హేమ మనసంతా ఆనందంతోనూ, అతని మీద అభిమానంతోనూ నిండిపోయింది. ఏదేమయినా తను అతనికి పూర్తిగా లొంగిపోకూడదు. తనను తను పూర్తిగా అర్పించుకుని చులకన చేసుకోకూడదు. మగాడి బుద్దే అంత. ఆడహ్ది లొంగేవరకూ ఓ విధంగానూ, లొంగాక మరోవిధంగా ప్రవర్తించడం ప్రతి మగాడికీ సహజగుణం. అందుకని మొదట్నుంచీ తనే అతనిమీద అధికారం చెలాయించాలి. అతనిని తన గుప్పెటలో ఉంచుకోవాలి! ఆడదానికంటే మగాడేమీ ఎక్కువకాదని అడుగడుగునా గుర్తుచేస్తూండాలి. అతనన్ని హామీలిచ్చేక ఇంక అతనిని అడగాల్సిందేమీలేదనిపించిందామెకి.
"సరే-అలాగయితే నీ ఇష్టం! మరి మీ ఇంట్లోవాళ్ళు మన వివాహానికి వప్పుకుంటారా?" అడిగిందామె.
"వప్పుకోరనే అనుకుంటున్నాను. అయినా నాకు వాళ్ళ అంగీకారంతోపనేముందీ ఇది నా జీవితం! నా ఇష్టం వచ్చినట్లు మలచుకునే అధికారంనాకుంది!"
ఆమె ఏమీ మాట్లాడలేదు.
"వాళ్ళు వప్పుకోకపోతే రిజిస్ట్రారాఫీసులో మన వివాహానికి ఏర్పాట్లు చేస్తాను! ఇవాళే హైద్రాబాద్ వెళ్ళిపోతాను!" అన్నాడతను.
"సరే!" అందామె.
ఆ తరువాత కొద్దిసేపటికి అతను హైద్రాబాద్ కి బయలుదేరేడు. అతనికి ఇదంతా నిజంగా జరిగినట్లు అనిపించడంలేదు. కలలాగా ఉంది. తను ఊహించని మలుపు ఇది. తను ప్రేమించి ఆరదిస్తోన్న దేవతను వివాహం చేసుకునే అదృష్టంతనకు లభించింది. ఇంతకంటే జీవితంలో కోరుకునేదేమంటుందీ? తనకు దక్కదు అనుకున్న ఆమె తిరిగితనదయే అవకాశం లభించడం, ముఖ్యంగా ఆమె తనకోరికను అంగీకరించడం నమ్మడానికి వీల్లేనినిజం ఇది ఇప్పుడు తనతల్లిదండ్రులనువప్పించాల్సిన మరోసమస్య తనకెదురవుతోంది. అయితే తనకో ధైర్యంఉంది తన అక్క వసుంధర. ఈ విషయంలో తన తరపున వుంటే కొంత సులభతరమవుతుంది తన బావ ఛాందసుడే కనక ఇందుకు అంగీకరించకపోవచ్చు. అందరూ కాదన్న తను హేమను వివాహంచేసుకునేది ఖాయంకాకపోతే వీలయినంతవరకూ ఈ విషయాన్ని సౌమ్యంగానే పరిష్కరించాలి.
హేమ ఆ రోజు భోజనంచేసేటప్పుడు తల్లితండ్రులదగ్గర ఆ ప్రసక్తి తీసుకువచ్చింది.
"నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాన్నా!"
అతను ఆశ్చర్యానందాలతో ఆమెవేపు చూశాడు. "ఈజిట్! నాకో పెద్ద సమస్య తప్పించావ్! నిన్ను మరో వివాహానికి వప్పించడానికి ఎలాగా అని నేను సతమతమవుతున్నాను. అయితే పేపర్ లో మంచిమాచ్ కోసం ప్రకటనవేద్దామా?" అడిగారు.
"అవసరంలేదు నాన్నా! చంద్రకాంత్ ఎప్పటినుంచో నన్ను వివాహం చేసుకోవాలన్నకోరికతో ఉన్నాడు. నేను ఇన్నాళ్ళూ నిర్ణయించుకోలేక అతనికి అంగీకారం తెలుపలేదు" ఆయనఆనందం అవధులుదాటింది.
"చంద్రకాంత్ అయితే ఇంక సమస్యేలేదు. అతను మనకు ఎంతోకాలం నుంచీ తెలుసు. అతని గురించి ఆలోచించాల్సిన పనేలేదు. ఎటొచ్చీ అతను నీకంటే తక్కువవయసువాడనుకుంటాను. కానీ అంతగా ఆలోచించాల్సినంత ఏమీ లేదని నా ఉద్దేశ్యం".
