీమీరు కోపగిస్తారేమోనని భయంగా ఉంది..." అన్నాడతను ఆమెవంక చూస్తూ.     ఆమె విరగబడి నవ్వేసింది.
    "నాదగ్గర భయమా? బావుంది! నేనంటే భయపడేవారొకరున్నారన్నమాట!" అంది నవ్వేస్తూ.
    "భయమంటే భయం కాదనుకోండి! అలాంటిది!"
    "భలేవాడివే! నాకున్న ఆప్తుడివి నువ్వొక్కడివేకదా! కోపగించుకుని నిన్ను ఎందుకు దూరం చేసుకుంటానోయ్?"
    "అంటే కోపగించుకొను అని ఇది మీరు ఇస్తున్న హామీగాభావించవచ్చా?"
    "నీ యిష్టం! నువ్వెలా అనుకున్నాసరే! కానీ కోపం మాత్రం రాదునాకు?"
    "థాంక్యూ హేమగారూ!" అన్నాడతను.
    ఆ విషయం చెప్పాలో, ఎలా ప్రారంభించాలో తెలీటంలేదతనికి.
    "ఇంకాభయంపోలేదా ఏమిటి? దగ్గరకు తీసుకుని బుజ్జగించమంటావా?" నవ్వుతూ అందామె.
    చంద్రకాంత్ కూడా నవ్వేశాడు.
    "మీరునన్నెలా అర్ధం చేసుకున్నారో తెలీదుగాని మీరుకాలేజీలో చదివేరోజుల్లోనే నేనుమిమ్మల్ని ప్రేమించాను హేమగారూ! నా ప్రేమను మీకు తెలియజేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. అందుకు కారణాలెన్నో ఉన్నాయ్. మీరు అంగీకరిస్తారోలేదోననీ, మీకంటే నాకు వయసు చాలాతక్కువనీ, కోప్పడతారేమోననీ, ఇంకా పెద్దాడినయాక చెప్పాలనీ...." త్వరత్వరగా మాట్లాడాడతను.
    ఆమె నిర్ఘాంతపోయింది. కొద్దిక్షణాలు ఆమె శరీరంలో రక్తప్రసారం నిలిచిపోయినట్లయింది. తనకసలు అలాంటి అనుమానమే కలుగలేదెప్పుడూ! అలాంటిఆలోచనే రాలేదింతవరకూ! అలా జరగడానికి సంభవముందనికూడా అనుకోలేదు.
    "మీకు వివాహం జరగబోతోందని తెలిశాక నేనెంత బాధపడ్డానో మీకు తెలీదు. రెండురోజులు భోజనం చేయలేదంటే మీరు నమ్ముతారా?మేము ఈ ఊరువదలి హైద్రాబాద్ వెళ్ళే రోజున నా మనసు విప్పి మీకు చెప్పేయాలనుకున్నాను. కానీ వివరంగా చెప్పడానికి భయం మీరు నన్నర్ధం చేసుకోలేదు. ఆ రోజు మీ మీద ఎంతకోపం వచ్చిందో మీకు తెలీదు. నన్నంత నిర్లక్ష్యంచేసినందుకు ఇంకెప్పుడూ మిమ్మల్ని చూడకూడదనీ, మీతో మాట్లాడకూడదనీ అనుకున్నాను. కానీ అదెలా సాధ్యమవుతుంది? ఆ ప్రేమ ఒక్కనాటిదికాదుగదా! త్రుంచివేయడం సాధ్యమేనా? ఆ రోజునుంచీ మీమీద ప్రేమ కలిగింది. ఆరాధన ప్రారంభమయింది. మీకు తెలీదు మిమ్మల్ని తల్చుకొనని రోజు లేదింతవరకూ అందుకే ఎన్నోసార్లు మిమ్మల్ని చూడడం కోసం ఏదొక నెపంతో మీ ఇంటికి రావడం ప్రారంభించాను.
    మీ ఇంట్లో మీరు అనుభవిస్తున్న నరకం చూశాక మీ మీద మరింత గాఢంగా ప్రేమకలిగింది. మిమ్మల్ని క్షణం కూడా వదలిఉండాలనిపించలేదు. మిమ్మల్ని శ్రీనివాసరావు దగ్గర్నుంచీ బలవంతంగానయినా ఎత్తుకుపోయి దేవతలా పూజించాలనిపించేది. ఇన్నేళ్ళకు ఇప్పుడు నా ఆశలు మళ్ళీ చిగురించినయ్. ఇప్పుడు మీరు ఏ బంధమూ లేనివారు. అన్ని బంధాలూ వదిలించుకున్నవారు. మిమ్మల్ని వివాహంచేసుకుంటే నా జీవితం ధన్యమవుతుందనిపిస్తుంది. నా గురించి మీకు తెలుసు. మీ గురించి నాకు తెలుసు. మనిద్దరి ఆలోచనలూ, అభిప్రాయాలూ ఒక్కటే! మనం వివాహం చేసుకుంటే అందుకువిచారించాల్సిన క్షణాలేరావు. ఎంతో ఆనందంగా, సుఖంగా మన జీవితాలు గడిచిపోతాయని నాకు నమ్మకుంది. నాకు మీ అంగీకారం కావాలి హేమగారూ! కనీసం నామీద కనికరంతోనయినా ఇందుకు అంగీకరించండి....." ఆవేశంగా అన్నాడతను.