చంద్రకాంత్ చెప్పిన విషయం అతనింటిలో పెద్దకల్లోలాన్నే సృష్టించింది. అతని తండ్రి అతని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అతనితల్లి తన కంఠంలో ప్రాణముండగా అలాజరిగేందుకు వీల్లేదనిశాసించింది ఏడుస్తూ గత్యంతరంలేక వసుంధరనాశ్రయించాడు చంద్రకాంత్." అక్కా! నువ్వే అమ్మా నాన్నలకు నచ్చజెప్పాలి. ఇంకెవరివల్లా కాదీపని!" అన్నాడు దీనంగా. వసుంధర మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యం కలిగింది.
"మాట్లాడవేమక్కా?"
"నాకు ఇష్టం లేదు నువ్వు హేమను చేసుకోవడం!" నెమ్మదిగా చెప్పిందామె. చంద్రకాంత్ కి షాక్ తగిలినట్లయింది. "అక్కా! నువ్వేనా ఈమాటలనేది?"
"అవును! రెండోపెళ్ళి అమ్మాయిని వివాహం చేసుకోవాల్సిన ఖర్మ నీకేం పట్టింది?"
"అంతమాత్రాన ఆ అమ్మాయి వివాహానికి అర్హత కోల్పోతుందా?" అడిగాడతను.
"అలా అని నేననడం లేదు. కానీ ఆమె మరో రెండోపెళ్ళిమగాడిని చేసుకుంటే సరిపోతుంది..."
అక్కడే ఉండివారి సంభాషణనంతా వింటూన్న కుమార్ గట్టిగా తప్పట్లు కొట్టాడు.
"శభాష్ వసుంధరా! నీ అభ్యుదయానికీ, నీ తెలివితేటలకూ నా జోహార్లు!" వ్యంగ్యంగా అన్నాడతను.
"ఎందుకూ?" కోపంగా అడిగిందామె.
"లేకపోతే ఏమిటి? చెప్పే కబుర్లువేరు చేసే పనులువేరు అన్నట్లుంది నీ వాదన! ఆడదానికి అన్యాయం జరిగిపోతుందీ అని కేకలు పెట్టేది నువ్వే మగాడితోపాటు సమానహక్కులు కావాలని ఉపన్యాసాలిచ్చేదీనువ్వే దుర్మార్గుడయినభర్తను వదిలేసిన యువతి మరో వివాహం చేసుకోబోతూంటే నిరసించేదీ నువ్వే! ఇంకెక్కడ బాగుపడుతుందీ స్త్రీ జాతి! మనంచెప్పే ఉపన్యాసాలూ, మనమిచ్చే స్లోగన్సూ అనీ పక్కవారికోసం గాని మనకోసంకాదన్న మాట!" హేళనగా అన్నాడతను.
చంద్రకాంత్ నివ్వెరపోయాడు. తను ఛాందసుడిగా భావించినబావేనా యిలా మాట్లాడేది? ఏమిటీ విచిత్రం? తను ఎంతో ఉన్నతభావాలుగల వ్యక్తిగా ఊహించుకున్న అక్కయ్య చాలా మామూలు స్థితికి దిగజారిపోయింది. ఎంతో పాతకాలంనాటిమనిషి అనుకున్న బావతామందరికంటే ఉన్నతంగా ప్రవర్తిస్తున్నాడు.
"మీరెన్నైనా అనండి! ఇలాంటి విప్లవాలు, ప్రయోగాలూ మనతోనే ప్రారంభంకావడం నాకు నచ్చదు! అందరిలోనూ ఇది ఎంత అసహ్యంగా వుంటుందో ఇతరులు మన కుటుంబాన్నెంత హేళనగా చూస్తారో మీకు అర్ధంకావటంలేదు!
"విన్నావా చంద్రకాంత్! ఇదీ మన వసుంధర అంతరంగం. ఇలాంటి పిరికివాళ్ళు కాదు స్త్రీలహక్కుల కోసం పోట్లాడవలసింది. గో ఎ హెడ్ చంద్రకాంత్! నేను అన్ని విధాలా నీకు సహకరిస్తాను. ఎలాంటి సహాయంకావాలన్నా చేస్తాను. హేమలాంటి యువతిని ఓడిపోనీకూడదు మనం! ఆమెలాంటివాళ్ళకు ఓటమి ఎదురయితే అది మన సంఘానికే నష్టం!" ఆవేశంగా అన్నాడు కుమార్.
వసుంధర అక్కడినుంచి లేచి, వేరే గదిలోకి వెళ్ళిపోయింది.
"నేను వెళ్ళి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను! నువ్వు చేసే పని యెంతో ఆదర్శవంతమైనదనీ, చాలా మంది ఆదర్శాలువల్లించే యువకులుకూడా ధైర్యం చేయనియిలాంటి వివాహాన్ని నువ్వు చేసుకుంటున్నందుకు మనందరం ఆనందంతో అంగీకారం తెలియజేయాలనినచ్చజెప్తాను......"
చంద్రకాంత్ కుమార్ వేపు కృతజ్ఞతాపూర్వకంగా చూసేడు.