    హేమచిత్తరువులా ఎలాంటి కదలికలేకుండా అతని మాటలువింటూండిపోయింది.
    అతనికేవి సమాధానం చెప్పాలో ఆమెకు అవగాహనకావడం లేదు. తనకు మళ్ళీపెళ్ళా? అసలిలాంటి ఆలోచనే రాలేదింతవరకు! అదీ చంద్రకాంత్ తోనా? అతన్నసలు ఆ అభిప్రాయంతోనే చూడలేదు. ఎలా ఊహిస్తుంది? అంత క్లోజ్ గా అంత ఆప్తుడిగా ఉన్న అతని హృదయంలో తను ఎంతోకాలం నుంచీ ఆరాధింపబడుతోందని ఎలా అనుకొంటుంది?
    అదీగాక అతను తనకంటే ఏడెనిమిదేళ్ళు తక్కువ వయసువాడు. మరి అలాంటి వివాహం ఎంత వరకూ ఆమోదయోగ్యం? అయినా అసలు తను వివాహం గురించి నిర్ణయం తీసుకున్నాక ఆలోచించాల్సిన విషయాలు అవన్నీ!
    "హేమగారూ! ఏమీ మాట్లాడరేం? మీ మౌనంభరించలేకపోతూన్నాను. దయచేసి మీ మనసులోని ఆలోచనలేమిటో నాతో చెప్పండి! ఇద్దరంకలిసే మంచీ చెడూ పరిశీలిద్దాం నా దగ్గర మీకు అంతటి చనువులేదూ? మనమధ్య అంతటి స్నేహం. సన్నిహితత్వం లేవూ! ఇంకెందుకు సంశయిస్తున్నారు?" ఆవేదనగా అడిగాడతను.
    "ఏమో చంద్రకాంత్! నేనెప్పుడూ మరో వివాహం గురించి ఆలోచించలేదు. అసలు జీవితమంతా ఒంటరిగానే గడిచిపోతుందని అనుకుంటా వచ్చాను ఇన్నాళ్ళూ! అదీగాక నువ్వు నాకంటే చిన్నవాడివి! అదెంత వరకూ సమంజసమోనువ్వే ఆలోచించు".
    "హేమా! మీరు కూడా వయసు తేడాల గురించి మాట్లాడడం బావుండలేదు భర్తే వయసులో పెద్దాడయి వుండాలని నిబంధనలేమీలేవే! భార్యవయసు ఎక్కువుంటే నష్టం ఏమిటి? ఎంతమంది భర్తల కంటే ఎక్కువ వయసున్నభార్యలు లేరు? వారందరి సంసారాలూ సవ్యంగానే ఉన్నాయి కదా......"
    "చంద్రకాంత్! దయచేసి ఇంక ఇప్పుడేమీ మాట్లాడకు నన్నుఆలోచించుకోనీ? ఇది ఇంత త్వరగా హఠాత్తుగా నిర్ణయించుకోవాల్సినవిషయం కాదు. నేను ఇంకా ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడే ఈ విషయం గురించి నిర్ణయించుకోవడం అంత తేలికయిక విషయం కాదు."
    "అలాగే! మీరు తాపీగా ఆలోచించడం మిమ్మల్ని తొందరపెట్టడం నాకు ఇష్టంలేదు. మీరు నిర్ణయం తీసుకోడానికి ఎంతకాలం పట్టినా సంతోషంగా వేచి ఉంటాను. ఒకవేళ మీరు మన వివాహానికి అంగీకరించకపోయినా మీ మీద నాకున్న అభిమానం, ఆరాధనా, గౌరవం అలాగే ఉండిపోతాయ్." ఉద్వేగంతో మాట్లాడాడతను. కొద్దిసేపు నిశ్శబ్దంగా వుండిపోయారిద్దరూ.
    "నేనింకవెళతాను చంద్రకాంత్! నిద్రవస్తోంది!" అనేసి డాబాదిగి కిందకువెళ్ళబోయిందామె.
    చంద్రకాంత్ వెన్నెలను ఆనందంతో చూడసాగాడు. తను మనసు విప్పి హేమముందుంచాక ఎంతో భారం తగ్గిపోయినట్లుంది తనకి. అంతవరకూ మనసులో పెరిగిపోతూ వచ్చినఆందోళనకాస్తా మాయమయిపోయింది. హేమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలీదు. తను అదృష్టవంతుడయితే నిరాకరిస్తుంది! అంతే!