* * * * *
నాగమణి, చంద్రం వివాహం చేసుకోబోతున్నారన్నవార్త ఆశనిపాతంలా తాకింది శ్రీనివాసరావ్ ని. తనుకొంతవరకు ఇలా జరగవచ్చునని ఊహించాడు గానీ, ఖచ్చితంగా తనూహించినట్లే జరుగుతుందని. అదీ ఇంత త్వరగా జరుగుతుందనీ అనుకోలేదు.
ఆ తరువాత రెండు రోజులకే నాగమణీ చంద్రం ఇద్దరూ తన ఆఫీసుకొచ్చి శుభలేఖఅందించారు.
"తప్పకరావాలి బావా! వచ్చే శుక్రవారం ఉదయం రిజిస్త్రారాఫీసులో మారేజ్! సాయంత్రం నటరాజ్ లో రిసెప్షన్!" అంది నాగమణి.
ఆమెను చూస్తుంటే కోపం, దుఃఖం రెండూ కలుగుతున్నాయ్. తనను కాదన్నందుకు కోపం, తన చేయి జారిపోతున్నందుకు దుఃఖం "వస్తాన్లే!" అన్నాడు పొడిగా.
"చూడండి! నా తరపున బంధువులంటూ ఎవరూ లేరు! అమ్మా, తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ! ఇక నాగమణి తరపున కూడా కొద్దిమందే! కనుక మీరు కొంచెం బాధ్యత తీసుకొని మా ఇద్దరినీ ఒకటి చేస్తే బావుంటుంది!" అన్నాడు చంద్రం.
"ఓ ష్యూర్...." అతనితో చేయి కలుపుతూ అన్నాడు శ్రీనివాసరావు.
వారిద్దరూ వెళ్ళిపోయారు.
వారి గురించి ఆలోచిస్తున్నకొద్దీ అశాంతి పెరిగిపోసాగిందతనిలో! సరిగ్గా వారం రోజులు టైముంది పెళ్ళికి! అంతే! ఆ తరువాత నాగమణి శ్రీమతి నాగమణి అయిపోతుంది. తను అంతగా బ్రతిమాలినా ఆమె తనను కాదని చంద్రాన్ని చేసుకుంటోంది. తనతో ఏర్పడ్డ సంబంధాన్ని కూడా ఆమె లెక్కచేయడంలేదు. ఇప్పుడేమిటి చేయడం? ఆమెను అలా వదులుకోవడమేనా? ఏదో విధంగా తన దాన్ని చేసుకునే మార్గంలేదా?
హఠాత్తుగా ఓ ఆలోచన తట్టిందతనికి. అతని గుండెలువేగంగా కొట్టుకున్నయ్! అవును! తనకీ నాగమణికీ సంబంధం వున్న విషయం చంద్రానికి చెప్తే? అప్పుడతను ఏం చేస్తాడు? అతనేమిటి ఆ పరిస్థితులు ఏ మొగాడున్నా చేయగలిగింది ఒక్కటే! వెంటనే వివాహం రద్దుచేసి పారేయడం! అలాజరిగిన రోజు నాగమణి ఇంకేం చేస్తుంది? ఇంకెవరు ఆమెను వివాహం చేసుకోడానికి ముందుకొస్తారు? అప్పుడు తన వశంకాక మరే మవుతుంది? తను తప్పిస్తే ఆమెకింక దిక్కెవరుంటారు?
ఆ ఆలోచన అద్భుతంగా ఉన్నట్లనిపించిందతనికి. అలా చెప్పడం వల్ల నాగమణి జీవితం నాశనం చేయబోవడంలేదు తను. ఆమెను దిక్కులేనిదాన్నిగా చేయడమూ తన కోరిక కాదు కేవలం ఆమె మీదున్న అనురాగంతోనే ఆ పని చేయబోతున్నాడు. ఆమెను తనదానిగా చేసుకోవడం కోసమే యిలా కుటిలంగా ఆలోచించాల్సి వస్తోంది. తనను నిరాకరించడంవల్లనే ఆమె గతజీవితం బయటపెట్టబోతున్నాడు తను. మర్నాడు ఉదయం చంద్రం ఆఫీసు కెళ్ళాడతను. ఫ్యూన్ చేతిలో ఓ రూపాయి వుంచి చంద్రం కోసం ఎవరోవచ్చారని చెప్పికాంటీన్ కు తీసుకురమ్మని చెప్పాడు. తను వెళ్ళి కాంటీన్ లో కూర్చుని చంద్రం అతను శ్రీనివాసరావ్ ని చూడగానే ఆశ్చర్యపోయాడు.
"మీరా?" అన్నాడు ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.
"అవునండీ! మీతో ఓ ముఖ్యమయిన విషయం మాట్లాడదామనివచ్చాను....." సీరియస్ గా అన్నాడు శ్రీనివాసరావ్.
"ఏమిటో చెప్పండి!"
"ఊహు! ఇక్కడ కాదు! ఎక్కడయినా ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే బావుంటుందేమో!" సంశయంగాడతను.