    ఆలోచనల్లోనే ఎప్పుడో నిద్రపట్టేసిందతనికి. మర్నాడు ఉదయమే అతను తిరిగి హైద్రాబాద్ వెళ్ళిపోయాడు. మరికొద్ది రోజులపాటు ఆ విషయంగురించే ఆలోచిస్తూండిపోయింది హేమ తన ఉద్దేశ్యంలో తను మరో వివహం చేసుకోవడం తప్పుకాదు. అందులోనూ శ్రీనివాసరావ్ లాంటివాడి అహంకారంమీద దెబ్బ కొట్టాలంటే అదే సరయిన సమాధానం. తన వివాహపు శుభలేఖచూస్తే అతనెంతటి చిత్రవధ అనుభవిస్తాడో తనకు తెలుసు. అదే అతని బూజుపట్టిన భావాలకూ ఆలోచనా విధానానికీ ఓటమి!
    తననుకున్నట్లు భర్తను త్యజించిన ఆడదాని జీవితం అక్కడితో ముగిసిపోదని ఆ మగాడికెలాంటి హక్కులుంటాయో, ఆడదానికీ అవే హక్కులూ, రక్షణలూ ఉంటాయనీ చాటి చెప్పాలి. ఇది అతనికో చక్కటి గుణపాఠం అవుతుంది. కానీ ఈ రెండో వివాహమయినా తన పాలిట శాపంకాకుండా చూసుకోవాలి శ్రీనివాసరావ్ మూలానే ప్రతిమొగాడినీ సంశయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేమగాడిని గౌరవించకూడదనీ, ఎవరినీ తన దరిదాపులకు రానీకూడదనీ కూడా అనుకుంది. కానీ ఇప్పుడీ చంద్రకాంత్ కొత్త పరిస్థితిని సృష్టించాడు.
    శ్రీనివాసరావ్ లాంటి మృగం కాదు చంద్రకాంత్. అసలు వీరిద్దరి మనస్తత్వాల్లో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. చంద్రకాంత్ లాంటి మెత్తని స్వభావంగలవాళ్ళు, కపటంలేని మనసు గలవాళ్ళూ చాలా తక్కువమంది ఉంటారు. అయినా ఒకవేళతను అతనిని చేసుకోవడానికి వప్పుకొనేట్లయితే ఎన్నో ఆంక్షలు విధించాలి. ముందుగానే ఎన్నో వప్పందాలు చేసుకోవాలి. తనుపెట్టే నిబంధనలన్నిటినీ అతను అంగీకరించాలి ఇవన్నీ అతని మీద అపనమ్మకంతో కాదు. జీవితంలో మరోసారి మోసపోవడం తనకిష్టంలేదు. మరో అఘాయిత్యం భరించేంత మానసికబలం తనకులేదు. ఆ రోజే చంద్రకాంత్ నుంచి ఉత్తరం వచ్చిందామెకి.
    తను ఆమెనుంచి వర్తమానంకోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడట. తనకిప్పుడు ఆమెగురించిన ఆలోచనలు తప్పితే మరో ఆలోచనేలేదుట. తామిద్దరూ వివాహం చేసుకోవడంలో అతని కెలాంటి అనౌచిత్యమూకనిపించడంలేదట అటు అతని ఆశయాలూ, ఇటు తన ఆశయాలూ, రెండూ నెరవేర్చుకోవటమే అవుతుందట. తమ వివాహం తమకంటే ఎక్కువగా స్త్రీజాతిని మేల్కొలుపు అవుతుందట. ఇంకా ఏమేమో రాశాడతను.
    అతనికి వెంటనే జవాబురాసిందామె. తను ఈ విషయంలో ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోలేకపోతోందనీ, కనుక అతనోసారివస్తే ఇద్దరూ వివరంగా మాట్లాడుకుని అంగీకారానికివచ్చే అవకాశం వుందనీ తెలియజేసింది. ఉత్తరం అందిన వెంటనే అక్కడకు చేరుకున్నాడు చంద్రకాంత్. "ఉత్తరం అందిందా అసలు?" ఆశ్చర్యంగా అడిగింది హేమ.
    "ఓ! అందిన వెంటనే బస్సెక్కేశాను. పరీక్షా ఫలితాలు కదా మరి" నవ్వుతూ అన్నాడతను.
    "చెప్పండి హేమ! నాకా అదృష్టం ఉందా లేదా?" ఆత్రుతగా అడిగాడతను.
    "నాకేమీ అభ్యంతరం లేదు చంద్రకాంత్. కానీ నువ్వు నాక్కొన్ని హామీలివ్వాలి"
    చంద్రకాంత్ ముఖం ఆనందంతోవెలిగిపోయింది. చటుక్కున ఆమె చేతిని తీసుకుని గాఢంగా చుంబించాడతను.
    "మీరు ఏమడిగినా వప్పుకోడానికి సిద్దంగా వున్నాను హేమా! మీరెలా చెపితే అలా నడుచుకుంటాను! మీకు పూర్తిగా స్వేచ్చ స్వాతంత్ర్యాలుంటాయ్. మీరు స్త్రీకి కావాలని కోరుకుంటూన్న సమానత్వం, గౌరవం అన్నీ లభిస్తాయి. నన్ను నమ్మలేరూ?" ఆవేశంగా అన్నాడతను.

 Previous Page Next Page